పాకిస్తాన్ హాలా నగరంలో 24 ఏళ్ల హిందూ మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. దుండగులు మహిళను పెళ్లి వేదిక నుంచి బలవంతంగా తీసుకెళ్లి ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఈ సంఘటన గతవారం జరిగింది. బాధితురాలు భారతి బాయి అని, ఆమెకు అదే నగరానికి చెందిన ఒక హిందూ వ్యక్తితో వివాహం కావలసిందని తెలుస్తున్నది.
షారుఖ్ గుల్ అనే కిడ్నాపర్ కొంత మంది దుండగులతో వివాహ వేడుక జరుగుతున్న వేదికపైకి వచ్చి తన కుమార్తెను పగటిపూట తీసుకెళ్లారని, ఆ సమయంలో దుండగులతో పాటు పోలీసులు కూడా ఉన్నారని భారతి బాయి తండ్రి కిషోర్ దాస్ తెలిపారు.
భారతి ఆ తరువాత షారూఖ్ గుల్ ను వివాహం చేసుకున్నట్లు, ఇస్లాం మతంలోకి మారినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
భారతి మతమార్పిడి పత్రాల ప్రకారం ఆమె డిసెంబర్ 1, 2019 న ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. ఆమె ఇంతకుముందే మతం మారినందువల్లనే వివాహ మండపం నుంచి ఆమెను తీసుకువెళ్ళి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
మతమార్పిడి తర్వాత భారతి కొత్త పేరు ‘బుష్రా’ అని ఆ పత్రం పేర్కొంది. కరాచీలోని అల్లామా ముహమ్మద్ యూసుఫ్ బానురి పట్టణంలో ఉన్న జామియాట్-ఉల్-ఉలూమ్ ఇస్లామియా, భారతి మతమార్పిడి ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిందని, ఆమె మతమార్పిడికి సాక్ష్యమిచ్చిన ముఫ్తీ అబూబకర్ సయీద్ ఉర్ రెహమాన్ ధృవీకరించారు.
ఆమె షారుఖ్ గుల్ ను ఎప్పుడు వివాహం చేసుకుందో ఇంకా అనిశ్చితంగా ఉందని. ఆమె వివాహ ధృవీకరణ పత్రం లేదా నిఖా పత్రం ప్రకారం నిసార్ అహ్మద్ కుమారుడైన షారుఖ్ గుల్ కు కూడా 24 సంవత్సరాలేనని, అతను కూడా హాలా నివాసి అని తెలుస్తున్నది.
అయితే భారతి తల్లిదండ్రులు చెపుతున్నదాని ప్రకారం, స్థానిక పోలీసు అధికారుల అండదండలతోనే ఆమెను షారుఖ్ అపహరించాడని. ఆమెను తిరిగి తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
బుష్రా(భారతి మతం మారిన తరువాత పేరు) తన భార్య అని, ఆమెకు చట్టవిరుద్ధంగా మళ్ళీ మరొకరితో పెళ్లి చేస్తున్నారని షారుఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని స్థానికులు అంటున్నారు. ఆవిధంగా పోలీసులను కూడా తీసుకువచ్చి భారతిని బలవంతంగా తీసుకుపోయాడని చెపుతున్నారు.