– డా. శ్రీరంగ్ గోడ్బోలే
మొదటి భాగం
జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం. అయితే అంతకు మునుపు 1930 నుండే ఈ రోజు అంటే ‘ జనవరి 26 ‘న ‘ స్వాతంత్ర్య దినోత్సవం ‘ గా జరుపుకోవడం ప్రారంభమైంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనవరి 26ని, ఉత్సవంగా లేక పర్వంగా జరుపుకోదనే ఒక అపోహ, లేక ఆరోపణ ఉంది. 1930 లో ఈ రోజు (26 జనవరి) సంపూర్ణ స్వాతంత్ర్య దినంగా మొట్టమొదట జరుపుకున్నారు. ఆ సమయంలో సంఘ్ ఇంకా తన శైశవ దశలో ఉంది. ఆ సమయంలో సంఘం ఈ రోజును ఎలా జరుపుకునేది అన్నది మనకు తెలియాల్సిన విషయం. అంతేకాదు 1950 లో మొదటి ” గణతంత్ర ” దినాన్ని సంఘం ఎలా జరుపుకుంది అనేది కూడా మనకు(సమాజానికి) తెలియాలి. అందుకే ఈ వ్యాసం. సంఘ్ అభిలేఖాగారంలో లభ్యమైన పత్రాలు, ‘ కేసరి ‘ పత్రిక ప్రతులు (కేసరి మరాఠా ట్రస్ట్ , పూణే ) ఈ వ్యాసానికి ఆధారం. అసలు ముందుగా 26 జనవరి 26ను ఎందుకు గణతంత్ర దినంగా ఎంచుకున్నారో చూద్దాం.
గణతంత్ర రాజ్యం పుట్టుక
1947, జులై 18న భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం అఖండ భారతాన్ని రెండుగా విభజించారు. ఆ విభజన మూలంగా ‘ డొమీనియన్ అఫ్ ఇండియా”, ” డొమీనియన్ అఫ్ పాకిస్తాన్ ” అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి . 1947, ఆగస్టు 15న స్వతంత్రమైన భారత్ పరిపాలనా పగ్గాలు” ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్” నుండి రాజ్యాంగ సభ తీసుకుంది. ఆ రాజ్యాంగ సభ 1949, నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే ఇక రాజ్యాంగ అమలు ఎప్పటినుండి చేయాలన్నది ప్రశ్న. 1950 జనవరిలో ఏ రోజునైనా సరైనదేనని అందరూ భావించారు . కానీ జనవరి 1 ని ఎంచుకుంటే అది ఆంగ్లేయులను అనుకరించినట్టు అవుతుంది. 31 తేదీ మహాత్మాగాంధీ చనిపోయిన రోజు కాబట్టి పనికిరాదు. కాబట్టి మధ్యలో ఏదైనా తేదీని ఎంచుకోవాలని అనుకున్నారు. 1930లో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసిన జనవరి 26 ఇందుకు సరిపోతుందని అంతా భావించారు(కేసరి పత్రిక , 27 జనవరి 1950). జనవరి 26 “పూర్ణ స్వరాజ్ దిన్” గా జరుపుకోవాలని 1930, జనవరి 2న జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతవహించిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశాలలో నిర్ణయించారు. అలా 1930నాటికిగాని కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య తీర్మానం చేయలేకపోయింది. అప్పటివరకూ కనీసం యాభై సంవత్సరాలపాటు విప్లవవీరులు, వారి కుటుంబాలు ఇదే ధ్యేయాన్ని తమ ముందు ఉంచుకుని నరకయాతనలు అనుభవించారు, ప్రాణాలు అర్పించారు, జైళ్ళపాలయ్యారు. చివరికి కాంగ్రెస్ కు, ముఖ్యంగా నెహ్రూకు ముఖ్యమైన జనవరి 26ను నూతన రాజ్యాంగ అమలుకు సరైన రోజుగా నిర్ణయించారు.
నూతన ప్రజాతంత్రాన్ని ఎవరెవరు ఎలా స్వాగతించారో చూద్దాం !
1950 జనవరి 26, 27 తేదీలను ఆనందోత్సాహాలతో కూడుకున్న జాతీయ వేడుకగా జరుపుకోవాలని ప్రకటించారు. ఆనాడు రాజకీయరంగంలో తమకున్న ఆధిక్యత మూలంగా కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గాంధీజీ హత్యోదంతాన్ని అడ్డుపెట్టుకుని హిందూ సంస్థలైన హిందూమహాసభ, సంఘ్ లను అణచివేయాలని నెహ్రూ ప్రయత్నించారు. జాతీయకార్యంలో ఈ సంస్థలకు ఎలాంటి పాత్ర లేదన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. గాంధీజీ హత్య కేసులో హిందూమహాసభ నాయకుడు వినాయక దామోదర సావర్కర్ ను జైలుకు పంపినా ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సంవత్సరం లోపే విడుదల చేసింది నెహ్రూ ప్రభుత్వం. కానీ స్వాతంత్ర్య వీర సావర్కర్ మాత్రం ” మాతృభూమిపట్ల అకుంఠితమైన, సంపూర్ణమైన భక్తి కలిగినవారెవరైనా బ్రిటిష్ బానిసత్వ సంకెళ్ళ నుండి దేశం విముక్తమైన ఈ రోజును వేడుకగానే భావిస్తారు. సంకుచితమైన ప్రాంతీయ, వ్యక్తిగత, పార్టీపరమైన విభేదాలను పక్కనపెట్టి ఈ దేశపు విజయగాధను ముక్తకంఠంతో ప్రపంచానికి చాటాలి’’ అంటూ తన ఆకాంక్షను వ్యక్తపరచారు (బాంబే క్రానికల్, 5 ఏప్రిల్, 1950). గాంధీ హత్య తరువాత నెహ్రూ వల్ల వచ్చిన అపోహలు, ఆరోపణల అగ్నిగుండం నుండి బయటపడి అప్పటికి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అయినా దేశసేవకు తాను ఎప్పుడూ సిద్ధమేనంటూ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కు లేఖ వ్రాసారు.
స్వాతంత్ర్యం కొరకు అందమానులో యాతనలు అనుభవించిన, తరువాత హిందూ మహాసభ ఉపాధ్యక్షులుగా పనిచేసిన అశుతోష్ లాహిరీ 26,27లలో జరిగే నూతన గణతంత్ర వేడుకలలో హిందూ మహాసభ సభ్యులందరూ పాల్గొనడమే కాక , ఉత్సవానికి తగు సహాయ సహకారాలను అందించాలనే ఆదేశించారు. నూతన రాజ్యాంగం లో లోటుపాట్లు ఉన్నప్పటికీ అది చాలా విశేషమైనది , ముఖ్యమైనది” అని అన్నారు (కేసరి , 24 , జనవరి 1950) . ఆ తరువాత 1950 జనవరి 27 న ముంబైలో జరిగిన అ.భా . హిందూ మహాసభ కార్యనిర్వాహకవర్గ సమావేశాలలో భారత గణతంత్రానికి స్వాగతం పలుకుతూ చేసిన ప్రస్తావన చేశారు (కేసరి , 31 జనవరి 1950).
నూతన గణతంత్ర ఆవిర్భావం కొందరికి మాత్రం అసంతృప్తిని కలిగించింది. జనవరి 26 న ముంబైలోని కాలాచౌకీలో కమ్యూనిస్టులు నల్ల జెండాలతో నిరసన ఊరేగింపు తీయబోయారు . సామాన్య ప్రజలకు కమ్యూనిస్టు లకి మధ్య ఘర్షణ జరిగింది . పోలీసులు కమ్యూనిస్టులను వెనక్కి పోవాలని హెచ్చరించినప్పుడు వాళ్ళు ఆసిడ్ బాంబులు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు . అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు . దాదాపుగా 55 మంది కమ్యూనిస్టు కార్యకర్తలను అరెస్ట్ చేశారు (కేసరీ , 27 జనవరి 1950). అదే సమయంలో ముంబైలోని కొలాబాలో జరిగిన జెండావందన కార్యక్రమానికి వచ్చిన కమ్యూనిస్టులు నల్ల జెండాలు ఎగరవేయాలని పట్టుపట్టారు . దాంతో అక్కడ ఘర్షణ జరిగింది (కేసరి , 31 జనవరి 1950) . ” ఫార్వర్డ్ బ్లాక్, రైతు కార్మికుల పార్టీ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేసినట్టు వార్తలు వచ్చాయి. బొంబాయి, కలకత్తా వంటి నగరాల్లో కూడా వేడుకలను అడ్డుకోవాలని కమ్యూనిస్టులు ప్రయత్నించారు’’అని కేసరి పత్రిక వ్రాసింది (కేసరి, 3 ఫిబ్రవరి 1950).
కామఠీ(సెంట్రల్ ప్రావిన్స్)లో గణతంత్ర వేడుక సందర్భంగా జరిగిన ఊరేగింపులో బ్యాండ్ వాదనను వ్యతిరేకిస్తూ అక్కడ ఒక మసీదు ముందర ఊరేగింపును అడ్డుకున్నారు. రాజేంద్రప్రసాద్ చిత్రపటంపై రాళ్ళు రువ్వారు. బ్యాండు ఆపిన తరువాతనే ఊరేగింపును ముందుకు వెళ్లనిచ్చారు. ఊరేగింపు పూర్తిచేసుకుని తిరిగి వస్తున్న వారిపై కొందరు హైందవేతరులు కర్రలతో దాడి చేశారు. కానీ అక్కడే సాయుధబలగాలు ఉండడంతో పెద్ద ఘర్షణ తప్పింది(కేసరి , 6 ఫిబ్రవరి 1950 ).
“26 జనవరి ఉదయాన్నే కాంగ్రెసు సేవాదళ్, బాలవీర పథక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదలైన సంస్థల స్వయంసేవకుల ప్రభాత ఫేరీలు పూనా నగరంలో జరగనున్నాయి . ఇవన్నీ ఆ తరువాత శనివార్ వాడా ముందరున్న మైదానంలో కలుస్తాయి. అక్కడ కమీషనర్ జాతీయ జెండాను ఎగరవేస్తారు’’ అని కేసరి పత్రిక ప్రచురించింది (కేసరి, 24 జనవరి 1950). రెండురోజుల ఉత్సవాలలో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు కూడా అంతా ఉత్సాహంగానే పాల్గొన్నారని కేసరి పత్రిక వ్రాసింది(కేసరి , 27 జనవరి 1950 ). సంఘ్ కార్యక్రమాన్ని గురించి పేర్కొంటూ జనవరి 26న ముంబై చౌపాటీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా ధ్వజవందన కార్యక్రమం జరిగింది . అందులో కనిపించిన క్రమశిక్షణ, ఉత్సాహం సైన్యం, పోలీసు దళాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఉన్నాయి (కేసరి, 31 జనవరి 1950).
జలంధర్, గుర్దాస్ పూర్, ఖరద్, బిల్వారా, అంబాలా, రోతక్, ఇండోర్ లలో సంఘ్ ఆద్వర్యంలో జరిగిన మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వివరాలు పూర్తిగా లభిస్తున్నాయి. ఇండోర్ లో జనవరి 26న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటయింది. అనేకమంది భిక్షగాళ్లకు(వారిలో మహిళలు కూడా ఉన్నారు) స్వయంసేవకులు గౌరవప్రదంగా ఆహారం అందించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇండోర్ సంఘ్ కార్యదర్శి పండిత్ రామ్ నారాయణ్ శాస్త్రి (వీరు ఆ తరువాత మధ్యభారతపు సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు)ఇలా అన్నారు – “మీ (బిచ్చగాళ్ల) స్థితిగతులు సాధ్యమైనంత త్వరగా మారాలని, మెరుగుపడాలని మేము కోరుకుంటున్నాము. ఈ దేశంలో ఏ ఒక్కరూ కూడా తిండికి, బట్టకు అల్లాడని రోజు సుదినం రావాలని కోరుకుంటున్నాము. మీరే మరొకరికి తిండి పెట్టగలిగిన స్థితికి రావాలి. మీరు బిచ్చమెట్టుకుంటున్నామని, దిగజారిపోయామని కించపడకండి. ఈ దేశపు గౌరవనీయులైన పౌరులని, మహారాజులని భావించండి’’(ఆకాశవాణి వారపత్రిక, జలంధర్, 5 ఫిబ్రవరి, 1950).
సంపూర్ణ స్వాతంత్ర్యం వైపు కాంగ్రెస్ గతుకుల ప్రయాణం
1927 డిసెంబర్ 27న మద్రాసులో జరిగిన కాంగ్రెసు సమ్మేళనాలలో అ.భా. కాంగ్రెసు కార్యదర్శిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం“సంపూర్ణ జాతీయ స్వాతంత్ర్యమే భారతీయులందరి లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటిస్తున్నది’’ అని పేర్కొంది(1927 మద్రాసు కాంగ్రెసు సమావేశాల నివేదిక, స్వాగత సమితి ,మద్రాసు, పేజీ 15 ). స్వాతంత్ర్యం, విదేశీ వస్తు బహిష్కరణ తీర్మానాలు గాంధీ గారికి నచ్చలేదు (డీ . జీ . టెండుల్కర్: మహాత్మా : లైఫ్ ఆఫ్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ , విఠ్ఠల్ భాయి కే . ఝవేరీ , డి.జీ. టెండుల్కర్, ముంబై , 1951 , రెండవ సంపుటం , పేజీ .402 , 429 – 430). అప్పటి వరకు “వలసవాద స్వపరిపాలనే కాంగ్రెసు ధ్యేయం” గా ఉండేది. “వీలున్నంత వరకు వలస సామ్రాజ్యంలో భాగంగా, అవసరమైనప్పుడు మాత్రమే (సామ్రాజ్యం) బయట” అనే గాంధీ గారి మాటలను ఉటంకిస్తూ కాంగ్రెసు అధ్యక్షుడు డా. ముఖ్తార్ అహ్మద్ అన్సారీ కాంగ్రెసు ధ్యేయాన్ని స్పష్టం చేశారు (మద్రాసు కాంగ్రెసు నివేదిక, అనుబంధం 1 , పేజీ 3 )
29 డిసెంబర్ 1928 నుండి 1 జనవరి 1929 వరకు కలకత్తాలో జరిగిన కాంగ్రెసు సమ్మేళనాలలో, కాంగ్రెసు ధ్యేయం ఏమిటనే విషయంపై అభిప్రాయభేదాలు వచ్చాయి. ఒకవైపు శ్రీనివాస అయ్యంగార్ , జవహర్ లాల్ నెహ్రూ , సుభాష్ చంద్రబోస్ , తదితరులు సంపూర్ణ స్వరాజ్యం కోరుకోగా , మరోపక్క గాంధీజీ , అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ వంటివారు సంస్థానాల హోదా ( డొమీనియన్ స్టేట్స్) సరిపోతుందన్నారు. ఇదే భావన ఆధారంగా పండిత్ మోతీలాల్ నెహ్రూ సర్వపక్ష సమితి తరపున భారత భవిష్య రాజ్యాంగ నివేదికను తయారు చేసారు. తాను తయారు చేసిన నివేదికకి ఏకగ్రీవ ఆమోదం లభించకపోతే కాంగ్రెసు అధ్యక్ష బాధ్యత అంగీకరించనని ఆయన ముందుగానే స్పష్టంచేశారు. కాంగ్రెసులో రెండు వర్గాలు ఏర్పడకుండా ఉంచడానికి గాంధీ గారు ఒక మధ్యేమార్గం సూచించారు. గాంధీగారు “బ్రిటిష్ పార్లమెంట్ 31 డిసెంబర్ 1929 నాడు లేక అంతకంటేలోపు రాజ్యాంగ ప్రస్తావనను అంగీకరించకపోతే కాంగ్రెసు అహింసాత్మక, సహాయనిరాకరణ ఉద్యమాన్నిచేస్తుంది …” అని అన్నారు(టెండుల్కర్, పేజీ 439 , 440)
గాంధీ గారిచ్చిన గడువు తీరే లోపలే 31 అక్టోబరు 1929 న వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, సంస్థాన హోదాను సంపాదించడమే భారత్ రాజ్యాంగ నిర్మాణానికి సహజమైన మొదటి అంశం అంటూ ప్రకటించాడు. అయినా 23 డిసెంబర్ 23న తనను కలవడానికి వచ్చిన గాంధీ , మోతీలాల్ నెహ్రూ , జిన్నా తదితరులతో డొమీనియన్ స్టేట్స్ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశాడు . దీనితో ఇక వేరే మార్గంలేక గాంధీజీ కూడా పూర్ణ స్వాతంత్ర్య పక్షం వహించారు . ఇప్పుడు దేశం యావత్తూ సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు పోరాడసాగింది . సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదించిన జవహర్ లాల్ 25 నుండి 31 డిసెంబర్ 1929 లో లాహోర్ కాంగ్రెసు సమావేశాలకి అధ్యక్షత వహించబోతున్న కారణంగా ఈ భావన మరింత బలం పుంజుకుంది . (ఆర్.సి.మజూందార్ , హిస్టరీ అఫ్ ది ఫ్రీడమ్ మూవ్ మెంట్ ఇన్ ఇండియా , ఫర్మా కె.ఎల్.ముఖోపాధ్యాయ , కలకత్తా, మూడవ సంపుటం, 322-325 పేజీలు) .
దానితో కాంగ్రెస్ రాజ్యాంగం మొదటి అధికరణలోని `స్వరాజ్య’ అనే పదానికి అర్ధం `సంపూర్ణ స్వాతంత్ర్యం’ గానే ఇకనుండి పరిగణించాలని లాహోర్ సమావేశాల్లో గాంధీజీ ప్రకటించారు. మోతీలాల్ నెహ్రూ కమిటీ నివేదిక రద్దయ్యిందని, ఇక పూర్ణ స్వాతంత్ర్యం కోసమే కాంగ్రెస్ కార్యకర్తలు తమ యావత్ శక్తిని ఒడ్డాలని స్పష్టంచేశారు. కేంద్రీయ , ప్రాంతీయ నియొజక వర్గాల , ప్రభుత్వ సమితుల బహిష్కరణ , పన్నులు చెల్లించకపోవడంతోపాటు , సవినయంగా చట్టనిరాకరణను కూడా గాంధీజీ ఈ ప్రకటనలో పేర్కోన్నారు . (44వ వార్షిక సమావేశాలు,లాహోర్ కాంగ్రెసు నివేదిక, 88పేజి) .
సంపూర్ణ స్వాతంత్ర్య సాధన లక్ష్యాన్ని ప్రజలముందు ఉంచడం కోసం జనవరి 26న దేశవ్యాప్తంగా”పూర్ణ స్వరాజ్ దిన్” జరుపుకోవాలని 1930 జనవరి 2న కాంగ్రెసు కార్యనిర్వహణ సమితి నిర్ణయించింది. “బ్రిటీష్ ప్రభుత్వం భారతీయుల స్వాతంత్ర్యాన్ని లాక్కుని, వారిని దోచుకుని, ఆర్థిక , రాజకీయ , సాంస్కృతిక , ఆధ్యాత్మిక రంగాలను భ్రష్టు పట్టించింది. కాబట్టి భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తమై, సంపూర్ణ స్వాతంత్ర్యం పొందాలని మా నిర్ణయం” అంటూ గాంధీగారు తయారుచేసిన మ్యానిఫెస్టోను కాంగ్రేసు కార్యనిర్వహణ సమితి ఆమోదించింది. దీనినే ప్రతి గ్రామంలో చదివి వినిపించి, ప్రజల సహకారాన్ని పొందాలని నిర్ణయించింది ( మజూందార్ 331 వ పేజీ).
సశేషం..
మరాఠీ మూలం
అనువాదం – పరిమళ నడింపల్లి.