Home News జలియన్‌వాలాబాగ్ : భరతభూమి మరచిపోలేని దురాగతం

జలియన్‌వాలాబాగ్ : భరతభూమి మరచిపోలేని దురాగతం

0
SHARE

( ఏప్రిల్ 13 – జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగిన రోజు )

ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు పెట్టింది. ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు మొదలయ్యాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ఆనాటి విషాద ఘటనలో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురోడిన చీకటి రోజు అది. 105 ఏళ్ల క్రితం జలియన్ వాలాబాగ్‌లో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జరిపిన మారణ కాండ బ్రిటీష్ పాలనపై పోరాటాన్ని మలుపు తిప్పింది.

భారత స్వాతంత్ర్ర్ర్యోద్యమ చరిత్రలో అత్యంత విషాదకర, దురదృష్టకర హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది. బ్రిటీష్ ప్రభుత్వం 1915లో రూపొందించిన భారతీయ రక్షణ చట్టానికి అదనంగా 1919లో రౌలత్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ నల్లచట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్‌లకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పత్రికలపై సెన్సార్‌షిప్‌తో పాటు విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఈ చట్టాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అరెస్టైన వారికి సంఘీభావం ప్రకటిస్తూ అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో కూడా ఒక సభ ఏర్పాటైంది.

ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం. జలియన్ వాలాబాగ్ కిక్కిరిసి పోయింది. ఆ రోజు సిక్కులు, పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ దినం. వేలాదిమంది సభకు తరలివచ్చారు. దాదాపు 20వేల మంది ఉంటారు. ఇందులో హిందువులు, సిక్కులు, ముస్లింలతో పాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు. అదే సమయంలో బూట్లతో కవాతు శబ్దం వినిపించింది. జలియన్‌వాలా బాగ్ తోటను అప్పటికే 90 మంది సైనికులు చుట్టుముట్టారు. ఈ సైనికులతో పాటు జనలర్ డయ్యర్ కూడా వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ ఆదేశించాడు. సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలు పెట్టారు. సభలో హాహాకారాలు, జనాలు గాయపడుతూ, ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు. ఆ తోటలో ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒకరు పై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు. క్షణాల వ్యవధిలోనే సాయుధ బలగాలు 1650 రౌండ్లు మేర కాల్పులు జరపగా 1000 మందికి పైగా ప్రాణాలు వదిలారు.

జలియన్‌వాలాబాగ్ తోట ఇరుకైన సందులో చుట్టూ పెద్ద ఇళ్లు, భవంతులతో ఉంటుంది. ఈ కారణంగా సైనిక శకటాలు లోనికి వెళ్లలేక పోయాయి. అవి కూడా వెళ్లి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఆ స్థలంలోకి వాహనాలు వెళ్లగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని డయ్యర్ చెప్పుకున్నాడు. జలియన్‌వాలాబాగ్ ఘోరకలిపై విచారణకు ఏర్పాటైన హంటర్ కమిటీ ప్రశ్నలకు డయ్యర్ ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాదు పాలన వ్యవస్థ వికృత ధోరణిని కూడా స్పష్టం చేశాయి. ముందస్తు ప్రణాళికబద్ధ వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే తాను చర్యలు తీసుకున్నానని డయ్యర్ ఎలాంటి జంకుబొంకు లేకుండా చెప్పాడు. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అతడి క్రూర చర్యలను సమర్థిస్తూ పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేసింది.

జలియన్‌వాలాబాగ్ ఘటనకు ప్రతిగా భారతదేశంలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన సర్ బిరుదును ఇంగ్లండ్ ప్రభువుకు తిరిగి ఇచ్చేశారు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1951లో జలియన్‌వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ యాక్ట్‌ను పార్లమెంట్ రూపొందించింది. ఈ బిల్లును అనుసరిస్తూ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించి 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. 1951 నాటి బిల్లును 2019లో సవరిస్తూ ట్రస్ట్‌లో శాశ్వత సభ్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన నిబంధనను తొలిగించడం ద్వారా మోదీ ప్రభుత్వం జలియన్‌వాలాబాగ్ నేషనల్ మెమోరియల్‌ను నిర్వహించే ట్రస్ట్‌ను రాజకీయరహితంగా మార్చారు. జలియన్‌వాలాబాగ్ స్తూపాన్ని మూడేళ్ల క్రితం ఆధునీకరించారు. 2021 ఆగస్ట్ 28న ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు.