Home Telugu Articles ఇక రాజకీయ స్వచ్ఛ భారత్‌ , ప్రక్షాళనపై ప్రధాని దృష్టి

ఇక రాజకీయ స్వచ్ఛ భారత్‌ , ప్రక్షాళనపై ప్రధాని దృష్టి

0
SHARE

ఇది సంస్కరణల యుగం. రాజకీయంగా, సామాజికంగా దేశ గతిరీతులను మార్చితీరాలన్న దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాయజ్ఞం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టిన మోదీ ఇప్పుడు సమగ్ర రాజకీయ ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్నారు. వందల కొద్దీ పార్టీలు లెక్కాపత్రం లేని వేలకోట్ల రూపాయలను విరాళాల రూపంలో వసూలు చేస్తున్నాయి. దేశంలో రాజకీయ అవినీతికి, నల్లధనానికి అక్కడే బీజాలు పడుతున్నాయి. నిర్దిష్ట కార్యాచరణతో ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలని మోదీ తలపోస్తున్నారు. పార్టీలు సృష్టిస్తున్న ఆర్థిక అవ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్నికల సంఘం నుంచి, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఎవరివో, ఏమిటో తెలియని ఖాతాలనుంచి భారీయెత్తున విరాళాలు సేకరిస్తున్న పార్టీల తీరును కట్టడి చేయాల్సిన అవసరాన్ని ఎన్నికల సంఘం ఎంతో కాలంగా నొక్కి చెబుతోంది.

అందుకోసం అవసరమైతే ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ సూచిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం రూ.20వేల లోపు విరాళాలకు సంబంధించి పార్టీలు ఎలాంటి రుజువులు, లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును దేశంలో పార్టీలన్నీ దుర్వినియోగపరుస్తున్నాయన్నది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం. కోట్ల రూపాయల్లో దఖలుపడిన విరాళాలను సైతం రూ.20వేల లోపు లావాదేవీలుగా విభజించి డిపాజిట్‌ చేస్తూ రికార్డులకెక్కకుండా జాగ్రత్తపడుతున్న పార్టీల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. రాజకీయ పార్టీల నిధుల్లో 80శాతం మేర ఇలా లెక్కలు చూపని సొమ్మే! రూ.20 వేల పరిమితిని మరింత తగ్గించి రెండు వేల రూపాయలకు కుదించాలని ఎన్నికల సంఘం ఆ మధ్య ప్రతిపాదించింది. మరోవంక పార్టీల ఖాతాలను, ఆదాయ వ్యయ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు తగిన చట్టబద్ధ వెసులుబాటు కల్పించాలని ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ డిమాండు చేస్తున్నారు.

దేశంలో 1,900 పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో చాలావాటికి కనీసం చిరునామా అయినా సరిగ్గా లేదు. స్వచ్ఛంద విరాళాలపై ఆదాయ పన్ను మినహాయిస్తున్న చట్టంలోని లొసుగును వాడుకోవడమే లక్ష్యంగా చిన్నా చితకా పార్టీలు విస్తరిస్తున్నాయి. ఇరవై వేల రూపాయలలోపు విరాళాలపై లెక్క చెప్పనవసరం లేదన్న నిబంధనను దుర్వినియోగపరచి లబ్ధి పొందడమే ఈ పార్టీల పరమోద్దేశం. అక్రమార్జనకు చట్టరూపం కల్పించేందుకు ఉపకరిస్తున్న ఈ వెసులుబాటును తక్షణం ఉపసంహరించాలి. ఎన్నికల్లో చేసిన వ్యయానికి, చెప్పిన లెక్కకు ఎక్కడా పొంతన లేని రీతిలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ వంటిచోట్ల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరు పది కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు అంచనాలున్నాయి. ఓ లోక్‌సభ స్థానంకోసం ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు గట్టిగా పోటీపడుతుంటే- ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు సగటున రూ.30కోట్లకు చేరుతోంది. ఈ ప్రాతిపదికన దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కకడితే కళ్లు బైర్లు కమ్ముతాయి. సుదీర్ఘకాలంగా దేశ రాజకీయ వ్యవస్థను చెండుకు తింటున్న తీవ్రమైన సమస్య ఇది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం అన్వేషించకపోతే రాజకీయ వ్యవస్థ పూర్తిగా గాడితప్పి- నల్లధన స్వాములు అడ్డూఆపూ లేకుండా పేట్రేగుతారు. దేశంలోని సమస్త రంగాలనుంచి నల్లధనాన్ని పరిమార్చేందుకు కంకణబద్ధమైన మోదీ సర్కారు రాజకీయ అవినీతి నిర్మూలన దిశగానూ అత్యంత వేగంగా కదులుతోంది.

డిసెంబరు 31న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. అవినీతి, నల్లధనంపై దేశవ్యాప్తంగా ఏ వేదిక మీద చర్చ జరిగినా- పార్టీలు, నాయకులు, రాజకీయ పక్షాల విరాళాలకు సంబంధించిన వ్యవహారాలే ముఖ్యంగా ప్రస్తావనకు వస్తున్నాయి. రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిపై నిజాయతీ, నిబద్ధత కలిగిన పౌరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని- వారి అభిప్రాయాలను, ఆగ్రహాన్ని అర్థం చేసుకుని తీరు మార్చుకోవాల్సిన అవసరం పార్టీలు, నాయకులపై ఉందని మోదీ పిలుపిచ్చారు. తమను మించినవారు లేరని బిగుసుకుపోయి; ఎక్కడాలేని ఆభిజాత్య ధోరణులు ప్రదర్శించకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. అన్ని పార్టీలు కలిసి రాజకీయ అవ్యవస్థను రూపుమాపే పారదర్శక విధానాలకు రూపకల్పన చేయాల్సిన అవసరాన్ని మోదీ ఉద్బోధించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత వాతావరణం నల్లధనానికి కోరలు మొలిపిస్తోందనడం ద్వారా మోదీ మరో కీలక చర్చను లేవనెత్తారు. నిరంతర ఎన్నికలవల్ల ప్రభుత్వ విధానాల అమలు నిలిచిపోయి, పాలన ప్రక్రియ కుంటువడుతోంది. అత్యవసర సేవలకూ ఆటంకం ఏర్పడి సాధారణ ప్రజాజీవనం స్తంభిస్తోంది. సిబ్బంది, పౌరసేవలు, చట్టం-న్యాయం తదితర అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం అయిదేళ్లకు ఒకే పర్యాయం దేశంలోని అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు జరపాల్సిన అవసరాన్ని బలంగా ఉద్ఘాటించింది. మరోవంక పార్టీల విరాళాల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాలని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం తన ప్రతిపాదనలను అన్ని ప్రధాన పార్టీలకూ పంపించాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా సంస్కరణలను వ్యతిరేకిస్తే ప్రజాక్షేత్రంలో దాని అసలు గుట్టు బయటపడుతుంది. రాజకీయ ప్రక్షాళన లేకుండా ‘స్వచ్ఛ భారత్‌’ సాధ్యం కానే కాదు!

ఎ సూర్యప్రకాష్, రచయిత , ప్రసార భారతి చైర్మన్

ఈనాడు సౌజన్యం తో