Home News కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు సన్మానం

కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు సన్మానం

0
SHARE
కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు వ‌రంగ‌ల్ లోని కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్షుడిగా వ్య‌వ‌హరించిన కాకతీయ విశ్వవిద్యాలయం డీన్(రి) ఆచార్య.కే.విజయ బాబు గారు మాట్లాడుతూ… మన పూర్వీకులు అందించిన గొప్ప జీవన విలువలను కాపాడుకుంటూ, మధ్య కాలంలో వచ్చిన దురాచారాలను లేకుండా చేయడమే సామాజిక సంస్కర్తల ఆశయ‌మ‌న్నారు. పశ్చిమాన స్వామి దయానంద, మహాత్మా జ్యోతిబా ఫూలే, తూర్పున రాజా రామ మోహన రాయ, ఆంధ్రలో కందుకూరి, తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ ఈ సామాజిక సంస్కరణ ఉద్యమంలో అగ్రేసరులుగా ఉన్నార‌ని తెలిపారు.
కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ గారు మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అండగా అందరం నిలబడాల‌న్నారు. వివాహం కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య పరిమితమైన వ్యవస్థ కాద‌ని, రెండు కుటుంబాల మధ్య బంధం, అనుబంధం ఏర్పరిచే వ్యవస్థ అని అన్నారు. “మా పెళ్లి మా ఇష్టం” అంటే సరి పోద‌ని, త‌ల్లిదండ్రుల‌కు నచ్చ చెప్పాల‌ని, వారి మనో భావాలను మన్నించాల‌ని సూచించారు. కులాంతర వివాహం చేసుకోని గృహస్తులుగా అన్యోన్యంగా ఉంటూ, సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ, సంతానాన్ని సంస్కార వంతులుగా తీర్చి దిద్దినపుడే ఆదర్శ దంపతులు అవుతార‌ని తెలిపారు. మహాభారత కాలం వరకు వర్ణ వ్యవస్త ఉండేద‌ని, వర్ణ వ్యవస్థకు ఆధారం గుణం, జన్మ కాద‌ని తెలిపారు. వశిష్ట, అరుంధతీలది వర్ణాంతర వివాహ‌మ‌ని, వారు ఆదర్శ దంపతుల‌ని పేర్కొన్నారు. నేడున్న కుల వ్యవస్థ, కులాల పేరున హెచ్చు తగ్గులు, అస్పృశ్యత పాటించ‌డం స‌రికాద‌న్నారు. హిందువులందరూ సోదరీ, సోదరులు ఇది మన ఆలోచనలకు, వ్యవహారానికి దిక్సూచి కావాల‌న్నారు. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కన్న తల్లి తండ్రులకు సైతం తమ పిల్లలను చంపే హక్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. పెద్దలు నిర్ణయం చేసిన వివాహమైనా, కులాంతర వివాహమైనా పతుల మధ్య చిన్న చిన్న‌ సమస్యలు వ‌స్తుంటాయిని, వాటి వ‌ల్ల పెరుగుతున్న విడాకులు, ఇద్దరినీ సర్దుబాటు చేయక విడాకులకు ప్రోత్సహిస్తున్న త‌ల్లిదండ్రుల‌ నేటి ప్రవృత్తి ప్రమాదకర‌మ‌న్నారు. కులాంతర వివాహం చేసుకున్న దంపతులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవడానికి తయారు కావాల‌ని వారు సూచించారు.
ముఖ్య వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్య గిరిజా మనోహర బాబు మాట్లాడుతూ వివాహ వ్యవస్థను, మన ప్రాచీన జీవన విలువలను కాపాడు కోవాల‌ని అనేక శాస్త్రాలలో అంశాలను ఉల్లేఖిస్తూ వివ‌రించారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు తమ అనుభవాలను వివరించారు. అనంత‌రం ఆదర్శ దంపతులకు సన్మానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్.ఎస్.ఎస్ వరంగల్ విభాగ్ సంఘ్ చాలక్ డా.చిలకమారి సంజీవ, త‌దిత‌రులు పాల్గొన్నారు.