Home News 8 రాష్ర్టాల్లో హిందువులే మైనారిటీలు!

8 రాష్ర్టాల్లో హిందువులే మైనారిటీలు!

0
SHARE
  • వారికి మైనారిటీ హోదా ఇవ్వాలి..
  • సుప్రీంకోర్టులో బీజేపీ నేత పిటిషన్‌

భారత్‌లో హిందువులు అత్యధికులు! ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధులు అల్పసంఖ్యాకులు! అల్పసంఖ్యాక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి! జాతీయస్థాయిలో చూస్తే ఇదంతా బాగేనే ఉంది. కానీ, హిందువులే మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? అల్పసంఖ్యాకులుగా వారికి ఎలాంటి లబ్ధి చేకూరడంలేదని 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మెజారిటీగా ఉన్న వర్గాలే ‘మైనారిటీ’ హోదా ప్రయోజనాలు పొందుతున్నాయని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది.

లక్షద్వీప్‌ (కేంద్ర పాలిత ప్రాంతం), మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ, జమ్మూకశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, పంజాబ్‌లలో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలంటూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

‘‘జాతీయ మైనారిటీ కమిషన్‌ 1992లో ఏర్పాటైంది. జమ్మూకశ్మీర్‌ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో 1993నుంచి అమలులోకి వచ్చింది. సంబంధిత చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు అల్పసంఖ్యాకులుగా గుర్తించిన వారికి ఆ హోదా ఇస్తారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులను తొలుత మైనారిటీలుగా ప్రకటించారు. 2014లో పార్శీలను కూడా ఈ జాబితాలో చేర్చారు.

కానీ, పలు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నా వారికి ఆ హోదా ఇవ్వలేదు. వారికి లభించాల్సిన ప్రయోజనాలు ఆ రాష్ట్రాల్లోని మెజారిటీలైన ఇతర వర్గాల వారు అనుభవిస్తున్నారు’’ అని అశ్విని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా పరిగణించి… వారి హక్కులను కాపాడాలని ఆయన కోరారు.

ఏమిటీ ‘మైనారిటీ’?

రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రెండు రకాల అల్పసంఖ్యాక వర్గాలున్నాయి. ఒకటి… భాషాపరమైన, రెండు… మతపరమైన! రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30లో దీని గురించి ప్రస్తావించారు. దేశంలో 40శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు. వీరు మినహా… మిగిలిన వారంతా ‘భాషాపరమైన మైనారిటీ’లే! అయితే,భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత… దీని నిర్వచనం మారింది. ఆ రాష్ట్రంలో తమ మాతృభాష వాడేవారే అత్యధికులుగా ఉంటారు. కాబట్టి ఆ రాష్ట్రానికి, ఇతర ప్రాంతాల నుంచి(మరో మాతృభాష ఉన్నవారు) వచ్చిన వారే భాషాపరమైన మైనారిటీలు అవుతారు.

మతం విషయానికొస్తే మొత్తం జనాభాలో ఎంత శాతంలోపు ఉన్న వారిని మతపరమైన మైనారిటీగా పరిగణించాలనే విషయంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలో దీనికి ఎలాంటి నిర్వచనమూ లేదు. దీంతో ‘మెజారిటీ’ కాని వారంతా మైనారిటీలే అనే భావన కొనసాగుతోంది. పలు సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకొని మైనారిటీల హక్కులను విద్యకు పరిమితం చేయాలని తెలిపాయి. మతపరమైన మైనారిటీలను రాష్ట్రాల స్థాయిలోనే గుర్తించాలంటూ 2002లో సుప్రీం తీర్పు చెప్పింది. జనాభాను కాకుండా, రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఏ మతం మైనారిటీ కిందికి వస్తుందో నిర్ణయించాలని స్పష్టం చేసింది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)