Home News సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రమే కుటుంబం

సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రమే కుటుంబం

0
SHARE

మన దేశంలో కుటుంబం అంటే కేవలం నిత్యావసరాలను సమకూర్చేది మాత్రమే కాదు మన ఆలోచనలకు, బుద్ధికి ఒక దిశను చూపి జీవన విలువలను అందించే కేంద్రం. మన దేశంలో కుటుంబం అంటే సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రం. ఇక్కడ మన రెండు కుటుంబాల గురించి పరిశీలిద్దాం. వీటి ద్వారా నేటి పరిస్థితుల్లో కూడా సౌహార్దపూర్వకమైన వాతావరణాన్ని ఎలా నిర్మించుకోవచ్చును అనే విషయం అర్ధమవుతుంది. కుటుంబంలో సౌహార్దభావన కలగాలంటే వారంలో కనీసం ఒక రోజు కుటుంబంలోని వారంతా కలిసి భోజనం చేయాలి. పెద్దలపట్ల గౌరవభావం, ఇతరులపట్ల అభిమానం కలిగే విధంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను అక్కడికే పరిమితం చేయకుండా మనం నివసించే ప్రదేశంలో అందరికీ పంచగలగాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, గూడుతో పాటు విద్య, వైద్యం  మొదలైన సదుపాయాలు కూడా అందాలి. వీటితోపాటు అతిథి సత్కారం కూడా కుటుంబాల ద్వారానే జరగాలి.

మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు ఒక కుటుంబాన్ని చూశాను. వారి దినచర్య చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. బారామతి గ్రామంలో ఉన్న ఈ కుటుంబంలో తల్లి, ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు ఉంటారు. ఉదయం 5 గంటలకు అంతా నిద్ర లేస్తారు. తరువాత అంతా కొద్దిసేపు వ్యాహ్యాళికి వెళతారు. ఇంటికి వచ్చిన తరువాత మామిడి, జామ, తులసి ఆకులతో తయారుచేసిన చాయ్‌ తాగుతారు. ఇంటి చుట్టుపక్కల మొక్కలు, చెట్లు పెంచుతున్నారు. వాటిపై వాలే పక్షుల కిలకిలారావాలు ఉదయం పూట ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ పక్షులకు ప్రతి రోజు అరకిలో ధాన్యం ఆహారంగా వేస్తారు. అది ఆ కుటుంబపు అలవాటు, సంప్రదాయంగా మారింది.

ఈ కుటుంబం నుండి మనమంతా ప్రేరణ పొందాలి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ఇలా కలసిమెలసి జీవిస్తున్న కుటుంబం అందరికీ ఆదర్శప్రాయమైనది. ఇంట్లో మహిళలు అందరి బాగోగులు చూస్తారు. రెండుపూటలా రుచికరమైన, తాజా ఆహారాన్ని వండి అందరికీ పెడతారు. రాత్రిపూట కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి ఆనందోల్లాసాలతో కబుర్లు చెప్పుకుంటారు. ఆడపిల్లలు చదువుతోపాటు సంగీతం, చిత్రలేఖనం మొదలైనవి నేర్చుకుంటారు. ఇలాంటి దినచర్య మూలంగా కుటుంబంలోని వారంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నారు.

ఇలాగే మరథ్వాడకు చెందిన ఒక కుటుంబం పునాలో ఉంటోంది. తల్లిదండ్రులిద్దరూ సంపాదన కోసం బయటకు వెళతారు. పిల్లల్ని పెంచిపెద్ద చేసేందుకు, వారికి విద్యాబుద్ధులు కలిగించేందుకు ఇద్దరు పనిచేయవలసిన పరిస్థితులు ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు సంస్కారాలు కలిగించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించవలసి ఉంటుంది. అయితే అది ఏమంత కష్టం కూడా కాదు. పిల్లలను చూసేందుకు వాళ్ళ తాత ప్రతి నెల గ్రామం నుండి వచ్చి నాలుగైదు రోజులు పిల్లలతో గడుపుతారు. అలా ఉన్నప్పుడు  పిల్లలకు మహాపురుషుల కథలు చెపుతారు. దీనివల్ల పిల్లలకు ఎంతో ఆనందం కలగడంతో పాటు వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది.

గుజరాత్‌లో పర్యటిస్తున్నప్పుడు నేను  ఒక వాక్యం చదివాను. అది నన్ను ఎంతో ఆకర్షించింది. అది – ‘తమే ప్రసన్న రహొ, నహి తో తమారో డాక్టర్‌ ప్రసన్న రహే చే’. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండు. లేకపోతే నీ డాక్టర్‌ ప్రశాంతంగా ఉంటాడు అని అర్ధం. ఈ వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకుంటే అందరి జీవితాలు ఆనందమయమవుతాయి. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన కుటుంబం బాగుండాలి.

-రవీంద్ర జోషి, సహ సంయోజకులు, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్‌

(లోకహితం సౌజన్యం తో)