
శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలని సరస్వతీ విద్యాపీఠం జిల్లా కోశాధికారి కాశీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ పట్టణంలోని శిశుమందిర్ లో ఆవిర్భావ మరియు శ్రీరామనవమి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ శిశుమందిరాలు విద్యార్థులకు విద్యతో పాటు, నైతిక విలువలు, దేశభక్తి, సదాచారంలో శిక్షణనిస్తూ, విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నాయన్నారు.

అనంతరం విద్యార్థులు, కమిటీ సభ్యులు, పోషకులు విద్యాపీఠ ఆవిర్భావ నిధిని సమర్పించారు. అంతకు ముందు శ్రీసీతారాముల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువులో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. విద్యార్థులు శ్రీసీతారాములకు సంబంధించిన భజనపాటలతో ఆకట్టుకున్నారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు చోళ పవన్ కుమారు, కార్యదర్శి మత్స్యేంద్రనాథ్, కృష్ణారెడ్డి, ప్రధానాచార్యులు సుధారాణి, పోషకులు తదితరులు పాల్గొన్నారు.
