Home News నాకు పరమవీరచక్ర కావాలి

నాకు పరమవీరచక్ర కావాలి

0
SHARE

తండ్రి చిన్న కిరాణా కొట్టు. తల్లి వంటింటికి, పూజగదికి పరిమితం. ఆ లక్నో పిల్లగాడు పాలుగారేటోడు. చిదిమితే పాలొచ్చేంత సుకుమారం వాడిది. కాని ‘పెద్దయ్యాక ఏం చేస్తావు’ అని ఎవరైనా అడిగితే బాణంలా జవాబు వచ్చేది. ‘సైన్యంలో చేరతాను’ అని.

‘ఎందుకురా సైన్యంలో ? ఏం సాధిద్దామని?’ అని అడిగితే ఆ పిల్లవాడు దఢంగా జవాబిచ్చేవాడు.

‘పరమవీరచక్ర’. సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్‌వ్యూలోను ఇదే ప్రశ్న వేశారు. ఇదే జవాబు ఇచ్చాడు.

అలాంటి వాడు నిజంగా పరమవీరచక్ర పొందే అవకాశం వస్తే ఊరుకుంటాడా?

ఆ అవకాశం రానే వచ్చింది. ఆ రోజు జూలై 3, 1998.

అంతకు రెండు రోజుల ముందు సేనాధ్యక్షుడు జనరల్‌ వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ కార్గిల్‌ యుద్ధంలో కార్గిల్‌ జిల్లాలోని జుబేర్‌ కొండలపై ఉన్న ఖాలుబర్‌ను చేజిక్కించుకోవాలని నిర్ణయించాడు. దీనికి నాయకత్వం వహించేందుకు ఎవరు ముందుకొస్తారు అని ఆయన అడిగాడు.

లెఫ్టినెంట్‌గా ఉన్న ఆ కుర్రాడు ముందుకొచ్చాడు. ‘శభాష్‌ నిన్ను ఇప్పుడే కెప్టెన్‌గా ప్రమోట్‌ చేస్తున్నా’ అని ప్రకటించాడు జనరల్‌. అంతే కాదు. ‘నువ్వు ఖాలుబర్‌ను గెలుచుకుంటే నేను స్వయంగా నీ కోసం టీ తీసుకుని కొండ మీదికి వస్తాను’ అన్నాడు.

ఒక్క సైనికుడు మాత్రమే ఆ మాటకు అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసు కోగలుగుతాడు. దాన్ని మించిన గౌరవం సైనికుడికి ఉండదు. ఆ రాత్రి ఆ కుర్రాడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు.

‘విజయం సాధించడం ముఖ్యం. చావనేది ఎంత ? గెలుపులో ఉన్న మజా ముందు చావు కూడా దిగదుడుపే’

ఆ కుర్రాడు మరుసటి రోజు నుంచే జుబేర్‌ కొండలపై మాటు వేసిన పాకిస్తానీ ముష్కరులను పారద్రోలేందుకు నడుం బిగించాడు. యుద్ధ శాస్త్రం ప్రకారం కొండపై ఒక్క సైనికుడు కొండ దిగువన ఉండే 30 మందికి సమానం. మన కుర్రాడు కొండ దిగువన ఉన్నాడు. కానీ మనసు, మనో ధైర్యం కొండ మీద ఉంది. జూలై 3 రాత్రి భీకర పోరాటం జరిగింది. తూటాల వానలో మన సైనికులు పైకి ఎగబాకారు. ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ కుర్రాడు ముందుండి సైన్యాన్ని నడిపించాడు. ఒక బంకర్‌, మరో బంకర్‌, ఇంకో బంకర్‌ ఇలా మూడు శత్రు స్థావరాలను ధ్వంసం చేశారు. నాలుగో బంకర్‌ చివరి బంకర్‌. ఆ సమయంలో శత్రువు తూట అతని ఛాతీకి, తలకి తగిలింది. కానీ ఆ కుర్రాడు ముందుకే సాగాడు. నాయకుడి రక్త త్యాగం చూసి మిగతా సైనికులు గూర్ఖా రైఫిల్స్‌ రణనినాదం ‘అయో గూర్ఖాలీ’ అంటూ ముందుకు సాగారు. ఆ యువకుడి ఒంట్లోని ఒక్కో బొట్టూ మంచుకొండకు రక్తం రంగు అద్దుతోంది. కానీ అతను ఆగలేదు. నాలుగో బంకర్‌ కూడా స్వాధీనం అయింది. శత్రువులు పలాయనం చిత్తగిస్తున్నారు.

మన వీరుడి ఆయుష్షు ఖాతాలోని ఆఖరి క్షణం ఆవిరైపోతోంది. తన గూర్ఖా సైనికులకు చిట్టచివరి ఆదేశం ఇచ్చాడు.

‘న ఛోడ్నా’ (వదిలిపెట్టొద్దు). ఆ తరువాత అంతా చీకటి. రణభూమిలో ఛాతీ ఎదురొడ్డి వీరగతిని పొందిన ఆ వీరాత్మ సూర్యమండలాన్ని భేదిస్తూ గుప్పెడు వెలుగు రూపంలో సాగిపోయింది.

ఆ యువకుడు తన డైరీలో ఒక పేజీలో ‘విజయం సాధించేలోపు మరణం అడ్డొస్తే నా రక్తం పదునేమిటో చావుకు తెలియచెపుతాను’ అని రాసుకున్నాడు. సరిగ్గా అదే మరణం అతనికి లభించింది.

ఆ పాలుగారే కుర్రాడి పేరు కెప్టెన్‌ మనోజ్‌ పాండే ! జుబేర్‌ కొండల్లో ఖాలుబర్‌లో మనోజ్‌ పాండే సాధించిన విజయం మన కార్గిల్‌ కథలో కీలక మలుపు. ఆ మలుపు వల్లే గెలుపు సాధ్యమైంది.

కార్గిల్‌ పోరులో మన పరమవీరచక్రల్లో ఒక పరాక్రమ వీరుడతను. పరమవీర చక్ర కెప్టెన్‌ మనోజ్‌ పాండేకి వేనవేల జోహారులు!

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)