బాగా చదువుకోవడం, ఉన్నతోద్యోగాలు సాధించడం.. వంటివన్నీ విజయాలే. కానీ మేం సాధించిన విజయం మా జీవితాలకో మలుపు. అప్పులు తీర్చలేక ఊరొదిలి వెళ్లిపోయిన మా భర్తల్ని తిరిగి ఊరు రప్పించాలనుకున్నాం. అనుకున్నది సాధించాం. ఇంతకన్నా పెద్ద గెలుపు ఇంకేం ఉంటుంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం 20 రూపాయల జీతానికి బానిసలుగా బతికిన మేమే, ఇప్పుడు నెలకు తలా 15 వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ప్రస్తుతం మా గ్రామ మహిళా బృందాల టర్నోవరు ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు. మాది ఉత్తరప్రదేశ్, వారణాసి జిల్లా, గోరా గ్రామం. మా అందరికీ చిన్న చిన్న కమతాలుండేవి. అయితే వ్యవసాయానికి పెట్టుబడి కావాలన్నా, ఎవరికైనా జబ్బు చేసినా మా ఊరి కామందు మహాదేవే ఆధారం. వేలిముద్ర వేయించుకుని అప్పు ఇచ్చి, దానికి చక్రవడ్డీ, బారువడ్డీ వేసి, గోరంత అప్పును కొండంత చేసేవాడు. అప్పు ఓ పట్టాన తీరేది కాదు. దాంతో మా భూముల్ని లాక్కునేవాడు. అలా మా పొలాల్లో మేమే కూలీలయ్యాం. ఊరంతా ఇదే పరిస్థితి. నెలకు 20 రూపాయల జీతంతో ఆయన దగ్గరే పనిచేయాల్సిన పరిస్థితి. ఆ డబ్బు తిండికే సరిపోదు. ఇక అప్పెలా తీరుస్తాం. పైగా వడ్డీ అంటే తరచూ వేధింపులు. ఇళ్లు స్వాధీనం చేసుకుంటానని, ప్రాణం తీస్తానని బెదిరింపులు. దాంతో మా ఊళ్లోని మగవాళ్లంతా ఊరు వదిలి పారిపోయారు. మగదిక్కు లేకుండా పిల్లల్ని పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ అనాథలుగా రోజులు గడిపాం.
పదిహేను మంది కలిసి..
ఎన్నాళ్లిలా బానిసల్లా ఉండాలనుకునేదాన్ని. మా ఊళ్లోని మహిళలందరితో మాట్లాడా. అందరం కలిసి ఏదయినా చేద్దామని చెప్పా. 15 మంది మహిళలం కలిసి ఓ బృందంగా ఏర్పడ్డాం. తలా 20 నుంచి 30 రూపాయలు చొప్పున పోగేస్తే మొత్తం వెయ్యి రూపాయలు జమయ్యాయి. మా భూముల్లో ఓ చిన్న భూమిని, ఏడాదికి పదివేల రూపాయలు అద్దె కట్టేలా మహాదేవ్ను ఒప్పించాం. ఆ డబ్బులే పెట్టుబడి పెట్టి బంతిపూల పంటను వేశాం. మాతోపాటు మా పిల్లలు కూడా రాత్రీ, పగలూ తేడాలేకుండా పనిచేసేవారు. పంట చేతికొచ్చాక మా దగ్గర్లోని బజారులో అమ్మి, ఆ నగదును ఓ చోట పొదుపు చేశాం. ఆ తరువాత అక్కడితో ఆగిపోలేదు. కూరగాయలూ, పండ్లు కూడా సాగు చేయడం మొదలుపెట్టాం. మాకు వచ్చిన ఆదాయంలో అప్పుడప్పుడూ వెయ్యి, రెండువేల రూపాయల్ని అప్పు తీరిస్తే, వడ్డీ పెరిగిందంటూ భయపెట్టేవాడు. అందుకే ఆలోచించాం. డబ్బు ఎక్కువగా పోగుచేసి, అప్పు తీర్చాలనుకున్నాం. రోజులు గడిచేకొద్దీ బృందాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం 40 బృందాలయ్యాయి. పంటలూ పెరిగాయి. ఒక్కో బృందం ఒక్కో పనిచేసేవారు. మేం అమ్మిన ప్రతి పంట తాలూకు డబ్బును జమచేసి, పుస్తకంలో పక్కాగా రాసుకునేవాళ్లం. కడుపు కట్టుకుని ఆరేళ్లు కష్టపడ్డాం. చెప్పానుగా మా లక్ష్యం అదే.
విముక్తిని సాధించాం..
2013 నుంచి కొంచెం కొంచెంగా అప్పు తీర్చడం మొదలుపెట్టి, ఈ మధ్యే పూర్తిచేసాం. మా భూములన్నీ ఇప్పుడు మా సొంతం. ఇప్పటికీ సమష్టిగానే వ్యవసాయం. బృందాల తరపున నగదును కూడా ఒకే చోట పొదుపు చేస్తాం.. పెళ్లీ, అనారోగ్యం వంటి అదనపు అవసరాలైతే, తక్కువ వడ్డీకి ఆ మొత్తం నుంచే అప్పుగా ఇస్తాం. దీనికోసం ప్రతి బృందం పేరుతో ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు డిపాజిట్ చేశాం. ప్రాణభయంతో పారిపోయిన మా ఊరి మగవాళ్లంతా తిరుగు ముఖం పట్టారు. ఈ మూడేళ్లలో అందరూ వచ్చేశారు. వాళ్లందరికీ మా బృందాల డిపాజిట్ల నుంచి అప్పు ఇచ్చాం. కుట్టు మిషన్లూ, ప్రింటింగ్ మిషన్లు వంటివి ఏర్పాటు చేసిచ్చాం. వాళ్లు కూడా అప్పు తీర్చాలి. ఇప్పుడు ప్రతి మహిళా నెలకు తలా 15 వేల రూపాయలను సంపాదించుకోగలుగుతోంది. పిల్లలను చదివిస్తున్నాం. ప్రస్తుతం మా బృందాల టర్నోవరు ఈ ఏడాది ఏడు కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పుడు 230 బృందాలున్నాయి. వాటిలో 42 నేను, మిగతావాటిని మరో ముగ్గురు చూసుకుంటున్నారు. మా ఊరిని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కలవాళ్లంతా మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.
(ఈనాడు సౌజన్యం తో)