Home News అభేద్యం భారత నౌకాదళం -డిసెంబర్‌ 4 భారత నౌకాదళ దినోత్సవం

అభేద్యం భారత నౌకాదళం -డిసెంబర్‌ 4 భారత నౌకాదళ దినోత్సవం

0
SHARE

1971 ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం సందర్భంగా డిసెంబర్‌ 4 నాడు మన పశ్చిమ నావికాదళం పాకిస్థాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచి నౌక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ సాధించిన అద్భుత విజయానికి చిహ్నాంగా మనదేశ ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఆపరేషన్‌ ట్రైడెంట్‌  (Operation Trident)

నావికాదళం ప్రణాళిక ప్రకారం INS నిపట్‌, INS నిర్ఘాట్‌, INS వీర్‌ క్షిపణి నౌకలు. అంటే సబ్‌మైరేన్‌ నౌకINS-కీల్తన్‌, INS కాచిత్‌, INS పావషన్‌ అనే ప్లేట్‌ ట్యాంకర్‌లతో కమాండర్‌ ఒబ్రూభాన్‌ యాదవ్‌, కమాండర్‌ గోపాల్‌రావు నేతృత్వంలో గుజరాత్‌లోని ఓడ రేవు నుండి కరాచి దిశగా మధ్యాహ్నం బయల్దేరి రాత్రి కరాచికి 460 కి.మీ. దూరంలో ఆదేశాల కోసం వేచి ఉన్నాయి. పాకిస్థాన్‌ నౌకలు భారత నావికాదళం రాడార్‌ పరిధిలోకి రావడంతోనే INS నిర్ఘాత్‌ తన మొదటి క్షిపణి ప్రయోగించి పాకిస్థాన్‌కు చెందిన PNS  ఖబర్‌ యుద్ధనౌకపై దాడిచేసింది. దీన్ని ఖబర్‌ నౌకలోని పాకిస్థానీయులు వైమానిక బాంబుదాడిగా భావించి, యాంటీ ఎయిర్‌క్రాప్ట్‌ గన్‌లతో, విమానాలతో ముప్పేట దాడి చేస్తూ, ‘శత్రువులు విమానాలతో మాపై దాడి చేస్తున్నారు, దాంతో మా నౌక దెబ్బతింది’ అని పాకిస్థాన్‌ నావల్‌ ముఖ్య కార్యాలయానికి విషయం చేరవేశారు.

ఇదంతా డీకోడ్‌ చేసిన అక్కడే ఉన్న మన నావికులు, ఖబర్‌పై మరో క్షిపణితో దాడి చేయడంతో దానిలో ఉన్న 200 మందికి పైగా పాకిస్థాన్‌ సైనికులు సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే INS నిపట్‌ నౌక తన పరిధిలో ఉన్న వర్తక నౌక ఎమ్‌.వి. వేనస్‌ చాలెంజర్‌, దానికి రక్షణగా ఉన్నPNS షాజహాన్‌పై దాడి చేసింది. వర్తక నౌకలో పశ్చిమ దేశాల నుండి పాకిస్థాన్‌కు రహస్యంగా వస్తున్న మందుగుండు సామాగ్రి అని తరువాత మనవారికి తెలిసింది. ఇది మునిగిన కాసేపటికి, తీవ్రంగా దెబ్బతిన్న షాజహాన్‌ నౌక, దానికి దగ్గరలో ఉన్న మరొక నౌక PNS ముహఫిజ్‌ పై INS వీర్‌ దాడిచేసింది. ఈ ముప్పేట దాడిలో ముహఫిజ్‌, షాజహాన్‌ నౌకలు అతి తక్కువ సమయంలో పాకిస్థాన్‌ సైనిక స్థావరానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శత్రు సైనికులతో సహా సముద్రగర్భంలో కలిసిపోయాయి. అదే జోరుతో INS నిపట్‌ నుండి వెలువడిన క్షిపణి కరాచి దిశగా వెళ్లి అక్కడే ఉన్న చమురు నిల్వలపై దాడిచేసి వాటిని సమూలంగా ధ్వంసం చేసింది. దీనివలన పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ పోరులో భారత నౌకలు, వాటిలోని నావికులు క్షేమంగా తిరిగి తమ సురక్షిత స్థావరానికి 5 డిసెంబర్‌ నాడు చేరుకున్నారు. పాకిస్థాన్‌ వైమానిక దళాలు దీనికి ప్రతీకారంగా 125 ఓడరేవులపై దాడికి దిగారు. మన సైనికులు వ్యూహం ప్రకారం ఆ ఓడరేవులలో ఎలాంటి యుద్ధ నౌకలు, చమురు నిల్వలు లేకుండా జాగ్రత్తపడడంతో నష్ట తీవ్రతను తప్పించుకున్నారు.

భారత నౌకా చరిత్ర

భారత నౌకా చరిత్ర, నౌకా వర్తకం చాలా పురాతనమైనది. 3000 BC నుండి 1500 BC వరకు నౌక నిర్మాణంలోనూ, వర్తకంలోనూ హరప్పా నాగరికత ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది ఒక వారసత్వ సంపద. 1817లోనే బొంబాయి షిప్‌యార్డ్‌లో నిర్మించిన HMS ట్రైంకోమలి 144 టన్నుల బరువును మోయగలిగి ఉండేది. బ్రిటీష్‌వారి కాలంలో ఉన్న ఈ నౌక ఎక్కువ కాలం సముద్రంలో ఉన్నదానిగా కీర్తి గడించింది.

బ్రిటిష్‌ కుటిలత్వం

మన నౌకలు లండన్‌ చేరడాన్ని ఓర్చుకోలేని బ్రిటిష్‌ ప్రభుత్వం 1814లో ఒక చట్టాన్ని చేసి భారతీయ నౌకలు యూరప్‌లో ప్రవేశించరాదని నిషేధం విధించింది.

శివాజీ తన సామ్రాజ్యం సుస్థిరం చేసుకొని కొంకణ్‌ ప్రాంతంలో పట్టు సాధించిన తరువాత 1657-58 కాలంలో నౌకా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అందులో భాగంగా పద్మదుర్గం, విజయదుర్గం, సువర్ణదుర్గం, సింధుదుర్గంలను నిర్మించడంతో పాటు నౌకాదళాన్ని తయారుచేశాడు. అప్పటి బ్రిటిష్‌, పోర్చుగీసు భారతీయ చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన నిర్మించిన 400 నౌకలు వివిధ సేవలు అందించాయని తెలుస్తోంది.

నౌకాయాత్రలు, సామ్రాజ్యాలు, వలస రాజ్యాలు

ద్వీపాంతరాలకు ఓడల మీద ప్రయాణం చేస్తూ ధైర్యంగా అటు గ్రీసు, రోమ్‌ వరకు ఇటు చైనా వరకు భారతీయులు ఓడ ప్రయాణాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ‘నావిగేషన్‌’ అనగా నావ ప్రయాణం. ఇది ఇంగ్లీష్‌ పదం. నౌ అనగా నావ. ఋగ్వేదంలో, ఇతిహాసాల్లో, సంస్కృత, పాళీ, దేశభాషా గ్రంథములలో ఓడ వ్యాపారాల గురించి వివరించారు.

సంస్కృతంలో ‘యుక్తికల్పతరు’ అనే గ్రంథంలో 27 దశల ఓడ నిర్మాణాలు వర్ణించారు. 64 కళలలో ‘నౌకాతీ రథాదియానానాం కృతిః’ అనేది కూడా ఓ కళగా వర్ధిల్లింది. 2309 టన్నుల బరువు కలిగి, 276 అడుగుల పొడువు, 36 అడుగుల వెడల్పు, 27 అడుగుల ఎత్తు గలిగిన ఓడలు నదుల్లో, సముద్రములలో తిరగడానికి ఉపయోగపడే విధంగా ఆ కాలంలో ఓడల్ని నిర్మించేవారు. ఆంధ్ర చక్రవర్తుల కాలంలో తూర్పు సముద్రంలో హెచ్చుగా వ్యాపారం జరిగినట్లు, క్రీ.శ.75వ సంవత్సరం నాటికి జావాలో భారతీయులు వలస రాజ్యములను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఆ కాలంలో 1000 టన్నుల కంటే ఎక్కువ పరిమాణం గల ఓడలు వేల కొలది సముద్రంలో ప్రయాణించాయి. అపాయ స్థితులలో జన సంరక్షణ కొరకు 10 చిన్న పడవలను ఆ పెద్ద ఓడ చుట్టూ వేలాడదీసేవారు. ఓడల్లో ప్రయాణికులు సుఖంగా నివసించడానికి ప్రత్యేక గదులుండేవి. 700 మంది ప్రయాణీకులను తీసికొని పోగలిగిన ఓడలు 13వ శతాబ్దంలో అనగా ఐరోపా దేశీయులకు ఈ వ్యాపారం గురించి తెలియని రోజులలోనే భారత్‌లో ఉన్నట్లు మార్కోపోలో అనే చరిత్రకారుడు వర్ణించాడు. 17వ శతాబ్దంలో ఐరోపా దేశీయులు మనదేశానికి వచ్చినప్పటికి వారి ఓడలు సాధారణంగా 270 టన్నులు మాత్రమే సామర్థ్యం కలిగి ఉండేవి. అప్పటి వరకు ప్రపంచంలోని అన్ని ఓడలలో భారతదేశ ఓడలే అధిక సామర్థ్యం కలవని స్పష్టంగా చెప్పవచ్చు.

ఇంగ్లీషు వారి ఓడలు 12 సంవత్సరాలోపు, ఆరు ప్రయాణాలలోనే చెడిపోయేవి. భావనగరు పట్టణంలో (పట్టణం అంటే ఓడరేవు అని అర్థం) క్రీ.శ.1550లో నిర్మించిన ‘డరియా డౌలత్‌’ అనే పేరుగల ఓడ 1837వ సంవత్సరంలో అనగా 287 సంవత్సరాలైన తర్వాత కూడా అంతే దృఢంగా ఉండి రికార్డుకెక్కింది.

ఈస్టిండియా కంపెనీవారు ఇక్కడ తమ సామ్రాజ్యం అభివృద్ధి అయ్యే కొద్దీ, ఆయుర్వేదాన్ని రూపుమాపిన విధంగానే, భారత నౌకాయాత్రలను, నౌకా నిర్మాణ విద్యను కూడా రూపుమాపారు.

మన నావికదళ స్థావరాలు
  • పశ్చిమ నావికదళం : ముంబాయి, గోవా, లక్షద్వీప్‌, లోనావాల, కోలాబా, జామ్‌నగర్‌, ఒకా (గుజరాత్‌).
  • తూర్పు నావికాదళం : కోల్‌కతా, చెన్నయ్‌, విశాఖపట్టణం, అరక్కోణం, కోయంబత్తూర్‌, కొచ్చి, కేరళ, తిరునల్‌వేలి.
  • దక్షిణ నావికా విభాగం : కొచ్చిన్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌.
మన తీర ప్రాంతం
  • – మన తీర ప్రాంతం 7516.6 కి.మీల విస్తీర్ణంలో ఉంది. ఇది 9 రాష్ట్రాల గుండా పోతుంది.
  • – హిందూ మహాసముద్రం గుండా వెయ్యి మిలియన్‌ టన్నుల చమురు ప్రతి సంవత్సరం రవాణా జరుగుతుంది.
  • – మన తీర ప్రాంతం 7,500 కి.మీ., 1197 ద్వీపాలతో, సముద్రంలో ప్రత్యేక ఆర్థిక ప్రాంతంగా 2 మిలియన్ల్‌ చదరపు కి.మీ. పరిధిని కలిగి ఉంది.
  • – మన దేశంలో 41% జిడిపికి సముద్ర మార్గం గుండా జరిగే వర్తకమే కీలకం.

డిసెంబర్‌ 4న సాధించిన విజయానికి చిహ్నంగా మనం నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యుద్ధం తరువాత ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అప్పటి ప్లీట్‌ ఆపరేషన్స్‌ అధికారి గులాబ్‌ మోహన్‌లాల్‌ పిలాందాకి, ‘నౌసేవా మోడల్‌’ను, ఒభూభాన్‌ యాదవ్‌కు మహావీర్‌చక్రను, లెఫ్టినెంట్‌ కమాండర్‌లు బహదూర్‌ నారేయన్‌ కవినా, ఇందర్‌జిత్‌ శర్మ, ఓం ప్రకాశ్‌ మెహతా, కమాండింగ్‌ ఆఫీసర్‌ ఎమ్‌.ఎన్‌.సెంగర్‌లకు వీర్‌చక్రను ప్రదానం చేశారు.

అప్పటి పరిస్థితులలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికి వాటిని అధిగమిస్తూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా తిరిగి సైనిక స్థావరానికి సురక్షితంగా చేరడం ఒక గొప్ప విజయంగా భావించేవారు.

– సురేందర్‌ కుంటి

(జాగృతి సౌజన్యం తో)

This article was first published in 2018