Home Telugu Articles సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత

0
SHARE

–  శ్రీ కృష్ణ గోపాల్ శర్మ

గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా…

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు.

అఖండ సాధన 

గోదావరీతట `నాసిక’ వద్ద శ్రీ సమర్థగురు పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసారు. ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీళ్ళల్లో నుంచుని గాయత్రీ మంత్రజపం చేసేవారు. శ్రీరామనామజపం `శ్రిరామజయరామ జయజయరామ’ మంత్రాన్ని పదమూడుకోట్లసార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలు పర్యటించారు. పండరీపురంలోనూ ఆయనకు ఆ రాముడే కనిపించాడు. అక్కడే ఆయన భక్త తుకారామ్ ను కూడా కలిసారు. ఆ కాలంలోని దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఖం కలిగింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది.

కుల, భేదభావాలు

సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధ పడడం చూసి,  శ్రీ సమర్థగురు రామదాస్ ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించడానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తమ ప్రఖ్యాత `దాసబోధ’ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ, `పెద్ద- చిన్న, రాజు- పేద, స్త్రీ -పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మము ఉంటాడు’ అని బోధించారు. `బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, రాజైనా, ప్రజలైనా, అందరిలోనూ పవిత్రమైన పరబ్రహ్మము ఒక్కటే’ అంటూ ఆయన సమస్త మానవులలోనూ ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించి, కుల విభేదాలని తోసిపుచ్చారు. అందరి హృదయాలను సంభాలించడమే దైవభజన అని చెప్పారు. `సంత్ చోఖామేలా’,`వర్కారి సంప్రదాయం’లో (శ్రీ పాండురంగ భక్తి సంప్రదాయం) `మహార్’కులానికి చెందిన స్వామీజీ గురించి వ్రాస్తూ… `అనాథనాథుడైన భగవంతునికి ఏ జాతి లేదు, ఆయన `చోఖామేలా’తో కూర్చుని పాలు, పెరుగు భోజనం చేస్తాడు’ అన్నారు. మరొకచోట వ్రాస్తూ `ఎక్కువ తక్కువ కులాలనే వ్యత్యాసం లేదు. హరినామ సంకీర్తనతో నిండిన అటువంటి వ్యక్తుల పవిత్ర పాదధూళికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. `ఇంకొకరి స్పర్శమాత్రం చేత అపవిత్రమైపోతే నీదేపాటి పవిత్రత? పెద్ద-చిన్న కులభేదాలను తోసిపుచ్చి అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించండి, ఆదరించండి; అప్పుడే అందరి హృదయాలు పునీతమౌతాయి’ అన్నారు.

 అంటరానివారి’తో భోజనం, దక్షిణ

చాఫల్ ప్రాంతంలో, భేర్వాడి గ్రామంలోని `అంటరానివాళ్ళు’ అనబడే దంపతులను, శ్రీ సమర్థగురు రామదాస్ తమ శ్రీరామనవమి ప్రవచనాలకు ఆహ్వానించారు. వారు `మాండ్’ నదిలో స్నానం చేసిన తరువాత, సంప్రదాయానుసారం వారిద్దరికీ చీర-ధోవతులు పెట్టి, సహపంక్తి భోజనం కావించి, దక్షిణ సమర్పించారు. ఆ కాలంలో ఈ సంఘటన ఒక గొప్ప విప్లవంగా పేర్కొనవచ్చని డా. సచ్చిదానంద పర్లికర్ తమ పుస్తకంలో వ్రాసారు, `కులం, వర్ణం, ప్రాంతం, భాషా భేదాల పేరుతో, మనుషుల మధ్య  అంతరాలు శ్రీ సమర్థగురు రామదాస్ గారికి ఎంతమాత్రం అంగీకారం కాదు’ అని వ్రాసారు.  శ్రీ సమర్థగురు రామదాస్ అంటారు. `భక్తిమార్గములో వెళ్లే ప్రతి వ్యక్తి పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడే, అన్ని వర్ణాలు దీనికి అర్హులే, చిన్నా-పెద్దా ఎవరూ లేరు, మూర్ఖుడైనా భగవంతుడి నామస్మరణతో భవసాగరాన్ని దాటవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి శ్రేష్టుడు, చెడు చేసేవాడు నికృష్టుడు, కర్మానుసారం మనుషులు పాపకర్మలు లేక పుణ్యకార్యాలు చేస్తుంటారు’ అని ఉద్బోధించారు.

దేశోద్ధారణ

ఆ కాలంలో భారతదేశం మీద ఇస్లాంమత దాడులనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి శ్రీ సమర్థగురు రామదాస ప్రణాళికాబద్దంగా కృషి చేసారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబలేశ్వర్ కొండలలో ఆయన ప్రధమంగా శ్రీ వీరహనుమాన్ దేవాలయం, మఠం నిర్మించారు; ఆ తరువాత 11 క్షేత్రాల్లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థగురు రామదాస్ మహారాష్ట్ర అంతటా వేయి హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు.

ఆ కాలంలో పూర్తి దేశమంతా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకర దాడులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో రాజ్యాధికారం ముస్లిముల చేతిలోనే ఉంది. భక్తి ఉద్యమంతో పాటు, ముస్లిముల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందడం కూడా దైవకార్యంగానే శ్రీ సమర్థగురు రామదాస్ భావించారు. `స్వరాజ్యం ధర్మకార్యం. పరమేశ్వరుని శిరసు మీద ధరించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకండి’ అని శ్రీ సమర్థగురు రామదాస్ పిలుపు నిచ్చారు. `హిందూ ఆలయాలను ధ్వంసం చేసినవారు దైవద్రోహులు, అటువంటివారిని శిక్షించిన వారు దేవదాసులు, ఈశ్వరుని భక్తులు; ఈశ్వర భక్తులకి విజయం తధ్యం’.  అని అన్నారు

 శ్రీరామనవమి మహోత్సవాలు

హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్కతాటిపై తేవడానికి శ్రీ సమర్థగురు రామదాస్, శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే  శ్రీరామ రథోత్సవాలలో, అన్ని కులాలు వర్గాలవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు.

శిష్య పరంపర

శ్రీ సమర్థగురు రామదాస్ దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి, ఒక్కతాటిపై సమీకరించడానికి కృషి చేసారు. ఆయన తమ విస్తృత శిష్యపరంపర నుంచి, దాదాపు 1100మందిని `మహంత్’లుగా తీర్చిదిద్దారు, అందులో 300మంది మహిళలు, ఆనాటి సమాజంలో అది చాలా పెద్ద సంస్కరణ, ముందడుగు. వీరంతా దేశమంతా విస్తరించి, అనేక స్థానాల్లో, హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. వీరు కులాలకి అతీతంగా వేయి పైగా మఠాల స్థాపన చేసారు. తంజావూరు నుంచి కాశ్మీరు దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు, ఛత్రపతి శివాజీ మహారాజుకి ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినపుడు, తంజావూరు మఠం ఆయనకు సర్వంసహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు.

 సాహిత్య రచనలు

హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థగురు రామదాస్ అనేక ఉత్కృష్ట రచనలు చేసారు. అందులో ప్రముఖమైనవి- `దాసబోధ’ `కరుణాష్టక్’ `మనాచే శ్లోక్’ `సుందరకాండ మరియు యుద్ధకాండ’. వేలాదిమంది కార్యకర్తలను సుశిక్షితులుగా తయారుచేసి, సామాజికంగా సంఘటితం చేయడానికి ఎనలేని కృషి చేసారు. `అందరి హృదయాలలో శ్రీరాముడు నివాసముంటాడు, కులభేదాలు పట్టుకువేళ్ళాడడం అంటే మనందరిలోని శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరంచడమే’ అన్నారు.  వెనకబడిన కులాలనబడే వారితో పనిచేసి, వారిని సంఘటితం చేసి ఛత్రపతి శివాజీ మహారాజుకి తోడుగా తెచ్చి నిలబెట్టారు.

 (‘భారత్ కీ సంత్ పరంపర ఔర్ సమాజిక్ సమరసతా’ హిందీ గ్రంథం ఆధారంగా)

అనువాదం: ప్రదక్షిణ

This article was first published in 2020

For local updates, download Samachara Bharati