– డా. శ్రీరంగ్ గోడ్బోలే
రెండవ భాగం
సంఘ్ స్థాపకులు డా. కేశవబలీరాం హెడ్గేవార్ జన్మజాత దేశభక్తులు. ఊహ తెలిసినప్పటి నుండి దేశ సంపూర్ణ స్వాతంత్ర్యాన్నే కాంక్షించేవారు . విప్లవకార్యక్రమాలలో పాల్గొని, హిందూ మహాసభ , కాంగ్రెస్ తదితర సంస్థల్లో పనిచేసిన ఆయన చివరికి హిందూఐక్యత ద్వారా రాష్ట్ర కార్యం అనే ధ్యేయంతో 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్థాపించారు. తాను కోరుకున్నట్టుగానే కాంగ్రెసు కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం ధ్యేయంగా పెట్టుకున్నందుకు వారు చాలా సంతోషించారు. అయితే స్వయంసేవకులు సంఘ్ కార్యకర్తలుగా కాకుండా వ్యక్తిగత హోదాలోనే దేశ స్వాతంత్య్ర కార్యంలో పాల్గొనాలని వారి భావించారు. దీనివల్లనే అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నా, సంఘ్ పేరుతో నేరుగా ఉద్యమాలు జరగలేదు. అయితే కాంగ్రెసు తీసుకున్న సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నిర్ణయం వారికి ఎంత ఆనందాన్ని కలిగించిందంటే , తన నిర్ణయానికి వ్యతిరేకంగా శాఖలలో ఈ నిర్ణయానికి స్వాగతం పలకాలని సూచన చేసారు .
1930, జనవరి 21న డా. హెడ్గేవార్ స్వయంసేవకులకు ఒక సూచనా పత్రకం పంపారు . అందులో “ఈసారి కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యమని నిర్ణయించి 26 జనవరి ఆదివారం నాడు దేశం యావత్తూ స్వాతంత్ర్య దినంగా జరుపుకోవాలని సూచించింది . ఒక జాతీయస్థాయి సంస్థ ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోవడం మనందరికి ఆనందకరమైన విషయం. స్వాతంత్ర్యం ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న ఏ సంస్థకైనా సహకారం అందించటం మన కర్తవ్యం కాబట్టి అన్ని శాఖలలో జనవరి 26 సాయంత్రం 6 గంటలకి స్వయంసేవకులు అందరూ సమావేశమై భగవాధ్వజానికి వందన చేయాలి. ఆ కార్యక్రమంలో స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ప్రతి హిందువు తన ముందు స్వాతంత్ర్యాన్నే ధ్యేయంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అనే విషయాల గురించి ప్రస్తావించాలి . స్వాతంత్ర్యం ధ్యేయంగా ఎంచుకున్నందుకు కాంగ్రెస్ కు అభినందనలు కూడా చెప్పాలి” అని పేర్కొన్నారు (సంఘ అభిలేఖాగారం , హెడ్గేవార్ , రచనలు, A patrak by Dr hedgewar to the swayamsevaks – 21 Jan 1930 ). క్రమబద్ధమైన పద్ధతిలో పనిచేయటం అలవాటు ఉన్న డాక్టర్జీ `కార్యక్రమం వివరాలు వెంటనే మాకు పంపగలరు’ అని సూచించడం వల్ల ఆ సమయంలో వివిధ శాఖలలో చేసిన ఉత్సవాల వివరాలు నమోదయ్యాయి. ఆ కాలంలో సంఘం పని నాగపూర్ , వార్ధా , చాందా (చంద్రపూర్) , భాండారా మరాఠీ మధ్య ప్రాంతాలలో ఎక్కువగా ఉండేది. అమరావతి , బుల్ఢాణ , అకోలా , యవత్ మాళ్ , మొదలైన వర్హాడ్ ప్రాంతాలలో పని తక్కువగా ఉండేదనే విషయం మనం గుర్తించాలి.
డా. హెడ్గేవార్ ఆదేశం ప్రకారం 1930, జనవరి 26న పలుచోట్ల శాఖలలో కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి సమ్మతి తెలిపారు. నాగపూర్ సంఘస్థాన్ లో ఉదయం 6 గం. నుండి 7.30 వరకు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం జరిగింది. న్యాయవాది విశ్వనాథరావ్ కేళకర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణరావు వైద్య ప్రధాన ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో డాక్తర్జీతో పాటు డా. పరాంజపే , నవాథే , భండారా సంఘచాలకులు న్యాయవాది దేవ్ , సాకోలీ సంఘచాలకులు న్యాయవాది పాటక్ , సావనేర్ సంఘచాలకులు ఆంబోకర్ తదితరులు ఉన్నారు.
చాందా(నేటి చంద్రపూర్)లో జరిగిన కార్యక్రమం
చాందాలో జరిగిన కార్యక్రమ వివరాలు చూద్దాం (సంఘ అభిలేఖాగారం హెడ్గేవార్ రాతలు,registers/ register 3 DSC _ 0044 , DSC _ 0045) – 1930, జనవరి 29న చాందా కార్యవాహ రామచంద్ర రాజేశ్వర్ (తాత్యాజీ దేశ్ ముఖ్) డాక్టర్జీకి వ్రాసిన ఉత్తరంలో “ఇక్కడి శాఖలో జనవరి 26న కార్యక్రమం చేయాలని ముందుగానే అనుకున్నాం. ఇంతలో మీ ఉత్తరం వచ్చింది. ఆ ప్రకారమే స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది . 1. తాలూకా కాంగ్రెసు సెక్రేటరీ కోరిక ప్రకారం ఆ రోజు ఉదయం 8.45 ని. శాఖాస్థానం నుండి బయలుదేరి గాంధీ చౌక్ వరకు కవాతు జరిగింది. అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేసి స్వయంసేవకులు దానికి ప్రణామ్ చేసారు . ఆ తరువాత స్వయంసేవకులు శాఖా స్థానానికి తిరిగి వచ్చి అక్కడ భగవాధ్వజానికి ప్రణామ్ చేయడంతో కార్యక్రమం ముగిసింది . 2. సాయంకాలం జరిగే ఊరేగింపులో పాల్గొనటానికి అలాగే ఆ తరువాత సభా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కాంగ్రెసు నుండి ఆహ్వానం వచ్చింది. కాని సంఘ కార్యక్రమం ముందుగానే నిర్ణయించినందువల్ల ఆ కార్యక్రమానికి హాజరుకావడం కుదరదని సంఘ కార్యవాహ తాలూకా కాంగ్రెస్ సెక్రటరీకి తెలిపారు. 3. సాయంత్రం 4.30 ని సంఘ్ స్వంత స్థలంలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కేశవరావు బోడకే గారి ఆధ్వర్యంలో శస్త్ర విన్యాసం , దండ ప్రదర్శన (కర్రసాము), మిలటరి డ్రిల్లు ప్రదర్శన జరిగాయి . ఆ తరువాత కార్యవాహ దేశముఖ్ వకీల్ విషయప్రస్తావన చేశారు. భాగవత్ వకీలు(“భాగవత్ వకీలు” అంటే న్యాయవాది నారాయణ పాండురంగ నానాసాహెబ్ భాగవత్. వీరు ప్రస్తుత సర్ సంఘచాలకులైన డా. మోహన్ భాగవత్ గారి తాతగారు) కాంగ్రెస్ తీర్మానం గురించి క్లుప్తంగా, అందమైన రీతిలో మాట్లాడి తన సమ్మతిని తెలిపారు. అనుశాసనం, వ్యవస్థ , నిష్ఠ అనేవి యువతరం మనస్సులో నాటుకున్నప్పుడే స్వాతంత్ర్యానికి విలువ ఉంటుందని, సంఘం ఈ పని ముందునుండి చేస్తోందని అన్నారు . కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం గురించి మాట్లాడుతూ కాంగ్రెసు ఏవిధంగా విన్నపం, యాచన, సంస్థాన హోదా సాధించడం వంటి ప్రయత్నాలు చేస్తూ చివరికి సంపూర్ణ స్వాతంత్ర్యం అనే ధ్యేయానికి ఎలా చేరుకుందో దేశముఖ్ సంక్షిప్తంగా వివరించారు. `కాంగ్రెస్ లో సంపూర్ణ స్వరాజ్యం గురించి చర్చ జరగడానికి ముందే సంఘం ‘ స్వాతంత్ర్యం ‘ అనే భావనతో పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి కాంగ్రెస్ చేసిన ఈ ప్రస్తావన వల్ల సంఘానికి ఎలాంటి ఆశ్చర్యం కలగటం లేదు . కానీ జాతీయస్థాయిలో పనిచేస్తున్న సంస్థ సంఘం పెట్టుకున్న ధ్యేయం వైపు మళ్ళడం సహజంగా సంతోషాన్ని కలిగించే విషయమే కాబట్టి ఆ సంస్థకి అభినందనలు చెబుతోంది’ అని అన్నారు. అధ్యక్ష ప్రసంగం ముగిసాక సరిగ్గా 6 గం. సంఘ ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది. ఇందులో 110 మంది స్వయంసేవకులు ఉన్నారు . ” రా.స్వ.సం . జాతీయ సభ , సంఘం ధ్యేయంగా పెట్టుకున్న బిందువు వద్ద వచ్చిచేరినందుకు గాను దాన్ని అభినందిస్తోంది . సంఘ కార్యానికి , ధ్యేయానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా, జాతీయ సంస్థకి సంఘం సహకారం అందిస్తుంది” అని ప్రకటన చేశారు.
అనువాదం – పరిమళ నడింపల్లి
జనవరి 26 – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (మొదటి భాగం)