హిందూ జైన్లకు శ్రీ మహావీర్ జయంతి అతి ముఖ్యమైన పండుగ, జైనమతంలో మహావీరుడు 24వ, మరియు ఆఖరి తీర్థంకరులు (మహాజ్ఞాని). ఆ రోజు పవిత్రంగా మహావీరునికి అభ్యంగనం, అభిషేకం, పూజాధ్యానాలు చేస్తారు. శ్రీ మహావీరుడు బుద్ధుని సమకాలికుడు. ఇక్ష్వాకువంశంలో, నేటి పాట్నా సమీపాన ఉన్న వైశాలి రాజ్యంలో `క్షత్రియకుండ్’ అనే ప్రాంతంలో, మహారాజు సిద్ధార్థుడు-మహారాణి త్రిశల దంపతులకు, జైనమత స్థాపకుడైన శ్రీ భగవాన్ మహావీరుడు చైత్ర శుద్ధ త్రయోదశి రోజున, క్రీ.పూ 599 సం.లో జన్మించారు, ఆయన చిన్ననాటి నామం వర్ధమానుడు. శ్వేతాంబర జైనాచారం ప్రకారం రాణి త్రిశలకు, ఈయన పుట్టుకముందు నిద్రలో 14 కలలు కనిపించాయి, పుట్టబోయే శిశువు చక్రవర్తి అయినా లేక మహాతీర్థంకరుడు అయినా అవుతాడని పండితులు జోస్యం చెప్పారు. ఆ భవిష్యవాణి ప్రకారమే ఆయన 24వ తీర్థంకరులుగా అవతరించారు. రాజకుమారుడిలాగా సర్వసౌఖ్యాలలో పెరిగినా, అవేవీ ఆయనను ఆకర్షించలేదు. తల్లిదండ్రుల ఆనతి ప్రకారం రాజకుమారి `యశోద’ను వివాహం చేసుకున్నారు, వారికి `ప్రియదర్శన’ అనే కుమార్తె. అయితే జైన దిగంబర సంప్రదాయం ప్రకారం ఆయన వివాహం చేసుకోలేదు అని చెప్తుంది.
జయంతి ఉత్సవాలు
జైన మతస్థులు మహావీర జయంతి పుణ్యదినాన్ని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు. జైన ఆలయాలలో శ్రీ మహావీర స్వామి విగ్రహానికి అభిషేకాలు నిర్వర్తిoచి, పవిత్ర ప్రార్థనలమధ్య లక్షలమంది, రధాల మీద ఊరేగింపులు చేస్తారు. సంప్రదాయ విందులతో పాటు పేదలకు అన్నదానాలు చేస్తారు. ఆలయాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, నైతిక విలువలు బోధిస్తారు. జైన తీర్థంకరుల జీవితాలు, శ్రీ మహావీరుని జీవితంలో ఘట్టాలను పారాయణం చేస్తారు.
జైనమతం
ప్రథమ తీర్థంకరులు శ్రీ రిషభదేవుడు, ఆఖరి తీర్థంకరులు శ్రీ మహావీరుడు. జైన ఆచారాల ప్రకారం, జైనమత తత్వ సిద్ధాంతాలను శ్రీ వర్ధమాన్ మహావీర స్వామి క్రోడీకరించి పొందుపరిచారు.
వరుసగా వీరు- శ్రీ రిషభదేవ స్వామి, శ్రీ అజితనాథ స్వామి, శ్రీ శాంభవనాథ స్వామి, శ్రీ అభినందన స్వామి, శ్రీ సుమతీనాథ స్వామి, శ్రీ పద్మప్రభ స్వామి, శ్రీ సుపార్శవనాథ స్వామి, శ్రీ చంద్రప్రభ స్వామి, శ్రీ సువిదినాథ స్వామి, శ్రీ సీతానాథ స్వామి, శ్రీ శ్రేయంస్నాత స్వామి, శ్రీ వాసుపుజ్య స్వామి, శ్రీ విమలనాథ స్వామి, శ్రీ అనంతనాథ స్వామి, శ్రీ ధర్మనాథ స్వామి, శ్రీ శాంతినాథ స్వామి, శ్రీ కుంతునాథ స్వామి, శ్రీ ఆరనాధ స్వామి, శ్రీ మల్లినాథ స్వామి, శ్రీ మునిసువ్రత స్వామి, శ్రీ నామినాథ స్వామి, శ్రీ నేమినాథ స్వామి, శ్రీ పార్శవనాథ స్వామి, శ్రీ వర్ధమాన్ మహావీర స్వామి.
జీవితం తొలి దశ, పరిత్యాగం, సర్వజ్ఞత
రాజకుమారుడైన శ్రీ మహావీరుడు చిన్నతనం నుంచే జైనమతం మీద శ్రద్ధాసక్తులతో ధ్యానం మీద మనసు లగ్నం చేసారు. ఆయన తన తల్లిదండ్రులు మరణించాక, తన అన్నగారైన `నందివర్ధనుడి’ అనుమతికోరి, ఆయన వద్దన్నా వినక, 30సంవత్సరాల వయసులో `నమోసిధ్దానాం’ అని జపిస్తూ, సింహాసనాన్ని కుటుంబాన్ని పరిత్యజించి, 12సం తపస్విగా, సన్యాసిగా కఠోర దీక్షతో జీవించారు. ఆయన ధ్యానంలో ఉండగా ఒక గోపాలకుడు వచ్చి తన ఆవులను చూసుకోమని చెప్పి వెళ్ళాడు, ధ్యానంలో నిమగ్నమైన ఆ తేజోమయ తపస్వికి ఏమీ వినిపించలేదు. గోపాలకుడు తిరిగివచ్చి చూస్తే, ఒక్క గోవుకూడా లేదు. అతను కోపంతో కొట్టబోతే, ఎదో అదృశ్యశక్తి, అతని చెడు కర్మల వల్ల గోవులు తప్పిపోయాయని చెప్పి అతన్ని వారించింది. ధ్యానంనుంచి బయటకివచ్చిన తపస్వి గోపాలకుడిని కోప్పడలేదు, శాంతంగా అతని గోవులు అతనికి దొరుకుతాయని దీవించి పంపించారు. దుస్తుల్ని సైతం త్యజించి, సంపూర్ణ మౌనం, ఉపవాసం, ధ్యానంలో గడిపారు. 12సం తరువాత, కొన్ని క్షణాలు నిద్రపట్టగా, ఆయనకి పది స్వప్నాలలో, కొన్ని సంకేతాలు ప్రతీకలు గోచరించాయి. `రిజువల్క’/ఇప్పటి `బరాకర్’ నదివద్ద, సాలవృక్షం కింద, 43సం. వయసులో `కేవలి’ అనగా సర్వజ్ఞ్యత, కైవల్యజ్ఞ్యానం ప్రాప్తించింది; సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం సిద్ధించాయి. ఇంద్రియనిగ్రహం, మనోబలంతో కఠోర ధ్యానం చేయడంవలన ఆయనకు మహావీరుడని పేరు వచ్చింది. అన్ని బంధాలు జయించిన `జీను’డైనారు. ఆయన ప్రపంచానికి సహనం, క్షమ, శాంతి, సహజీవనo, అన్ని జీవరాశులపట్ల కరుణతో ఉండాలనే అహింసా తత్వాన్ని బోధించారు. శ్రీ భగవాన్ మహావీర శేషజీవితం 30సం కాలం, దేశపర్యటన చేస్తూ శిష్యులకు, ప్రజలకు నైతిక సూత్రాలు, ఆధ్యాత్మిక జీవనం, ముక్తిమార్గం బోధపరిచారు.
కాల పరిస్థితులు
ఆ కాలంలో హిందూ వైదికమతం ఉత్కృష్ట ఆధ్యాత్మికతా సిద్ధాంతాలనుంచి దూరంగా జరిగి, ప్రజాజీవితం ఆచారాలు కర్మకాండ మధ్య నలిగిపోతున్న అనిశ్చిత దశలో శ్రీ మహావీరుడి ఆవిర్భావం జరిగింది. ఆనాటి కాలం కల్లోలితంగా ఉండేది. అన్ని మహాజనపదాలు రాజకీయ ఆధిపత్యం కోసం పరస్పరం పోరాడుతూ ఉండేవారు. వ్యాపార వర్గాల అభ్యున్నతి, పరపతి పెరుగుతున్న కాలం అది, అయితే బలంగా ఉన్న సామాజిక వర్గాలలో కొత్తమార్పులను, కొత్త తరగతులను ఆహ్వానించి కలుపుకునే సామరస్యం కొరవడింది. త్వరితంగా మారుతున్న ఆర్థిక స్థితిగతులు, సామాజికంగా సాంస్కృతికంగా వాటి ప్రభావాన్ని చూపుతున్న ఆ సందిగ్ధ కాలంలో శ్రీ మహావీరుని బోధనలు ప్రజలకు నూతన దిశానిర్దేశం చేసాయి. ప్రజలను ముక్తిమార్గంలో సరియైన దారిలో నడిపించడానికి శ్రీ మహావీరుడు సరళంగా స్వచ్చందంగా పాటించే జీవన నైతిక సూత్రాలను తెలియచేసారు.
ఆధ్యాత్మిక తత్త్వం, బోధన- శిష్యగణం
శ్వేతాంబర శాఖ అంతకు పూర్వమే ఉండగా, శ్రీ మహావీరుడు `దిగంబర’ శాఖకు ఆద్యుడయారు. జీవితాన్ని కఠిన నిష్ఠగా మలుచుకోవడమే కాక, దుస్తుల్ని విడిచిపెట్టేసి అన్నిరకాల భవబంధాలు, బంధనాలు త్యజించడం దీనిలో ముఖ్య తత్త్వం. శ్రీ మహావీరుని తత్వ సిద్ధాంతాలు భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఎనలేని ప్రభావం చూపాయి. ఆయన ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించారు, వాటిలో కీలకమైనవి రెండు. సంస్కృతంలో కాక సామాన్యులకి అర్ధమయే ప్రాంతీయ వాడుక భాషలలో శ్రీ భగవాన్ మహావీర్ `కైవల్య జ్ఞ్యానం’ బోధించారు.
అనేకాంతవాదం- `పరమ సత్యం’ని అనేక దృష్టికోణాలతో చూడవచ్చు, ఒక్క దృక్పధమే సత్యం అని చెప్పలేము. ఈ వాదం వల్ల, `పరమసత్యం’ చేరుకోవడానికి వివిధ దృష్టికోణాలు సాధ్యమే అని, అలాగే వైవిధ్యం బహుళత్వం కూడా సమ్మతమే అని ఆయన చెప్పారు.
స్యాద్వాదం- ఏడు సూత్రీకరణల ఆధారంగా స్యద్వాదం నెలకొల్పబడింది. అనేక రకాల నిర్ధారణలు/నిర్ణయాలు కొన్ని పరిస్థితులలో మాత్రమే సరియైనవి అని చెప్పవచ్చు, అన్నిటా కాదు.
జైనమతాన్ని పునర్నిర్మాణం చేసినవారు శ్రీ భగవాన్ మహావీర. స్త్రీపురుషులిద్దరూ సమానమే అని, మోక్షజ్ఞ్యానం కోసం ఇరువురూ లౌకిక ప్రపంచాన్ని పరిత్యజించవచ్చు అని చెప్పారు. `జైన సంఘాలు’ స్థాపించి, పేద గొప్పా భేదంలేక అన్ని వర్గాలవారిని కలుపుకున్నారు. మానవులు, స్వార్థం, క్రోధం, లోభం, దురాశ, హింస లక్షణాల కారణంగా చెడుచర్యలు చేస్తూ ఉంటారు, ఈ దుష్కర్మల మూలంగా ఆత్మవిమోచనo పొందలేదు. మానవ జీవితాలు మళ్ళి మళ్ళి బాధలు వ్యధలు పడకుండా, జన్మ పునర్జన్మ అనే ఆవృత్తం నుంచి తప్పించుకుని మోక్షప్రాప్తి పొందాలంటే, మానవాళికి సమ్యక్ దృష్టి (సరియైన విశ్వాసం), సమ్యక్ జ్ఞ్యానం (సరియైన జ్ఞ్యానం), సమ్యక్ చరిత్ర (సత్శీలం) ఉండాలని బోధించారు.
పంచ వ్రతాలు:
అహింస – సృష్టిలోని ఏ జీవిని హింసించరాదు.
సత్యం – సత్యమే పలుకవలెను.
అస్తేయ – చౌర్యం చేయరాదు, ఎవరూ ఇవ్వని వస్తువు ఎక్కడినుంచి తీయరాదు.
బ్రహ్మచర్యం- కోరికలకి దూరంగా ఉండవలెను.
అపరిగ్రహం – వ్యక్తులు, స్థలాలు, ధనం, వస్తువులు మొదలైన వాటితో బంధనాలు పెంచుకోరాదు. నిమిత్తమాత్రంగా జీవనం సాగించాలి.
జైన గ్రంథాల ప్రకారం, 11మంది బ్రాహ్మణులు శ్రీ మహావీరుని ప్రధమ శిష్యులు, వారిని పదకొండు `గణాధరుల’ని పేర్కొంటారు. వారు ఇంద్రభూతి గౌతమ, ఆయన సోదరులు అగ్నిభూతి, వాయుభూతి మరియు ఆకంపిత, అర్యవ్యక్త, సుధర్మ, మండితపుత్ర, మౌర్యపుత్ర, అచలభ్రాత, మేతర్య మరియ ప్రభాస. శ్రీ మహావీరుడు శిష్యులకు `త్రిపాది’ జ్ఞ్యాన ప్రదానం చేసారు- అవి ఉపనైవ (ఉద్భవం), విగమైవ (నాశనం), ధువైవ (శాశ్వతం). ఇంద్రభూతి గౌతమ కైవల్య జ్ఞ్యానం పొందడం వల్ల, శ్రీ మహావీర తీర్థంకరుని తరువాత, `గాంధార సుధర్మ’ ఆచార్యుడయారు. శ్రీ మహావీరుని బోధనలు కంటస్థం వచ్చిన గణాధరులు ఆయన మరణానంతరం వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్ళారు. ఆ బోధనలను `గాని-పిడగా’ లేక `జైన ఆగమాలు’ అంటారు.
జైన సంప్రాదయం ప్రకారం, శ్రీ మహావీరునికి 14000 పురుష భక్త మునులు, 36000 `ఆర్యిక’ అనబడే స్త్రీ భక్తులు, 159000 పురుష శ్రావకులు/అనుయాయులు, 318000 మహిళా శ్రావికలు/అనుయాయులు ఉండేవారు. శ్రీ మహావీరుడు ఆయన అనుచరులు, భిక్షువులకు ఐదు `మహావ్రతాలు’ చేయించేవారు. ఆయన మొత్తం 55ప్రవచనాలు, `ఉత్తరాధ్యయన సూత్రాలు’ అనబడే ప్రసంగాలు చేసారు. ఆ కాలంలోని ఎంతోమంది రాజులు, ఆయన భక్తి ప్రవచనాల ప్రభావంతో ఆయన భక్తులు అనుచరులు అయారు. మగధ రాజు `శ్రేణికుడు’, అంగ రాజు `కునికుడు’/బింబిసారుడు, వైశాలి రాజు `చేతకుడు’, రాజగృహ రాజు `అజాతశత్రు’, రాజు `చంద్రపద్యోత్’, రాజు `ఉదయనుడు’, కోసల రాజ్యానికి చెందిన తొమ్మిదిమంది `లిచ్చవి’ రాజులు, కాశీ రాజ్యానికి చెందిన తొమ్మిదిమంది రాజులు కూడా శ్రీ మహావీరుని అనుయాయులే. `భద్రబాహు’ అనే జైనముని మార్గదర్శకత్వంలో, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి `చంద్రగుప్త మౌర్యుడు’ తన సింహాసనం రాజ్యం త్యజించి, తపస్సుకి వెళ్లిపోయాడని చరిత్ర చెపుతోంది.
నిర్వాణం
ఆయన చివరి ప్రవచనం పావాపురి నగరంలో (నేటి బీహార్) 48గంటలపాటు సాగింది. ఆ తరువాత 72సం వయసులో క్రీ.పూ 527లో, ఆయన నిర్వాణం చెంది, జీవన్మరణ-పునర్జన్మల నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు.
This article was first published in 2020