Home Rashtriya Swayamsevak Sangh రామమందిర నిర్మాణం ఎందుకు?

రామమందిర నిర్మాణం ఎందుకు?

0
SHARE

                                    — డా. మన్మోహన్ వైద్య

ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్ లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల భారతీయుల విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేవు.

కోట్లాదిమంది భారతీయుల విశ్వాసాలు, ఆశయ ఆకాంక్షలకు గుర్తుగా భవ్య రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ జరిగింది. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఈ సంఘటన సువర్ణధ్యాయంగా నిలిచిపోతుంది. 1951లో సౌరాష్ట్ర(గుజరాత్)లోని సుప్రసిద్ధ సోమనాధ మందిర ప్రారంభోత్సవాన్ని నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేశారు. సోమనాధ మందిర పునర్నిర్మాణం సనాతన భారతీయ చింతన, అస్తిత్వాలకు ప్రతీక అని సర్దార్ పటేల్, కె.ఎం. మున్షీ, మహాత్మా గాంధీ, వి.పి. మీనన్, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహామహులంతా భావించారు.

కానీ నెహ్రూ వంటి వారు మాత్రం ఇది `హిందుత్వవాదపు పునర్ స్థాపన’(Hindu revivalism) అంటూ వ్యతిరేకించారు. ఆ సందర్భంగా నెహ్రూతో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, వాదోపవాదాలను కన్హయ్యలాల్ మున్షీ తన `pilgrimage to Freedom’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

అవి చదివితే ఇప్పుడు రామమందిర నిర్మాణానికి భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అర్ధమవుతుంది. దానిని వ్యతిరేకిస్తున్నవారి ధోరణి కూడా అవగతమవుతుంది.

ఎందుకంటే సోమనాధ మందిరంపైన అనేకసార్లు దాడి చేసిన ముస్లిం దురాక్రమణదారుడైన గజనీ చివరికి దానిని ధ్వంసం చేశాడు. ఆ మందిర పునర్నిర్మాణ సమయంలో కూడా ఇప్పటిమాదిరిగానే భారతీయ సాంస్కృతిక చరిత్రను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా రాజకీయాలు ఎలా సాగాయో తెలుస్తుంది.

 విశ్వాసాలపై దాడి

దురాక్రమణదారులు కేవలం ఒక దేశంపై దాడి చేసి భూభాగాన్ని మాత్రమే ఆక్రమించరు. ఆ దేశ సంస్కృతి, విశ్వాసాలను కూడా దెబ్బతీయడం ద్వారా అక్కడి ప్రజానీకాన్ని అవమానానికి గురిచేస్తారు. అయోధ్యలో మసీదుగా చెపుతున్నది అసలు మసీదేనా? అది ప్రార్ధనలు చేసుకునేందుకే కట్టరా? అంటే లేదు. బాబర్ ఆదేశాల మేరకు అయోధ్యాపై దాడిచేసిన సేనాధిపతి మీర్ బాకీ అక్కడ నమాజు చేసుకోవాలని నిజంగా అనుకునిఉంటే అక్కడ ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో ఎక్కడైనా పెద్ద మసీదు కట్టించుకుని ఉండవచ్చును. పైగా బలవంతంగా ఆక్రమించుకున్న స్థలం లేదా భవనంలో చేసే నమాజును అల్లా అంగీకరించడని ముస్లిం మతపెద్దలు సుప్రీం కోర్ట్ లోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. కాబట్టి రామమందిరాన్ని ధ్వంసం చేసి మీర్ బాకీ అక్కడ కట్టడాన్ని నిర్మించడానికి కారణం నమాజు కోసం కానేకాదు. అలాగే ఆ కట్టడానికి ఇస్లాం సూత్రాల ప్రకారం ఎలాంటి గుర్తింపు ఉండదు కూడా. అయినా ఆ కట్టడం ఎందుకు కట్టాడు? ఎందుకంటే భారతీయ విశ్వాసాలు, అస్తిత్వం, గౌరవాలను దెబ్బకొట్టడం అతని లక్ష్యం.

కె. ఎం. మున్షీ ఇలా వ్రాసారు –

“…1922లో నేను ఆ ధ్వంసమైన మందిరాన్ని చూడటానికి వెళ్ళాను. …అపవిత్రమై, శిధిలమైన స్థితిలో కూడా ఆ మందిరం దృఢంగా నిలచి ఉంది. జరిగిన అవమానాన్ని మరచిపోరాదని చెపుతున్నట్లుగా ఉంది. ….కూలిన స్తంభాలు, చెల్లాచెదురుగా పడిఉన్న రాళ్ళను చూసినప్పుడు నాలో అవమాన జ్వాలలు ఎంతలా ఉవ్వెత్తున లేచాయో చెప్పలేను.’’

 సాంస్కృతిక వారసత్వం, సంపద అంటే కేవలం కట్టడాలు, భవనాలు మాత్రమే కాదు. సమాజాన్ని ఒకటిగా ఉంచే విలువలు, సంప్రదాయాలు, ఆచారాలు కూడా. అవి సమాజానికి శక్తిని, ప్రేరణను కలిగిస్తాయి.

కె.ఎం. మున్షీ ఇంకా ఇలా వ్రాసారు –

`1947 నవంబర్ లో సర్దార్ పటేల్ పాట్నాలో పర్యటించారు. అప్పుడు ఆయన అక్కడ దేవాలయాన్ని దర్శించారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో ఇలా ప్రకటించారు – “నూతన సంవత్సరంలో సోమనాధ మందిర పునర్ నిర్మాణం చేయాలని అనుకుంటున్నాము. దీనికి సౌరాష్ట్ర ప్రజల అత్యధిక భాగస్వామ్యం అవసరం. ఈ పవిత్ర కార్యంలో అందరూ పాలుపంచుకోవాలి’’.

“…….ధ్వంసమైన మందిరపు శిధిలాలను అలాగే ఉంచి ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని కొందరు సలహా ఇచ్చారు. అప్పుడు చరిత్రలో ఏం జరిగిందన్నది బాగా తెలుస్తుందని వారి అభిప్రాయం. కానీ సోమనాధ మందిరం కేవలం ఒక పురాతత్వ భవనం కాదని అది భారతీయులందరికీ పవిత్ర పూజాస్థలమని నాకు అనిపించింది. దానిని పునర్ నిర్మించడానికి యావత్ దేశం సంసిద్ధంగా ఉందనిపించింది.’’

జాతీయ విషయాల్లో భిన్నాభిప్రాయాలు

 అప్పుడున్న జాతీయ నాయకులు రెండు వేరువేరు ధోరణులు కలిగిఉండేవారు. జాతీయ విషయాల్లో కూడా వివిధ రాజకీయ పక్షాలకు వేరువేరు ఆలోచనలు కనిపిస్తుంటాయి. దీనికి కారణం జాతీయత, సమాజానికి సంబంధించి ఆ పక్షాల దృష్టి భిన్నంగా ఉండడమే. సోమనాధ విషయంలో నెహ్రూ దృష్టి వేరుగా ఉండడం, నేడు అయోధ్య గురించి వ్యతిరేకత దీనికి తార్కాణం.

కె.ఎం. మున్షీ ఇలా వ్రాసారు –

“……………..కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత జవహర్ లాల్ నన్ను పిలిచి ఇలా అన్నారు -`సోమనాధ పునర్నిర్మాణం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇది హిందుత్వవాదపు పునర్ స్థాపనమే(Hindu revivalism)’. ఇంటికి వెళ్ళిన తరువాత ఈ విషయంలో వివరంగా సమాధానం ఇస్తానని నేను ఆయనకు సమాధానమిచ్చాను.’’

సోమనాధ మందిర పునర్ నిర్మాణాన్ని `హిందూవాదపు పునర్ స్థాపన’ అని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు భావించారు? మరోపక్క అది `భారత దేశపు సామూహిక అంతః చేతన’ కు సంబంధించిన విషయమని, దేశ ప్రజానీకం మందిర పునర్ నిర్మాణం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని కె.ఎం. మున్షీ అన్నారు. ఒకే విషయానికి సంబంధించి వేరువేరు, పరస్పర వ్యతిరేకమైన అభిప్రాయాలు ఎందుకు కలుగుతాయి? నిజానికి ఇవి భారత్ లోని రెండు ప్రధానమైన ఆలోచనా ధోరణులకు సంబంధించినవి. దేశ విరోధి కాకపోయినా భారతీయత గురించి నెహ్రూ ఆలోచనా ధోరణి పాశ్చాత్యమైనది. అభారతీయమైనది. మరోవైపు సర్దార్ పటేల్, డా. రాజేంద్ర ప్రసాద్, కె.ఎం. మున్షీ తదితరుల ఆలోచనా ధోరణి ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక పరంపరతో ముడిపడినది. సోమనాధ పునర్ నిర్మాణాన్ని మహాత్మా గాంధీ కూడా అంగీకరించారు. అయితే అందుకు అవసరమైన ధనాన్ని ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించాలని షరతు విధించారు.

కె.ఎం. మున్షీ ఇలా వ్రాసారు –

“1951 ఏప్రిల్ 24న నేను ఆయనకు (నెహ్రూ) ఒక ఉత్తరం వ్రాసాను. ఆ ఉత్తరాన్ని ఇక్కడ యధాతధంగా ఇస్తున్నాను..’’

“…..సోమనాధ్ గురించి సర్దార్ పూర్తి వివరాలు బాపూ (గాంధీజీ)కి చెప్పినప్పుడు ఆయన మందిర పునర్నిర్మాణ ఆలోచన సరైనదేనన్నారు. మందిర నిర్మాణానికి అవసరమైన ధనాన్ని ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించాలని అన్నారు. గాడ్గిల్ కూడా బాపూజీని కలిశారు. ఆయనకు కూడా ఇదే సలహా ఇచ్చారు. దానితో నిర్మాణం కోసం భారత ప్రభుత్వం పూర్తి ఆర్ధిక సహాయం అందించాలన్న ఆలోచనను పక్కనపెట్టడం జరిగింది.’’

“…….ఇతర ఏ కార్యం కంటే సోమనాధ మందిర పునర్నిర్మాణానికి ప్రభుత్వ మద్దతు పట్ల భారత `సామూహిక అంతః చేతన’ ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందిందని మీకు చెప్పగలను.’’

“….నిన్న మీరు `హిందుత్వవాద పునర్ స్థాపన’ (Hindu revivalism)గురించి అన్నారు. మీ ఆలోచనలు ఏమిటో నాకు తెలుసు. నేను వాటిని గౌరవిస్తాను. …. గతం పట్ల నాకు ఉన్న విశ్వాసమే వర్తమానంలో నేను పనిచేసేందుకు శక్తిని ఇస్తుంది. భగవద్గీతను నా నుంచి దూరం చేసే `స్వేచ్చ’ వల్ల ఉపయోగం లేదు. అలాగే లక్షలాది మంది ప్రజానీకాన్ని వారి విశ్వాసం నుంచి, దేవాలయాల నుంచి దూరం చేస్తే అది మన జీవన వ్యవస్థనే నాశనం చేస్తుంది.’’

“….మన జీవిత కాలంలో సోమనాధ భవ్య మందిర నిర్మాణం పూర్తైతే అప్పుడు ప్రజల్లో ధార్మిక భావన పెంపొందుతుంది. అలాగే స్వాంతంత్ర్యం వచ్చిన కొత్తలోనే ప్రజలకు మన శక్తి ఏమిటో తెలుస్తుంది. అది చాలా ముఖ్యం.’’

“నా ఉత్తరం చదివిన తరువాత ప్రభుత్వ సలహాదారు శ్రీ. వి.పి, మీనన్ నాకు ఇలా వ్రాసారు’’ –

“మీ అద్భుతమైన లేఖ నేను చదివాను. ఆ ఉత్తరంలో మీరు వ్యక్తం చేసిన ఆలోచనలు, భావాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని అనుకునేవారిలో నేనూ ఒకడిని. అలా చేయడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధం.’’

“సోమనాధ మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ (అప్పటి రాష్ట్రపతి) ని ఆ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించాను. అలాగే నా ఆహ్వానం స్వీకరించినట్లైతే ఆ తరువాత ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేసుకోకుండా కార్యక్రమానికి రావాలని కూడా ఆయనతో అన్నారు.

నా అనుమానం నిజమయింది. సోమనాధ మందిర ప్రారంభోత్సవానికి రాజేంద్ర ప్రసాద్ హాజరవుతారని ప్రకటించగానే నెహ్రూ అందుకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాజేంద్ర ప్రసాద్ ఆ కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆ మర్నాడు వార్తా పత్రికలన్నీ ప్రచురించాయి. కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రభుత్వ విభాగం మాత్రం పట్టించుకోలేదు. అధికారికంగా ఎక్కడా రికార్డ్ చేయలేదు, నమోదు చేయలేదు.’’

ఉదారవాదాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను బాగా కోరుకునేవారు ఎవరూ గౌరవనీయ రాష్ట్రపతి ఉపన్యాసాన్ని ప్రభుత్వ ప్రచార, ప్రసార విభాగం ఏమాత్రం పట్టించుకోకపోయినా ఎలాంటి అభ్యంతరం, నిరసన తెలుపలేదు.

నెహ్రూతో సహా మరికొంతమంది కూడా సోమనాధ పునర్నిర్మానాన్ని వ్యతిరేకించినా గాంధీజీతోపాటు అనేకమంది జాతీయనాయకులు ఆ కార్యాన్ని పూర్తిగా సమర్ధించారన్నది నిజం. వారి కృషి మూలంగానే మందిర నిర్మాణం పూర్తైంది, లక్షలాదిమంది భక్తులు సోమనాధుని దర్శనం చేసుకుంటున్నారు.

60 ఏళ్లపాటు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండడం, ఈ హిందూ వ్యతిరేక ధోరణిని ప్రభుత్వం పూర్తిగా సమర్ధించడం, మద్దతునివ్వడంతో విద్య, పరిశోధన సంస్థల్లో, మీడియాలో ఈ వైఖరే స్థిరపడింది. అందుకనే రామమందిర నిర్మాణం విషయంలో మీడియాలో, మేధావులలో వ్యక్తమైన వ్యతిరేకత ఎక్కువ బలంగా ఉన్నట్లు కనిపించింది. కానీ భారతీయత పట్ల అచంచలమైన విశ్వాసం, ఆధ్యాత్మిక పరంపరతో గాఢమైన సంబంధం కలిగిన కోట్లాదిమంది భారతీయులు ఉన్నారు. వారు `భారతీయ సామూహిక అంతః చేతన’ ప్రకారమే వ్యవహరిస్తారు. ఈ అంతః చేతననే సర్దార్ పటేల్, కె.ఏం.మున్షి, రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ, డా. రాధాకృష్ణ, మదన్ మోహన్ మాలవ్యతో పాటు ఆధునిక స్వతంత్ర భారతంలో అనేకమంది జాతీయ నేతలు ప్రకటించారు, వ్యక్తీకరించారు.

క్లుప్తంగా చెప్పాలంటే అయోధ్యలో రామమందిరం కేవలం మరో దేవాలయం కాదు. అది కోట్లాదిమంది భారతీయుల సనాతన విశ్వాసం, గౌరవాలకు ప్రతీక. అందువల్ల ఆ మందిర పునర్నిర్మాణం భారతదేశ సాంస్కృతిక గౌరవ పునర్ స్థాపనే అవుతుంది.

ఈ సాంస్కృతిక గౌరవ పునర్ స్థాపన కార్యం 2020 ఆగస్ట్ 5న ప్రారంభమైంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భారతీయులు ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని దురదర్శన్ ద్వారా తిలకించారు. ఇందులో అన్నీ సంప్రదాయాలకు చెందిన సాధుసంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు.

डॉ. मनमोहन वैद्य
(लेखक राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह हैं)

 

 

 

 

 

(రచయిత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ )