Home Telugu Articles హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 2

హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 2

0
SHARE

ప్రతాపరుద్రుని తరువాత కాలంలో ముస్లిములు జరిపిన దురంతాలను కొందరు ముస్లిం చరిత్రకారులు ఘనకార్యాలుగా ఎంచి నమోదు చేశారు. ఉదాహరణకు మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ సమకాలికుడైన ఇబ్న్‌ బతూతా తన సఫర్‌నామా అనే యాత్రాగ్రంథంలో ఇలా రాశాడు – ”హిందూ రాజులను చెరబట్టి బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి వారి మాంసాన్ని వండి, వారి భార్యాబిడ్డల చేత తినిపించారు. చచ్చినవాడి తలనరికి కోటగోడలకు వ్రేలాడగట్టారు. దేవాలయాలను కూల్చి విగ్రహాలను ముక్కలు చేశారు. దేవాలయాల్లోని నగలను, ఇతర వస్తువులను దోచుకున్నారు. హిందూ స్త్రీపురుషులను బలవంతంగా ముస్లిములుగా మార్చారు. ఇవన్నీ సుల్తాన్‌ సైనికుల నిత్యకృత్యాలు.”

ఓరుగల్లు పడిపోయిన తరువాత ఉలుగ్‌ఖాన్‌ నాయకత్వంలో ముస్లిం సైన్యాలు దక్షిణభారతదేశాన్ని దోచుకోవడం, ఆక్రమించడం ప్రారంభించాయి. తాము ఆక్రమించిన ప్రదేశాల్లో దేవాలయాలను నాశనం చేసి, వాటి శిథిలాలతో అదే స్థలంలో మసీదులు నిర్మించడం ముస్లిములు ఒక ఆచారంగా పాటించారు. ఉదాహరణకు సా.శ. 1324 సెప్టెంబరు 10 ఉలుగ్‌ఖాన్‌ సేనాపతి సాలార్‌ ఉల్వీ రాజమండ్రిలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని కూలగొట్టించి దాని శిథిలాలతో అక్కడే ఒక మసీదు కట్టించి, తన ఘనకార్యాన్ని వివరిస్తూ ఆ మసీదు గోడమీద ఒక పర్షియను శాసనాన్ని చెక్కించాడు. దాన్ని నేటికీ చూడవచ్చును. ఆ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు కట్టించారని, దాన్ని ఉలుగ్‌ఖాన్‌ సేనలు పాడుచేశాయని అలగ్జాండర్‌ రే, ఇలియట్‌ మరియు డౌసన్‌ మొదలైన చరిత్రకారులు తెలిపారు. ఇది ఆంధ్రదేశంలోని మసీదుల్లో అతి ప్రాచీనమైనది. బహుశా మొదటిది కావచ్చును. ఈ విధంగానే ఏలూరు, కొండపల్లి మొదలైనచోట్ల హిందూదేవాలయాలను నాశనంచేసి వాటి స్థానంలో మసీదులు కట్టారు.

ఆనాడు దక్షిణభారతదేశమంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. 1324 – 35 సంవత్సరాల మధ్య నెల్లూరు నుంచి క్విలన్‌ వరకూగల మబార్‌ (మధుర) రాజ్యాన్ని ముస్లిములు కొల్లగొట్టినట్లు వస్సాఫం అనే చరిత్రకారుడు రాశాడు. పైన చెప్పిన ఆధారాలేకాక విజయనగరరాజైన బుక్కరాయల కుమారుడు కంపరాయల భార్య గంగాదేవి రచించిన మధురావిజయం అనే సంస్కృత కావ్యంలోనూ, వేదాంతదేశికులు రచించిన అభీతిస్తవంలోనూ ఆనాటి దుండగాలను వర్ణించారు.

అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రదేశాన్ని ముస్లిం దురాగతాల నుంచి, దురాక్రమణ నుంచి విముక్తం చేయడానికి ప్రజలు ఉవ్వెత్తుగా ఉద్యమించారు. వారిలో ముసునూరి ప్రోలయ, కాపయ అనే కమ్మ వీరులు, ప్రోలయ వేమారెడ్డి వంటి రెడ్డి వీరులు, రేచర్ల సింగమ వంటి వెలమ(పద్మనాయక) వీరులు, బెండపూడి అన్నయ వంటి బ్రాహ్మణవీరులు ముఖ్యులు.

వీరిలో ప్రత్యేకంగా చెప్పవలసినది ముసునూరి ప్రోలయ, కాపయల గురించి. వీరిద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. గోదావరికి పడమటివైపున ఉన్న వేంగి ప్రాంతంలోని ముసునూరు గ్రామం వీరి జన్మస్థలం. భద్రాచల క్షేత్రానికి దగ్గరున్న అడవుల్లో రేకపల్లి అనే వనదుర్గం ఉండేది. సా.శ.14వ శతాబ్ది ప్రారంభంలో ముసునూరి వంశస్థులు దానికి అధిపతులుగా ఉండేవారు. ముసునూరి వంశానికి పోతానాయ(కు)డు మూలపురుషుడు. ఆయనకు పోచానాయడు, దేవానాయడు, కామనాయడు, రాజనాయడు అని నలుగురు కొడుకులు. పోచానాయడి కుమారులు ప్రోలయ నాయడు, ఎరపోతానాయడు. కాపానాయని కుమారులు ఇమ్మడేశుడు, రెండవ దేవనాయడు. వీరిద్దరిలో ఒకనికి వినాయకదేవుడనే పేరు కూడా ఉంది. ప్రోలయకు సంతానం లేదు. తన పినతండ్రి కుమారుడు కాపయను కన్నబిడ్డలా చూసుకున్నాడు.

ఆనాడు ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ చక్రవర్తులకు ముసునూరివారు సామంతులు. ప్రతాపరుద్ర చక్రవర్తి తురకలకు ఓడి బందీగా మరణించిన తరువాత తురకల దౌర్జన్యాల నుంచి ఆంధ్రదేశాన్ని రక్షించే బాధ్యత నాయంకర ముఖ్యులపై పడింది. నాయంకర ముఖ్యులంటే కాకతీయ సామ్రాజ్య రాజకీయవ్యవస్థను నిర్వహించే 72 విభాగాలైన నాయంకరములకు అధిపతులు. ప్రతాపరుద్రుని సేనానుల్లో చాలామంది యుద్ధంలో మరణించడమో, పట్టుబడటమో జరిగింది. బెండపూడి అన్నయ మంత్రి, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమ నాయడు అనే ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు ముస్లిం దుండగాలపట్ల ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకతను, స్వాతంత్య్రేచ్ఛను గుర్తించారు. ఆంధ్రదేశాన్ని విముక్తం చేయడానికి అప్పుడున్న సామంత, మాండలిక కుటుంబాలను సమైక్యపరచి, ధర్మరక్షణకు, స్వతంత్ర పోరాటానికి సిద్ధం చేశారు. అలా సమావేశమైన వారిలో కోరుకొండ కూనయ కుమారులు, ముమ్మడి గన్నమ, సింగయ, అద్దంకి ప్రోలయవేమారెడ్డి, అతడి అన్నదమ్ములు మాచారెడ్డి, అన్నారెడ్డి, దొడ్డారెడ్డి, మల్లారెడ్డి, రాచకొండకు చెందిన వెలమ సింగమ, పిఠాపురం కొప్పుల నాయడు, కోటపురి సింగమ, తాటిపాక గన్నయ, మంచికొండ గణపతి నాయడు ఉన్నారు. వీరందరూ ఏకమై స్వతంత్ర యోధుల సమాఖ్యగా ఏర్పడి ముసునూరి ప్రోలయను తమకు నాయకుడిగా, సమన్వయకర్తగా ఎన్నుకున్నారు.

ప్రోలయనాయకత్వంలో ఆంధ్రనాయకులు మొదట తీరాంధ్ర ప్రాంతాన్ని ముస్లిముల నుంచి విముక్తం చేశారు. ప్రోలయ వేమారెడ్డి వేయించిన మల్లవరం శాసనం, కొలని రుద్రదేవుని సంతమాగలూరు శాసనాలను బట్టి ప్రోలయ ఆధ్వర్యంలోని స్వాతంత్య్రసమరం 1325 , 26 సంవత్సరాలలో జరిగినట్లు చెప్పవచ్చును. అంతేకాదు సా.శ. 1326నాటి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ వేయించిన నాణెం తీరాంధ్రకు సంబంధించి ఢిల్లీ సుల్తాను వేయించిన చివరి నాణెమని, దీన్నిబట్టి కూడా అదే ఆంధ్రలో ఢిల్లీ చక్రవర్తి అధికారానికి చివరి సంవత్సరమని చరిత్రకారుల అంచనా. ప్రోలయ నాయకునితో సహకరించి స్వతంత్రం కోసం పోరాడిన ఇతర నాయకులు అతడి సార్వభౌమత్వాన్ని లాంఛనప్రాయంగా అంగీకరించినప్పటికీ తమ రాజ్యాలను స్వతంత్రంగా పాలించినట్లు పైన పేర్కొన్న మల్లవరం కలువచేరు శాసనాలు సాక్ష్యమిస్తున్నాయి.

స్వతంత్ర పోరాటంలో బెండపూడి అన్నయ చూపిన సాహస పరాక్రమాలకు గుర్తింపుగా 1326లో కొలని రుద్రదేవుడు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరేడు గ్రామాన్ని అన్నయకు అగ్రహారంగా ఇచ్చినట్లుగా సంతమగలూరు శాసనం పేర్కొంటున్నది (Annual report on Epigraphy, 308 of 1915). ఆ శాసనం అన్నయమంత్రిని ‘ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసనాప్రతిష్టాపనాచార్య’ అని వర్ణించింది.

స్వాతంత్య్ర సమరం మూడు దశలుగా జరిగింది. మొదటి దశలో ప్రోలయ నాయకత్వంలోని తీరాంధ్రను స్వాధీనం చేసుకున్నారు. రెండవ దశలో పశ్చిమాంధ్ర (రాయలసీమ)ను విముక్తం చేశారు. మూడవ దశలో ఉత్తరాంధ్ర (తెలంగాణ)ను విడిపించారు. ఈ మూడుదశలను గడచి ఆంధ్రదేశాన్ని ముస్లిముల నుంచి విముక్తం చేయడానికి రెండు దశాబ్దాలు (20ఏళ్ళు) పట్టింది. వీటిలో మొదటి దశ ఒక సంవత్సరంలోనే పూర్తయింది. 1325 సంవత్సరంలో ఢిల్లీలో ఘియాజుద్దీన్‌ మరణించడంవల్ల ఉలుగ్‌ఖాన్‌ తన సింహాసనాధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళిపోవడం హిందువులకు కలిసివచ్చింది.

మొదటిదశ పూర్తయ్యేసరికి ప్రోలయవేమారెడ్డి అద్దంకి రాజధానిగా పరిపాలిస్తున్నాడు. ఈ దశలోని స్వతంత్ర పోరాట విశేషాలను విలసశాసనం విపులంగా వర్ణించింది. ప్రోలయనాయకుడి స్వాతంత్య్ర పిపాస, వేదసంస్కృతిని, జ్ఞానాన్ని రక్షించడంలో అతడికున్న నిబద్ధత, దూరదృష్టి, అందుకు తగిన వ్యూహరచన విలసశాసనంలో కనిపిస్తాయి.

భారతీయ జీవనానికి వేదం ప్రాణంవంటిదని, వేదం నుంచే భారతీయ శాస్త్రాలు, కళలు,, సామాజిక, రాజకీయ, మతవిజ్ఞానం, న్యాయస్మృతి, వృత్తి నిపుణతలు, వస్తుసంపద ఉద్భవించాయని, వేదవిద్యను కాపాడటమంటే హిందూ సంస్కృతిని, సమాజాన్ని, సంపదను శాశ్వతం చేయడమనే సత్యాన్ని ఎరిగినవాడు ప్రోలయనాయకుడు. ఏ విదేశీ దోపిడిదారుడైనా మొదట నాశనం చేయాలని చూసేది భారతీయ మత సంస్కృతులకు మూలమైన వేదవిద్యలను, వాటి సజీవరూపమైన పండితులను. పండితులను నాశనం చేస్తే వేదవిద్య నశిస్తుంది. ఎందుకంటే వేదాలంటే పుస్తకాలు కావు. వాటిని నేర్చిన పండితుల ద్వారానే అవి నిలుస్తాయి. కాబట్టి వేదవిదులను కాపాడి, వారి విద్యావ్యాసంగానికి ఆటంకం కలగని ఏర్పాట్లు చేసే ఉద్దేశ్యంతో గోదావరి పాయల మధ్య సురక్షితంగా ఉండే కోనసీమలోని విలస గ్రామాన్ని వెన్నయ అనే పండితుడికి దానం చేసి, ఆయన ద్వారా వివిధ శాస్త్రాలలో నిష్ణాతులైన ఎనభైమంది పండితులకు భూ – ఉపాధి కల్పించి, ఆ పండితులందరూ ఆ గ్రామంలో స్థిరపడి, తమ విద్యావ్యాసంగాన్ని కొనసాగించే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా వెన్నయ ద్వారా భూవసతి పొందిన వాళ్ళు ఎనభైమంది పండితులు. వారి పేర్లు, గోత్రప్రవరలు(విద్యాసంప్రదాయపు వివరాలు), వారికిచ్చిన భూవసతి విస్తీర్ణం, ఏ పండితుడు ఏ శాస్త్రంలో నిపుణుడు అనే వివరం మొదలైన అంశాలను తెలిపే రాగిరేకులను విలసతామ్రశాసనమని అంటారు. ఈ శాసనాన్ని సా.శ.1327లో జారీ చేశారు.

(మిగతా తరువాయి సంచికలో..)

– సత్యదేవ