Home News జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ (ఫిబ్రవరి 22)

జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ (ఫిబ్రవరి 22)

0
SHARE

ఫిబ్రవరి 22 ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994 లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అవిభాజ్య అంతర్భాగమని, దీనిని దేశం నుంచి వేరుచేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా గట్టిగా, అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది. అంతే కాదు. ఇది జమ్మూ కశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ తీర్మానం చేసినప్పుడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నది బిజెపి. మజ్లిస్ సహా అన్ని పార్టీలూ ఈ తీర్మానాన్ని ఒక్క గొంతుకతో సమర్థించాయి. 

ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి. మొదటిది – జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా ఎన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం.  రండవది భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్ కు ఉంది.  మూడవది – దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్  ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి. నాలుగు – భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.

ఇది చాలా స్పష్టంగా భారత దేశపు జనమానసపు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. జమ్మూ కాశ్ఈర్ ను భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని, ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగిసాధించుకోవడమేనని ఈ తీర్మానం చెబుతుంది.

మనం గుర్తంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన శత్రువు పాకిస్తాన్ 1,20,747 చకిమీ భూభాగాన్ని దురాక్రమించుకుంది. ఇదే ఆక్రమిత జమ్మూ కాశ్మీర్. దీనికి ముజఫరాబాద్ రాజధానిగా ఉంది. ఇది కాక మిగతా భాగం గిల్గిత్ బాల్తిస్తాన్. దీనికి స్కర్డూ రాజధానిగా ఉంది. ఇవి రెండూ అంటే మీర్ పూర్ ముజఫరా బాద్, గిల్గిత్ బాల్తిస్తాన్ లు పాకిస్తాన్ కబ్జాలో ఉన్నాయి. ఇవి కాక 1962 యుద్ధంలో చైనా ఆక్సాయి చిన్ ను ఆక్రమించుకుంది. కాబట్టి ఈ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది పార్లమెంటు ఏకాభిప్రాయంతో చెప్పింది.

* 1994 లో ఉగ్రవాదం పెచ్చరిల్లి ఉన్న పరిస్థితుల్లో , పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేస్తున్న సమయంలో, అమెరికా కూడా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న సమయంలో ఈ తీర్మానం చేయడం ద్వారా భారత దేశం జమ్మూ కాశ్మీర్ విషయంలో తన దృడ సంకల్పాన్ని ప్రపంచానికి తెలియచేసింది. అంతే కాదు. ఈ తీర్మానం ప్రపంచ దేశాలకు భారత్ వైఖరిని తెలియచేసింది.

* ఆ తరువాత జెనీవాలో జరిగిన ఐరాస సమావేశంలో కాశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ ఈ తీర్మానం తరువాత ప్రధాని పీవీ విపక్ష నేత వాజ్ పేయీ నాయకత్వంలో ఒక ప్రతినిధి మండలిని ఈ సదస్సుకు పంపించారు. ఈ ప్రతినిధి వర్గంలో ఫారూఖ్ అబ్దుల్లా కూడా సభ్యులు. ఈ ప్రతినిథివర్గం కశ్మీర్ విషయంలో భారత్ ఏకాభిప్రాయాన్ని ప్రపంచానికి చూపించింది. విపక్ష నేత నాయకత్వంలో అధికార పక్ష నేతలు సభ్యులుగా ఉండటం, ప్రధాని విపక్ష నేతను ఎంచుకోవడం వల్ల భారత్ ఒకే గొంతుతో తన వాణిని వినిపించినట్టయింది. ఐరాస సదస్సులో ఫారూఖ్ అబ్దుల్లా కశ్మీరీ భాషలో ప్రసంగించారు. ఇది పాకిస్తానీ ప్రతినిధులకు అర్థం కాలేదు. అప్పుడు ఫారూఖ్ అబ్దుల్లా కశ్మీరీ భాష అర్థం కాని వారికి కశ్మీర్ సమస్య గురించి మాట్లాడే హక్కు లేదని అనడంతో పాక్ ఖంగుతిన్నది.  ఆ విధంగా పార్లమెంటు తీర్మానం ఒక చారిత్రిక పాత్రను పోషించింది.

ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పదం వాడటం పొరబాటు. దీని వల్ల కేవలం కాశ్మీర్ లోని కొంత భాగం మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఉందన్న తప్పుడు భావన కలుగుతుంది. ఎందుకంటే ఆక్రమణకు గురైన ప్రాంతంలో జమ్మూకు చెందిన మీర్ పూర్, కోట్లీ, భీమ్ బేర్, దేవ్ బటాలాలు ఉన్నాయి. కశ్మీర్ లోయలోని ముజఫరా బాద్, లడ్దాఖ్ ప్రాంతానికి చెందిన స్కర్దూ, గిల్గిత్, బల్తిస్తాన్ లు ఉన్నాయి. కాబట్టి దీనిని ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ అన్న పదాన్నే ఉపయోగించాలని నిర్ణయించింది.

అలాగే కశ్మీర్ అంటే మొత్తం అంతా కశ్మీరీలే ఉన్నారన్న తప్పుడు భావన కలుగుతుంది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ అని అనాలి. ఆ రాష్ట్రంలో లడాఖ్, జమ్మూలు వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక్క కశ్మీర్ లోయ లోని మూడు జిల్లాల్లో మాత్రమే వేర్పాటు వాదం ఉంది. అంటే మొత్తం భూభాగంలో పదిశాతం, మొత్ం జనాభాలో ఇరవై శాతం మాత్రమే వేర్పాటువాదం సమస్యతొ బాధపడుతున్నాయి. జమ్మూ, లడాఖ్ లు ఉగ్రవాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పూంఛ్, రాజౌరీ, కార్గిల్, కిష్త్ వాడ్ ప్రాంతాలు కూడా భారత్ లో ఉండాలనే కోరుకుంటున్నాయి.

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి శరణార్ధులుగా వచ్చిన 12 లక్షల మంది నేటికీ జమ్మూలో నివసిస్తూనే ఉన్నారు.  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లో 24 స్థానాలు ఇప్పటికీ ఖాళీగా ఉంటున్నాయి. ఇవి మీర్ పూర్, ముజఫరాబాద్, గిల్గిత్, బల్తిస్థాన్ లకు చెందినవి. ఈ ప్రాంతాలనుంచి శరణార్థులుగా వచ్చిన వారికి, వారి సంతతికి ఆ ఖాళీ స్థానాలకు ఓటు వేసి, ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించాలి.  ఈ విధంగా ఆ ప్రాంతాలపై మనకున్న హక్కును మనం చాటుకున్నట్టవుతుంది. ఇప్పుడు పాక్ ఆక్రమణలో లేకుండా స్వతంత్ర భారతంలో ఉన్న జమ్మూకాశ్మీర్ లో 87 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. 24 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.

‘ వీరే కాక 1990 లో నాలుగు లక్షల మంది కాశ్మీరీ పండితులు శరణార్థులుగా వచ్చారు. వీరు జమ్మూలో, మిగతా భారతదేశంలో ఉంటున్నారు. కానీ వీరికి కాశ్మీరు లోయలోని తమ తమ నియోజకవర్గాల్లో ఓటువేసే హక్కుంది. కానీ వీరిని ఓటర్లుగా నమోదు చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.  కాబట్టి వీరు కూడా తమ ప్రజాస్వామ్యబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.

* అదే విధంగా పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ లోకి శరణార్ధులుగా వచ్చిన 5764 కుటుంబాల వారు ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మంది అయ్యారు. వారిని 70 ఏళ్ల తరువాత కూడా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులుగా పరిగణిస్తున్నారు. వారికి లోకసభలో ఓటు హక్కుంది. కానీ అసెంబ్లీకి వారు ఓటువేయలేరు. బహుశః ఇలాంటి పరిస్థితి కేవలం మన దేశంలోనే ఉంది. వీరికి కూడా అసెంబ్లీలో ఓటు హక్కు కల్పించడం ద్వారా మన దృఢ సంకల్పాన్ని తెలియచేసినట్టవుతుంది.

* ప్రస్తుతం పాక్ దురాక్రమణలో ఉన్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ను గట్టిగా వ్యతిరకిస్తున్నారు. వారు బలవరిస్తాన్ ఉద్యమం పేరిట స్వతంత్రపోరాటాన్ని చేస్తున్నారు. గిల్గిత్ బల్తిస్తాన్ నివాసులకు కనీస ఓటు హక్కులు లేవు. అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు. ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధీ లేవు. వారు స్థానిక భాషలో చదువుకోలేదు. గిల్గిత్ రాజధానిలో గిల్గితీ భాషలో బల్తస్తాన్ లో బల్తీ భాషలో సైన్ బోర్డులు కూడా ఉండవు. పూర్తిగా పాక్ సైన్యం ఆజమాయిషీ ఉంటుంది. అక్కడి ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే పరిస్థితి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోనూ ఉంది. కాబట్టి వీటిని విముక్తం చేయడం మన కర్తవ్యం. ఇంత వరకూ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనికోసం ప్రజా చైతన్యం నిర్మాణం చేయడం అవసరం. మోదీ ప్రభుత్వం ఆక్రమిత జమ్మూ కశ్మీర్ వంటి పదాలను ఉపయోగించడం ద్వారా తన సంకల్పం ఋజువు చేసుకుంటోంది.

* జమ్మూ కశ్మర్ విషయంలో కార్గిల్ విజయాన్ని సాధించిన రోజును విజయ్ దివస్ గా, జమ్మూకాశ్మీర్ మహారాజు భారత్ లో విలీనం చేస్తూ సంతకం చేసిన రోజును (అక్టోబర్ 26) ను విలీన దినంగా, ఫిబ్రవరి 22 సంకల్పదివస్, కశ్మీర్ నుంచి కశ్మీరీ హిందువులు పారిపోయిన రోజును నిశ్కాషన్ దివస్ గా, మహరాజా హరిసింగ్ జన్మదినాన్ని జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్ నిర్వహిస్తుంది.