హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ దాడులు రెండో రోజు కొనసాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటిశాఖ దాడులు నిర్వహిస్తోంది. అక్రమ మార్గంలో, హవాలా పద్దతిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని వచ్చిన అభియోగాలపై ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన సన్నిహితులు, వ్యాపారులపై ముందుగా దాడులకు దిగినట్టు ఎంఐఎం నాయకులు చెబుతున్నారు. బుధవారం చేపట్టిన సోదాలు గురువారం కూడా కొనసాగాయి. టోలీచౌకీలో 10 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అసదుద్దీన్ ముఖ్య అనుచరుల్లో ఒకరైన షానవాజ్ హుస్సేన్ నివాస స్థలాలైన ఇంజన్ బౌలి, శాస్ర్తీపురం, చార్మినార్ వద్ద, మరో అనుచరుడైన ఉబేద్ ఇంటిపై, టోలిచౌకీలోని అఖ్తర్ అనే కార్యకర్త ఇళ్లపై దాడులు నిర్వహించారు. వీరంతా గతంలో ఎలాంటి పన్నులు చెల్లించలేకపోయినా..ప్రస్తుతం ఏడాదిలో లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తుండడంతో వారికి చెందిన డబ్బు ఎక్కడి నంచి వచ్చింది? వారు ఎవరికి బినామీలుగా పని చేస్తున్నారు? వారి డబ్బుల లెక్కలు ఎమైనా ఉన్నాయా? వారి ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలను ఆదాయ పన్నుల శాఖ అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా వ్యాపారులు, పలువురు బిల్డర్లు, ఫైన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో అనేక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ గుర్తించింది. నేడో, రేపో వారికి నోటీసలు అందజేయనున్నట్టు ఐటీ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గతంలో ఎన్నడూ బ్యాంకుల్లో పెద్ద మొత్తాలు జమ చేయని అనేక మంది ఈ ఏడాదిలో కోట్లాది రూపాయల వ్యాపారం చేయడం పట్ల, వీరి లావాదేవీలలో కొంత మంది బ్యాంకు అధికారులు కూడా ఐటీ శాఖకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
పాతబస్తీలో అనేక అకౌంట్లలో భారీగా నిధులు చేతులు మారినట్టు గుర్తించడం జరిగిందని, అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకు అధికారులకు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద ఖాతాల లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)