Home News పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు

పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు

0
SHARE

ఉగ్రవాదంపై పోరును భారత్‌ ఉద్ధృతం చేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటిన భారత వాయుసేన యుద్ధ విమానాలు పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసాయి. నిర్దేశిత లక్ష్యాలపై వంద శాతం విజయవంతంగా దాడులు జరిగాయి. మిరాజ్‌-2000 విమానాలను ఇందుకోసం భారత్ వినియోగించింది. కేవలం 21 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తిచేసిన ఈ ఆపరేషన్లో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.

జైషే మహమ్మద్‌, లష్కరే, హిజ్బుల్‌ ఉగ్రవాద సంస్థల సంయక్త శిక్షణా శిబిరాలు లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఈ ఆపరేషన్ మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ప్రారంభమైంది.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని‌ ముజఫరాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌ ప్రాంతంపై 3.45 నుంచి 3.53 వరకూ భారత యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. మరో లక్ష్యం ముజఫరాబాద్‌ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3.48 నిమిషాల నుంచి 3.55 మధ్య దాడులు చేపట్టాయి. చకోటి ప్రాంతంపై 3.58 నుంచి 4.04 వరకూ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

భారత్ చేపట్టిన ఈ దాడులను పాకిస్థాన్‌ సైనిక అధికార ప్రతినిధి ఆసీప్‌ గఫూర్‌ ధృవీకరించారు. మెరుపు దాడుల అనంతరం భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. పాక్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించింది.

భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడులను ప్రతిఘటించేందుకు పాక్‌విఫలయత్నం చేసింది. ఆ దేశానికి చెందిన ఎఫ్‌ 16 విమానాలు ప్రతిదాడికి ప్రయత్నం చేసినప్పటికీ మిరాజ్‌ 2000 విమానాలను ఎదుర్కోలేక వెనక్కి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. తాజా ఆపరేషన్‌ వాయు సేన పశ్చిమ కమాండ్‌ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. దాడుల్లో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని భావిస్తున్నారు. కాగా.. ఈ దాడిని అంబాలా ఎయిర్‌బేస్‌ నుంచి చేపట్టినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ శిబిరం చాలా పెద్దది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది.