Home News కాంతార – హిందూ ధార్మిక చిత్రం

కాంతార – హిందూ ధార్మిక చిత్రం

0
SHARE

-ప్రదక్షిణ

కాంతార కన్నడ సినిమా గురించి ఎంతో చెప్పుకుంటున్నాము. కాంతార అంటే `రహస్యమయ అరణ్యం’ అని అర్ధం. ఈ సినిమా చూడడం ఒక గొప్ప అనుభూతిగా వర్ణించవచ్చు, కధ, కధనం, ముఖ్యంగా ముగింపు, ఆద్యంతం ఉత్కృష్టమైన దేవీదేవతల రూపాలతో, ఒక మరచిపోలేని ధార్మిక అనుభూతిని కలిగిస్తాయి. వన దేవతలు, భూత దేవతలు, అటవీ ప్రాంతాలలో వారిని సంరిక్షించే జనజాతులు ఈ చిత్రంలో మనకు కనిపిస్తారు, `భూత-కోలా’ అనే దైవ-ఆగమన ఆరాధనా నృత్య రూపకాలను మనం చూస్తాము.

కధాకధనం సూటిగా ఉంటుంది; 19వ శతాబ్దంలో, కేరళని అనుకుని ఉన్న కర్ణాటక తీరంలోని, తుళునాడు ప్రాంతానికి చెందిన ఒక రాజు, అన్నీ ఉండి కూడా మనశ్శాంతి కరువై, ఒక కీకారణ్యంలో, వనదేవతల సమక్షంలో శాంతి పొందుతాడు; దానికి బదులుగా అక్కడి జనజాతి ప్రజలకి శాశ్వతంగా స్వతంత్రంగా ఉండేలా అనుమతిస్తాడు. అయితే ముందు తరంలో ఆ భూమి కోరుకున్న తన తండ్రి, కోర్టు మెట్లమీద దారుణంగా రక్తం కక్కుకుని చావడం చూసి కూడా, ఆ వంశానికి చెందిన ఇప్పటి జమీందారు, తిరిగి ఆ భూమి మీద కన్ను వేస్తాడు. అడవిలోని జనజాతి ప్రజలతో సఖ్యంగా ఉంటూ, అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. చిత్ర నాయకుడు శివ, పారంపర్యంగా వనదేవత `పంజుర్లి’ ఆరాధనలో, `భూత-కోలా’ నృత్యాన్ని నిర్వహించే వంశానికి చెందినవాడు. అతని చిన్నతనంలో, అతని తండ్రి అడవిలో ఒక మహిమాన్వితమైన అగ్నితో చుట్టబడిన వృత్తంలో మాయమైపోతాడు. శివ ఆడుతూ పాడుతూ, తల్లితో చివాట్లు తింటూ, వార్షిక ఎద్దుల పోటీ ‘కంబాల’లో గెలుస్తూ, మధ్యమధ్యలో అడవి పందులను వేటాడుతూ, అడవిమృగాలను వేటాడనివ్వని అటవీ అధికారులతో తగాదా పడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు `ఆది-వరాహ’ రూపం అతని మస్తిష్కంలో అతనిని వెన్నాడుతూ ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగంలో చేరిన `లీల’తో ప్రేమలో పడతాడు. `భూత-కోలా’ దైవ నృత్యం నిర్వహించే అతని తమ్ముని మరణం తరువాత, ఆ బాధ్యత శివ మీద పడుతుంది. ప్రేక్షకులని దిగ్భ్రాంతికి గురిచేసే చిత్ర ముగింపులో, మోసపూరిత జమీందారు మనుషులు, అడవిలోని జనజాతి ప్రజలకు భూమి సంఘర్షణ జరుగుతుంది; అన్ని సంక్లిష్టతలు తేటతెల్లమయే చివరి సన్నివేశంలో, చనిపోతున్న శివలో `పంజుర్లి’ దైవం ఊపిరి నింపుతాడు, భయానక శ్రీ అదివరాహస్వామి రూపం ప్రకటితమౌతుంది, పవిత్ర వన్య-ప్రాంతాలను, అటవీ జనజాతులను సంరిక్షించే ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూ, శివ- వరాహరూపం ఒక్కటై ప్రేక్షకుల కళ్ళ ముందు వెలుగొందుతాయి.

సినిమాలో అంతర్లీనంగా ఉండేది, అనాదిగా జరుగుతున్న సంఘర్షణ- మనిషికి ప్రకృతికి మధ్య, మానవుని దురాశ- పర్యావరణానికి మధ్య, జనజాతుల హక్కులు- ప్రభుత్వ నియంత్రణ మధ్య, అభివృద్ధి –అటవీ సంపద సంరక్షణ మధ్య, ప్రాచీన సంప్రదాయాలు-`ఆధునికత’ల మధ్య, జరిగే నిత్య సంఘర్షణ ఈ చిత్రంలో మనం చూస్తాము. చివరి సన్నివేశంలో ఈ ఘర్షణల పరిష్కారం కూడా మనం చూస్తాము-చెడు నిర్మూలింపబడుతుంది, దుర్మార్గులు వధింపబడతారు, `రిసర్వ్ ఫారెస్ట్’ కింద ప్రభుత్వంచే `పవిత్ర వనాలు’ సంరక్షించబడతాయి, అరణ్యంలోని జనజాతులు వారి సంప్రదాయ ఆరాధనలు, హక్కులు, కళలు కాపాడుకోగలుగుతారు.

చిత్రంలో శ్రీ మహావిష్ణువు, మాహశివుడిని ప్రతీకాత్మకంగా చిత్రీకరించారు, మహావిష్ణు అవతారమైన భీకర వరాహరూపం కనిపిస్తుంటుంది; నాయకుడి పేరు శివ, అతను చెట్టుమీద కట్టుకున్న చెక్క ఇల్లు కైలాసం. భూత-కోలా దైవకళప్రదర్శన సందర్భంగా `వరాహ రూపం దైవ వరిష్టం, వజ్రదంత ధరా రక్షా కవచం….’ అనే వచనం శ్రవ్య-రూపంగా నేపధ్యంలో వినపడుతుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో, భీకరమైన శ్రీ ఆదివరాహరూపం, వన్య ప్రాంతాలను, భూములను సంరక్షించే ప్రతీకగా చూపబడుతుంది. ఈ చిత్రంలో వన్యక్షేత్రాలకు సంరక్షక దేవుడు `పంజుర్లి’, క్షేత్రపాలకుడు `గులిగ’. దైవం/ప్రకృతి/భూతం అన్ని ప్రతీకలు పరస్పరం ఒకటిగా మార్పు చెందుతున్నాయని మనకు అనిపిస్తుంది. కన్నడ మాతృకలో కాంతారా చిత్రానికి టాగ్లైన్ `దాంటే కధ’- `అరణ్య పురాణం’.

దక్షిణ కర్నాటక, ఉత్తర కేరళల మధ్య అటవీ ప్రాంతంలో `భూత-కోలా’ సంప్రదాయం పాటిస్తుంటారు. కేరళలో `థెయియ్యం’ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలో ఉంది. తెలుగునాట ఉన్న ఎన్నో గ్రామదేవతల సంప్రదాయాలు-పురాణ రూపాలలాగానే, వన-దేవతల పురాణాలు దేశమంతా ప్రబలంగా ఉండేవి. అయితే అవన్నీ మూఢనమ్మకాలు అని బ్రిటిషువారు హిందువులను నమ్మించడం చేత, ప్రజలు వారి వారి- పవిత్ర ధార్మిక సంప్రదాయాలకు దూరం చేయబడ్డారు. ఇప్పుడు కూడా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పర్వత-వన ప్రదేశాలలో, ప్రజలు వన-దేవతలను కొలుస్తుంటారు, ఇటివలే జరిగిన `కులు-దసరా’ దానికి ఒక ఉదాహరణ.

ఈ చిత్రం ఎన్నో మరచిపోయిన సంప్రదాయ బిందువులను స్పృశిస్తుంది. ఈ చిత్రంలోని ధార్మిక దృష్టి ఎంతో సహజంగా దీనిలో ఇమిడింది, ఎక్కడా ఏది కృతకంగా ఉండదు, ఈ చిత్ర ధార్మిక శైలిలో, దీని ముగింపు కూడా అంతే సహజసిద్ధంగా ఉంటుంది. ఈ చిత్రముగింపు ఇంకొకలా ఉండడం సాధ్యం కాదు. మనలో ఎక్కడో, మనసు పొరల్లో నిద్రాణమై ఉన్న సంస్కృతీ-సంప్రదాయాలను, మన వారసత్వాన్ని ఈ చిత్రం తట్టి లేపుతుంది. మానవుల అత్యాశలకి, స్వార్థాలకి అతీతంగా ఉండే దేవీ-దేవతలు, దివ్యక్షేత్రాలు, పవిత్ర-వనాలు అనే భావనలను ఇది జాగృతం చేస్తుంది. జంతువులు-పశు పక్ష్యాదులు- నదులు, కొండలు, పర్వతాలతో మానవులు సత్సంబంధాలతో సహజీవనము చేయాలనే మన సంప్రాదయాలు, సంరక్షక వనదేవతలు-మానవుల మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈ చిత్రం చూపిస్తుంది. దైవం-వనం-మానవం-ప్రకృతి అన్ని, భారతీయ ధార్మిక సంప్రదాయంలో, కళారూపాలలో ఒకటే ఏకాత్మత కలిగి ఉంటాయని అని ఈ చిత్రం తెలియజేస్తుంది. మనం తరచుగా అనుకునే `స్థానికత- విశ్వజనీనత’ ఒకటే అనే అంశం కూడా స్పష్టమౌతుంది. మనం దైవసమక్షంలో ఉన్నామనే భావన మనకు ఈ చిత్రం కలిగిస్తుంది. ఈ దేశ ఆత్మ, భూమి, సంస్కృతీ సాంప్రదాయాలు, ఈ చిత్రానికి జవసత్వాలు. హిందూ పునరుద్ధరణకి, మన జాతి మరచిపోయిన గ్రామదేవతల, వన్యదేవతల, కులదేవతల పురాణాలు వెలికితీయాల్సిన సమయం వచ్చిందని మనకు అర్ధం అవుతుంది.

దురదృష్టవశాత్తూ, `కాంతార’ తెలుగు చిత్రంలో, `భూత-కోలా’లో `పంజుర్లి’ దైవం చెప్పే పలుకులు తెలుగులో తర్జుమా చేయబడలేదు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా `పుష్ప’లో నాయకుడు అడవుల్లో ఎర్రచందనం నరికి దొంగిలించే స్మగ్లర్, అయితే `కాంతార’ నాయకుడు పవిత్ర-వనాలను, ప్రకృతి-వనదేవతల సంప్రదాయాలను కాపాడే నాయకుడు, ఈ వ్యత్యాసం మనకు కనిపించక మానదు. హిందూ ధార్మిక చిత్రం `కాంతారా’ తీసిన యువ నిర్మాత, దర్శకుడు, నాయకుడు శ్రీ రిషభ్ శెట్టికి అభినందనలు. ధర్మో రక్షతి రక్షితః!

Watch This Video : గ్రామదేవతలు వైదిక సంప్రదాయంలో భాగమే.