— చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి
ఈ మధ్య కర్నాటక రాష్ట్రంలో కొందరు విద్యార్థినులు “హిజాబ్” లు ధరించి రావడం జరిగింది. ఒక విద్యాలయంలో ఉన్న డ్రెస్ కోడ్ ప్రకారం అలా రావోద్దని ఆ విద్యాలయ సిబ్బంది వారిని నివారించారు. అది ఒక వివాదాస్పదాంశంగా దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. రాజ్యాంగబద్ద హక్కు అంటూ తమ మతాన్ని వెనకేసుకొంటూ కొందరూ విద్యార్థులలో ఈ మతపరమైన తేడాలు ఉండటం ఏమిటీ అలా ఉండడం ద్వారా వారిలో బేధ భావాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కొందరు వాదిస్తున్నారు. మన దేశంలో ఇంకేమీ సమస్యలు లేవన్నట్టు ఈ హిజాబ్ పదర్శనలే ముఖ్యమని భావించిన కొన్నసంస్థలు తెగపోరాడేస్తున్నాయి. ఇది మతపరమైన అంశం అంటూనే “ఒక వర్గాన్ని” సమర్థిస్తూ మాట్లాడే మేధావులని చూస్తూ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పసి మనస్సుల్లోనే ఈ మతపరమైన విభజన ఎందుకు? వారి ఇంట్లో వారు ఏ మతాన్ని అవలంభిస్తారో “వారి ఇష్టం” ఇందులో ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. కానీ విద్యాలయాలకి వచ్చినప్పుడు పేద , గొప్ప, మత, కుల విభేదాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏకరూప దుస్తుల పద్దతిని దాదాపు అన్ని విద్యాలయాలు పాటించడం రివాజు. అది అనాదిగా వస్తున్న ఒరవడి, ఆ ఒరవడిని వదిలి మనం ఎందుకు ఇలా మధ్యమ యుగంలోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
ఈ వివాదాన్ని చిలికి చిలికి గాలివాన చేయాలని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. హిజాబ్ కు అనుకూలంగా ప్రదర్శన జరిగే ప్రదేశంలో ఆయుధాలు ధరించిన కొందరు ముస్లిం యువకులను పోలీసులు అదుపు లోకి తీసుకోవడం అన్న విషయం నిజంగా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం.
మతనిరపేక్ష (సెక్యులర్) సమాజం మత స్వేచ్చ పేరుతో ఈ విధంగా పొర పొచ్చాలు తెచ్చే విషయాలలో చాలా స్పష్టంగా ఉండాలి. విద్యార్థులుగా ఉన్న వారు తమ స్థాయిని, మతాన్ని అన్ని విభేదాలను విద్యాలయం బయటే వదిలి విద్యార్జనే ధ్వేయంగా మారి విద్యాలయం పూర్తిగా మతానికి దూరంగా ఉండాలి.
(వ్యాసకర్త ప్రముఖ సినీ కళాకారులు, రచయిత)