Home News స్థానికుల భూముల్ని అక్రమ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు – ఉపమన్యు హజారికా

స్థానికుల భూముల్ని అక్రమ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు – ఉపమన్యు హజారికా

0
SHARE

అసోంలో పౌరుల జాతీయ రిజిస్టర్  సవరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించడంతో అక్రమ చొరబాటుదారుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలని అసోం ప్రజలు గట్టిగా కోరడంతో అస్సామ్ ఒప్పందం (1985) అమలు చేస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం  తరువాత ముస్లిం వోటు బ్యాంక్ కోసం ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేసింది. దీనివల్ల స్థానికుల హక్కులు హరించుకుపోయాయి. చొరబాటుదారులు అన్నిరకాలుగా బలపడ్డారు. చొరబాటుదారులవల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లి ఇండో – బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యను విచారించేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేసే విధంగా వాదన వినిపించిన సీనియర్ న్యాయవాది ఉపమన్యు హజారికాతో ముఖాముఖి –

ప్ర . ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, ఎన్ ఆర్ సి ని సవరించడం పై మీ అభిప్రాయం ఏమిటి?

జ. ఎన్ ఆర్ సి పై సుప్రీం కోర్ట్ తీర్పు ఆహ్వానించదగింది. 2014 వరకు ఈ విదేశీ చొరబాటుదారుల సమస్య గురించి ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పట్టించుకోలేదు. చాలాకాలం రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంకుచిత ప్రయోజనాల కోసం ఈ సమస్యను నాన్చుతూ వచ్చింది. రిజిస్టర్ ను సవరించడానికి కాల పరిమితిని విధించడమేకాక, ఆ పనిని భారత రిజిస్ట్రార్ జనరల్ కు అప్పగించడం నిజంగా సంతోషించదగిన పరిణామం. 33 ఏళ్ల నాటి అసోం ఒప్పందాన్ని అమలు చేయడానికి తీసుకున్న మొట్టమొదటి చర్య ఇది అని చెప్పవచ్చును. అసోంలో 2001 డిసెంబర్ 31నాటికి 50 లక్షలకు పైగా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారంటూ 2004 జులై 24న పార్లమెంట్ లో అప్పటి హోమ్ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ వెల్లడించిన విషయాన్నే సుప్రీం కోర్ట్ ఇటీవల తన తీర్పులో ప్రస్తావించింది.

2016 నవంబర్ 16న పార్లమెంట్ లో ప్రకటన చేస్తూ దేశంలో రెండు కోట్లమందికి పైగా అక్రమ చొరబాటుదారులు ఉన్నారని  కేంద్ర మంత్రి కిరణ్ రిజెజూ వెల్లడించారు. 2004లో ప్రకాష్ జైస్వాల్ చెప్పిన లెక్కలనే తీసుకున్నా  చొరబాటుదారుల సంఖ్య 80లక్షలకు పైనే ఉంటుంది. కనుక ఎన్ ఆర్ సి ప్రకారం వచ్చిన  సంఖ్య (40లక్షలు) చాలా తక్కువ. పైగా ఇది ముసాయిదా మాత్రమే. అంతిమ జాబితా కాదు. ఒక కుటుంబంలో ఒకరిద్దరిని జాబితాలో చేర్చి మిగిలిన వారిని పక్కకు పెడితే కొంతకాలానికి వారందరి పేర్లు కూడా జాబితాలోకి చేరిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా లక్షలాది మంది చొరబాటుదారులు భారత పౌరులైపోయారు. కనుక  ప్రస్తుతం తేలిన చొరబాటుదారుల సంఖ్య చాలా చాలా తక్కువ. ఇక ఈ జాబితా తుది రూపు దిద్దుకునేసరికి ఇది మరింత తక్కువైపోతుంది. 2001లో యుపియే ప్రభుత్వం, 2011లో ఎన్ డి యే ప్రభుత్వం తయారుచేసిన అంచనాల ప్రకారం 50 నుండి 80 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఈ దేశంలో ఉన్నారు.

అంతేకాదు, ఇలా జాబితాలోకి రానివారి సంఖ్య రాష్ట్రం మొత్తంలో సగటున 11.59 శాతం ఉంటుందని అంచనా వేశారు. కానీ ధూబ్రి, గోల్పారా, కరీంగంజ్ మొదలైన సరిహద్దు ప్రాంతాల్లో ఇలా జాబితాలోకి రాని వారి సగటు కేవలం 7.5 శాతం మాత్రమే. అంటే ఇక్కడ చొరబాటుదారుల సంఖ్య రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా నమోదైందన్నమాట. నిజానికి ఈ జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే 5 నుండి 6 శాతం ఎక్కువగా జనాభా పెరుగుదల నమోదైంది. అయినా విచిత్రంగా చొరబాటుదారుల సంఖ్య మాత్రం రాష్ట్ర సగటుకంటే తక్కువగా నమోదైంది. ఈ రెండు విషయాలను ప్రభుత్వం  జాగ్రత్తగా పరిశీలించాల్సిఉంది.

ప్ర. ఎన్ ఆర్ సి తుది జాబితాలో పేర్లు లేనివారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరి వారి సంగతి ఏమవుతుంది?

జ: వాళ్ళకి అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. వారి అభ్యంతరాలు, చూపే ఆధారాలను పరిశీలించడానికి ఒక ప్రక్రియ ఉంది. అది అప్పుడే ప్రారంభమైంది కూడా. ఎన్ ఆర్ సి లో చోటుదక్కని వారు వెంటనే విదేశస్థులైపోరు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, సాక్ష్యాధారాలు స్వీకరిస్తారు. ఆ తరువాత తయారయ్యే మొదటి జాబితాలో పేరు లేని వారి వ్యవహారాన్ని  ట్రిబ్యూనల్ కు నివేదిస్తారు. ట్రిబ్యూనల్ తుది నిర్ణయం తీసుకుంటుంది.

ప్ర. ఎన్ ఆర్ సి `ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర’ అని మమతా బెనర్జీ, ఇతర రాజకీయ పార్టీలు విమర్శించాయి. జాబితా తయారీ ప్రక్రియను ఆపకుంటే `రక్తపాతం’ జరుగుతుందని హెచ్చరించాయి కూడా. ఈ బెదిరింపులు, మమతా రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు ?

జ. ఇలాంటి స్వార్ధ రాజకీయాల వల్లనే చొరబాటుదారులు అసోంలో ప్రవేశించడమేకాక దర్జాగా తిష్టవేసుకుని కూర్చోగలిగారు. ఈ రాజకీయాల వల్లనే ఆ చొరబాటుదారులకు ప్రయోజనం చేకూర్చే అక్రమ వలసదారుల (ట్రిబ్యూనల్ ద్వారా నిర్ధారణ) చట్టం (IMDT) అమలయ్యింది. ఈ చట్టం స్థానికులకు నష్టం చేసి విదేశస్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఉందని 2005లో సాక్షాత్తు సుప్రీం కోర్ట్ పేర్కొంది. ఆ తరువాత ఎన్ ఆర్ సి ని తెచ్చారు. అది కూడా విదేశీ చొరబాటుదారులను గుర్తించడానికి కాదు. కేవలం పౌరసత్వాన్ని పొందే అవకాశం కల్పించేందుకు. అంటే దీని ద్వారా విదేశీయులు `స్వదేశస్తులు’గా మారిపోవచ్చన్నమాట. ఇలాంటి రాజకీయాలు సాగడానికి కారణం వలసదారులు ఎక్కువగా ముస్లిములు కావడమే. ఇలా ఒక మతవర్గానికి, వారు విదేశస్థులైనా, కొమ్ముకాయడం వల్లనే అసోంలో స్థానికుల పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది.

ప్ర. కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇదంతా హిందూ – ముస్లిం సమస్య అని ప్రచారం చేస్తున్నాయి. మీరేమంటారు?

జ. దీనిని హిందూ – ముస్లిం సమస్యగా పరిగణించడం పెద్ద తప్పు. ఇది స్వదేశస్థులు, అక్రమంగా దేశంలోకి చొరబడిన విదేశస్థులకు సంబంధించిన విషయం. ఈ చొరబాటుదారుల వల్ల స్థానికులు ఎలా నష్టపోయారు, పోతున్నారనే విషయం. చొరబాటుదారులు పెద్దయెత్తున భూములను, అడవులను ఆక్రమించడంవల్ల స్థానికులు భూములు కోల్పోయారు. మన దేశంలో 525 గిరిజన జాతులు ఉన్నాయి. వాటిలో 247 దేశపు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే, ఒక్క అసోం లోనే 115 జాతులవారు నివసిస్తున్నారు. వీరికి రక్షణ కల్పించాలి. కనుక ముస్లిములైన చొరబాటుదారుల గురించి కాకుండా ఈ స్థానిక జాతుల గురించి ఆలోచించాలి, మాట్లాడాలి.

ప్ర. అసోం ప్రజల హక్కులను కాపాడేందుకు ఎన్ ఆర్ సి తో పాటు ఇంకా ఏ చర్యలు అవసరమనుకుంటున్నారు ?

జ. ఇటీవల వేరువేరు సంస్థలు జరిపిన మూడు అధ్యయనాల్లో ప్రస్తుతపు జనాభా పెరుగుదల రేటు, చొరబాటుల వేగాన్ని బట్టి 2040, 2050 నాటికి అసోంలో స్థానిక జాతులవారు అల్పసంఖ్యాకులుగా మారిపోతారని తేలింది. కనుక తాము అల్పసంఖ్యాకులుగా మారకుండా చూసుకోవడం స్థానికుల ముందున్న పెద్ద సమస్య. కేవలం ఎన్ ఆర్ సి వల్ల సమస్య పరిష్కారమైపోదు. అసోంలో ఎన్ ఆర్ సి జాబితాలో పేరులేకపోయినా 2004 డిసెంబర్ ముందు వారికి పుట్టిన సంతానం జన్మతః పౌరులైపోతారు.  ఈ విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

దీనికి ఒకే పరిష్కారం కనిపిస్తోంది. బంగ్లాదేశీ చొరబాటుదారుల సమస్య లేకపోయిన అరుణాచల్, నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో అమలు చేసిన చట్టాలనే అసోంలో కూడా తీసుకురావాలి. భారత పౌరులు, 1951 కంటే ముందు నుంచి అసోంలో నివసిస్తున్నవారికి మాత్రమే ఇక్కడ భూమి హక్కు, ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ పధకాలు పొందే హక్కు ఉండాలి.

అసోం ఒప్పందం పుణ్యమా అని ఇప్పటికే 23 సంవత్సరాలపాటు అసోం చొరబాటుదారులను భరిస్తోంది. ఎందుకంటే పౌరసత్వాన్ని గుర్తించడానికి మిగిలిన దేశంలో 1948 జులై 19 ని నిర్ణాయక తేదీగా తీసుకుంటే, అసోం విషయంలో మాత్రం దానిని 1971 మార్చ్ 25గా నిర్ధారించారు. ఈ తేడా వల్ల వచ్చే నష్టాన్ని పూరించడానికి, స్థానికుల హక్కులు పరిరక్షించడానికి  అసోం ఒప్పందంలో క్లాజ్ 6 ను చేర్చారు.

ప్ర. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్ ఆర్ సి జాబితా రూపొందించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు?

జ. నిజమే అన్నీ రాష్ట్రాల్లోనూ ఈ జాబితా తయారుచేయాలి. మన దేశంలోకి వచ్చిన చొరబాటుదారుల సంఖ్య, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినవారి సంఖ్యను చూస్తే దేశంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఎవరు స్వదేశీయులు, ఎవరు విదేశస్థులు అని గుర్తిచడం చాలా అవసరం. అసోంలో నేర చరిత్ర చూస్తే 70 నుంచి 80 శాతం నేరాలు బంగ్లాదేశీ చొరబాటుదారులు చేసినవే. కనుక మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్ ఆర్ సి ని అమలు చేయాలి.

ఆర్గనైజర్ సౌజన్యంతో….

అనువాదం: విశ్వాసంవాద కేంద్ర, తెలంగాణ