Home News విశ్వకళ్యాణం భారతీయ మార్గం ద్వారానే సాధ్యపడుతుంది – భయ్యాజీ జోషి

విశ్వకళ్యాణం భారతీయ మార్గం ద్వారానే సాధ్యపడుతుంది – భయ్యాజీ జోషి

0
SHARE

మనలో ఉన్న ఆత్మన్యూనతాభావమే దేశ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారిందని, ఇతర దేశాలు, సంస్కృతులతో పోల్చుకుని మనం తక్కువవారమని అనుకోవడం ఆలావాటైపోయిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి అన్నారు. జపాన్, అమెరికాల మాదిరిగా మారాలనే తాపత్రయానికి బదులు ఈ దేశం భారత్ ల ఉండడానికే ప్రయత్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల చిన్నచూపును వదిలి వాటిని ప్రచారం చేయడానికి యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వకళ్యాణం భారతీయ మార్గం ద్వారానే సాధ్యపడుతుందనే విషయం వారు గ్రహించాలని శ్రీ సురేశ్ జోషి అన్నారు. డిసెంబర్ 23న మానససరోవరంలోని సంస్కృతి కళాశాలలో ఏర్పాటైన సంగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు పాల్గొన్నారు.  సమాజంలో పేరుకుపోయిన ఈ న్యూనతాభావాన్ని తొలగించేందుకు కుటుంబ స్థాయిలో, అలాగే సంస్థల ద్వారా ప్రయత్నం జరగాలని సర్ కార్యవాహ అన్నారు. ప్రపంచంలో భగవంతుడికి అనేక రూపాలున్నా ఆయన ఒక్కడేనని, ఇప్పుడు ఏకత్వాన్ని వదిలి అనేక రూపాల గురించి ఘర్షణ పడటం విచారించదగిన విషయమని అన్నారు. పరస్పరం ఘర్షణ పడాల్సిన అవసరం లేదని, కలిసి జీవించవచ్చని హిందూత్వం చెపుతోందని, ఇదే నేడు విశ్వకళ్యాణానికి ఏకైక మార్గమని అన్నారు. సర్వ సృష్టి పంచభూతాత్మకమైనది. చివరికి ఆ పంచ భూతాలలనే కలిసిపోతుందని హిందూత్వం చెపుతోంది. కాబట్టి బయటకు కనిపించే భిన్నత్వాన్ని చూసి ఘర్షణ పడాల్సిన అవసరం లేదని చెప్పిన భారతీయ సంస్కృతి ప్రకృతికి అనుగుణంగా జీవించడం ఎలాగో చూపించిందని శ్రీ సురేశ్ జోషి అన్నారు.

పరస్పర సంబంధాలు చట్టాల ద్వారా ఏర్పడవని, అవి భావాత్మక ఏకత్వం ద్వారానే వికసిస్తాయని అందుకనే భారతీయ జీవన విధానం ఈ మానవ సంబంధాల ఆధారంగానే ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. ఆత్మ శాశ్వతం, శరీరం నశించిపోయేదని గుర్తించినవాడే హిందువని, ఈ భావన లేనప్పుడు వినాశానికి దారి తీస్తుందని అన్నారు. భారతీయ జీవనశైలి సకారాత్మకమైనది.

మన దేశంలో మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఉన్నాయని, అన్నీ రంగాలలో మహిళలు ముందుకు సాగుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమాజం ఎప్పుడైతే మౌలిక విలువలకు దూరమైందో అప్పుడు పతనావస్థను చేరుకుందని, కనుక ఆ విలువలను తిరిగి ఆచరణలోకి తెచ్చేందుకు సమాజం, కుటుంబం, సంస్థలు సంకల్పించాలని శ్రీ సురేశ్ జోషి పిలుపునిచ్చారు.