కారల్ మార్క్స్ ద్విశత జయంతి వేడుకలు ఈనెల 5న అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేకానేక రచనలు అచ్చయ్యాయి. అవన్నీ చర్విత చరణాలే తప్ప వర్తమాన నేపథ్యాన్ని పట్టి చూపలేకపోయాయి. 1848లో కారల్ మార్క్స్ పేర్కొన్న విషయమేమిటంటే- ‘యూరప్‌ను నేడు ఒక భూతం ఆవహించింది, అదే కమ్యూనిజం.’ ఈ ఒక్క వాక్యం చాలదా? మార్క్స్ మనోభావాలను అర్థం చేసుకోవడానికి. భూతాలు, ప్రేతాలు లేని సమాజం కోసం అందరూ ఆశపడుతూ ఉంటే మార్క్స్ కమ్యూనిజం భూతాన్ని పరిచయం చేస్తే ఎలా? దుష్టత్వానికి, దాష్టీకానికి ప్రతీకగా భూ తాన్ని చెప్పుకుంటాం. 1818 మే 5న జర్మనీలోని ప్రష్యాలో జన్మించిన యూదుడు మార్క్స్ ఈ సరికొత్త భూతప్రేతాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడాన్ని ఇప్పటికీ సంబరపడుతున్న వారి సంఖ్యను చూస్తే వింతగా తోస్తుంది. సానుకూల దృక్పథం ప్రజల్ని ముందుకు నడుపుతుంది. అలాగాక ప్రతికూల ధోరణితో అగ్గిరాజేయడం- ‘అద్భుతమైన అంశం’ ఎన్నడూ అవదు. కాని మార్క్స్ చేసిందే అది. దానికి ఇప్పటికీ ఆయన అభిమానులు జేజేలు పలుకుతుండటం వారి మానసిక స్థితికి నిదర్శనం తప్ప మరొకటి కాదు.
కమ్యూనిజం అనే భూతాన్ని ఆరాధించమని- ‘21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లి ప్రజాజీవితం విప్లవీకరించిన వేళ చెప్పడం సబబేనా?’ అని మార్క్స్ అభిమానులు కాకపోయినా, మిగతావాళ్లు నిశితంగా ఆలోచించాల్సిన సందర్భమిది. కాలం కరిగినకొద్దీ మనసు, హృదయం, ఆలోచన పరిపక్వమవ్వాలి. అదేమిటో గాని మార్క్స్ అభిమానుల, ఆరాధకుల్లో ఆ పరిణామం మృగ్యమవడం విడ్డూరం. 30 ఏళ్ల మార్క్స్, 32 ఏళ్ళ ఏంగిల్స్ 23 పేజీల కమ్యూనిస్టు ప్రణాళికను 1848లో ప్రకటించడంతో ఒక కొత్త ‘మతం’ వచ్చినట్టయింది. అందుకే మార్క్స్ అభిమానులు ఇప్పటికీ బైబిల్ కన్నా కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతులు ఎక్కువ అమ్ముడుపోయాయని గొప్పగా చెప్పుకుంటారు. ఇదా ఆ సిద్ధాంతానికి ప్రామాణికత? ఇస్లాం, క్రైస్తవ మతం చేరని ప్రదేశాలున్నాయి గాని కమ్యూనిస్టు ప్రణాళిక చేరని ప్రదేశం ప్రపంచంలో లేనేలేదని భుజాలు ఎగరేయడాన్ని ఏమనుకోవాలి? మార్క్సిజం శాస్ర్తియ, సృజనాత్మక సిద్ధాంతమని పదే పదే పేర్కొంటారు. జీసస్, మహ్మద్ ప్రవక్తల మాదిరి మార్క్స్ మానవాళిని ప్రభావితం చేశారని గతి తర్కం గురించి ప్రబోధిస్తారు. వారి మాటల్లో,చేతల్లో అన్నీ వైరుధ్యాలే, అసంబద్ధ ప్రకటనలే, అహేతుక వాదనలే తప్ప వాస్తవికత కనిపించదు. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మార్క్స్ రచనల వైపు ప్రపంచం దృష్టి నిలిపిందని ఆయన అభిమానులు గుర్తుచేస్తూ ఉంటారు. 1848లో గాని, 2008లో గాని ఆయన రచనలతో మానవాళి ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం లభించిందా? లభించిందని భ్రమను కల్పిస్తూ ఆ సిద్ధాంతాన్ని సజీవంగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు తప్ప సారాంశం ఏమిటో ప్రకటించడం లేదు.
ఏటా స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో ఆర్థిక శిఖరాగ్ర సదస్సులు నిర్వహిస్తూ , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా సమాజాలను ప్రభావితం చేస్తున్నదో చర్చలు జరుపుతూ ముందుకుసాగుతూ ఉన్న నేపథ్యంలో అది పెట్టుబడిదారి విధానం, దోపిడీ పద్ధతి, సామ్రాజ్యవాద వైఖరి అంటూ తులనాడుతూ ప్రత్యామ్నాయం పేర మార్క్స్ మార్కెట్ రహిత వ్యవస్థకు వందనాలంటూ గీతాలు ఆలపిస్తే ఏమిటి ప్రయోజనం? ఆ ప్రత్యామ్నాయం మంచులా కరిగిపోయిన దృశ్యం తిలకించాక కూడా పట్టించుకోకుండా ‘పాడిందే పాడేరా..’ అన్నట్టు వ్యవహరిస్తే- వర్తమాన శ్రామిక ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఈ చిన్న ప్రశ్న వారి మదిలో మెదలకపోవడానికి కారణం ‘మార్క్సిస్టు మత విశ్వాసం’ అని చెప్పుకోక తప్పదు.
మనం వర్తమానంలో జీవిస్తున్నామన్న ప్రాథమిక సత్యాన్ని విస్మరించి 170 ఏళ్ల నాటి చైతన్యంలోనే మునిగి ఉన్నామనుకోవడం ఎలాంటి పురోగమన విధానం? 1760 ప్రాంతంలో వచ్చిన తొలి పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పరస్పరాధితం చేసిందని, హద్దులు చెరిగిపోయాయని, సార్వజనీన భావం పెరిగిందని, ఉత్పత్తిపెరిగి, ధరలు తగ్గాయని, నాణ్యత హెచ్చిందని చెబుతూనే మరోపక్కనుంచి దానికి తూట్లుపొడిచేందుకు ఫిరంగులు అమర్చే విధానం విచిత్రం. దాన్ని సంస్కరించే మార్గంపై మనసు నిలపడం మానేసి- ‘తిరగబడండి, ఉత్పత్తి సాధనాలను స్వాధీనం చేసుకోండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. ప్రపంచాన్ని మార్చండి’ అని రణభేరీలు మోగిస్తే, కొమ్ముబూరలు ఊది పిలుపునిస్తే ఏమి జరిగిందో గత 170 ఏళ్ళ చరిత్ర కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా దాన్ని తిలకించేందుకు ఇష్టపడక ఇంకా ముతక ధోరణిలో మార్క్సిస్టు మూలసూత్రాలపై మనసు నిలపమనడం దేనికి సంకేతం?
ఈ సమాజం ఒక సముద్రం లాంటిది. ఇందులో తుఫాన్లు, ఉప్పెన్లు, సునామీలు, రాకాసి కెరటాలు వస్తాయి. తిరిగి తన పూర్వస్థితికి సముద్రం చేరుకుంటుంది. అది దాని గొప్పదనం, నిండుదనం. సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడతాయి. మరెన్నో ఉత్థాన పతనాలుంటాయి. పతనం కనిపించిన ప్రతిసారీ ‘ప్రత్యామ్నాయం.. ప్రత్యామ్నాయం’ అంటూ పలవరించడం అంతగా నప్పని అంశం. మనిషి ఇంగితం, జ్ఞానం, చొరవ అన్నీ నిరంతరం మెలకువతోనే కనిపిస్తాయి. ఏదైనా రాకాసి కెరటం వచ్చిపడితే దాన్నుంచి తప్పించుకోవడానికో, తేరుకోవడానికో అతని ప్రజ్ఞ పనిచేస్తుంది. వేల ఏళ్ల మానవ మనుగడ అంతటా ఇదేకదా కనిపిస్తోంది! మార్క్సిస్టులు మాత్రం గత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని ఒక ప్రకటనచేసి ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న పద్ధతిలో వ్యవహరించడం విషాదం, అజ్ఞానం. మార్క్సిజంలోని వౌలిక సూత్రాలు మానవ ఆవరణంలో ఆచరణ సాధ్యం కావని అటు రష్యా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా, చైనా తదితర దేశాలు రుజువు చేసినప్పటికీ ఇంకా మొండిగా ఆ సిద్ధాంతం ‘తాజాగానే ఉంది గమనించండి’ అంటూ కాలాన్ని వృథా చేయడం సరికాదని ఎవరుచెబితే వారి చెవికెక్కుతుంది?
దేశకాలాలు అన్న మాటను మార్క్స్ అభిమానులు పూర్తిగా విస్మరించి వ్యవహరించడం అలవాటు చేసుకున్నారు. అదే వారికి చేటు చేస్తోంది. ఆ చేటును సైతం పసిగట్టకపోతే ఎలా? చరిత్రను తవ్విపోయడం కాదు, వర్తమానంలో ఏది ఆచరణ సాధ్యమో దానిపై మనసు నిలిపి శ్రామికవర్గం నిటారుగా నిలిచేలా చేయడంలో అర్థం, పరమార్థం ఉంది. ‘170 ఏళ్ల నాటి సూత్రీకరణలను ఇప్పుడు పాటిద్దాం రండి, రారండోయ్..’ అని పిలుపునిస్తే ఎలా?
నూతన సహస్రాబ్దిలో కృత్రిమ మేధ ప్రపంచాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందేలా చేసింది. ఈ అతిముఖ్యమైన పరిణామాన్ని తొక్కిపెట్టి, శ్రామికవర్గం- పెట్టుబడిదారీ వర్గం మధ్యగల వైరుధ్యాలపై ఆధారపడిన సిద్ధాంతానికి ప్రాణప్రతిష్ఠ చేయబూనుకోవడం ఎంతటి అమాయకత్వం? లేని వైరుధ్యాలను ఉన్నాయని భ్రమ కల్పిస్తూ తమ ‘మతాన్ని’ కాపాడుకోవాలని చూడటం శోభనిస్తుందా? శ్రామిక వర్గానికది శ్రేయస్కరమవుతుందా?
దోపిడీ, అసమానతలు అన్న పదాల నిర్వచనం సంపూర్ణంగా మారిన సందర్భంలో, మనిషి అరిషడ్వర్గాలను విస్మరించి, మానవుని వౌలిక ఆకాంక్షలను- ఆరాటాలను చూడ నిరాకరించి ఉటోపియన్ ఆలోచనలతో రక్తకాసారాలను సృష్టించడానికి రెచ్చగొట్టడం అద్భుతమైన సిద్ధాంతం కాదు. ఆరు మాసాలు మనకు పనికిరాని వస్తువులను పూర్తిగా పారేసేందుకు సంసిద్ధమవుతున్న మానవ చైతన్యం ఏకంగా పనికిరాదని దశాబ్దాల క్రితమే రుజువైనా దానే్న పట్టుకుని వేలాడటం అంత గొప్ప అంశం కాదు, విజ్ఞత అసలే అవదు. అదేమిటోగాని అన్ని మర్యాదలను, అన్ని సున్నితత్వాలను, వివేచన, విజ్ఞతలను నిరంకుశంగా అణచివేసి తమ ఆధిపత్యం కొనసాగించాలనుకోవడం 21వ శతాబ్దపు భావజాలం కానేకాదు. మార్క్స్ అభిమానులు మాత్రం ఆ భావజాలానికే ఓటేస్తున్నారు. ఇది ఎంతటి అసంబద్ధమైన అంశమో ఇంగితజ్ఞానమున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
ఫ్రెంచి విప్లవంలో వెలుగుచూసిన స్వేచ్ఛ, సుహృద్భావం, సమానత్వం.. లాంటి ఆకాంక్షలను మార్క్సిజం తుంగలోతొక్కి శ్రామికవర్గ నిరంకుశత్వం (రాచరికం కన్నా ఘోరమైన పాలన) కావాలని ఆహ్వానించడం ఎంతటి అసంబద్ధమో గుర్తించకపోవడం మరో విషాదం. వర్తమానంలో ఫ్రెంచి విప్లవ సహజమైన ఆకాంక్షల కొనసాగింపును నేటి నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆ వాతావరణం చిక్కబడుతోంది. ఇది ఎంతో పారదర్శకంగా కనిపిస్తోంది మార్క్సిస్టులకు తప్ప! మానవజాతి విముక్తికి ఆచరణ సాధ్యమైన మార్గం మార్క్సిజం అని ఇంటర్నెట్‌పై ఆధారపడిన నెటిజన్ల ముందు అనడం హాస్యాస్పదంగా ఉంటుంది. ముందు ‘విముక్తి’ అనే పదానికి నిర్వచనమేంటో, వర్తమానంలో ఎవరు ఎవరిని చెరపట్టారో స్పష్టంగా వివరించలేక ఇలా గత స్మృతులను నెమరేయడం వల్ల అది వాస్తవమవదు కదా? విచిత్రమేమిటంటే మార్క్స్ ద్విశత జయంతి వేడుకల వేళ కారల్‌మార్క్స్ స్వయంగా జర్మనీలో అమ్మకం సరుకయ్యాడు. ఆయన బొమ్మలతోపాటూ అనేక వస్తువులు అక్కడ, ప్రపంచంలో ఇతరచోట్ల అమ్ముడవుతున్నాయి. ఈ తత్త్వం బోధపడినాక సైతం మార్కెట్ రహిత మార్క్స్ సిద్ధాంతం- ‘అపురూపమైనది, మానవాళికి సంజీవిని’ అని గొప్పలుపోయేవారి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం కావలసిందే!
-వుప్పల నరసింహం సెల్: 99857 81799
(ఆంధ్రభూమి సౌజన్యం తో)