దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసు శాఖవారు, జలశక్తి నుంచి ఒకరు, విద్యాశాఖ నుంచి మరొకరు వున్నారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి, వారి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని రోజుల క్రిందటే గుర్తించారు. వీరి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వున్నాయని అధికారులు అభ్యంతరం తెలిపారు.
మరోవైపు పోలీసు శాఖలో పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్ అనే కానిస్టేబుల్ మందుగుండు సామాగ్రిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఓ చోటు నుంచి ఇంకోచోటుకి తరలిస్తున్నారని పోలీసుల పరిశోధనలో తేలింది. అలాగే… ఇస్లామిక్ ఉగ్రవాదులకు దుస్తులు, ఇతర సామాగ్రి కూడా కొనుగోలు చేసే విషయంలో ఈ పాత్ర వుందని తేలింది. ఇక..రసూల్ భట్ అనే కానిస్టేబుల్ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేయడం, మందుగుండు సామాగ్రి అందించడం, మందుగుండు సామాగ్రిని ఓ చోటు నుంచి మరో చోటుకి అక్రమంగా తరలించడం చేస్తున్నారని తేలింది. పుల్వామా జిల్లాలోని ఆయుధ కర్మాగారంలో ఎన్‌సీఓగా పనిచేస్తూ… ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడు. దీంతో పాటుగా పాక్ కేంద్రంగా, పాక్ లో వుంటున్న ఇస్లామిక్ ఉగ్రవాదుల కనుసన్నల్లో నడుస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్‌వర్క్‌తో కూడా సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు.
ఇక… షబీర్ అహ్మద్ వనీ… ఇతను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. హంజీపూరలోని కుల్గాంలో వుంటాడు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి వున్నాడు. నిషేధిత వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లాంలో అత్యంత క్రియాశీలక సభ్యుడు. అంతేకాకుండా రిక్రూట్‌మెంట్‌లో, నెట్‌వర్క్‌ను డెవలప్ చేయడంలోనూ కీలకంగా వుంటున్నాడు. ఇతనిపై అనేక ఎఫ్‌ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి. పోరా ప్రాంతంలో 2016 లో అల్లర్లు జరిగినపుడు, విధ్వంసకర శక్తులను క్రోడీకరించడంలో షబీర్ అహ్మద్ వనీ పాత్ర కీలకంగా వుంది.
ఇక.. అనయతుల్లా షా ఫిర్జాదా… జలశక్తి విభాగంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఇస్లామిక్ ఉగ్రవాదుల అజెండాను అమలు చేయడంలో ఈయన కీలకంగా పనిచేస్తున్నాడని ప్రభుత్వం గుర్తించింది. అల్ బదర్ ముజాహియుద్దీన్ అనే ఉగ్రవాద సంస్థకి చెందిన యూసుఫ్ బలోచ్, తమీమ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలతో నెరుపుతున్నాడు.