భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్‌సైట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చానళ్లు, వెబ్‌సైట్లలో కశ్మీర్, ఇండియన్ ఆర్మీ, రామ మందిరం, మైనారిటీలు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు సున్నిత అంశాలపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
యూట్యూబ్ చానళ్లలో చాలా వరకు పాకిస్థాన్‌కు చెందిన నయా పాకిస్థాన్ గ్రూప్(ఎన్‌పీజీ)కు చెందినవే ఉన్నాయి. కొన్ని ఇతర చానళ్లు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 35 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఎన్‌పీజీ నిర్వహణలోని చాళ్లలో చాలా వరకు పాకిస్థాన్ న్యూస్ చానళ్ల యాంకర్లే నిర్వహిస్తుండడం గమనార్హం. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం, పౌరసత్వం సవరణ హక్కు చట్టం వంటి వాటిపై రెచ్చగొట్టే వార్తలను/వీడియోలను పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మైనారిటీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే, త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ చానళ్లలో పూంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, నేక్‌డ్ ట్రూత్, 48 న్యూస్, ఫిక్షనల్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, పంజాబ్ వైరల్, నయా పాకిస్థాన్ గ్లోబల్, కవర్ స్టోరీ, గో గ్లోబల్, ఈకామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్, తయ్యబ్ హనీఫ్, జైన్ అలీ అఫీషియల్, మోషిన్ రాజ్‌పుట్, అఫీషియల్, కనీజ్ ఫాతిమా, సదాఫ్ దురానీ, మియాన్ ఇమ్రాన్, అహ్మద్, నజమ్ ఉల్ హసాన్, బజ్వా, న్యూస్ 24 వంటివి ఉన్నాయి.