-ప్రదక్షిణ
26 జనవరి గణతంత్ర దినోత్సవంగా మనకి చిరపరిచితం. 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ /గణతంత్రంగా అవతరించింది. అప్పటికి దేశ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ పూర్తి అయింది, ఆ తరువాతి సంవత్సరం 1951 చివరి నెలల్లో దేశంలో మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
అయితే 1950 జనవరి 26న దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావిస్తే అది అతిశయోక్తి కాదు. భారత ప్రజలు 75సంవత్సరాలుగా 1947 ఆగస్ట్ 15న దేశ స్వాతంత్య్రం సిద్ధిoచిందనే అభిప్రాయంలో ఉన్నారు, ఎందుకంటే మనకి మన ప్రభుత్వం 1947నుంచి అదే చెప్తూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఎన్నో విచిత్రమైన నిజాలు బయటపడుతున్నాయి.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ మౌంట్బాటెన్ ఆధ్వర్యంలోని బ్రిటిష్-ఇండియా ప్రభుత్వం, 1947 జూన్ 3న , ముస్లిం లీగ్ `ద్విజాతి సిద్ధాంతo’ ఆధారంగా, కాంగ్రెస్ పూర్తి అంగీకారంతో, అఖండ భారత విభజన, దేశ స్వాతంత్య్రం నిర్ణయం తీసుకుంది. అంటే కేవలం రెండు నెలల ముందు హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. అదే రోజు బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఈ ప్రకటన చేసారు. దీనినే `మౌంట్బాటెన్ ప్లాన్’ అని పేర్కొంటారు. అప్పటికి ఏయే ప్రదేశాలు, రెండు దేశాలలో దేనికి చెందుతాయి అనే కనీస స్పష్టత కూడా లేని సమయంలో `బౌండరీ కమిషన్’( సరిహద్దు కమిషన్) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం, పంజాబ్, బెంగాల్ ప్రదేశాల విధాన సభలు విభజనపై తీర్మానాలు చేస్తాయని, సింధు, బలూచిస్తాన్ ప్రాంతాలు తమ నిర్ణయాలు తామే స్వయంగా తీసుకోవచ్చని, 15 ఆగస్ట్ కల్లా స్వతంత్ర భారతదేశం ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చింది. కేవలం పది రోజులలోపే, 1947 జూన్ 14న కాంగ్రెస్ ఈ `మౌంట్బాటెన్ ప్లాన్’ కి, అంటే దేశ విభజనకి ఆమోదం తెలిపింది.
ఈ వార్త విన్న దేశ ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ, తూర్పు భారత్ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఆ ప్రాంతాల హిందువులకి ఎవరి దగ్గిరకి వెళ్లి మొరపెట్టుకొవాలో తెలియలేదు. జిన్నా `ప్రత్యక్ష చర్య’(డైరెక్ట్ యాక్షన్) కారణంగా అప్పటికే హిందువుల ఊచకోతలు, మహిళలపై అత్యాచారాలు యదేచ్చగా జరుగుతున్నాయి. వారు వేలయేళ్ళుగా తమ పూర్వీకులున్న స్థలాలు, భూములు, ఇళ్ళు, ఆస్తులు, వ్యాపారాలు వదులుకుని, ఆ ప్రాంతాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ వైపు పారిపోయివచ్చారు. ఢిల్లీ ఎముకలు కొరికే చలిలో లక్షలాదిమంది శరణార్థులు, వసతి లేక, తిండి నీరు లేక రోడ్లమీద కాలం గడిపారు. కనీసం 15లక్షల మంది ఆ కాలంలో, కొద్ది నెలల కాలంలో హత్య చేయబడ్డారని అంచనా. అప్పటి మూకుమ్మడి హత్యలు, అత్యాచారాలను ఈనాడు మనం `హిందూ నరసంహారం’ (హిందూ జినోసైడ్) గా పేర్కొంటున్నాము.
అటువంటి సమయంలో, దాదాపు 560 భారత సంస్థానాలు 1947 ఆగస్ట్ 15లోపే భారత దేశంలో అధికారికంగా విలీనం అయాయంటే, అప్పటి మధ్యంతర(ఇంటరిమ్) భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్, ఇంత అల్లకల్లోల, సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఒక్కటి చేయడానికి ఎంత వేగంగా, ప్రతిభావంతంగా, చాకచక్యంగా పనిచేసి ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు. జమ్మూ- కాశ్మీర్, హైదరాబాద్, జునాగడ్, భోపాల్ మినహా భారత భూభాగంలోని అన్ని సంస్థానాలు భారతరాజ్యంలో విలీనమయ్యాయి.
అధీకృత దేశాలు
‘మౌంట్బాటెన్ ప్లాన్’ ఆధారంగా, 1947 జులై 15న బ్రిటిష్ పార్లమెంట్ `ఇండియన్ ఇండిపెండెన్స్ ఆక్ట్( భారత స్వాతంత్ర్య చట్టం) ఆమోదించింది. దీంట్లో రాబోయే స్వతంత్ర భారత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అఫ్ పవర్ (అధికార బదలాయింపు)కి సంబంధించిన కీలకమైన అంశాలు కొన్ని జొప్పించింది. ఆ ప్రకారంగా 1947 ఆగస్ట్ 15లోపు బ్రిటిష్ రాజు, ప్రభుత్వ సార్వభౌమాధికారం, ఆధిపత్యం కింద, భారతదేశం- పాకిస్తాన్ అనే రెండు `డొమినియన్’లు ఏర్పాటవుతాయని, రెండు అధీకృత దేశాలకి వేర్వేరుగా `గవర్నర్-జనరల్స్’ ఉంటారని, రెండు `డొమినియన్ లెజిస్లేచర్లు’, అనగా పార్లమెంట్ స్థాయి ఉన్న రెండు `రాజ్యాంగ సభలు’ ఏర్పాటై స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తాయని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది.
1947-1950 భారత ప్రభుత్వం
ఈ ఏర్పాట్లవల్ల లాంఛనంగా అయినా సరే, జవహర్ లాల్ నెహ్రు ప్రథమ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడిచిన `స్వతంత్ర భారత్’ ప్రభుత్వం ఎంతవరకు స్వతంత్రంగా వ్యవహరించింది అనేది ఆ కాలంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా, మౌంట్ బాటెన్, 1947 ఆగస్ట్ తరువాత కూడా 1948 జూన్ వరకు గవర్నర్-జనరల్ గా కొనసాగారు. కానీ పాకిస్థాన్ లో మాత్రం మొహమ్మద్ అలీ జిన్నా ప్రథమ గవర్నర్-జనరల్ కాగలిగారు. భారతీయుల్లో, కాంగ్రెస్ నాయకుడు శ్రీ రాజగోపాలాచారి ప్రథమ –చివరి గవర్నర్-జనరల్ గా 1948 జూన్ 21 నుంచి-1950 జనవరి 26 వరకు పనిచేసారు. మనకి వింత కలిగించే విశేషాలలో ఒకటేమిటంటే గవర్నర్-జనరల్ గా రాజగోపాలచరిణి నియమించినపుడు, ప్రధాని నెహ్రు వినయపూర్వకంగా బ్రిటిష్ మహారాజుకి లేఖ వ్రాస్తూ, మహారాజావారి భారత డొమినియన్ ప్రభుత్వ మంత్రివర్గం, శ్రీ రాజగోపాలాచారిని తదుపరి గవర్నర్-జనరల్ గా నియమించాలని నిర్ణయం తీసుకుందని తెలియచేసారు. అదే విధంగా భారత సైన్యంలో, ఫీల్డ్ మార్షల్ క్లాడ్ ఆచిన్లేక్ భారత-పాకిస్థాన్ ఉమ్మడి సేనలకు 1948 వరకు సైన్యాధిపతిగా కొనసాగారు. ఈయన బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ వ్రాస్తూ 1947 ఆగస్ట్ తరువాత పరిస్థితి విషమించిందని, `పాకిస్థాన్ డొమినియన్’ సవ్యంగా ఏర్పడకుండా, ముఖ్యంగా సైనిక దళాల విభజన సక్రమంగా సాగకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి కింద స్వతంత్ర భారత సైన్యం ఎలా పనిచేసి ఉంటుందో, ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వపు పాకిస్థాన్న్-సానుకూల వైఖరిని ఎంతబాగా అమలు చేసి ఉంటారో అర్ధo చేసుకోవచ్చు.
పాక్-ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్/గిల్గిట్-బాల్టిస్తాన్లో అధికారిక బ్రిటిష్ సైన్యాధికారుల పాత్ర
పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే, 1947 సెప్టెంబర్-అక్టోబర్ లోనే పాకిస్థానీ మూకలు/సైన్యం కలిసి, కాశ్మీర్ ప్రాంతాన్ని అక్రమించుకోవాలని భారత్ మీద దాడి చేసినపుడు, క్లాడ్ ఆచిన్లేక్ నేతృత్వం కింద ఇరు దేశాల సైన్యాలు ఉన్నాయి. మరి ఎవరి ఆదేశానుసారం పాకిస్థానీ సైన్యం, ఇతర జిహాది మూకలు దాడి చేసాయో, భారత సైన్యం ఎదురుదాడిని ఎవరైనా బలహీనపరిచారా అనేది అనేకమంది పరిశోధిస్తున్న విషయం. ఏదియేమైనా భారతదేశానికి ప్రతికూలమైన ఫలితం 1947లోనే భారత్ చవిచూడాల్సి వచ్చింది. జమ్మూ-కాశ్మీర్ సంస్థానంలో అధిక భాగం, గిల్గిట్-బాల్టిస్తాన్ మొత్తం ప్రాంతం, పాక్ ఆక్రమిత ప్రాంతంగా మారింది. ప్రధాని నెహ్రు చేసిన ఎన్నెన్నో ఘోర తప్పిదాలు పరిస్థితిని మరింత జటిలపరిచి, ఈనాటి వరకు ఈ భూభాగమంతా, వాస్తవాధీన రేఖకి (LoC)అటుపక్కన, పాకిస్థాన్ నియంత్రణలోనే ఉంది. ఈ మూక దాడిలో, గిల్గిట్-బాల్టిస్తాన్ లో ఉన్న విలియం బ్రౌన్ అనే బ్రిటిష్ సైన్యాధికారి పాత్ర, దేశద్రోహం కిందే పరిగణింపబడుతుంది, అతను స్వయంగా తన చర్యలు దేశద్రోహమని ఒప్పుకున్నాడు కూడా. ఇతను పాక్ సైన్యాన్ని, మూక దాడులను, స్థానిక జిహాదిలను ముందుండి నడిపించి, జమ్మూ-కాశ్మీర్ మహారాజుకి వ్యతిరేకంగా సైన్యపోరాటం చేసి, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాక్-ఆక్రమిత కాశ్మీర్ లో కలిపేసాడు. ఇతను 1947 నవంబర్ 1న గిల్గిట్-అస్టర్ అనే పేరుతో ఆ ప్రాంతాన్ని స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, నవంబర్ 2న పాకిస్థాన్ జెండా ఎగరేసి, గిల్గిట్ ఏజెన్సీని పాకిస్థాన్ లో విలీనం చేస్తున్నానని ప్రకటించాడు. 1947 నవంబర్ 16న, పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే మహమ్మద్ ఆలంని తమ రాజకీయ ప్రతినిధిగా అక్కడికి పంపింది, `విలీనం’ తంతు పూర్తి చేసారు. 1948 జనవరి వరకు విలియం బ్రౌన్ అక్కడే సైన్యాధికారిగా కొనసాగాడు. ఇటువంటి విద్రోహానికి పాల్పడినందుకు బ్రౌన్ మీద కానీ, ఆ ప్రాంతాన్ని తిరిగి భారత్ లో విలీనం చేయడానికిగానీ, ఫీల్డ్ మార్షల్ క్లాడ్ ఆచిన్లేక్ ఏ విధమైన చర్య తీసుకోలేదు. పైగా క్లాడ్ ఆచిన్లేక్ `వినూత్న సేవ’లకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అదే సంవత్సరం జూన్ లో, OBE (Order of the British Empire)తో అతన్ని సత్కరించింది. విలియం బ్రౌన్ 1959 వరకూ పాకిస్తాన్ లోనే ఉన్నాడు; మరణానంతరం పాకిస్తాన్ ప్రభుత్వం 1993లో అతనికి `సితారా-ఇ-ఇంతియాజ్’ అవార్డు ప్రదానం చేసింది కూడా.
1948లో ఈ బ్రిటిష్ ఫీల్డ్ మార్షల్ క్లాడ్ ఆచిన్లేక్ పదవీ విరమణ తరువాత, తిరిగి ఇంకొక బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ రాయ్ బుచర్ సర్వ సైన్యాధికారిగా నియమితుడయ్యాడు. 1949 జనవరిలో సర్వ సైన్యాధికారిగా జనరల్ కరియప్ప నియామకం తరువాత మాత్రమే, సైన్యంలో బ్రిటిష్ శకం ముగిసింది.
భారత `డొమినియన్ స్థితి’ ఎంతవరకూ కొనసాగింది?
1947ఆగస్ట్15 – 1950 జనవరి 26 వరకూ ఈ స్థితి కొనసాగింది. జనవరి 26న భారతదేశం గణతంత్రంగా ప్రకటించబడినప్పటినుంచీ, లాంఛనంగానే అయినా అప్పటిదాకా ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం, ఆనాటితో తొలగిపోయింది. దానితోపాటు, ఏ `ఇండియన్ ఇండిపెండెన్స్ ఆక్ట్/ భారత స్వాతంత్ర్య చట్టం’ ద్వారా డొమినియన్ ఆధిపత్య వ్యవస్థ కొనసాగిందో, ఆ చట్టాన్ని భారత రాజ్యాంగం `అధికరణ 395’ కింద రద్దు చేసారు. అయితే బ్రిటిష్ పార్లమెంట్ చట్టాన్ని, భారత రాజ్యాంగం ఎలా తొలగించగలుగుతుంది అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
అయితే అప్పటి అనిశ్చిత పరిస్థితుల గురించి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ కాలంలో `డొమినియన్ స్థితి’కాక, పూర్తి స్థాయి స్వతంత్ర భారత ప్రభుత్వం పనిచేసి ఉంటే, ఇంతకన్నా పరిస్థితి మెరుగ్గా ఉండేదా? గిల్గిట్-బాల్టిస్తాన్ తో సహా పూర్తి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం భారత్ లోనే ఉండేదా?
డొమినియన్ స్థితి మీద అంతకు ముందు కాలంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటి? `డొమినియన్ లేక పూర్తి స్వాతంత్ర్యం’ వర్గాల మధ్య కాంగ్రెస్ లో ఎంతోకాలం వాదోపవాదాలు జరిగాయి; ఎన్నో చర్చల మధ్య, అటూ ఇటూ ఊగుతూ, చివరికి సందిగ్ధత నుంచి బయటపడి కాంగ్రెస్ `పూర్ణస్వరాజ్య’ తీర్మానం ఆమోదించింది. 1930 జనవరి 26 లాహోర్ లో సభ్యుల కరతాళధ్వనుల మధ్య, ఉద్వేగభరితంగా `పూర్ణస్వరాజ్యం’ తీర్మానం ఆమోదించి, త్రివర్ణ పతాకం ఎగరవేశారు. కానీ ఆ తరువాత 1947లో బ్రిటిష్ వారితో చర్చల్లో ఎందుకు `డొమినియన్ స్టేటస్’ ఒప్పుకున్నట్లు? ఎందుకు పూర్ణ స్వరాజ్య ఆలోచనను వదిలేశారు? `డొమినియన్ స్టేటస్’ గురించి ఒప్పందం కుదిరినట్లు, తద్వారా `అధికార బదలాయింపు’ ప్రక్రియ జరుగుతుందని అధికారికంగా దేశ ప్రజలకు చెప్పిందా? ఈ సంగతి బ్రిటిష్ ప్రభుత్వం కావాలని దాచిపెట్టినట్లుగా ఏమీ ఆధారాలు లేవు. మరి అప్పుడు ఏమి జరిగిందో, భారత ప్రజలకు ఇప్పటికీ సమగ్రంగా ఎందుకు తెలియదు?