Home News 1942 నాటి ఈరమ్ నరమేథం: ఒడిశాలో రెండవ జలియన్‌ వాలాబాగ్ ఘటన

1942 నాటి ఈరమ్ నరమేథం: ఒడిశాలో రెండవ జలియన్‌ వాలాబాగ్ ఘటన

0
SHARE

– అజయ్ కుమార్ పాండా

ఒడిశాలోని ఈరమ్ భారతీయ వ్యవసాయానికి తలమానికంగా నిలిచింది. భారతదేశపు రెండవ జలియాన్ ‌వాలాబాగ్‌గా పేరొందింది. భద్రక్ జిల్లాలోని ఈ ప్రాంతం బాలాసోర్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో, భద్రక్‌కు ఉత్తరంగా 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక అతిపెద్ద గ్రామం. సముద్రానికి, పర్వతాలకు మధ్య ఒండ్రు నేలతో కూడుకున్న పొడవైన ఇరుకైన పీలికలా ఉంటుంది. ఇక్కడే ఈరమ్ నరమేథం జరిగింది.

గాంధీజీ ఇచ్చిన పిలుపుతో 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930 నాటి పౌర ఉల్లంఘన ఉద్యమంలో, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో ఈరమ్ ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. పండిట్ గోపబంధు దాష్, పండిట్ నీలకంఠ, రమాదేవి, కవి బంఛానిధి మోహంతి లాంటి నేతలు, స్వతంత్ర సమర యోధులు ఈరమ్‌ను విప్లవానికి ఒక కేంద్ర బిందువుగా మార్చారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం ఈరమ్ గ్రామ చరిత్రలో రక్తపుటేరులు పారిన ఒక దుస్సప్నం లాంటి అధ్యాయంగా మిగిలిపోయింది.

అది 1942 సంవత్సరం సెప్టెంబర్ 28, సోమవారం. అశ్వయుజ మాసంలో ఈరమ్ గ్రామస్తులకు అశ్వీయుజు మాసంలో అత్యంత అరిష్టమైన రోజు. కానీ వెనువెంటనే అనూహ్యమైన విషాదానికి వారు లోనయ్యారు. ఈరమ్ జమీందారు దివంగత రాధాకృష్ణ పర్హి బ్రిటీష్ నియమించిన DSP కి రహస్యంగా ఒక లేఖను పంపించారు. స్వతంత్ర సమరయోధులపై అభియోగాలను విచారించి వారిని అరెస్టు చేసేందుకు బాసుదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు అధికారులు చేరుకున్నారు. మొత్తంగా 27 మంది పోలీసులు వచ్చారు. అయితే వారిలో విచారణ జరిపేందుకు ఉద్దేశించిన మేజిస్ట్రేట్ లేరు. సూర్యాస్తమయానికి తోడు వర్షంలో గ్రామం తడిసిముద్దయిపోతున్న వేళ బాలాసోర్ నుంచి DSP బాసుదేవ్‌పూర్ చేరుకున్నాడు.

చూడామణి ఘాట్ వద్ద పోలీసులను తన పడవలోకి ఎక్కించుకోవడానికి రాజ్ సేన అనే పడవ నడిపే వ్యక్తి నిరాకరించాడు. దాంతో పోలీసులు తమంతటతాముగా పడవను నడుపుకుంటూ ‘స్వాధీన్ బంఛనిధి చకల’ కు ప్రధాన కేంద్రమైన ఈరమ్ గ్రామానికి పయనమయ్యారు. ఇది చూసిన కుషా తరాయి అనే మరో పడవ నడిపే వ్యక్తి పోలీసుల రాకపై అప్రమత్తం చేస్తున్నట్టుగా శంఖం ఊదాడు. ఈరమ్‌లో నేతలకు సమాచారం అందించేందుకు నదిలో ఈదుకుంటూ వెళ్లసాగాడు.

బ్రిటీష్ బలగాలు ఆగమనాన్ని తెలియజేస్తున్నట్టుగా గ్రామగ్రామన శంఖరావం వినపడసాగింది. 19 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సమాంత ప్రభుత్వాన్ని నడుపుతున్న స్వాధీన్ బంఛనిధి చకల చేసిన తీర్మానానికి లోబడి పెద్ద సంఖ్యలో ప్రజలు మైదానంలో గుమిగూడారు. జమీందార్ భవన సౌదానికి పోలీసులు చేరుకున్నారు. వారికి అక్కడ కావలసిన సమాచారం ఒక చీటీ రూపంలో అందింది.

సమావేశం ప్రాంతం గూండా పోలీసుల సామాన్లను చౌకీదార్లు తీసుకొనివెళుతుండగా అధువాకు చెందిన మణి బెజ్, సువాన్‌కు చెందిన రత్నాకర్ బిస్వల్ అనే ఇద్దరు వ్యక్తులు చౌకీదార్లను అడ్డుకున్నారు. వారి చేతుల్లోని పోలీసుల లగేజీని గుంజుకున్నారు. “బ్రిటీష్ రాజ్యానికి బానిసలైన వారి వస్తువులను మీరు మోయరాదు” అని వారితో అన్నారు. ఆత్మహుతి దళానికి అధిపతి గణేష్ ప్రసాద్ త్రిపాఠి అధీనంలో పోలీసుల లగేజీని ఉంచారు. అదే సమయంలో తాత్కాలిక పోలీసుగా పనిచేస్తున్న గోలక్ చంద్ర దాస్ జమీందార్ భవన సౌధానికి పరుగుపరుగున చేరుకున్నాడు. అక్కడే ఉన్న DSPతో స్వతంత్ర సమరయోధులను తమపై భౌతికదాడికి పాల్పడ్డారని, తమను హతమార్చడానికి పన్నాగం పన్నారని అసత్యాలు చెప్పాడు.

సమావేశ మైదానంలో దాదాపు 6,000 మంది అమాయక ప్రజలు ఉన్నారు. స్వతంత్ర సమర యోధుడు కమలా ప్రసాద్ కర్ చేస్తున్న వాడి వేడి ప్రసంగంతో, నినాదాలతో మైదానం వేడెక్కిపోయింది.

జమీందార్ చేసిన అభియోగాలపైన, తాత్కాలిక పోలీసు ఇచ్చిన సమాచారం పైన ఎలాంటి విచారణ జరపకుండానే జలియన్ వాలాబాగ్ నరమేథానికి మూలకారకుడైన డయ్యర్ తరహాలో DSP కుంజబెహారి మోహంతి ఆగ్రహంతో ఊగిపోయాడు. “నేడు నేను మనుష్యులను బలి ఇస్తాను” అని బిగ్గరగా అన్నాడు. “ఇవాళ కచ్చితంగా కాల్పులు జరుగుతాయి” అని సబ్ ఇన్‌స్పెక్టర్ హేమ పాణిగ్రాహి అరిచాడు. కన్నూమిన్నూ తెలియని కోపంతో ఉన్న సదరు ఇన్‌స్పెక్టర్ తూటాల పెట్టెను తెరిచాడు. అక్కడే ఉన్న కానిస్టేబుళ్ళందరికీ తూటాలను పంచిపెట్టాడు.

ముప్పై నిముషాల సేపు కాల్పులు కొనసాగిన తర్వాత కాల్పులు నిలిపివేయాలని కుంజబెహారి ఆదేశించాడు. 304 రౌండ్ల తూటాలను మైదానంలో జనసమూహంపైకి కాల్చారు. కాల్పుల్లో 65 సంవత్సరాల పరి బెవా అనే మహిళతో పాటుగా 29 మంది అమరలైనారు. మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు జరిపిన అమానుషమైన కాల్పుల్లో మొదటి తూటా తాకిన 35 సంవత్సరాల మణి ప్రధాన్ అనే వ్యక్తి “కాల్పులు జరపకండి.. ఆయుధాలను వీడండి.. స్వతంత్రం వస్తుంది.. మీకు మంచిని తెస్తుంది” అని విజ్ఞప్తి చేశాడు. అలా విజ్ఞప్తి చేస్తుండగానే తనపైకి మరో తూటాను పోలీసులు పేల్చడంతో మణి ప్రధాన్ అమరుడైనాడు. ఈరమ్ నరమేథంలో తొలి అమరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. నరమేథం ముగిసిన తర్వాత భారతీయ శిక్షాస్మృతి -IPC 147, 152, 149, 342 సెక్షన్ల కింద, భారత రక్షణ తాలూకు 38 నియమానికి లోబడి ఛార్జీషీట్లను పోలీసులు రూపొందించారు. అన్నెంపున్నెం ఎరుగని స్వతంత్ర సమరయోధులను అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయంలో అనేక చోట్ల అనేక మంది స్వరాజ్య సమర యోధులు అమరులైనప్పటికీ ఏకకాలంలో ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది స్వతంత్ర సమరయోధులు అమరులైన నరమేథానికి సాక్షిగా ఈరమ్ గ్రామం మిగిలిపోయింది.

myindiamyglory.com సౌజన్యంతో..