ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మతమార్పిళ్లపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతన్న క్రైస్తవ మతమార్పిళ్లు, మతం మారిన వ్యక్తుల ద్వారా ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగం అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.ఆర్.పి.ఎఫ్) సమీకరించిన డేటా ఆధారంగా రాష్ట్రానికి చెందిన ‘ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్’ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఎస్సీ సామజిక వర్గ ప్రజలే లక్ష్యంగా పెద్దఎత్తున సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లను అడ్డుకోవాలని, ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగానికి గురవుతోందని దీనిపై సరైన విచారణ చేపట్టి నిజమైన ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ దాఖలు చేసిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన జాతీయ కమిషన్ దీనిపై స్పందించింది. భారత రాజ్యాంగంలోని అధికరణం 338 ప్రకారం తమకు సంక్రమించిన విశేష అధికారాలను వినియోగించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్ల వ్యవహారంపై తాము దర్యాప్తు చేయదలచుకున్నామని, ఇందులో భాగంగా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు/ఆరోపణలపై 15 రోజుల్లో చర్యలు తీసుకుని, తీసుకున్న చర్యల వివరాలు తమకు సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా, ఈ విషయంలో తమ నోటీసుకు సకాలంలో స్పందించకపోయినట్లైతే తమకున్న విశేషమైన ‘సివిల్ కోర్ట్’ అధికారాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది అని పరోక్షంగా హెచ్చరించింది.
ఈ వ్యవహారంపై ‘ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్’ వ్యవస్థాపక అధ్యక్షులు కె. నాగరాజ స్పందించారు. “దేశంలోని ఎస్సీ సామజిక వర్గమే చర్చి సాగిస్తున్న మతమార్పిళ్లకు అతిపెద్ద బాధిత వర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మతమార్పిళ్లు మరింత అధికంగా జరుగుతున్నాయి” అని అన్నారు. ఎస్సీ సామజిక వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ సాగిస్తున్న మతమార్పిళ్లను “ఎస్సీల సంస్కృతీ సాంప్రదాయాలపై చర్చి జరుపుతున్న సాంస్కృతికంగా దాడి“గా అభివర్ణించారు. ఈ దాడి నుండి బాధిత ఎస్సీలను రక్షించాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకుండా చోద్యం చూస్తున్నాయని అన్నారు. మొట్టమొదటి సారిగా జాతీయ ఎస్సీ కమిషన్ మతమార్పిళ్ల అంశంపై స్పందించడం స్వాగతించదగ్గ పరిణామం అని అన్నారు.
Source : NIJAM TODAY