Home News తెలంగాణలో ప్రశాంతం.. ఏపీలో హింస మధ్య రాత్రి వరకూ..!

తెలంగాణలో ప్రశాంతం.. ఏపీలో హింస మధ్య రాత్రి వరకూ..!

0
SHARE

లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌లో భాగంగా సోమవారం తెలంగాణలోని 17 స్థానాలకు జరిగిన ఎన్నికలు కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయానికి 61.59 శాతం పోలింగ్ నమోదైందన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల సహకారం పూర్తిగా లభించిందన్నారు. పోలింగ్ శాతం విషయానికి వస్తే 2019 కంటే ఐదు నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉండవచ్చని ఈసీ అంచనా వేస్తోంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటం ఇందుకు తోడైనట్లు భావిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సమస్యలేమీ లేకుండా జరిగినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 5 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో నాలుగైదు పోలింగ్ కేంద్రాలలో తప్ప మిగిలినచోట్ల సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కాగా, పోలింగ్ రోజున 400 వరకూ ఫిర్యాదులు అందగా C విజిల్ ద్వారా 200 ఫిర్యాదులు వచ్చాయని, 38 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు, రూ.330 కోట్లు సీజ్ చేసినట్లు సీఈఓ చెప్పారు. అయితే తెలంగాణలో రీపోలింగ్ పరిస్థితులు తలెత్తలేదన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో క్యూలు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగిన పరిస్థితులు ఉన్నందున అక్కడ పొలింగ్ పొడిగించాల్సి వచ్చిందన్నారు.

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మాధవీలత పైనా విపక్షాలు ఫిర్యాదులు చేశాయి. మరోవైపు కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ విపక్ష నేతలు, కార్యకర్తలు వారితో ఘర్షణపడిన దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్పాముల గ్రామంలో బిజెపి దళిత నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కులం పేరుతో దూషిస్తూ విచక్షణా రహితంగా దాడి చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

ఇక ఏపీలోని మొత్తం 25 లోక్‌సభా స్థానాలకు, మొత్తం 175 శాసనసభా స్థానాలకు ఒకే విడతగా సోమవారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్ల స్పందించి ముందుకు రావడంతో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. చాలా చోట్ల రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో కర్నూలు, కడప, సత్యసాయి జిల్లా ధర్మవరం, కుప్పం, కడప, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, గుంటూరు, పల్నాడు, కోనసీమ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి వర్గాల మధ్య తీవ్రస్థాయిలో హింస జరిగింది. పోలింగ్ ముగిసేసరికి దాదాపుగా 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో హింసాత్మక వాతావరణం నెలకొన్నా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా, వానలు పడినా ఓటర్లు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.

దేశవ్యాప్తంగా చూస్తే 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కలిపి మొత్తం 96 లోక్ సభా నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో 63 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్‌ నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో 68.48 శాతం, మహారాష్ట్రలో 52.63 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిస్తోంది. జమ్ముకశ్మీర్‌లో కనిష్ఠంగా 36.88 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ ఎన్నికల మొదటి మూడు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. బెంగా‌లో మాత్రం కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

రాత్రి సమయంలో కూడా కొనసాగిన పోలింగ్ సమాచారాన్ని కూడా సమీకరించి మంగళవారం పోలింగ్ శాతం పూర్తి వివరాలను ఈసీ వెల్లడించే అవకాశముంది.