Home News శతాబ్ద కాలంగా సనాతన ధర్మ సేవలో గీతా ప్రెస్

శతాబ్ద కాలంగా సనాతన ధర్మ సేవలో గీతా ప్రెస్

0
SHARE

గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ (GPG) ప్రచురించే భగవద్గీత, భాగవతం, జేబులో పట్టేంత హనుమాన్ చాలీసా పుస్తకం.. ఇలా వీటిలో ఏదో పుస్తకం భారత్‌లో కుల,మత, వర్గ, భాషలకు అతీతంగా ప్రతి ఇంట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

గోరఖ్‌నాథ్ గడ్డపై 99 సంవత్సరాలుగా గీతా ప్రెస్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. లెక్కకు అందనంతగా ధార్మిక పుస్తకాలను ప్రచురిస్తున్నది. అందరికి అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలకు వాటిని అందిస్తున్నది.

శతాబ్ది సంవత్సరంలో సందర్శకులకు పుణ్య క్షేత్రం లాంటి ఈ పుస్తక ప్రచురణ సంస్థ అవాంతరాలు, అడ్డంకులు ఎన్ని వచ్చినప్పటికీ తాను విశ్వసించిన సత్ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నది. ఐదు సంవత్సరాల క్రితం సమ్మె నుంచి కోవిడ్ సంక్షోభ కాలంలో సంస్థను మూసివేస్తారనే వదంతులు, తమ విద్వేషపు రాతలతో ప్రచురణ సంస్థపై వికృతమైన రంగులను కొందరు రచయితలు పులిమినప్పటికీ తనకు మార్గదర్శనం వహిస్తున్న ధర్మానికి, సిద్ధాంతాలకు కట్టుబడిన అతి పెద్ద ఈ ప్రచురణ సంస్థ మహోన్నతంగా నిలిచింది.

ఇటీవల మేం ఈ ప్రచురణ సంస్థను సందర్శించిన సందర్భంగా సంస్థ పట్ల సంపూర్ణమైన అవగాహన మాకు కలిగింది. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే అతి చిన్న పుస్తకం (అత్యంత అమ్మకాలను చవిచూస్తున్న పుస్తకం) నుంచి A4 సైజులో ఉండే పుస్తకం వరకు, క్లుప్తమైన హనుమాన్ చాలీస్ నుంచి సమగ్రమైన భాగవతం వరకు, బాలల కోసం ఆంగ్లంలో బాలరామాయణం బొమ్మల పుస్తకం నుంచి సరళీకరించినప్పటికీ అత్యంత సమగ్రమైన దుర్గ సప్తశతి వరకు అనేక ధార్మిక పుస్తకాలు అక్కడ ప్రచురితమవుతున్నాయి. ప్రచురణ సంస్థకు ఎదురుగా ధార్మిక పుస్తక ప్రియులను ఆకట్టుకునేలా అతి పెద్ద పుస్తక విక్రయ శాల ఉంది.

ప్రచురణ సంస్థలోపలకు దారి తీసే ద్వారం వర్ణశోభితమై ఉన్నది. అద్దాల పెట్టెలో కొలువుదీరిన పార్థసారథి, ద్వారపు స్తంభాలపై దేవీ దేవతల పేర్లతో సందర్శకుల్లో ఒక క్షణం ఆధ్యాత్మిక చింతనను కలిగించేలా ద్వారం రూపుదిద్దుకుంది. ప్రవేశం వద్ద ఏర్పాటు చేసిన రెండు అతి పెద్ద తైల వర్ణ చిత్రాలు దేవీ దేవతల ఆయుధాలు, ముఖ్యమైన పుణ్య క్షేత్రాలతో ధార్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

అతి పెద్ద చెక్క ద్వారం నుంచి లోపలకు అడుగుపెట్టగానే ఒక ఆశ్రమానికి దారి తీసే అతి పెద్ద భవంతులపై సుభాషితాలు చెక్కి ఉన్నాయి. భవంతుల మూలమూలల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ధూమపానం, పాన్ సేవనం నిషేధం అని తెలిపే బోర్డులు దర్శనమిచ్చాయి.

ఆ దారి అతి పెద్ద వసారాలోకి దారి తీసింది. అక్కడ నిలిపి ఉన్న లారీలు శ్రీ కృష్ణ ప్రవచనాలను దేశవ్యాప్తంగా చేరవేసే పుస్తకాలను లోడ్ చేసుకునేందుకు బారులు తీరి ఉన్నాయి. ఇదే విషయమై మూడు దశాబ్దాలకు పైగా ప్రెస్‌కు మేనేజర్‌గా సేవలందిస్తున్న రాజేశ్ శర్మ మాట్లాడుతూ “రోజుకు 50,000 పుస్తకాలను ముద్రిస్తాము. రామచరిత మానస్ పుస్తకం ప్రతి నెలా 20,000 నుంచి 30,000 కాపీలు ముద్రితమవుతుంది. ఇప్పటివరకు 82 లక్షల 89 వేల కాపీల రామచరిత మానస్‌ను ముద్రించాము” అని తెలిపారు.

కొద్ది గంటలసేపు ప్రెస్‌లో మేం సాగించిన పర్యటనలో ‘అచ్చుతప్పుల్లేకండా పుస్తకాలు’ అందించే ఒక మహా యజ్ఞంలో భాగంగా వేర్వేరు విభాగాల్లో ప్రతి పేజీ ముద్రితం కావడం, పేజీలను కూర్చడం, పుస్తక రూపకల్పన వరకు ప్రతిదీ అత్యంత అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాలతో జరుగుతున్నది. అక్కడక్కడా పుస్తక రూపకల్పనలో మానవ ప్రమేయం కూడా కనిపిస్తున్నది.

ప్రెస్ ప్రతి రోజూ ఎనిమిది గంటలు పనిచేస్తుంది. అత్యవసరమైన సందర్భాల్లో మరో నాలుగు గంటలు అదనంగా పనిచేస్తుంది. నూరవ ఆవిర్భావ సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ.. ప్రెస్ వ్యవస్థాపకులు గోయంద్‌కాజీ జన్మస్థలం చురు నుంచి శతాబ్ది వేడుకలకు నాంది పలుకుతామని 1980 తొలినాళ్ల నుంచి ప్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్న లాల్ మణి తివారి తెలిపారు. ఎలాంటి ప్రణాళికలు ఖరారు కానప్పటికీ 1923లో ప్రెస్ ఆవిర్భవించిన వైశాఖ శుద్ధ త్రయోదశి నాటి నుంచి అంటే ఈ సంవత్సరం మే 14 నుంచి వేడుకలు మొదలవుతాయని తివారి చెప్పారు. సంవత్సరం పొడుగునా శతాబ్ది వేడుకల నిర్వహణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటైంది. వేడుకల్లో భాగంగా కళ్యాణ్ మ్యాగజైన్‌ ప్రత్యేక సంచికను తీసుకువస్తారు.

కోల్‌కతాలోని ఒక ప్రెస్‌లో భగవద్గీత ప్రచురణలో దోషాలను జయదయాళ్ గోయంద్‌కా కనుగొన్న అనంతరం ఆయన చేతుల మీదుగా 1923 సంవత్సరం ఏప్రిల్ 29న గీతా ప్రెస్ ఆవిర్భవించింది. దోషాలు లేకుండా భగవద్గీత కాపీ కావాలంటే స్వంతంగా ఒక ప్రెస్ ఏర్పాటు చేసుకోవాలని కోల్‌కతా ప్రెస్ యజమానులు ఇచ్చిన సలహా గోయంద్‌కాపై ప్రభావం చూపింది. గోరఖ్‌పూర్‌లో వారి స్నేహితుడు, వ్యాపారవేత్త ఘనశ్యామ్ జలన్ ప్రెస్ నిర్వహణపై ఇచ్చిన భరోసాతో గీతా ప్రెస్ ఆవిర్భవించింది.

10 రూపాయిల అద్దెకు లభించిన ఇంటిలో బోస్టన్ నుంచి తెప్పించిన అచ్చు యంత్రంతో గీతా ప్రెస్ ధార్మిక గమనం ఆరంభమైంది. అలనాటి బోస్టన్ యంత్రం ప్రస్తుతం ప్రెస్ ఆవరణలోని ధార్మిక ఆర్ట్ గ్యాలరీ లీలా చిత్ర మందిర్‌లోని ఒక అద్దాల పెట్టెలో సేద తీరుతున్నది. ఈ వంద సంవత్సరాల కాలంలో ప్రెస్ దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి విస్తరించింది.

“1926లో ఈ భవనాన్ని రూ.10,000 లకు వారు కొనుగోలు చేసినప్పుడు అంతటి విస్తీర్ణానికి సరిపడ పుస్తక ప్రచురణ లేదు. కానీ గోయంద్‌కాజీ ముందుచూపు, దూరదృష్టి శ్రీకృష్ణుని మత్స్యావతారం తీరుగా సంస్థ పురోగతిని దర్శించింది. ఆ క్రమంలో రెండు లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో 1,45,000 చదరపు అడుగుల మేర ప్రాంతంలో ప్రెస్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. మిగిలిన 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మా స్వంత దుకాణం, కొన్ని కిరాయి దుకాణాలు, కొందరు అధికారులు, కార్మికులకు నివాసాలు ఉన్నాయి” అని తివారి వివరించారు.

సాంకేతికతలో కాలానుగుణంగా వచ్చిన మార్పులకు లోబడి ఒక పుస్తకం తయారీలో భారత్‌తో పాటుగా జర్మనీ, జపాన్, ఇటలీ నుంచి తెప్పించిన యంత్రాలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.

పుస్తకాల ముద్రణ కోట్ల రూపాయల్లో ఉండగా వాటి విక్రయాల ద్వారా వచ్చే రాబడి చాలా స్వల్పం. ఉద్యోగాలు వేతనాలు, ప్రెస్ నిర్వహణకు సంబంధించిన ఇతర ఖర్చులను చూసుకోవాలి. అయితే తమది లాభార్జనే ధ్యేయంగా పనిచేసే సంస్థ కాదని అలాగని ఎవ్వరి నుంచి విరాళాలను తాము స్వీకరించేది లేదని తివారి తెలిపారు. దుకాణాల నుంచి వచ్చే అద్దెలు, ఉత్తరప్రదేశ్ అంతటా విస్తరించిన వస్త్ర వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంతో ప్రెస్‌ను నడుపుతున్నట్టు ఆయన చెప్పారు.

గీతా ప్రెస్ ప్రస్తుతం 15 భాషల్లో పుస్తకాలను ప్రచురిస్తున్నది. 1,800కు పైగా రకాల పుస్తకాలను ముద్రిస్తున్నది. అయినా పుస్తక ప్రియుల నుంచి వస్తున్న డిమాండ్‌ను ప్రెస్ చేరుకోలేకపోతున్నదని అధికారులు తెలిపారు.

యావత్ ప్రపంచాన్ని మహమ్మారి పట్టిపీడించగా సంభవించిన ఆర్థిక మందగమనానికి విరుద్ధంగా గడచిన రెండు సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున డిమాండ్‌ను గీతా ప్రెస్ చవిచూసింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పుస్తకాల విక్రయాలు పెరిగాయని వారు వెల్లడించారు.

మహమ్మారి ప్రభావానికి ఇంటి నుంచి ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరిగింది. అలాగే మానసిక ఆందోళన చెందేవారి సంఖ్య పెరిగింది. టీవీలో రామాయణం లాంటి సీరియళ్ళకు ప్రేక్షకాదరణ పెరిగింది. అదే సమయంలో మన ధార్మిక రచనల పట్ల యువతలో ఆసక్తి పెరిగిన కారణంగా ఈ పుస్తకాలకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడిందని గీతా ప్రెస్‌లో పని చేస్తున్న అధికారుల్లో ఒకరు వివరించారు.

“అంతేకాదు, ఇది దైవ కార్యం. మీరు కనుక చూస్తే.. ఈ ప్రాంగణమంతా ఒక దేవస్థానాన్ని పోలి ఉంటుంది. ఇంట్లో భగవద్గీత పుస్తకం ఒక కాపీ ఉంటే చాలు.. ఆ పుస్తకం ఆ ఇంట్లో సమస్త దోషాలను పారద్రోలుతుందని సాధుపుంగవులు చెబుతుంటారు. మరి ఇక్కడ వేలకొద్దీ పుస్తకాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ మంచికానిది మరేదైనా ఎలా మనగలుగుతుంది?” అని శర్మ అన్నారు.

“ప్రతి ఒక్కరికి అలాంటి సాహిత్యం అందుబాటులో ఉండాలనేది మా వ్యవస్థాపకుల ఏకైక లక్ష్యం. ప్రతి ఒక్కరూ పురోగమించాలి. ప్రతి ఒక్కరూ భగవంతునితో అనుసంధానమై ఉండాలి. ఈ ఏకైక లక్ష్యమే ఈ ప్రెస్‌ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నది” అని ఆయన చెప్పారు.

“గత ఆర్థిక సంవత్సరంలో రూ.51 కోట్ల విలువైన పుస్తకాలను విక్రయించాము. ఈ సంవత్సరం పుస్తకాల విక్రయం రూ.75 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాము” అని తివారి తెలిపారు.

కరోనా మహమ్మారి కాలంలో ప్రెస్ మూతపడుతుందనే వదంతులతో సైతం ప్రెస్ వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న గీతా ప్రెస్ ఏ క్షణంలోనైనా మూతపడిపోవచ్చు అనే వదంతులు సోషల్ మీడియాలో అనేక పర్యాయాలు ప్రత్యక్షమయ్యాయి. అయితే దుష్ప్రచారం సైతం సానుకూలంగా పనిచేసిందని తివారి తెలిపారు.

“దుష్ప్రచారం ఎలాంటి సవాల్ కాలేదు. గీతా ప్రెస్‌కు ప్రజల మద్దతు మరోసారి నిరూపితమైంది. “గీతా ప్రెస్ నుంచి ముద్రణ నిలిపివేయవద్దు.. ఎంత మేరకు నిధులు అవసరమైనా సరే.. మీకు అందేలా మేం చూస్తాము” అనే ఫోన్ కాల్స్ స్వదేశీయుల నుంచి మాత్రమే కాకుండా విదేశీయుల నుంచి కూడా వచ్చాయి. ఈ రకమైన వదంతులు మా కార్యాన్ని మరింత విస్తరింపజేయడానికి దోహదపడతాయి” అని ఆయన తెలిపారు.

గీతా ప్రెస్ ఆవిర్బవించినాటి నుంచి నేటి వరకు మొత్తంగా 73 కోట్ల పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటిలో కళ్యాణ్ మ్యాగజైన్ కాపీలు 16.5 కోట్లు ఉన్నాయి. కళ్యాణ్ మ్యాగజైన్ 96వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ పత్రికకు 1,75,000 మంది చందాదారులు ఉన్నారు. పత్రికకు తొలి సంపాదకులుగా సుదీర్ఘ కాలం సేవలందించిన రాధేశ్యామ్ ఖేమ్కాజీని కొద్ది రోజుల క్రితం పద్మభూషణ్ పురస్కారం వరించింది.

“తనదైన సిద్ధాంతానికి లోబడి ఎలాంటి రివార్డు లేదా గుర్తింపు కోసం గీతా ప్రెస్ ఒక్కనాటికి పనిచేయకపోయినప్పటికీ, ఈ అవార్డును ఖేమ్కాజీకి ఇచ్చారు. వారి లేని వేళ నిర్ణయించేది మేము కాదు కాబట్టి దానిని (అవార్డు) మేం ఆమోదించాము” అని తివారి వివరించారు.

ప్రతి మాసం దాదాపు 400 టన్నుల నుంచి 500 టన్నుల కాగితాన్ని ప్రెస్ వినియోగించుకుంటుందని శర్మ తెలిపారు. ప్రతి అచ్చు యంత్రానికి ఏ వేళలోనైనా ముద్రణ కోసం కనీసం ఒక ట్రక్కు లోడు కాగితం కావాలి.
చింపివేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ చినిగిపోని విధంగా పుస్తకాలను బైండింగ్ చేస్తామని బైండింగ్ మెషిన్ దగ్గర పనిచేస్తున్న ఒకానొక ఉద్యోగి తెలిపారు.

1955 సంవత్సరం ఏప్రిల్ 29న భారతదేశ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆరంభమైన లీలా చిత్ర మందిర్, ద్వారం అనేక దశాబ్దాల కాలపరీక్షకు తట్టుకొని అంతే స్థాయిలో ధార్మికతను పంచుతున్నాయి. కళ్యాణ్ మ్యాగజైన్ సంపాదకులు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ ద్వారా తీర్చిదిద్దబడిన లీలా చిత్ర మందిర్ మ్యూజియమ్ శ్రీరామ, శ్రీకృష్ణ లీలలతో కూడిన వర్ణ చిత్రాలను సంతరించుకుంది. అదే లీలా చిత్ర మందిర్‌లో పాలరాతిపై గీతా ప్రవచనలు చెక్కి ఉన్నాయి. “యావత్ రామచరితమానస్‌ను చదివినంత ప్రభావం ఇక్కడ ఉంటుంది” అని శర్మ తెలిపారు.

అత్యంత పవిత్రమైన కార్యానికి వినియోగించే కాగితాలు ప్రతి దశలోనూ నేల మీద పడకుండా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచడం విశేషం. అందుకోసమే అన్నట్టుగా కాగితపు తయారీ సంస్థ ITC.. ‘Gita Printing Paper’ అని ముద్రించిన కాగితాన్ని తయారు చేస్తున్నది. పుస్తకంలో కాగితానికి ఒక వైపు యావత్ గీతా ప్రవచనం ఉండగా మరొకవైపు భూతద్దంలో చూడగలిగే విధంగా చేతి రాతతో కూడిన ప్రవచనం, అద్భుతమైన వర్ణ చిత్రాలు, ఆధ్యాత్మికను ఆమూలగ్రం పంచిపెట్టే అనేక రకాల పుస్తకాలు, అరుదైన రాతప్రతులు, ధార్మిక సాహిత్యానికి చెందిన కీలకమైన రచనలు, అక్షరదోషాలకు, అచ్చుతప్పులకు ఏ మాత్రం అవకాశం లేని గీతా ప్రెస్‌లో ఎవరైనా సాగించే పర్యటన మరపురానిదిగా మిగిలిపోతుంది.

SOURCE: SWARAJYAMAG.COM