మార్చి 18వ తేదీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందవలసిన సుదినం. 1944 సంవత్సరంలో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ – INA బర్మా-భారత్ సరిహద్దులను దాటింది. స్వరాజ్య సమరం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో బర్మా-భారత్ సరిహద్దుకు చెందిన ఎనిమిది సెక్టార్లలో INA బలగాలు వీర విహారం చేశాయి. కల్నల్ ఎస్ఏ మాలిక్ నేతృత్వంలో INA బలగాలు ఇంఫాల్, కోహిమా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. భారత్ భూభాగంలో కొంత భాగానికి బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాయి. భారతీయ గడ్డపై జాతీయ పతకాన్ని తొలిసారిగా ఎగురవేసిన ఘనత నేతాజీ నేతృత్వంలోని INAకు దక్కింది. ఆజాద్ హిందు ఫౌజ్ చేసిన త్యాగాలకు నిదర్శనంగా మొయిరాంగ్‌లో ఒక స్మారక చిహ్నం వెలిసింది. అదే చోట నేతాజీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.