Home Telugu Articles దేశభద్రత ముఖ్యం కాదా?

దేశభద్రత ముఖ్యం కాదా?

0
SHARE

సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం సం యుక్తంగా నిర్వహించిన జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియతో అక్కడ నివసిస్తున్న 40 లక్షల మందిని (ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారు) చొరబాటుదారులుగా తేలారు. వెంటనే నకిలీ లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించాయ. ఈ దేశం భారతీయులకు మాత్రమే అనే స్పష్టమైన విషయాన్ని మరచిపోయి ఇంకా వలసవాద రాజకీయాలను పట్టుకొని విపక్ష నేతలు వేలాడుతున్నారు.

అస్సాం, పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుండి వస్తున్న చొరబాటుదారుల సమస్య ఈనాటిది కాదు. దేశ విభజన ఖాయం అని స్పష్టమైన తరువాత 1946లో ఫారినర్స్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ భారత ప్రభుత్వానికి విదేశీయులకు సంబంధించిన విషయంలో అధి కారాలను ఇచ్చింది. 1950 ఏప్రిల్ 8న మన ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌ల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎప్పటిలాగానే నెహ్రూ విదేశీయుల సమస్య పట్ల ఉదాసీన వైఖరి అవ లంబించారు. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో హిందువులపై అత్యాచారాలు, లూటీలు యథేచ్ఛగా జరిగాయి. సుమారు 2.5 లక్షల మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న డా॥ శ్యాంప్రసాద్ ముఖర్జీ, సర్దార్ పటేల్ ప్రధాని నెహ్రూని కలిసి, జరుగుతున్న ఘోరకలిని ఆపమని ఎన్నిసార్లు కోరినప్పటికి ఫలితం దక్కలేదు. ఫలితంగా మంత్రివర్గం నుండి డా॥ శ్యాంప్రసాద్ ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆయన తన రాజీనామాలో 7 అంశాలను సమగ్రంగా వివరించారు. 1951 తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉండకూడదు, ఒకవేళ ఉన్నట్లైతే వారిని వెనక్కు తిప్పి పంపాలన్నది ముఖ్యమైనది. 1948 ఏప్రిల్ తర్వాత పాక్ నుండి 2.3 మిలియన్ల హిందువులు గెంటివేతకు గురయ్యారు.

1961లో చైనా భారత్‌పై దురాక్రమణకు పాల్పడింది. అప్పుడు జరిగిన యుద్ధంలో భారత్‌కు చెందిన కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి ప్రధాని నెహ్రూ అస్సాం కూడా చైనా దురాక్రమణకు లోనైనట్లుగా భావించి అస్సాం ప్రజలకు తన రేడియో ప్రసంగం ద్వారా సానుభూతి తెలిపారు. కానీ, అస్సాం ప్రజలు చైనా దురాక్రమణను తిప్పికొట్టి తమ భూభాగాన్ని కాపాడుకొన్నారు. 1964లో ది ఫారినర్ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1972లో ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజబూర్ రెహమాన్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, మార్చి 1971 తరువాత నుండి భారతదేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులను వెనక్కు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ ప్రధాని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి 30-9-1972న మన ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. దీని ప్రకారం 1971 మార్చికి ముందు మనదేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయులు తిరిగి వెళ్ళనవసరం లేదు. ఆ తేదీ తరువాత వచ్చిన వారిని వెనక్కు పంపవలసినదిగా సర్క్యులర్ స్పష్టం చేసింది. ఈ చట్టంతో అంతకుముందు తయారైన 1946, 1964 చట్టాలు నీరుకారిపోయాయి. ఇందిరాగాంధీ చేసిన ఈ చట్టం వల్ల 1971 మార్చికి ముందు ప్రవేశించిన వారి జనాభా అస్సాంలో 77 శాతానికి పెరిగిపోయింది.

ఈ సమస్యను గుర్తించి 1980లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) చొరబాటుదారులను వెనక్కు పంపాలని ఉద్యమం ప్రారంభించింది. ఉద్యమ తీవ్రతను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1983లో ‘ఆసు’తో ఒప్పందం కుదుర్చుకుని ఐఎమ్‌డిటి (నిళఘ జూళశఆఒ ళఆళూౄజశ్ఘఆజ్యశ ఱక జఇఖశ్ఘ ఘషఆ 1983) ఛట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం చొరబాటుదారులను పౌరులెవరైనా గుర్తించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు. వారు చొరబాటుదారులే అని, ఈ దేశపు పౌరులుకారని ఫిర్యాదుదారే రుజువుచేయాలి. ఇటువంటి అనేక లోపాలు ఈ చట్టంలో ఉన్నాయి. ఈ సమస్య గురించి 1985లో మరొకసారి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ‘ఆసు’కి మధ్య జరిగిన ఒప్పందం పటిష్టంగా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం విదేశీయుల విషయంలో తయారైన స్పష్టమైన చట్టం ప్రకారం 1.1.1966 తరువాత మన దేశంలోకి వచ్చిన విదేశీయులందరూ చొరబాటుదారులే. ఆ తేదీకి ముందు వచ్చి, 1967 నాటి ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు భారత పౌరులు అవుతారు.

2000 సంవత్సరంలో ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి, అప్పటి అస్సాం గణపరిషత్ నాయకుడు శర్వానంద సోనోవాల్ ఐఎండీటీ చట్టం చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2006 డిసెంబరులో ఆయన వాదనను బలపరుస్తూ ఐఎండీటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 1985 చట్టాన్ని అమలు చేయటంలో బిజెపి ప్రభుత్వం తప్ప మిగతా ప్రభు త్వాలేవీ చిత్తశుద్ధి చూపలేదు. 2001లో అస్సాంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 1985 చట్టాన్ని నీరు కార్చటం మొదలు పెట్టింది. ఆ సమయంలో కేంద్రంలోని వాజపేయ ప్రభుత్వం తిరిగి అస్సాం గురించి ఆలోచించింది. అప్పటి హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ అస్సాంలో చొరబాటు దారుల సంఖ్య భారీగా ఉందని, దానివల్ల అక్కడ జనాభా సమతూకం దెబ్బతినటమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేట్లుగా ఉందని పేర్కొంది.

ఇప్పటికైనా అస్సాంలో గొడవలు సద్దుమణిగి శాంతి ఏర్పడాలంటే అక్కడి చొరబాటు దారులను గుర్తించి, వెనక్కు పంపటం ఒక్కటే మార్గం. ఇది మత, భాషా పరమైన మైనారిటీల సమస్యకాదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. చొరబాటుదారులు అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించి నివసించడం ఇక్కడి రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధం అని కేంద్రం తన అఫిడవిట్లో అప్పుడే తేల్చిచెప్పింది. చట్టాలు ఇంత స్పష్టంగా ఉంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రాద్ధాంతం చేయటంలో అర్థం లేదు.

2001లో అస్సాంలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 1985 చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాకుండా జాతీయ భద్రతా సమస్యను హిందూ, ముస్లిం మైనారిటీల సమస్యగా చిత్రీకరించింది. 2004లో కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం రావడంతో అస్సాం ఒప్పందాలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఓటుబ్యాంకు రాజకీయాల ఫలితంగా 4 జిల్లాలు పూర్తిగా బంగ్లాదేశ్ చొరబాటు దారులతో నిండిపోయాయి. మరో రెండు జిల్లాలు 80 శాతం చొరబాటు దారులతో నిండిపోయాయి. ముస్లింల ఓట్ల కోసం- వారు నమాజ్ చేసుకునేందుకు ప్రతి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో బంగ్లాదేశ్ చొరబాటు దారులు 1950లో లాగా రెచ్చిపోతూ, హిందువులపై అత్యాచారాలు చేస్తూ, హిందూ స్ర్తీలను సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్‌లోకి తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపటం అలవాటైంది. ఇంత జరుగుతున్నప్పటికీనకిలీ లౌకికవాద ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిని ముస్లిం మైనారిటీ సమస్యగాను, మత, భాషా పరమైన మైనారిటీ సమస్యగాను చిత్రీకరించి సుప్రీం కోర్టు తయారు చేయించిన జాతీయ పౌర నమోదు పైనే పార్లమెంటు బయట, లోపల అల్లరి చేస్తున్నాయ. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో అస్సాం భాష మాట్లాడే వారి సంఖ్య 57.8 శాతం నుండి 48.8 శాతానికి పడిపోయింది. బెంగాలీ మాట్లాడేవారి సంఖ్య 21 శాతం నుండి 27 కి పెరిగింది. అంటే బంగ్లాదేశీయుల సంఖ్య ఎంతగా పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అస్సాం ప్రజలు వారి సొంత రాష్ట్రంలోనే మైనారిటీలు కావటం విస్మయకరం. ఈ రోజు బంగ్లాదేశ్ చొరబాటు దారులు పెత్తనం సాగిస్తున్నారు. 2015లో అప్పటి తరుణ్ గగోయి ప్రభుత్వం ప్రజల ఒత్తిడికి లొంగి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను పునరుద్ధరించింది. 2016లో బిజెపి ఆధ్వర్యంలో సోనోవాల్ సీఎం అయ్యాక ఎన్‌ఆర్‌సీ వేగవంతమైంది.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఎన్‌ఆర్‌సీ కమిషన్ బెంగాల్‌లో నివసిస్తున్న 1.5 లక్షల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల వివరాలు పంపమని కోరింది. దానిపై మమత ఎటువంటి చర్య తీసుకోకపోవటాన్ని జాతీయ పత్రికలు తప్పు పట్టాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో తన ప్రధానులు కుదిర్చిన ఒప్పందాలను, చేసిన చట్టాలను తానే వ్యతిరేకించే దుస్థితిలో ఉంది. ఒకవైపు ఎన్‌ఆర్‌సీని తామే వేశామని చెప్పుకుంటూ బంగ్లాదేశ్ చొరబాటు దారులను వెనక్కి పంపరాదనటం వారి ద్వంద్వనీతికి నిదర్శనం. మమతా బెనర్జీ 2005లో లోక్‌సభలో మాట్లాడుతూ బంగ్లాదేశ్ చొరబాటు దారులను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ అస్తిత్వం కోసం ఆమె ఇప్పుడు చొరబాటు దారులకు మద్దతు పలకటం హాస్యాస్పదం. ఆమె పాటకు తందాన అంటున్న మిగతా నకిలీ లౌకికవాద ప్రతిపక్ష పార్టీల తీరు చూస్తే దేశ భద్రత పట్ల వారికి ఎటువంటి నిబద్ధత లేదని అర్థమవుతున్నది. వీరికి తమ పార్టీల భద్రతే ముఖ్యమన్నట్లుగా ఉంది.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దేశంలో జరుగుతున్న అనేక విధ్వంసకాండలకు విదేశీ చొరబాటుదారులే కారణమని నివేదికలు ఘోషిస్తున్నా బిజెపియేతర రాజకీయ పార్టీలు ధృతరాష్ట్ర పాత్రను పోషిస్తున్నాయి. రోహింగ్యాల విషయంలోను ఈ పార్టీలు ఇలానే ప్రవర్తించాయి. ఇప్పుడు అస్సాం విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడానికీ వెనుకాడటం లేదు. వీరికి ఎవరు బుద్ధి చెప్పాలి ?

-పి.వి. శ్రీరామశాయి 98480 76295

(ఆంధ్రభూమి సౌజన్యం తో)