Home News ఆసియా క్రీడ‌ల్లో శ‌త ప‌త‌కాలు సాధించిన భార‌త్

ఆసియా క్రీడ‌ల్లో శ‌త ప‌త‌కాలు సాధించిన భార‌త్

0
SHARE
చైనా వేదికగా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి శ‌త ప‌త‌కాలు సాధించింది. శుక్రవారం వరకు భారత్ 95 పతకాలు గెలిచింది. నేడు ఇప్పటికే మరో 5 పతకాలను గెలిచింది. అందులో ఆర్చరీలోనే 4 పతకాలు వచ్చాయి. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ బంగారు పతకం గెలిచింది. ఆర్చరీ కాంపౌండ్ ఇండివిడ్యూవల్ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన సో చే-విన్‌పై జ్యోతి విజయకేతనం ఎగురువేసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో జ్యోతి 149-145తో గెలిచింది. కాగా తాజా పతకం ఈ ఆసియా క్రీడల్లో జ్యోతికి మూడవది కావడం విశేషం. అలాగే ఆర్చరీ కాంపౌండ్ ఇండివిడ్యూవల్ విభాగంలో నేడు అదితి గోపిచంద్ కాంస్య పతకం గెలిచింది.

మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ కూడా స్వర్ణం గెలిచాడు. ఇదే విభాగంలో అభిషేక్ రజతం కైవసం చేసుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు గెలిచిన పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కాగా గతంలో ఇండినేషియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా 100 పతకాలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

అయితే ఆటలు ప్రారంభమైనప్పుడు ఈ సంఖ్య అసంభవంగా అనిపించింది. అయితే ఈక్వెస్ట్రియన్, సెయిలింగ్, రోయింగ్‌లలో ఆశ్చర్యకరమైన విజయాలు సాధించ‌డం, షూటింగ్, అథ్లెటిక్స్‌లో పెద్ద సంఖ్యలో పతకాలు సాధించడం ద్వారా భారతదేశం నేడు 100 ప‌త‌కాల‌ను సాధించ‌గ‌లిగింది.