Home Telugu Articles బాబా సాహెబ్‌ ఆప్టే చారిత్రక దృష్టి

బాబా సాహెబ్‌ ఆప్టే చారిత్రక దృష్టి

0
SHARE

బాబాసాహెబ్‌ ఆప్టే చారిత్రక దృష్టి అత్యంత ఆవశ్యకమైనది. ‘జాతీయవాద చరిత్ర రచన జరగాలి’ అన్న బాబాసాహెబ్‌ ఆప్టే భావాలు నేడు అత్యంత అనుసరణీయాలు.

బాబాసాహెబ్‌ ఆప్టే బాల్య నామం ఉమాకాంత్‌ కేశవ్‌ ఆప్టే. ఆయన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, యవత్‌మాల్‌ జిల్లా కేంద్రంలో 28 ఆగస్టు 1903 న జన్మించారు. తండ్రిపేరు కేశవ్‌రావ్‌. చిన్నప్పటి నుండి ఉమాకాంత్‌ మంచి చదువరి. ఏదైనా పుస్తకం దొరికితే పూర్తి చేసేదాకా వదిలేవాడు కాదు. 1915లో యవత్‌మాల్‌కి బాలగంగాధతిలక్‌ వచ్చారు. ఉమాకాంత్‌ చదువుతున్న పాఠశాల ప్రధానో పాధ్యాయుడు తిలక్‌ సభకి విద్యార్థుల్ని వెళ్ళనివ్వలేదు. ఉమాకాంత్‌ ఎంతో బాధపడ్డాడు.

1920లో ఉమాకాంత్‌ మెట్రిక్‌ పరీక్ష ఉత్తీర్ణు డయ్యాడు. 1924 వరకు వార్ధా జిల్లాలోని ధామన్‌గావ్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. పుస్తకాల్లో ఉన్న చరిత్రకు అదనంగా భారత స్వాతంత్య్ర వీరుల గురించి, ప్రథమ స్వాతంత్య్ర పోరాటం గురించి పిల్లలకు ఎక్కువగా చెప్పేవారు. తిలక్‌ వర్ధంతి సభను తరగతిలో నిర్వహించడం మూలంగా ఆయనకు తాఖీదు వచ్చింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి, నాగపూర్‌కి వచ్చారు. అక్కడ ”దేశ్‌సేవక్‌” ముద్రణాలయంలో పనిచేశారు. దగ్గరలోనే సీతామర్దిలో, ఒక ఇంట్లో ఒక గది తీసుకొని ఉంటున్నారు. అతని గదికి ఎందరో దేశభక్తులు, పత్రికా రచయితలు తరచుగా వచ్చేవారు. బ్రిటీష్‌వాళ్ళు నిషేధించిన అనేక పుస్తకాలను రహస్యంగా సంపాదించి చదివేవారు. విప్లవకారుల గాథలను చర్చించేవారు. ఈ విద్యార్థులందరు తమను ‘విద్యార్థి మండలి’ పేరుతో పిలుచుకునేవారు. దగ్గరలోనే రాజారామ్‌ పుస్తక పఠనాలయంలో అనేక సభలు జరిపేవారు.

1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభమైంది. 1926లో ఉమాకాంత్‌ ఆప్టేకి సంఘం పరిచయం అయింది. డాక్టర్‌జీ, ఆప్టేతో అనేక విషయాలు చర్చించసాగారు. 1926 చివరికి ఆప్టేతో పాటు విద్యార్థి మండలి కూడా సంఘంలో విలీనమయింది.

1927 చివరికి చేస్తున్న చిరుద్యోగం వదిలివేసి, ఆప్టే పూర్ణ సమయ కార్యకర్తగా సంఘానికి అంకితమయ్యారు. ఒక బైఠక్‌లో డాక్టర్జీ ఉమాకాంత్‌ ఆప్టేను బాబాసాహెబ్‌ ఆప్టేగా పిలిచారు. అప్పటి నుండి ఉమాకాంత్‌ ఆప్టే పేరు బాబాసాహెబ్‌ ఆప్టేగా మారిపోయింది. ఆప్టే అనేక పుస్తకాలు చదివారు. ఆ పుస్తకాలను సంఘ సిద్ధాంతంతో పోల్చి చర్చించేవారు. స్వయం సేవకులు ధర్మం, సంస్కృతి, చరిత్రకు సంబంధించిన గ్రంథాలు చదివి తన జ్ఞానాన్ని పెంచుకోవాలని ఉద్బోధించేవారు. ఎలాంటి బలవంతుడు లేదా బలహీనుడు లేదా ప్రసిద్ధుడు అయిన వ్యక్తి సంఘానికి పనికివస్తాడనుకుంటే తీవ్రమైన కృషి చేసి ఆయన్ను సంఘానికి తీసుకొచ్చే వారు. కార్యక్రమం నిర్వహించా లని నిర్ణయిస్తే ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా కార్యక్రమాన్ని పూర్తిచేసేవారు.

సంస్కృతం, భారతదేశ చరిత్రలు ఆయనకు ఇష్టమైన విషయాలు. వాటికోసం అవకాశం దొరికి నప్పుడల్లా పుస్తకాలు చదువుతూ, స్వయం సేవకులకు చెపుతూ ఉండేవారు. బాబాసాహెబ్‌ ఆప్టే ప్రేరణతో డా||భా.వర్ణేకర్‌ 12 సంవత్సరాల పాటు సంస్కృతంపై అధ్యయనం చేసి, అనేక ఉపన్యాసా లిచ్చారు. గిరిరాజ్‌ శర్మ సంస్కృత పత్రికను ప్రారంభించారు. అది చాలా రోజులు నడిచింది. బెంగాల్‌లో కమ్యూనిస్టుల ప్రాబల్యం గురించి మాట్లాడుతూ ‘బెంగాల్‌కి చేరిన ఇతర ప్రాంతాల వ్యాపారస్తులు బెంగాలీలనకు దోచుకున్నారు. ఫలితంగా దోపిడికి వ్యతిరేకంగా బెంగాలిలు కమ్యూనిజాన్ని కోరుకున్నారని, అక్కడ హిందూ సంస్కృతి ప్రాబల్యం పెరగాలంటే దోపిడి లేని వ్యవస్థ ఏర్పడటం అత్యవసరం’ అని అన్నారు.

బాబాసాహెబ్‌ ఆప్టే బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా భారతదేశ మంతా పర్యటించారు. ఆయన ఎక్కడికెళ్ళినా ప్రశ్న- జవాబుల కార్యక్రమం నిర్వహించి అనేక విషయాల మీద సంఘ అభిప్రాయాలను స్పష్టం చేసే వారు. తన పర్యటనలో భాగంగా ఏ ప్రాంతం వెళ్ళినా ఆయా ప్రాంతాల చరిత్రను తెలుసుకునేవారు. స్థానిక స్వయం సేవకులను చరిత్ర తెలుసుకోమని ప్రోత్సహించేవారు.

స్థానిక చరిత్రను, అక్కడి స్వతంత్య్ర పోరాట ఘట్టాలను, ప్రముఖులను గురించి తన ప్రసంగాల్లో ఉటంకించి చెప్పేవారు. స్థానిక కట్టడాలను, పవిత్ర ప్రదేశాలను, చారిత్రక స్థలాలను శ్రద్ధగా సందర్శించే వారు. 1946లో చమ్‌కొర్‌లో గురుగోవింద్‌సింగ్‌ పుత్రుల బలివేదిక సందర్శించినప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దేశం కోసం, సంస్కృతి కోసం ప్రాణాలర్పించిన అనేకమంది త్యాగధనుల జీవితాలను గాథలను ఉద్వేగంతో చదివి, ఆ సంఘటనల గురించి, వాడిగా వేడిగా తన ప్రసంగాల్లో ఉటంకించేవారు. బాబాసాహెబ్‌ ఆప్టే 26 జూలై 1972న గురుపూర్ణిమ నాడు పరమపదించారు.

చరిత్ర విషయంలో ఆప్టే ఆలోచనలు :
– భారతదేశ చరిత్ర అంతా హిందువుల చరిత్రే.
– హిందువుల చారిత్రక విజయగాథలను మన యువకులకు చెప్పాలి. అప్పుడే వారికి దేశంపై భక్తి కలుగుతుంది. అది వర్తమాన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. భవిష్యత్తుని నిర్మిస్తుంది.
– రాజపుత్రులు, పీష్వాలు అంటూ కులమూ, జాతి, ప్రాంతం వారిగా చరిత్రను విభజించొద్దు. వారందరిని భారతీయులుగానే గుర్తించాలి.
– చరిత్ర బోధన ద్వారా మాత్రమే మనిషిలో జాతీయ భావనలు మేల్కొంటాయి.

బాబాసాహెబ్‌ ఆప్టే స్ఫూర్తితో 1989లో ఇతిహాస సంకలన సమితి ఏర్పడింది. భారతదేశ చరిత్ర రచనలో కృషి చేస్తున్నది.
నేడు భారతదేశ చరిత్రను పరాజితుల, బానిసల చరిత్రగా చిత్రిస్తున్నారు. మరికొంతమంది చరిత్ర రచనను సారాంశంగా మాత్రమే రాస్తున్నారు. ఫలితంగా చరిత్ర రచన, అధ్యయనాలు కుంటుపడు తున్నాయి. చరిత్ర చదువక యువత చరిత్రహీనులు అవుతున్నారు.

మరోవైపు చరిత్రను విభజించి కులాల చరిత్రను రాస్తున్నారు. కుల చరిత్ర రచన హద్దుదాటి కులాల చరిత్రకారులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ, కుల పోరాట యోధులుగా మారిపోతున్నారు.

ఇలాంటి వాతావరణంలో బాబాసాహెబ్‌ ఆప్టే చారిత్రక దృష్టి అత్యంత ఆవశ్యకమైనది. ‘జాతీయవాద చరిత్ర రచన జరగాలి’ అన్న బాబాసాహెబ్‌ ఆప్టే భావాలు నేడు అత్యంత అనుసరణీయాలు.

– కందకుర్తి ఆనంద్‌, 9951939737

(జాగృతి సౌజన్యం తో)

For regular updates download Samachara Bharati app

http://www.swalp.in/SBApp