Home Telugu Articles ఉడిపి కృష్ణఆలయంలో ఇఫ్తార్ పార్టీ గురించి తెలుసుకోవలసిన నిజాలు!

ఉడిపి కృష్ణఆలయంలో ఇఫ్తార్ పార్టీ గురించి తెలుసుకోవలసిన నిజాలు!

0
SHARE

ఇటీవల రంజాన్ రోజున శ్రీ ఉడిపి కృష్ణమఠం ఏర్పాటుచేసిన ‘ఇఫ్తార్ పార్టీ’, పవిత్రదేవాలయ ప్రాంగణంలో ‘నమాజ్’ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.  దేశవ్యాప్తంగా హిందువులు దీనిని గట్టిగా వ్యతిరేకించారు. కొందరు  స్వామీజీపై యిష్టానుసారంగా నిందలు వేశారు, శాపనార్ధాలు పెట్టారు. హిందువులలో ఆందోళన మరింత ఎక్కువ చేసేట్లుగా నిజాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం సాగింది. ఈ ఇఫ్తార్ విందు  హిందుత్వానికి అంతమన్నట్లుగా గోరంతలను కొండంతలు చేసారు. హిందువుల మనస్సుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

ఈ విషయమై హిందువులకు నిజానిజాలు తెలియచేయడం కోసమే ఈ ప్రయత్నం. శ్రీ శ్రీ విశ్వేశతీర్థస్వామిజీ తనజీవితంలోని క్రియాశీలమైన 80 సంవత్సరాలను సనాతనధర్మ సంక్షేమానికి నిస్వార్ధంగా అంకితం చేశారు. ఒక సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆయనను తప్పుపట్టడం మనని మనం కించపరచుకోవడమే అవుతుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం …

ప్రశ్న- ఇఫ్తార్ పార్టీ గోమాంసం తినేవారి కోసమా?

కాదు, గోమాంసంతినేవారికి కోసం కానేకాదు. అందులో పాల్గొన్నవారిలో చాలామంది మాంసాహారులు కూడా కాదు. నిజానికి వీరు గోరక్షణలో స్వామీజీకి సహాయపడుతున్నారు. వీరంతా గత 25 సంవత్సరాలుగా స్వామీజీ భక్తులుగా ఆయనను అనుసరిస్తున్నారు. వీరు అల్లాతోపాటు కృష్ణుడిని కూడా ప్రార్ధిస్తారు. స్వామిజీ చెప్పినట్లుగా వీళ్ళు కృష్ణమంత్రాన్నిరోజు జపిస్తారు. ఉడిపి కృష్ణదేవాలయానికి ధారాళంగా విరాళాలు ఇస్తారు. కబేళాల నుండి ఆవులను కాపాడి ఉడిపిలోని నీలావరం గోశాలకు క్షేమంగా చేరుస్తారు. ఇలా కబేళాల నుండి కాపాడిన 1200 ముసలి ఆవుల కోసం ఏర్పాటు చేసిన గోశాల చిన్నపెజావర్ స్వామి శ్రీ విశ్వప్రసన్న స్వామి పర్యవేక్షణలో నడుస్తోంది.  ఇక్కడ ఉన్న చాలా మటుకు ఆవులు ముస్లిములు కాపాడి తీసుకువచ్చినవే. ఈ ఆవుల కోసం  కొందరు ముస్లింలు ప్రతినెలా రూ 40,000 / విలువ చేసే గడ్డిని విరాళంగా ఇస్తున్నారు. క్రింది చిత్రాన్నిపరిశీలించండి. జీన్ ప్యాంట్ వేసుకుని ఆహార పదార్థాలు వడ్డిస్తున్న వ్యక్తి మనోజ్. ఇతను స్వామీజీ డ్రైవర్. ఇతని అసలు పేరు మన్సూద్. 16 ఏళ్ల క్రితం స్వామీజీ ప్రభావం వల్ల హిందూ మతంలోకి మారాడు.

ప్రశ్న:- హిందూ గురువు ద్వారా ఇఫ్తార్ పార్టీనా ?

ఎందుకు ఇవ్వకూడదు? సనాతనధర్మం ప్రకారం ఆకలితో ఉన్నవారికి కులం, మతం, అంతస్థులతో సంబంధం లేకుండా అన్నం పెట్టవచ్చును.  పైగా వీరంతా స్వామిజీ అనుచరులు. స్వామీజీ కి ఈ ముస్లిముల మధ్య గురుశిష్య సంబంధం ఉంది.  వాళ్ళ జీవితాలలో స్వామీజీ కి ప్రముఖ స్థానం ఉంది. మసీదుల ప్రారంభోత్సవానికి స్వామీజీని పిలుస్తారు.  ప్రత్యేక సందర్భాలలో స్వామీజీని తమ ఇళ్లకు ఆహ్వానించి ఆయన కాళ్ళు కడుగుతారు. కాంగ్రెస్, ఇతర శక్తులు కృష్ణ దేవాలయాన్ని లక్ష్యం చేసుకున్నప్పుడు ఈ ముస్లిములు స్వామీజీ కి మద్దతుగా నిలబడతారు. కృష్ణ ఆలయం కొరకు పనిచేయడానికై వీరు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సామాజిక స్పృహ ఉన్న స్వామీజీ తన ముస్లిం అనుచరుల కోసం ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇది మమతా బెనర్జీ , సోనియా వంటివారు రాజకీయ ప్రయోజనాలకోసం ఇచ్చే విందు కాదు. ఇది చిరుమందహాసంతో వ్యవహరించే స్వామీజీకి, ఆయనను గౌరవించి, అనుసరించే ముస్లిముల మధ్య సాగిన నిజమైన ‘సామరస్యవిందు’.

గోరకపూర్ ఆలయం ట్రస్టులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాధ్, ముస్లిముల మధ్య సాన్నిహిత్యాన్ని గురించి వింటే అద్భుతమనిపిస్తుంది. మరి పెజవర్ స్వామీజీ , వారి ముస్లిం అనుచరుల మధ్య సాన్నిహిత్యాన్ని చూసి ఎందుకు అనుమానించాలి?

ప్రశ్న-  బ్రాహ్మణేతరులకు ప్రవేశం లేదుకాని ముస్లింలకు ఆహ్వానమా?

ఇది బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య విభేదాలు సృష్టించడానికి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పచ్చి అబద్ధాలలో ఒకటి. నిజానికి ‘అన్న బ్రహ్మ చౌల్ట్రీలో’ ముస్లింలకు ఖర్జూరాలు, పళ్ళు వడ్డించారు. అన్నబ్రహ్మ చౌల్ట్రీ లో ఏ మతం, కులం, జాతి వారికైనా ప్రవేశం ఉంది.  ప్రతి రోజు ఇక్కడ వందలమంది ముస్లింలు, క్రైస్తవులకు కూడా సాత్వికఆహారాన్ని వడ్డిస్తారు. ఈ ఇఫ్తార్ విందులో ఎటువంటి ఆలయ నిబంధనలు ఉల్లంఘించలేదు. సంప్రదాయానికి భంగం కలగనివ్వలేదు. ముస్లింలు ఇంతకు ముందు కూడా  అన్నబ్రహ్మ హాలులో భోజనంచేశారు. ఇదేమీ కొత్త  విషయం కాదు.

ప్రశ్న- ఆలయప్రాంగణంలో నమాజా?

స్వామీజీ చెప్పినదాని ప్రకారం ఇది అనుకోకుండా జరిగిన సంఘటన.  విందు తరువాత ప్రార్థన చేసుకునేందుకు స్థలం కావాలని ముస్లింలు అభ్యర్దించినప్పుడు భోజనశాల పైన ఒకపక్క నమాజు చేసుకోవడానికి స్వామీజీ అనుమతినిచ్చారు. అంతే.

కానీ అల్లాని మహోన్నతమైన దేవునిగా పొగుడుతూ చేసే నమాజుని కృష్ణుడు వినేలా చేయడమేమిటని  హిందువులు మండిపడుతున్నారు. నేను వీరిని ఒక ప్రశ్న అడగదలచుకున్నాను. మీ హిందూత్వం  ప్రకారం  అల్లా అనే పేరున్నవారెవరైనా పైన ఉన్నారని మీరు నిజంగా నమ్ముతున్నారా? ఈ ప్రశ్నకు13వ శతాబ్దంలో సమాధానం జగద్గురు శ్రీమధ్వాచార్యులు ఒక మొఘల్ రాజుకు ఇచ్చారు-“లోకాన్నిపాలించే మహోన్నత శక్తిని విభిన్న మత విశ్వాసాలున్నవారు వారివారి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం తెలుసుకున్నారు. ఆ శక్తిని ముస్లింలు’అల్లా’ అని, క్రైస్తవులు’లార్డ్ ఆల్మైటీ’ అని, హిందువులు’విష్ణువు’ అని అన్నారు. అలా చూస్తే లోకాన్నిపాలిస్తున్నమహోన్నతశక్తిని అల్లా,దేవుడు మరియు విష్ణువు అని ఎలా పిలిచిన ఒక్కటే అని అర్ధం”. అయితే హిందూత్వం మహోన్నతశక్తి రూప,గుణ,క్రియల గురించి కూడా చెప్పి స్వర్గం, నరకంకన్నామించిన మోక్షమార్గంలో తీసుకువెళ్తుంది.

నమాజ్ కేవలం ఒక ప్రార్థన మాత్రమేనని దానివల్ల హిందూత్వానికి ఎలాంటి హాని లేదని స్వామీజీ చెప్పారు.

ప్రశ్న- అయినా ఎందుకు? అవసరమేమిటి?

భిన్నత్వం కలిగిన భారతదేశంలో సనాతనధర్మం నిలిచి ఉండాలంటే ధర్మగురువులు కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హిందూ ధర్మానికి చెందిన మాటల మధ్యనే కాకుండా ఇతర మతాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇది చాలా అవసరం.

రాజకీయ పరిస్థితులు :- హిందుత్వానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఉడిపి శ్రీకృష్ణ ఆలయం అంటే  హిందూ వ్యతిరేకపార్టీ, కాంగ్రెస్ కు ఎప్పుడూ కంటగింపుగానే ఉంది. దానికి తోడు స్వామీజీ విశ్వహిందూపరిషత్ కు గట్టి మద్దతుదారు, రామభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారు కావడంతో ఆ శతృత్వం మరింత పెరిగిపోతుంది. కర్ణాటక సి.ఎం. సిద్దిరామయ్య 12 సంవత్సరాలుగా రాజకీయ ప్రయోజనాలకోసం ఉడిపి కృష్ణ ఆలయాన్ని బహిష్కరించారన్నది అందరికి తెలిసిన విషయమే. ఉడిపి మఠానికి వ్యతిరేకంగా కనకగోపుర విషయంలో నిరసనలను పురిగొల్పడం ద్వారా’కురుబ’ (కాపరులు)అని పిలవబడే దళిత హిందూ ఓట్లను సిద్దిరామయ్య చేజిక్కించుకున్నారు. ఉడిపికృష్ణ ఆలయంతోపాటు ఇతర అద్భుత ఆలయాలను ముజరై నియంత్రణ క్రిందికి తేవాలని సి.ఎం భావిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముస్లింల మద్దతు చాలా ఉపయోగపడుతుంది.

జనాభా:- దక్షిణ కర్ణాటక తీరప్రాంతంలో  హిందూ, ముస్లిం జనాభా సమానంగా ఉంది.  ఉడిపి చుట్టుపక్కల ఉన్నబాల్కల్, కర్వాలి మొదలైన పట్టణాలలో స్వామీజీ  ప్రభావంవల్ల రెండు వర్గాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉన్నది. దక్షిణ కర్ణాటక జిల్లాల్లో షియా ముస్లింలసంఖ్య ఎక్కువ. షియా ముస్లిం యువతరం పెజావరస్వామీజీని ఎక్కువగా గౌరవిస్తారు. మన ధర్మగురువులు అన్నీ మతాలవారిని  కలుపుకునే విధానం అనుసరించడం ఇప్పుడు ఎంతో అవసరం.
సామాజిక పరిస్థితి :- యుక్త వయస్సు నుంచి పెజావర స్వామీజీ సామాజిక సంస్కరణ ఆసక్తి ఎక్కువ.  ఆయన పది సంవత్సరాల వయసులో బాలసన్యాసిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనవల్ల మానవత్వమే ప్రధానమతమనే భావన ఆయనలో పాదుకుంది. ఒకసారి ఒక ముస్లిం బాలిక ప్రమాదవశాత్తు బ్రాహ్మణులు మాత్రమే వాడుకునే పెద్దబావిలో పడిపోయింది. అంటరానితనమనే నిషేధంవల్ల ఏ బ్రాహ్మణు డు ఆ ముస్లిం బాలికను ముట్టుకోడానికి ముందుకు రాలేదు. మరొకరు ఆ పిల్లని రక్షించినప్పటికీ మతభావన  మానవత్వమనే  ప్రధాన లక్షణాన్ని చంపివేయడం స్వామీజీని  ఆ చిన్నవయసులోనే నిశ్చేష్టుల్ని చేసింది. అందుకే అప్పటి నుండి స్వామీజీ  దళితులు, ముస్లింలు మరియు క్రిష్టియనులకు సహృదయంతో చేరువయ్యేందుకు కృషిచేశారు. అందువల్లనే ఉడిపికృష్ణఆలయంలో వివిధ మతాలకు, కులాలకు చెందిన యాత్రికులను చూస్తాము. కృష్ణుడు అందరికి చెందినవాడు! బాహ్య శరీరరూపాలతో సంభందం లేకుండా ఆయన అన్నిజీవాలలోను ఉన్నాడు. ఈ ప్రపంచానికే మహోన్నత అధికారి.

శ్రీ శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ పట్ల ఉన్న మనోవేదన ఈ రచన ద్వారా తొలగుతుందని ఆశిస్తున్నాను.

జైశ్రీకృష్ణ

జ్యోతిసుపర్ణచించోలి