
మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా …
భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు. మనకు తెలిసిన, మనం చదువుకున్న పాఠాలకు ఈ పరిశోధనలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. వాటిల్లో `సతీసహగమనం’ విషయం ఆసక్తికరమైనది.
ప్రాచీన గ్రంథాల్లో `సతి’కి సంబంధించి అతికొద్ది ప్రస్తావనలు మాత్రమే కనపడతాయి. అవి స్వచ్చంద మరణం లేక `ప్రాయోపవేశం’ అనే యోచనతో ఉంటాయి. చరిత్రలో విదేశీ యాత్రికులు వ్రాసిన పుస్తకాలలో, ఒకటీ,ఆరా శాసనాలలో `సతి’ సంఘటనలు నమోదైనాయి, అవి సంఖ్యలో చాల తక్కువ, వేళ్ళమీద లెక్కపెట్టగలిగేవి. భర్తమరణం తరువాత భార్య స్వచ్చందంగా చేసిన `సతీసహగమనం’ గౌరవప్రదమనే దృష్టితో, అవి శాసనాలు వేసేంత అరుదుగా ఈ సంఘటనలు జరిగాయి. అది కూడా దేశంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సామాజిక వర్గాలలో మాత్రమే జరిగాయి. ముస్లిం దాడులను కొన్ని వందల సంవత్సరాలపాటు ఎదుర్కున్న సింద్, రాజస్థాన్ ప్రాంతాలలోని రాజపుత్ర సంస్థానాలు, రాజవంశాలలో, ముఖ్యంగా రాజపుత్ర రాచరికపు మహిళలలో `సతి’ సంఘటనలు ఎక్కువగా జరిగాయని ఉదాహరణలు ఉన్నాయి. ముస్లింమూకల దాడులలో తమ మానప్రాణాలు కాపాడుకోవడానికి, రాజమహల్లో మహిళలు సామూహికంగా బలవన్మమరణాలకు పాల్పడ్డారని `రాణి పద్మిని’ వంటి మహిళల `జౌహర్’ బలిదానాలు రుజువు చేస్తున్నాయి. ఇస్లామిక్ దాడుల ముందు భారత్ మీద విదేశీ రాజుల సైన్యాలు, భారతదేశ సైన్యాలతో యుద్ధాలు చేసాయి; కానీ ముస్లిం దాడులు ఆ కోవకు చెందవు, వారు సైన్యంతో సాధారణ ప్రజలమీద మూకదాడులు చేయించి, ప్రజలను హింసించి హత్యలు చేసి, దేవాలయాలు దోచుకుని ధ్వంసం చేసి, మహిళలను మానభంగాలు చేసేవారు; కొన్ని సార్లు స్త్రీలను అపహరించి, ఆసియా మార్కెట్లలో అమ్మేసేవారు. ఇటువంటి దారుణాలనుంచి తమను తాము రక్షించుకోడానికి, ముఖ్యంగా రాజపుత్ర మహిళలు `సతీసహగమనం’ లేక `జౌహర్లు’ పాటించి ఆత్మాహుతికి పాల్పడేవారు. ఆ స్త్రీలకు ఆలయాలు కట్టించి సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు, సాక్షాత్తు `సతీదేవి’గా కొలిచేవారు. దేశంలో ఇస్లామిక్ దాడుల పర్యవసానంగా `సతీప్రధ’ సంఘటనలు ఎక్కువగా జరిగేవి, అయితే దేశంలో మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా మినహాయిస్తే, ఎక్కడా ఇవి నమోదు కాలేదు. ఎక్కువగా నేటి రాజస్థాన్, బెంగాల్ ప్రాంతాల్లో జరిగేవి.
అయితే మన చరిత్రకారులు ఈ సత్యాలను దాచిపెట్టి, ముస్లిం రాజులు `సతీప్రధ’ను నిషేధించడానికి చేసిన గొప్ప ప్రయత్నాలను వివరిస్తారు. వీరు వేదాలను కూడా వదలలేదు, స్త్రీ పురుషులిద్దరూ స్వచ్చందంగా మరణాన్ని కోరుకునే నామమాత్రంగా ఉన్న 1-2 శ్లోకాలను ప్రస్తావించి, వాటిని వక్రీకరించి, సతీసహగమనం హిందూమతంలో అంతర్భాగమని, హిందూమతం మహిళలకు వ్యతిరేకమనే ప్రచారం చేసారు. ఉదాహరణకి, మహాభారతoలో ద్రుతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి వానప్రస్థం తరువాత వృద్ధాప్యంలో స్వచ్ఛంద మరణం స్వీకరిస్తారు. నిజానికి రామాయణ మహాభారత ఇతిహాసాల్లో, భర్త మరణం తరువాత సతీసహగమనం చేసిన ఉదంతాలు మనకు కనపడవు; మాద్రి సహగమనం చేసినా, అది పాండురాజు మరణానికి తాను కారణం అన్న వ్యధ వల్ల మాత్రమే చేస్తుంది.
బ్రిటిషు విదేశీ వలస పాలకుల పాలనలో, 1800సం. తదుపరి దశకాలలో, బెంగాల్ ప్రాంతంలో, ముఖ్యంగా అప్పటి బ్రిటిష్ రాజధాని కలకత్తా చుట్టుపట్ల విపరీతంగా `సతీప్రధ’ కొనసాగుతోందని బ్రిటిష్ పాలకులు నమోదు చేసారు. అంతకు ముందుకాలంలో అతితక్కువగా ఉన్న ఈ సంఘటనలు ఉన్నట్టుండి ఎలా అంతగా పెరిగిపోయాయో పరిశోధకులు కారణాలు వెతకగా ఎన్నో విచిత్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బ్రిటిష్ పాలకుల ప్రత్యక్ష ప్రోద్బలం సహకారంతో, అదే సమయంలో బ్రిటిష్ చర్చ్ మతమార్పిడిలు ముమ్మరం చేసింది. హటాత్తుగా కేవలం బెంగాల్లోనే, వేల సంఖ్యలో `సతీప్రధ’ జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. అప్పటి ప్రభుత్వ లెక్ఖల ప్రకారం 1815-1829 మధ్య 14ఏళ్ల కాలంలో 8134విధవలు సహగమనం చేయగా, వాటిల్లో 60% పైగా కలకత్తా మహానగరంలోనే జరిగాయి! ఇవి అంతకుముందు కాలంలో ఉన్న సంఖ్యకు రెండువేల రేట్లకు మించిఉన్నాయి. అయితే కలకత్తా నగరం రాజపుత్ర సంస్థానాలు ఉన్న ప్రదేశం కాదు కాబట్టి, ఈ అబద్ధపు సంఖ్యలు ప్రచారంచేసి, అదే సమయంలో విపరీతమైన క్రిస్టియన్ మతమార్పిడిలు జరిపించారని పరిశోధకులు తెలియచేస్తున్నారు. `మీనాక్షి జైన్’ తమ ప్రసిద్ధ గ్రంథం `సతి’లో ముఖ్యంగా రెండు కారణాలు వెలికితీశారు- ఒకటి, క్రిస్టియన్ మతప్రచారకులు, బాప్టిస్ట్ మిషనరీలు అప్పటి `ఈస్ట్ ఇండియా కంపెని’ భారతదేశంలో మతమార్పిడులకు బ్రిటిష్ పార్లమెంట్లో అనుమతిపొందడం, రెండవది, హిందూమతం స్త్రీలకు వ్యతిరేకమని, బలవంతంగా స్తీలను అగ్నికి ఆహుతి చేస్తుందని ప్రచారం చేసి, ప్రజల్లో సర్వత్రా హిందూమతం పట్ల ద్వేషం విముఖత కలిగించడం. ఒకవేళ నిజంగానే `సతీప్రధ’ సంఖ్య కొద్దిశాతం పెరిగినా, దానికి కారణం బ్రిటిష్ పాలన అవ్వాలిగాని, హిందూమతం, ప్రాచీన గ్రంథాలు ఎలా అవుతాయి? వాటిల్లో అసలు సతీసహగమనం లేదు. బ్రిటిష్ కధనాలకి విరుద్ధంగా, ఈ స్త్రీలు మధ్యవయస్కులు లేక వృద్ధులు, హిందూ సమాజంలో స్త్రీలకు, విధవలైనా ఆస్థి హక్కు ఉంది, వారికి ఆస్థి సంక్రమిస్తుంది; కాని బ్రిటిష్ స్త్రీలకు ఆస్థి హక్కులేదు కాబట్టి, అవే చట్టాలు భారతదేశoలో అమలుచేసి, మహిళలను ఆస్థికి దూరంచేశారు. మగసంతానం కావాలనే కోరిక భారత సమాజంలో పెరిగిపోవడానికి ఇదొక కారణం, ఎందుకంటే మగసంతానం లేకపోతే ఆస్థి చేయిజారిపోతుంది. బ్రిటిష్ చరిత్ర వారు స్వయంగా వ్రాసుకున్నట్లు, వారి అడుగుజాడల్లో నడిచే `లౌకికవాద’ చరిత్రకారులు వాటిని కాపీచేసి వ్రాసినట్లు కాక, అసలు నిజం వేరేఉంది. హిందూ స్త్రీలను ఉద్ధరించడానికి బదులు, బ్రిటిష్ పాలకులు స్త్రీలను మరింత నరకంలోకి తోయడమేకాక, ఆ వంకతో, మతమార్పిడిలు జరిపించారు.
తరువాత దశకంలో `అనాగరిక మూడాచారాలను’ పాటించే హిందూసమాజానికి `నాగరికత, సభ్యత’ నేర్పించాలని బ్రిటిష్ పాలకులు తమకుతామే ప్రకటించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా, బ్రిటిష్ గవర్నర్-జనరల్ `లార్డ్ బెంటిక్’, 1829సం.లో `సతీ నిర్మూలన చట్టం’ చేసారు. స్త్రీల అభివృద్ధికి, విధవలపై హిందూమతం చేసిన హింసకు, బ్రిటిష్ పాలకులు 19వ శతాబ్దoలో చేసిన అతిముఖ్యమైన `సంస్కరణ’ ఈ చట్టమని గత రెండు దశాబ్దాలుగా చిత్రీకరించబడింది, ఇదే మనం పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ చదువుకుంటాము. అయితే దీనివల్ల అప్పటి సమాజంలోగాని, స్వతంత్ర భారత్ లో గాని, `సతిప్రధ’ పూర్తిగా నిరోధించబడిoదా అంటే లేదనే చెప్పాలి. స్వాతంత్ర్యానంతరము కూడా చెదురుమదురుగా ఈ సంఘటనలు జరిగాయి. రాజస్థాన్లో 1987లో `రూప్ కన్వర్’ అనే మహిళ స్వచ్చందంగా చేసిన సతీసహగమనం, దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసి, ఇంకొక చట్టానికి దారితీసింది.
బ్రిటిష్ పాలకులు భారత సామాజిక, సాంస్కృతిక చరిత్రను వక్రీకరిoచడంవల్ల, నిజంగా అప్పటి హిందూ సమాజ స్థితిగతులు, హిందూ స్త్రీల అసలు పరిస్థితులు, చరిత్రకారులు నిజాయతీగా పరిశోధించలేదు. దీని మరొక పరిణామం-ప్రతి విషయానికి, నిజమైనా అబద్ధమైనా, హిందూమతంపై దుష్ప్రచారం చేయడం, బ్రిటిష్ పాలకుల కల్పితాలు అసత్యాలు ఈరోజుకి కూడా ప్రచారం చేయడం, దూషించడం సాధారణమైంది. ఇంకొక తీవ్ర పరిణామం- నేరాలకి, అక్రమాలకి గురయ్యే `అణగారిన’ వర్గాలుగా కొన్ని వర్గాలను గుర్తించి, చరిత్రలో వారికి జరిగిన `అన్యాయాన్ని’ వారికి ఎప్పటికప్పుడు బోధిస్తూ, వారిని `అణగారిన వర్గాలు, బాధితులు’గా చిత్రీకరించి, దేశంపట్ల, హిందూమతంపట్ల వారిలో కోపాన్ని, ద్వేషాన్ని నింపేప్రయత్నం ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. దేశాన్ని ప్రజలని విడదీయడంలో అప్పటి క్రిస్టియన్ చర్చ్ పాత్ర-మతమార్పిడిలు, బ్రిటిష్ పాలకుల కుట్రలు ఇప్పటికైనా చరిత్రకారులు, చరిత్ర పరిశోధనా సంస్థలు పరిశోధించి బయటపెట్టాలి.
– ప్రదక్షిణ
ఆధారం: ఇండియాఫాక్ట్స్
For local updates, download Samachara Bharati
For Multi-lingual News App – download Ritam