Home News చైనా విచ్ఛిన్నం అవుతుందా..!

చైనా విచ్ఛిన్నం అవుతుందా..!

0
SHARE

గర్వం, అహంకారం వలన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యాయి. చైనా దీనికి మినహాయింపు కాదు. కఠిన సెన్సారు నియంత్రణలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కార్మిక అశాంతి, వ్యతిరేకుల అణచివేత, పెరుగుతున్న ధనిక-పేద అంతరాలు, చివరకు సోవియట్‌ యూనియన్‌ వలె చైనా ఆకస్మిక విచ్ఛిన్నానికి దారి తీస్తాయని ఊహాగానాలు విహారం చేస్తున్నాయి.

ఒబామా పాలన చివరి నుండి ఇప్పటివరకు ఆగ్నేయ ఆసియా పట్ల అమెరికా నిర్లక్ష్యాన్ని జి సొమ్ము చేసుకుంటున్నారు. తిరోగమనంలో ఉన్న అమెరికా అధికారంతో జి కు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే, కఠిన దౌత్యం చేసే ధైర్యం వచ్చింది. ట్రంప్‌ ఉదాసీనత కారణంగా ఆగ్నేయాసియా దేశాలు చైనాకు దగ్గరవుతున్నాయి. ఇతర పొరుగు దేశాలను నిశ్శబ్దం చేసిన జి, తనకు వంతపాడేందుకు నిరాకరించిన భారతదేశాన్ని బెదిరిస్తున్నారు. భారత్‌, భూటాన్‌ మినహా అన్ని దక్షిణాసియా పొరుగు చైనా తన పరిధిలోకి తెచ్చుకోగలిగింది.

జనాభాపరమైన ఆకర్షణ, పెరుగుతున్న మధ్య తరగతి, భారీ వాణిజ్య అవకాశాలతో భారతదేశం చైనాకు గట్టి పోటీదారుగా నిలిచింది. ‘చైనా వారి ఆసియా’ స్వప్నానికి భారతదేశ పురోగతి అడ్డంకి అని చైనా భావిస్తోంది. చాలాకాలంగా కొనసాగుతున్న అపరిష్కృత సరిహద్దు వివాదాలు భారత్‌ – చైనా సంబంధాలను దెబ్బతీశాయి. మెక్‌మోహన్‌ రేఖను అంగీకరించడానికి చైనా తిరస్కారం, అరుణాచల్‌ ప్రదేశ్‌పై వారి వాదనలు, చైనాతో టిబెట్‌ విలీనం తరువాత దలైలామాకు, వారి వేలాది అనుచరులకు భారత్‌ ఆశ్రయం ఇవ్వడం కారణంగా శత్రుత్వం కొనసాగుతోంది.

1962 భారత్‌-చైనా యుద్ధం తరువాత, 1979లో భారతదేశం చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు పునఃప్రారంభించింది. 1981లో సరిహద్దు వివాదాలపై సంభాషణలు ప్రారంభించింది. 1988 లో మొదలైన నాయకుల సంభాషణలు సంబంధాలను మలుపు తిప్పాయి. చొరబాట్లను శాంతియుతంగా పరిష్కరించుకుంటున్నారు. చైనా, భారత్‌లో ఉద్భవిస్తున్న తమ ఆర్థిక ప్రయోజనాలను వివిధ అంతర్జాతీయ వేదికల్లో సంయుక్తంగా పరిరక్షించు కొంటున్నప్పటికీ, వైరుధ్యాల పెరుగుదల కొనసాగింది. భారతదేశంతో వాణిజ్య అసంతులనం నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కే వత్తాసు పలుకుతున్న చైనా, పాకిస్తాన్‌ అణుసామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయ పడుతోంది. అణు సరఫరాదారుల బృందంలోకి భారత ప్రవేశాన్ని జి అడ్డుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పిస్తున్నారు. భారతదేశంలోకి జలాల ప్రవాహాలను నియంత్రిస్తున్న చైనా, మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఐరాస ప్రతిపాదిత ఆంక్షలను వీటో చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ముత్యాల హారాన్ని అభివృద్ధి చేస్తూ భారత్‌ను దిగ్బంధనం చేస్తోంది.

భారత్‌ పట్ల శత్రుత్వాన్ని చైనా పునరుద్ధరించింది. బెల్ట్‌రోడ్‌ చొరవలో (BRI) పాల్గొనడానికి భారత్‌ తిరస్కారం, అమెరికాతో భారత్‌ సత్సంబంధాల వృద్ధి, దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌ సందర్శనకు అనుమతించడం దీనికి తక్షణ కారణాలు. టిబెట్‌ శాంతియుత విముక్తికి 60 సంత్సరాలయిన సందర్భంగా, 2011లో లాసా, పొటాలా ప్యాలెస్‌ వద్ద అధ్యక్షస్థానానికి వేచియున్న అభ్యర్థిగా మాట్లాడిన జిన్‌పింగ్‌, ‘అన్ని జాతులను కలుపుకొని దలైలామా బృందం వేర్పాటువాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలి. టిబెట్‌ స్థిరత్వానికి, జాతీయ ఐకమత్యానికి భంగం కలిగించే వ్యూహాలను కూలదోయాలి’ అన్నారు.

దలైలామా సందర్శనను రద్దు చేయాలనే చైనా విజ్ఞప్తిని తిరస్కరించిన భారతదేశాన్ని చైనా శిక్షించడం ప్రారంభించింది. భారత NSG సభ్యత్వానికి అడ్డుపడింది. ఐరాసలో అజర్‌ విషయంలో వీటో ప్రయోగించింది. భారత్‌లోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర ఉపనదులను నిరోధించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సింధునదిపై ఆరు ఆనకట్టలు నిర్మించే ఒప్పందం పాకిస్తాన్‌తో చేసుకుంది. 2013, 2014 నాటి రెండు ఒప్పందాలు ఉన్నప్పటికీ, దత్తాంశం నిమిత్తం డబ్బు చెల్లించినప్పటికీ, జలసంబంధిత దత్తాంశం పంచు కోవడం ఆపివేసింది. పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్ర ప్రవాహం అసోం, బిహార్‌ రాష్ట్రాలను ముంచెత్తి, 120 మందికి పైగా ప్రజల మరణానికి కారణమై, అనేక హెక్టార్ల పంటలను ముంచివేశాయి.

కావాలనే డోక్లామ్‌లో చైనా ప్రవేశించిందా ?

బిఆర్‌ఐ శిఖరాగ్ర సదస్సు మే 14-16 తేదీలలో జరిగింది. భారత గైర్జాజరు పట్ల చైనా తీవ్రంగా స్పందిం చింది. డోక్లామ్‌ నుండి భారత దళాల ఉపసంహరణ జరిగే వరకు నదీ జలాల దత్తాంశాన్ని పంచుకోం అని చైనా షరతు విధించింది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రహదారి నిర్మాణం మిషతో చైనా దళాల డోక్లామ్‌ ప్రవేశం ప్రణాళికాబద్ధంగా జరిగిన చొరబాటే అని అర్థం అవుతోంది. భూటాన్‌ మినహా భారత దక్షిణా సియా పొరుగు దేశాలతో చైనా ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకుంది. భూటాన్‌ తమదని వాదిస్తూ, భారత్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న భూభాగంలో ఇటీవలి డోక్లామ్‌ సందిగ్ధత నేపథ్యంలో భారత్‌-భూటాన్‌ల మధ్య విభేదాలు సృష్టించడానికి చైనా ప్రయత్నిస్తోంది.

కుతూహలంగా, డోక్లామ్‌ ప్రతిష్టంభన వలన చైనా దుష్ట పన్నాగాలు తెరపైకి వచ్చాయి. జి బెదరింపు దౌత్యం భారత దళాలను ఉపసంహరించడానికి, భారత్‌ను భయపెట్టడంలో విఫలమైన నేపథ్యంలో చైనా ప్రభుత్వ ప్రాయోజిత మీడియా భారత్‌పై మానసిక యుద్ధం, దుష్ప్రచారాలకు తెరతీశాయి. ఇంతలోనే అదుపులేని ఉత్తర కొరియా అణు లక్ష్యాలు, గ్వామ్‌ ద్వీపం లక్ష్యంగా బెదిరింపులు అమెరికా మిత్రుల్లో తీవ్ర భీతి కలిగించగా, వారు ఉత్తరకొరియాను అదుపు చేయాలని చైనాను కోరారు. విరుద్ధ ప్రమాణాలు పాటించిన చైనా ఉత్తర కొరియా సమస్య చక్కబెట్టేందుకు శాంతియుత చర్చలకు పిలుపు నిచ్చింది. అదేవిధంగా డోక్లాం సమస్యను పరిష్కరించుకోవడానికి తిరస్కరించింది. అంతర్జాతీయ విషయాలు, అంతర్గత భద్రత, సైనిక వ్యూహాలు, అంతర్గత విషయాలు, సెన్సార్‌ మొదలైన అన్ని విషయాలలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అభేద్య వైఖరి ఆయన నిరంకుశత్వాన్ని సూచిస్తున్నాయి.

ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యాలలో పరిపాలనను పర్యవేక్షించడానికి వీలుగా పార్టీ సభ్యులను పాలక మండళ్ళలో నియమించుకోవడం విదేశీ కంపెనీలకు చైనా తప్పనిసరి చేసింది. 1.86 మిలియన్ల చైనా ప్రైవేటు కంపెనీలలో 70 శాతం కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాయి. విదేశాల్లో చైనా కంపెనీల కార్యకలాపాలు నేరుగా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్నాయని స్పష్టమవుతుంది.

ఎవరీ జి జిన్‌పింగ్‌ ?

మొదటితరం విప్లవకారుడు, జాతీయ ప్రజా కాంగ్రెసు ఉపాధ్యక్షుడైన జి జాంగ్క్యున్‌ కుమారుడు జి జిన్‌పింగ్‌. జి తన 15 ఏళ్ళ వయస్సులో సాంస్కృతిక విప్లవ సమయంలో అణచివేతకు గురై చెరసాల పాలయ్యాడు. ఆ తరువాతి ఏడు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేసిన జి, తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

1982 నుండి 2002 వరకు తీరప్రాంత ప్రావిన్స్‌లలో వివిధ స్థాయిల్లో పార్టీకి సేవ చేశారు. 2002లో ఆయనకు 16వ కేంద్ర కమిటీ పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది. హు జింటావో బలపరచిన లికెక్వియాంగ్‌ జి లు ఇరువురిని 2007లో తొమ్మిది మంది సభ్యుల పొలిట్‌ బ్యూరో స్థాయి సంఘ సభ్యులుగా నియమించారు. పాతతరం మద్దతు పొందడంలో లీ విఫలం కావడంతో కేంద్ర సైనిక కమిషన్‌ ఉపాధ్యక్షుడిగా జి నియమితుడయ్యారు. హు, జియాంగ్‌ జెమిన్‌ బృందాల ఏకాభిప్రాయ ఎంపికగా జి ఉద్భవించారు. జియాంగ్‌, ఆయన డిప్యూటి జెంగ్‌ క్విన్‌హాంగ్‌లు జి తమ చెప్పు చేతల్లో ఉంటాడని మొదట్లో భావించారు. దీనికితోడు, షాంఘై ప్రావిన్స్‌లో జియాంగ్‌కు దగ్గర్లోని అవినీతి అధికారులపై కళ్ళాలు బిగించడంలో జి కాఠిన్యం ఆయనకు గొప్ప కీర్తి ప్రసాదించింది. తన అధికార నివాసాన్ని ఉపయోగించుకోకుండ దానిని ప్రముఖ కామ్రేలి నివాసంగా మార్చాలనే జి ఉద్దేశం ఆయనకు ప్రయోజనకారిగా మారింది. దీంతో ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రంలో రెండు స్నాతకోత్తర పట్టాలు ఉన్నప్పటికీ విప్లవ నేపథ్యంలోని లికెక్వియాంగ్‌పై జి పై చేయి సాధించారు.

సాంస్కృతిక విప్లవ బాధితునిగాను, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగాను జి ద్వంద్వ అర్హతలు ఆయనను మంచి స్థానంలో నిలిపాయి. గ్రామీణ ప్రాంతంలో కష్టపడి పని చేయడంతో ఆయన ధైర్యశాలిగా, భావజాలానికి అంకితమైన వానిగాను మారారు. ‘చేమ తన్ని సమయం’ కమ్యూనిస్టు పార్టీ పట్ల తన విధేయతను పెంచిందని జి చెప్పారు. సాంస్కృతిక విప్లవాన్ని ఆయన విమర్శించినప్పటికీ, పార్టీని స్వీకరించారు. పార్టీ కార్యకర్తలతో విస్తృత సంబంధాలు ఏర్పరచుకొని, ప్రత్యేకించి తన ప్రావిన్స్‌లో వ్యతిరేకత తగ్గించారు.

లీ, జీలు ఇరువురు వేర్వేరు మార్గాల్లో పార్టీ నిచ్చెన అధిరోహించారు. పార్టీ యూత్‌ లీగ్‌ నాయకునిగా లీ అత్యంత ప్రాచుర్యం పొందారు. రాచరికానికి ప్రాతినిధ్యం వహించిన జి సంపన్న వర్గాల కోసం పని చేశారు. పాశ్చాత్య నాయకుల వలె కాక, చైనా నాయకులు పార్టీ కార్యకర్తల ప్రత్యేక ప్రయోజనాలలో జోక్యం చేసుకోకపోవడం వలననే ఉన్నత స్థానాలనధి రోహించగలిగారని చాలామంది నమ్ముతున్నారు. అందువలన వారు ఆచరణాత్మకంగా తెలివైన వారు కానప్పటికీ, ప్రజలతో వ్యవహరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. జి అనేక ప్రావిన్స్‌లలో పనిచేసి నప్పటికీ, అసాధారణ, సంచలనాత్మక పని ఏదీ చేయలేదు. అనేక విభాగాల్లో పనిచేసినప్పటికీ, పార్టీ కార్యకర్తలతో ఘర్షణ వైఖరి అవలంబించలేదు. మొత్తానికి ఆయన ఆరోహణ సురక్షితంగా సాగింది. జి తన వాస్తవ ఉద్దేశాలను దాచిపెట్టి, వివిధ విభాగాల మద్దతు పొందారు. ఆయన అసలు ఆలోచనలు, నమ్మకాల గురించి ఎవరికీ తెలియదు.

పాలనా పగ్గాలు స్వీకరించడానికి ముందే, 2011 చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో జీ మాట్లాడుతూ ‘పార్టీ చరిత్రను వక్రీకరించి చరిత్రకు కళంకం తెచ్చే ప్రయత్నాల ధోరణిని గట్టిగా ఎదుర్కోవాలని’ చెపుతూ, వారి ఉపన్యాసాలలో పసలేని మాటలు, రాజకీయ పదజాలం ఉపయోగించడం మానివేయాలని కోరారు. మావో వర్గపోరాటాన్ని తీవ్రతరం చేసిన తరువాత మావోతో విడిపోయిన తన తండ్రి జి జాంగ్క్యున్‌ గురించి మాట్లాడటాన్ని ఆయన తప్పించుకునేవారు. పార్టీ చరిత్రకు కళంకం తీసుకురాకూడదనే జి విజ్ఞప్తులు చివరకు మసక బారిన సీనియర్‌ జి కీర్తి పునరుద్ధరణకు దారితీసింది.

ముగింపు

కీర్తి ప్రతిష్టలు, అధికారం కోసం తాపత్రయ పడుతున్న చైనా ప్రపంచంలో కీలక స్థానం ఆక్రమించాలని ఆశిస్తోంది. దశాబ్దాలుగా వస్తున్న సమిష్టి నాయకత్వాన్ని త్రోసిరాజన్న జి, చైనా కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సైన్యంలోను, పార్టీలోను తన స్థానాన్ని పటిష్టం చేసుకొని ఒక శక్తి వంతమైన నాయకుడిగా అవతరించారు. మావో ఆదర్శాలు, మార్క్సిస్టు సూత్రాలను జాగ్రత్తగా అనుసరిస్తూ ఆయన ‘ఎరుపు కంటె ఎరుపు’ (Redder than red) గా మారారు. వ్యతిరేకులను కఠిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఏరివేసిన జి, జాతయ వాదాన్ని ముందుకు తెచ్చి అధికారం అంతా తన వద్దకు చేర్చుకున్నారు. ప్రపంచ సంబంధాల పట్ల అమెరికా నిరాసక్తతను ఉపయో గించుకుంటూ ఆ ఉన్నత స్థానాన్ని ఆక్రమించడానికి జి ప్రయత్నిస్తున్నారు.

జి సుదూర ఆకాంక్షలు ఇలా ఉండగా, చైనా కమ్యూనిస్టు పార్టీలో ఆయన పట్ల అసమ్మతి, అంతఃకలహాలు తీవ్రం అవుతున్నాయి. కఠిన సెన్సారు నియంత్రణలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కార్మిక అశాంతి, వ్యతిరేకుల అణచివేత, పెరుగుతున్న ధనిక-పేద అంతరాలు, చివరకు సోవియట్‌ యూనియన్‌ వలె చైనా ఆకస్మిక విచ్ఛిన్నానికి దారి తీస్తాయని ఊహాగానాలు విహారం చేస్తున్నాయి. చైనాకు అటువంటి అగ్ని పరీక్ష ఎదురువుతుందని వ్యూహకర్తలు అంగీకరించకపోయినప్పటికీ, పాలనలోని అన్ని అంశాలపైనా పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుతూ, చైనాను ఒక ఉన్నత దేశంగా మలచడం జి కి అసాధ్యం కావచ్చు.

భౌగోళిక రాజకీయాల్లో చైనా జోక్యం దీర్ఘకాలంలో దుష్పరిణామాలకు దారి తీయవచ్చు. శక్తి ప్రదర్శన, వ్యాపార విధానం, పార్టీ పాలన బలోపేతం కోసం చరిత్ర శుద్ధీకరణ, నాయకుల వైఖరి చివరకు చైనాకు వ్యతిరేకంగా దేశాలు చేతులు కలపడాన్ని తప్పనిసరి చేయవచ్చు. భారతదేశం, జపాన్‌, ఇతర ఆగ్నేయాసియా దేశాలను చైనా అనవసరంగా వేధిస్తోంది. ఉత్తర కొరియా విషయంలో చైనా అలక్ష్యంపట్ల అమెరికా అసహనంగా ఉంది. వాణిజ్య లోటు పెరిగిపోతూ ట్రంప్‌ పాలనకు చైనా ముప్పుగా పరిణమిస్తూండగా పెట్టుబడులను ఉపసంహరించి, చైనా నుండి దిగుమతులపై పరిమితులు విధించడం అమెరికాకు తప్పనిసరి అయింది.

గర్వం, అహంకారం వలన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యాయి. చైనా దీనికి మినహాయింపు కాదు. ప్రపంచ ఆకాంక్షల పట్ల జి తన అతిశయాన్ని తగ్గించుకోవలసిన సమయం వచ్చింది.

– డా.రామహరిత

(జాగృతి సౌజన్యం తో)