‘మీటూ’ పేర మీడియాలో చెలరెగిపోతున్న ఉద్యమం తీరుతెన్నులు చూస్తే దీని నేపధ్యం, వెలికివచ్చిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, రాగల కీడు ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న సమయంలో అనేకమంది స్త్రీలు ‘మీటూ’ అంటూ తాము గతంలో పడ్డ లైంగిక వేధింపులు, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లు, వారి పోకడలు బయటపెడుతూ మీడియాలో 10 రోజుల పాటు నడచిన రచ్చలు, చర్చలు ఏవగింపు కలిగించాయి.
స్త్రీని దేవతగా ఆరాధించే దేశంలో ఈ తరహా కథనాలు, కవ్వింపులు, కదనకుతూహల విన్యాసాలు జరగడం ప్రతి వ్యక్తినీ ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా ఎన్‌టర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్ రంగాల్లో ప్రముఖులు ఈ ఆరోపణల్లో కేంద్ర బిందువు లయ్యారు. కాని ఈ ఆరోపణల్లో నిజమెంతో తేలాల్సివుంది. లైంగిక వేధింపుల విషయమై ఎక్కడో అమెరికాలో గత అక్టోబరు (2017)లో ప్రారంభ మైన మీటూ ఉద్యమం నేడు భారత్‌కు చేరింది. కేరళలో ఈ మధ్య ఒక నన్‌పై బిషప్ ములక్కల్ జరిపిన అత్యాచారం సంగతి తెలిసిందే. ఆయన అరెస్టయి ఈ మధ్యనే బెయిల్‌పై విడుదలయ్యాడు. తర్వాత పంజాబ్‌లోని జలధర్ వెళ్లినపుడు ఆయనకు భక్తులు పూలవర్షం కురిపించారు. కొట్టాయంకు చెందిన నన్ జలంధర్ బిషప్ ములక్కల్‌పై చేసిన లైంగిక వేధింపుల తాలూకు ఆరోపణ. చర్చి అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించలేదంది. 2014లో ఈ బిషప్ కొట్టాయంని కురువిలంగడు గ్రామానికి వచ్చాడని తనను ఆ తరువాత 13 సార్లు రేప్ చేశాడని ‘నన్’ ఆరోపించింది. ఫిర్యాదు చేసిందుకు తనను కొలువులోంచి తీసేశారని ఆమె అంది. గత కొన్నేళ్ళుగా చర్చిల్లో పిల్లలపై లెంగిక అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. యూఎన్‌ఓ అధికారిక చట్ట నిబంధనల్లో ఒకటైన సాంస్కృతిక మారణకాండ(కల్చరల్ జెనోసైడ్) క్రింద అనేక మంది ఫాదర్‌లు, బిషప్‌లు అరెస్టయ్యారు. బాధితులకు నష్టపరిహార చెల్లింపులు చేసిచేసి చర్చిలు దివాలాతీస్తున్నాయి. ఫాదర్‌లు బిషప్‌లలో కూడా ధార్మికత పేర దౌర్భాగ్యపు పనులు చేసేవాళ్ళ మీడియాలో కనిపించడంలో అంతర్జాతీయ చర్చికి దిక్కుతోచని స్థితి ఎదురైంది. స్త్రీని తల్లిగా భావించిన దేశం పరువుతీసేందుకు, భారతదేశమంటేనే లైంగిక వేధింపులకు, లింగ వివక్షతకు మారుపేరనే రీతిలో దుష్ప్రచారం సాగింది. ఎపుడో 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం జరిగినవో లేదో తెలియని సంఘటనలను తవ్వి తీసి మరీ అసలు సమస్యను పక్కదారి పట్టించిన ప్రబుద్ధుల మంత్రాంగం, తంత్రాంగం జనం గమనించకపోలేదు. చివరికి ఆ బిషప్ చేసిన అత్యాచారాలకు సాక్షి అయిన కురియోకోన్, హట్టుధార, జలంధర్‌కు సమీపంలోని దాసుయావద్ద శవమై కనిపించాడు. తనను కుతురులా చూసుకున్న కురియోకోన్ మృతిపట్ల బిషప్ ములక్కల్‌లో అత్యాచారాలకు గురియైన నన్ అనుపమ బోరున ఏడ్చింది. బిషప్ ములక్కల్ పతనమవుతున్న చర్చి ప్రమాణాలకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా మీడియా చోద్యం చూస్తోంది.
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న భారతవిదేశాంగ సహాయ మంత్రి ఎమ్.జె.అక్బర్ రాజీనామా చేసిన తరువాత అంతా సద్దుమణిగింది. మరి ఆరోపణలు ఎదుర్కొన్న మిగిలిన వాళ్ళ సంగతేమిటి? నానాపటాకర్, చేతన్‌భగత్, లోక్‌నాథ్, వికాస్‌బషి, రజత్‌కపూర్, గురిస్మరన్ కంచా, వైషన్‌ఖేర్ (పద్మశ్రీ సమ్మానియుడు) జులిఫ సయ్యద్ నాగర్‌కర్, ఉత్యవ్ చాక్రవర్తి, ముత్తుస్వామి రామస్వామి, జతిన్‌దాస్ (పద్మభూషణ్) వినోద్ దువా, జఫర్ ఖాన్ (కాంగ్రెస్ నాయకుడు), సిద్ధార్థ భాటియా, ఉత్తమ్‌సేన్ గుప్తా, తరుణ్‌తేజ్ పాల్ – వీళ్ళ సంగతేమిటి? కొందరు క్షమాపణలు చెప్పారు. కొందరు ‘తమ న్యాయవాదులు మాట్లాడవద్దని చెప్పారు’ అన్నారు. ఇందులో వినోద్ దువా జర్నలిస్టు వామపక్ష మేధావి, చిత్ర నిర్మాత నిష్ఠాజైన్ ఈయనమీద ఆరోపణలు చేసింది. నిషాబోరా పెయింటర్ జతిన్ దాస్‌పై ఆరోపణలు చేసింది. వామపక్ష మేధావి అదే వామపక్షానికి చెందిన ఆయన కూతురు నందితా దాస్ ఆయన్ను సమర్ధించడమేకాక నిషాబోరాకు హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన పద్మభూషణ్‌ను వాపసు ఇచ్చి ఉండాల్సింది.
మీటూ ఉద్యమం పేర జరిగిన ఇన్నాళ్ల ప్రవాసనంపై ఎక్కడా ఫిర్యాదులు, పోలీసుల విచారణా విభాగానికి అందకపోవడం, ఎక్కడా దీనిపై విచారణ ప్రారంభం కాకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఎక్కడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదు. ఎవరూ కోర్టులకెక్కలేదు. ఋజువులు చూపలేదు. కోర్టుల్లో ఎవరికీ నవ్మకం లేదు. దేశంలో మహిళహక్కులపై ఎవరికీ నమ్మకం లేదు. కేవలం సామాజిక మాధ్యమాలకు విషయం వదిలేసి చోద్యం చూడడంలో మీటూ ఉద్యమం భవిష్యత్తు వెతుక్కోవడమెందుకు? ఇందులో నిజమెంత?
– హనుమత్‌ప్రసాద్
(లోకహితం సౌజన్యం తో)