వ్యక్తి పుట్టుక నుండి చావు వరకు సంక్షేమ బాధ్యతను రాజ్యమే తీసుకుంటున్న ఆధునిక కాలంలో ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నామన్న మావోయిస్టుల మాటలు నమ్మే స్థితిలో ఆధునిక పౌరసమాజం లేదు. ప్రజల కోసమే ఈ హింస అని చెప్పే సాహసం ఇప్పుడు ఎవ్వరూ చేయలేరు. ఉద్యమ ప్రారంభంలో చెప్పిన మాటలే ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయనుకోవటం పొరపాటే అవుతుంది.
యాభై ఏళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్లో స్థానిక గిరిజనుల నేతృత్వంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమై, సైద్ధాంతికంగా ఎలాంటి పునాదులు లేకుండానే ఆవిర్భవించింది నక్సలైట్ ఉద్యమం. జంగల్ సంతాల్, కానూ సన్యాల్‌లు ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు కేవలం గిరిజనుల అటవీహక్కులు కాపాడేందుకు, భూస్వామ్య విధానాన్ని పారదోలేందుకు తిరుగుబాటును ప్రారంభించారు. ఆ క్రమంలో చారు మజుందార్ ఆ తిరుగుబాటులో ప్రవేశించాక తిరుగుబాటు క్రమం పూర్తిగా మారిపోయింది.
అదే సమయంలో చైనాలో కమ్యూనిస్టుల ప్రాభవం ఉండటం వలన చారు మజుందార్ మద్దతుతో గిరినుల తిరుగుబాటు కమ్యూనిస్టు తిరుగుబాటుగా గుర్తింపు పొందడం జరిగింది. ఆ తిరుగుబాటును విప్లవోద్యమంగా మలచటంలో చైనా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించటం మూలాన అప్పటి వరకు సాంప్రదాయ ఆయుధాలు వాడిన ఉద్యమకారులు అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్నారు. నిజానికి జంగల్ సంతాల్, కానూ సన్యాల్‌లు స్థానిక సమస్యల పరిష్కారం వరకే తమ తిరుగుబాటు ఉండాలనుకున్నారు. చారు మజుందార్ మాత్రం దాన్ని విస్తరించి రహస్యంగా సంస్థను నడపాలనుకున్నారు.
ఇటు సంస్థాగత కార్యకలాపాలు విస్తరించటం, చైనా నుంచి మార్క్సిస్ట్, లెనినిస్ట్ భావాలను దిగుమతి చేసుకొని సైద్ధాంతిక భూమికను రూపొందించుకోవటం ఒకేసారి జరిగిపోయాయి. ఆ తర్వాత 1969లో విడిపోవటం ప్రారంభమై నేటి వరకూ అనేక గ్రూపులుగా విడిపోతూ అంతఃకలహాలతో కలహించుకుంటూనే ఉన్నారు. భూమి కోసం, భుక్తికోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ తొలినాళ్ళలో నినదించి అనతి కాలంలోనే యువతను ఆకర్షించింది నక్సలైట్ ఉద్యమం. కానీ ఆచరణలో అవేవీ నిజం కాదన్న సత్యాన్ని తెలుసుకున్న ఎంతోమంది జనజీవన స్రవంతిలో కలసి ప్రజాస్వామ్య పద్ధతిలో కాలం వెళ్ళదీస్తున్నారు. నక్సలైట్ ఉద్యమంలో కూడా ఎంతో మంది సైద్ధాంతికంగా విభేదించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రారంభంలో కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల, జాదవ్‌పూర్ యూనివర్సిటీలను కేంద్రాలుగా చేసుకొని యువతను, విద్యావంతుల్ని ఆకర్షించి తమ వైపు తిప్పుకోవటంలో సఫ లీకృతమయ్యారు నక్సలైట్లు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళ గిరిజన ప్రాంతాల్లోకి విస్తరించటం పెద్ద సమస్య కాలేదు. అనతి కాలంలోనే చారు మజుందార్ నాయకత్వంలో ఎన్నో హింసాత్మక కార్యకలాపాలు కొనసాగించటం ద్వారా యావత్ దేశ దృష్టిని ఆకర్షించి సమాజంలో భయోత్పాతాన్ని, గుర్తింపును పొందగలిగారు. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు సిద్ధార్ద్ శంకర్ రే నక్సలైట్లతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ క్రమంలో జరిగిన హింస ద్వారా రాజ్య విధానాలకు నక్సలైట్లు పూర్తి వ్యతిరేకమని స్పష్టమైంది. అనేక మందిని ‘వర్గ శత్రువు నిర్మూలన’ పేరుతో కిరాతకంగా హతమార్చటం మొదలుపెట్టారు. 1980 దశకం నాటికి దాదాపు 30 నక్సలైట్ గ్రూపులు 30వేల మంది సాయుధులైన నక్సలైట్ సమూహాన్ని ఏర్పాటు చేసుకోగలిగారన్న ప్రభుత్వ లెక్కలు నక్సలైట్ ఉద్యమ ప్రాబల్యానికి అద్దంపడతాయి.
ఈ కాలంలో మేధావులైన ఎంతోమందిని కళాశాల క్యాంపస్‌లలో వివిధ పేర్లతో విద్యార్థి సంఘాలుగా ఏర్పడి తమవైపుకు తిప్పుకున్నారు. కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లను అడ్డాలుగా మార్చుకొని తమ కార్యకలాపాలు కొనసాగించారు.
దేశంలో అంతర్గత భద్రతకు పెనుముప్పు నక్సలైట్స్ ద్వారానే ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో ప్రకటించారు. నక్సలైట్ ఉద్యమం నుంచి 2004లో మావోయిస్ట్ గ్రూప్‌గా రూపాంతరం చెందిన తర్వాత దేశ సరిహద్దు నేపాల్ నుండి కేరళ వరకు నిర్మించ తలపెట్టిన ‘రెడ్ కారిడార్’ దేశానికి పెను ముప్పుగా మారనుందని భారత ప్రభుత్వం గుర్తించింది. మూల సిద్ధాంతాన్ని మరిచిపోయి అన్యాయంగా ప్రజల్ని, ప్రజ లకు అండగా ఉన్న రాజ్యాన్ని తుదముట్టించాలన్న అత్యాశే మావోయిస్టుల ఉద్యమాన్ని నిర్మూలిస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా సైద్ధాంతిక భూమికను పోషించటంలో మావోయిస్టులు విఫలమయ్యారు. వర్గ శత్రువును తుదముట్టించాలన్న ఏకైక లక్ష్యంతో దమన కాండకు తెగబడుతున్నారు. 2010 ఏప్రిల్‌లో దంతెవాడ జిల్లాలో నిరాయుధులైన 76మంది నిద్రిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను అత్యంత పాశవికంగా 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో విరుచుకుపడి చంపటం దేశ ప్రజల్ని కలచివేసింది. ఆ సంఘటనే మావోయిస్టుల పట్ల ప్రజా వ్యతిరేకతకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత సుక్మాకు వెళ్తున్న బస్సును పేల్చి 15 మంది పోలీసులు, 20మంది సాధారణ పౌరుల్ని చంపారు. అదే ఏడాది జూన్‌లో నారాయణపూర్‌లో 26మంది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను చంపారు. 2000 సంవత్సరం కంటే ముందు పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట ఎందరో ఆదివాసులను, రాజకీయ నాయకులను గ్రామాల్లో అత్యంత కిరాతకంగా హతమార్చారు. అప్పుడు మావోయిస్టులు చేసిన హింస వేరు 2000 సంవత్సరం తర్వాత జరిగిన సంఘటనలు వేరు. వ్యక్తి పుట్టుక నుండి చావు వరకు సంక్షేమ బాధ్యతను రాజ్యమే తీసుకుంటున్న ఆధునిక కాలంలో ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నామన్న మావోయిస్టుల మాటలు నమ్మే స్థితిలో ఆధునిక పౌరసమాజం లేదు. ప్రజల కోసమే ఈ హింస అని చెప్పే సాహసం ఇప్పుడు ఎవ్వరూ చేయలేరు. ఉద్యమ ప్రారంభంలో చెప్పిన మాటలే ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయనుకోవటం పొరపాటే అవుతుంది.
మళ్ళీ 1980ల నాటి పరిస్థితులు పునరావృతం చేయాలన్న ఆలోచనలు ఉన్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నటువంటి యువతను కులాల పేరిట, మతాల పేరిట రెచ్చగొట్టి తమవైపుకు తిప్పుకోవాలన్న వ్యూహం నేటి కాలంలో పనిచేయదు. సైద్ధాంతిక మూలాలున్న ప్రాంతాల్లోని విద్యార్థులు ఆకర్షితులైనా బలహీనమైన పునాదులున్న భావజాలాలు వారిని ఎంతోకాలం తమ వద్ద ఉంచుకోలేవు. కెరీరిజంకోసం అరాటపడుతున్న యువతకు హింసాకార్యకలాపాల వైపు మళ్ళే ఆసక్తి లేదు. కానీ ఇటీవల యూనివర్సిటీ క్యాంపస్‌లనుంచి చేరికలు ఉంటే కనీసం ఒక తరం వరకు నిలబడవచ్చన్నది మావోల వ్యూహం కావచ్చు. 2000 సంవత్సరం తర్వాత చేరికలు లేకపోవటంతో ఆధునికీకరణ, పోటీ ప్రపంచం ముందు మావోలు సిద్ధాంతం మోకరిల్లక తప్పలేదు. అందుకే చేరికలు కరువై అంతర్గత కుమ్ములాటలు, కుల సంవాదాలతో అట్టుడికిపోయి సిద్ధాంతం పట్ల నమ్మకం పోయి బలహీనపడి పోయారు. మరో ప్రక్క రాజ్యంపై ప్రత్యక్షంగా యుద్ధం చేయాలనుకోవటం వల్ల అది మొదటికే ముప్పును తెచ్చి పెట్టింది. తాము బలంగా ఉన్నామన్న సందేశాన్ని సమాజానికి పంపటం కోసం, ఉనికిని చాటుకోవటం కోసం అలజడి సృష్టించాలన్న ఆరాటంలో మావోయిస్టులు ఉన్నరనటంలో సందేహం లేదు.
50ఏళ్ళ నక్సలైట్ మావోయిస్టు ఉద్యమంలో ప్రజలకు వారివల్ల జరిగిన లాభమెంత, నష్టమెంత? ప్రజల్ని బాధపెడుతూ వారి ఆస్తుల్ని ధ్వంసంచేస్తూ ఎంత భయానకంగా, ఎంత అమానుషంగా చంపితే విప్లవం అంత పరిపూర్ణమైందని భావించటం ఏ సిద్ధాంతం? అదే సిద్ధాంతం అయితే, హింస ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అయితే ఆధునిక కమ్యూనిస్టు రాజ్యాలెన్ని నిలబడ్డాయి ఈ ప్రపంచంలో? ‘రాజ్యానికి ఆది అంతాలు రెండూ రాజ్యమే’ అయినప్పుడు రాజ్యాన్ని ఎదిరిస్తూ రాజ్యంలో మనుగడ సాగించటం ఎలాగూ సాధ్యం కాదు. గడిచిన 50 ఏళ్ళుగా ఒకటే సిద్ధాంతాన్ని ఎలాంటి మార్పులు లేకుండా బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవటం, తమ సిద్ధాంతాన్ని ఆచరించక పోతే హింసకు పాల్పడటం సైద్ధాంతిక లక్షణాలు కావు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, సంక్షేమరాజ్యాల పునాదులపై ఉన్న ఆధునిక కాలంలో ఇలాంటి సిద్ధాంతాలు నిలబడలేవు. ఆచరణలో సాధ్యంకాని సిద్ధాంతంపై ఆధారపడ్డ మావోయిస్టుపార్టీలు ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. ఏ పీడిత ప్రజల పక్షాన ఉండేందుకు సిలిగురి కిసాన్ సభగా ఏర్పడ్డారో ఆ దిశగా ప్రయాణం సాగలేదు. మావో సిద్ధాంతాన్ని యథావిధిగా భారతదేశంలో అమలు జరపాలని చారు మజుందార్ రూపొందించిన ‘ఎయిట్ డాక్యుమెంట్స్’ ఇక్కడ విజయవంతం కాలేకపోయింది. యాభై ఏళ్ళ మావోయిస్టు ఉద్యమ చరిత్రను చూస్తే ఇది అవగతమౌవుతుంది. మళ్ళీ ఉద్యమ తొలినాళ్ళనాటి హింసా చరిత్రను పునరావృతం చేయాలని చూడటం తప్పితే మావోయిజంలో కొత్తదనం లేకపోవటమే ఆ ఉద్యమానికి పెనుసవాలు. మనుగడ కష్టమైన నేటి కాలంలో అలజడి సృష్టించి, ఆందోళనలుచేయటం తద్వారా సైద్ధాంతికంగా నిలబడుతామని అనుకోవటం పొరపాటే. ప్రజల అవసరాలు తీర్చకపోగా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం పతనానికి నాంది అవుతోంది.
డా. దొంతగాని వీరబాబు
అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)