పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత వాటిని వివిధ మార్గాల్లో మార్పిడి చేయడానికి సహకరించిన దాదాపు 17 వేల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో పెట్టుబడి సలహా సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, హోటళ్లు, బియ్యం మిల్లులు, ఆభరణాల దుకాణాలు, సినీ నిర్మాణ, మీడియా సంస్థలు ఉన్నాయి. ఇదంతా నల్లధనమని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్‌వెస్టిగేషన్ ఆఫీసు-ఎస్‌ఎఫ్‌ఐఓ), ఆదాయపు పన్ను విభాగం (ఐ.టి.), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు ఇందుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేశాయి. మొత్తం 16,749 సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు లెక్కతేల్చారు. ఈ జాబితాలో 43 ఆహార కంపెనీలు, 9 బియ్యం మిల్లులు, 860 స్థిరాస్తి, భవన నిర్మాణ కంపెనీలు, 150 ఉక్కు-లోహాల సంస్థలు, 40 ప్రకటనలు, మల్టీమీడియా సంస్థలు, రెండు కొత్త మీడియా కంపెనీలు, డజన్ల కొద్ది ఆభరణాల దుకాణాలు, రెండు రేడియో సంస్థలు, వేలాది ఆర్థిక వ్యవహార సంస్థలు ఉన్నాయి. వాటి దస్త్రాల్లో ఉన్న తేడాలు ఆధారంగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. 14,247 సంస్థలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు వివరాల కన్నా చాలా తక్కువ మోత్తాన్ని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశం ఉన్న 50 రోజుల వ్యవధిలో (2016 నవంబరు 8 నుంచి డిసెంబరు 30 వరకు) 4.62 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ.25 లక్షలకన్నా ఎక్కువగా నగదు జమ అయినట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 23.87 లక్షల ఖాతాల్లో రూ.5లక్షల వంతున జమ అయింది. నోట్ల రద్దు అనంతరం జమ అయిన నగదు వివరాలను విశ్లేషించిన అనంతరం 1.75 లక్షల డొల్ల కంపెనీలు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఇందులో 400 కంపెనీలు ఒకే చిరునామాపై ఉండడం గమనార్హం. ఇవన్నీ పన్నుల ఎగవేతకు, అక్రమంగా నగదు చెలామణికి సహకరించేవేనని అధికారులు గుర్తించారు.
(ఈనాడు సౌజన్యం తో)