-సరిత పాటిబండ్ల
” భారతే హిందు నారీణాం భవేత్ సంఘటనం దృఢం
ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా సమితిర్యయా
సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితమ్
క్షణశః కణశశ్చైవ జీవితం చందనం యథా “
సంస్కృతి, స్వధర్మాల రక్షణ కోసం క్షణ క్షణమూ, కణ కణమూ అర్పించిన మహనీయవందనీయ లక్ష్మీబాయి కేల్కర్ సేవికలందరితో ప్రేమగా మౌసీ అని పిలిపించుకుని వందనీయ మౌసీజీ గా ప్రసిద్ధి చెందారు.
భారత స్వాతంత్ర్య చరిత్ర చూస్తే అనేక మంది వీరుల గురించి, వీరనారుల గురించి తెలుసుకుంటాం. అయితే ఉద్యమకారులై , యుద్ధ వీరులైన వారి గురించే తెలుసుకుని స్ఫూర్తి పొందటం సాధరణంగా ఉన్నది. దీనికి భిన్నంగా, స్వాతంత్ర్యం వస్తుంది సరే, కొన్ని వందల సంవత్సరాలుగా పరాయి పాలనలో మగ్గి, తనదైన అస్తిత్వాన్ని కోల్పోతున్న దశలో ఉన్న సమాజం స్వతంత్రమవాలంటే, తనేంటో ముందు తనకి తెలియాలి . దాని ఉద్యమాలు, యుద్ధాల కన్నా నిర్మాణాత్మకంగా జరిగే పని అవసరం ఉన్నదని ఆలోచించి వ్యక్తిత్వ నిర్మాణా కేంద్రంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యం మొదలైతే , దేని ముందైతే సమస్త ప్రపంచమూ తలవంచి నమస్కరించినదో, అటువంటి పవిత్ర సతీత్వ నిర్మాణం అవసరంగా ప్రారంభించబడిన సంస్థ రాష్ట్ర సేవికాసమితి. 1936 లో విజయదశమి రోజున కేవలం 5 మందితో ఆవిర్భవించిన రాష్ట్ర సేవికా సమితి సంస్థాపిక వందనీయ మౌసీజీ గా పిలువబడే లక్ష్మి బాయి కేల్కర్ 85 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక చిన్న సంస్థ ఈ రోజు విశ్వవ్యాప్తమై దేశదేశాల్లో తన శాఖలను విస్తరింపజేసుకుందంటే వారి సంకల్పం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది.
ఏమి తలపది? ఎంత లోతది? ఏమి యోచన? ఎంత యోగ్యము … అంటూ పాడే పాట అక్షర సత్యం అనిపిస్తుంది. సమితి కార్యమే తపస్సగా ఆచరించిన వారి జీవితాన్ని చూస్తే రాష్ట్రసేవికా సమితి కార్యము , వందనీయ మౌసీ జీ జీవితము వేర్వేరుగా కనిపించవు. అభేదమే.
1905 జూలై 6, విక్రమశక 1827 సంవత్సరం , ఆషాఢ శుద్ధ దశమిన పుణె లోని యశోదాబాయి, భాస్కరరావు దాలే దంపతులకు జన్మించిన ఆవిడ బాల్య నామం కమల. కమల పుష్పం వలెనే ఆవిడ జీవితమునూ. చుట్టూ బానిసత్వం, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న సంస్కారయుత, దేశభక్త కుటుంబం వీరిది. చిన్నతనం నుండి వారి తల్లిదండ్రుల సంస్కారం, జాతీయభావనలు వీరి వ్యక్తిత్వం మీద చెరగని ముద్ర వేశాయి. వీరి దాయీ సేవాభావం, ఆవిడ బాలింతలకు చేస్తున్న సేవ వీరి మనసులో నిలిచి పోయింది. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ‘బాంచన్ కాల్మోక్తా’ అనే పద్ధత లో కాక తన దేశం, తనకు ముఖ్యం అనే పద్ధతి లో నడిచిన తండ్రి వ్యక్తిత్వం, దేశాభిమానాన్ని పెంచే “ కేసరి “ , పత్రిక చదవడంలో తన సంకల్పాన్ని తన స్వతంత్రతను బ్రిటిష్ అధికారికి ధైర్యంగా చెప్పిన తల్లి లోని స్వతంత్ర భావన, ధైర్య గుణాలను, దాని అవసరాన్ని అర్థం చేసుకుంది. దాయి తో కలిసి ప్రతిరోజూ హరికథను వినడానికి వెళ్ళేది చిన్నారి కమల. అలా దేశభక్తి, దైవభక్తి, సేవాభావనలు సమానంగా ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని చెప్పవచ్చు. ఇలా ఆమె వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటున్న సమయంలో వరకట్నం కోసం బలైపోయిన స్నేహలతా దేవి ఆత్మహత్య ఒక పెద్ద దుమారం రేపింది. అప్పుడే వరకట్నం తీసుకోని వారినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ తీసుకున్నది కమల. దానికి కట్టుబడి పిల్లల తండ్రి ఐనా పురుషోత్తమరావు కేల్కర్ ను వివాహమాడి, లక్ష్మీబాయిగా, శాంత వత్సలలకు తల్లిగా వార్థాలో అడుగుపెట్టింది. తన పుట్టింటి అలవాట్లకు, వాతావరణానికి పూర్తి వ్యతిరేకమైన అలవాట్లు, పద్ధతులున్న కుటుంబం వారిది. ఆ పరిస్థితుల్లో తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే ప్రతి పనిలో వారికి అనుగుణంగా నడుచుకునేది. పిల్లలకు తనలోని మాతృత్వాన్ని పంచిపెట్టి ఆనందించేది. ప్రతి పనిలో తనదైన ముద్ర కనిపించేది. సంపన్నులైన కుటుంబాలలోని ఆడవారు ఎలా ఉంటారో, వారి కుటుంబమూ అదే విధంగా ఉండేది. బిలియర్డ్స్ ఆటలూ, క్లబ్బులూ దీని పట్ల ఏ మాత్రం వ్యతిరేకతను కనురచ లేదావిడ. కానీ, జాతీయ భావం, వాసన ఏ మాత్రం లేని ఆ వాతావరణంలో మెల్లి మెల్లిగా వార్తా పత్రికలు చదివే అలవాటు చేసింది. ఇలా తన స్నేహంతో పాటు , తన ఆలోచనలు నలుగురిలోకి పంపించింది. అంతరంగంలో తన దేశ, ధర్మాలకు ఏదైనా చేయాలనే మధన సాగుతూనే ఉంది. ఇలా గడిచి పోతున్న జీవితంలో పెద్ద కుదుపు పురుషోత్తమ రావు మరణం. లక్ష్మీబాయిలో కలిసి చేస్తున్న ప్రయాణం తీరం చేరక ముందే అర్థాంతరంగా తనువు చాలించాడాయన. ఆ తరువాత ఆమె జీవిత నావ దిశను మార్చుకుందని చెప్పవచ్చు. బహశా జరగవలసిన చారిత్రాత్మక సంఘటనల కోసమే వ్యక్తిగత జీవితంలోని అడ్డంకులు తొలగించాడేమో భగవంతుడు అనిపిస్తుంది.
కుటుంబ బాధ్యతలు పూర్తిగా తోటికోడలు ఉమాభాయి, లక్ష్మిబాయిల మీద పడినాయి . పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు. సమర్థవంతంగా బాధ్యతలు మోస్తూనే సమాజ చింతనా చేసేవారు వందనీయ లక్ష్మీబాయి. తన ఇల్లు, సమాజమూ ఒకేలా ఉన్నాయనిపించేది ఆవిడకి. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు అర్థం లేనివిగా అనిపించేవి. సీత, సావిత్రుల గురించి గొప్పగా చెప్పే దేశంలో పవిత్రత ఊసేలేక, ధన సంపాదన కోసం తమ అమ్మాయిలను దళారీల వద్దకు పంపే సంత్రాలు అమ్ముకునే మహిళలు , సీతా రాముల ఆదర్శం, పవిత్రతలు గురించి పొగడుతూనే రామాయం, మహాభారతాలు చదవగూడదనే ముర్ఖత్వం ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కాలేదావిడకు. ఇలా మధన సాగుతున్న సమయం లోనే మహాత్మాగాంధీ గారి ఉపన్యాసం వినడం తటస్థించింది. ” సీతాదేవి వ్యక్తిత్వం నుండే రాముడు రూపుదిద్దుకుంటాడు. ” అని ఆయన చెప్పిన మాట ఆవిడలో రామాయణాన్ని చదవాలనే కోరికను పెంచింది. సీత వ్యక్తిత్వ, జీవితం… చదివితే కదా తెలిసేది, అలా రామాయణ పఠనం ప్రారంభించారు. వందనీయ లక్ష్మీబాయి జీ అలా రామాయణ ప్రభావం, సీతాదేవి చరిత్ర ఆమెలో సీత లను తయారు చేయగలన సంకల్పాన్ని కలిగించింది. నిజానికి సీతలోని మహనీయ గుణాలే ఇక్కడి స్త్రీలందరిలోనూ నిక్షిప్తంగా ఉన్నవి. కానీ, వాటిని గుర్తించే స్థితిలో సమాజము లేదు, స్త్రీ కూడా లేదు .
ఆ పరిస్థితుల్లో స్త్రీ తనలోని గుణాలు, ఆలోచనలూ తాను పట్టించుకునే స్థితిలో లేదు. తనకు అవసరమైనదేదో ఆమె తెలియట్లేదు. సమాజాన్ని తన అనసరం? — అసలు ప్రశ్నేలేదు. స్త్రీ జీవితమే ఒక జడ స్థితిలోకి మారిపోయింది. ఈ జడత్వం నుండి బయటపడాలి. మళ్ళీ భారత స్త్రీ, తద్వారా జాతి పునర్‌వైభవాన్ని పొందాలి. దీనిపై ఏం చేయాలా? అని మదన పడుతున్న సమయంలో ఆవిడకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ (ఆర్.ఎస్.ఎస్) పరిచయం జరిగింది. వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా, భారతావనికి విశ్వగురుస్థానమే లక్ష్యంగా మొదలై బాలకులలో అనుశాసనము, దేశభక్తి, సంస్కారాలను ఉద్దీపింపచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్.ఎస్.ఎస్) సిద్ధాంతం పట్ల, కార్యపద్ధతి పట్ల మౌసీ జీ ఆకర్షితులయ్యారు. ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు పరమ పూజ్యనీయ డాక్టర్ జీ ని కలిసారు. “గరుడ పక్షి రెండు రెక్కలూ సమానంతో ఎగిరినపుడే లక్ష్యాన్ని ఛేదించ గలదు” అని స్వామి వివేకానందుల ఉవాచ. “మరి, కేవలం పురుషుల కోసం మాత్రమే సంస్థ పనిచేస్తే… మీరనుకున్న లక్ష్యాన్ని సాధించగలరా? ” సమాజంలో సగభాగమైన స్త్రీలు దుర్బలులైతే ఎలా? ఇలాంటి ప్రశ్నలు, వారి ఆలోచనలు, సమాధానాల పరంపర సాగింది. పల్లు మార్లు డాక్టరీని కలిసి చర్చించిన తర్వాత వారి మనసులో రాష్ట్ర సేవికా సమితి గురించిన రూపకల్పన జరిగింది. అదే విషయం పూజ్య డాక్టర్ జీ ముందు ఉంచారు. ఆ సమయంలో డాక్టర్ జీ స్పష్టంగా చెప్పిన విషయం – మీరు ప్రారంభించబోయే సమితి, సంఘానికి సమాంతరంగా పనిచేయాలి. కానీ సంఘ అణుబంధంగా కాదు. శారీరక శిక్షణ, కార్య పద్ధతుల విషయంలో సంఘ స్వయం సేవకుల మార్గదర్శనం ఉంటుంది. కానీ మీరు త్వరలోనే స్వయం సమృద్ధమవాలి ” అన్న డాక్టర్ జీ మాటలు, ఆయన ఆలోచనా మౌసీ జీకి సంపూర్ణంగా అర్థమయినాయి. ఆ తరువాత 1936, విజయదశమి రోజున వార్థాలో ఒక 5 మంది సేవికలతో రాష్ట్ర సవికాసమితి ఆవిర్భావం జరిగింది .
మహిళలలో శారీరక, మానసిక, బౌద్ధిక వికాసాని శిక్షణ ఇవ్వటంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేయవచ్చని మౌసీ జీ భావించారు. దండ, ఛురిక లాంటి శస్త్ర విద్యలలో శిక్షణ వల్ల మహిళలు తమ స్వీయ రక్ష, తాము చేసుకోగలిగే సంసిద్ధత వస్తుంది. స్వయరక్షణ విద్యలు ప్రాచుర్యం పొందిన ఇప్పటికి 85 సంవత్సరాల ముందే ఈ శిక్షణ అవసరమని ఆలో చించిన ద్రష్ట ఆవిడ.
మానసిక శక్తి కై అనేక మంది పతివ్రతా స్త్రీలు నడయాడిన దేశం మనది. వారి కథలు , చరిత్ర తెలుసుకోవడం వల్ల స్త్రీ అంతర్గత శక్తి ఇనుమడిస్తుంది. శారీరక శక్తి ఎలా ఉన్నా, మానసిక సంతులనం, శక్తి కలిగి ఉన్నపుడే దేన్నైనా సాధించగలము. అందుకే స్త్రీ ల మానసిక శక్తిని ఇనుమడింప జేయడానికి మానసిక శిక్షణ ఇవ్వ సంకల్పించారు. ఇక బౌద్ధిక వికాసం – శారీరక, మానసిక శక్తులతో పాటు బౌద్ధిక చింతన అవసరం. బుద్ధి బలం పెరగవలసిన అవసరంలో పాటు స్వతంత్రంగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోగలిగిన నేర్పు స్త్రీకి తప్పనిసరి. అందుకే వివిధ విషయాల చింతన, విశ్లేషణ చేయడం మొదలుపెట్టారు శాఖలో. ఆ నాటి సమాజ పరిస్థితులు, బ్రిటిషువారి పెత్తనం, మన వెనుకబాటు తనం వీటన్నిటికీ పరిష్కారంగా రాష్ట్ర సేవిక సమితి రూపొందింది. ఆ నాటికే సమాజంలో వివిధ రంగాలలో మహిళల కోసం కృషి చేస్తున్న అనే సేవా సంస్థలు, పిల్ల కాలువలు నదిలో సంగమించినట్లుగా రాష్ట్ర సేవికా సమితిలో అంతర్భాగమయినాయి. దీనికి వందనీయ మౌసీ జీ స్నేహశీలత, సంభాషణా చాతుర్యం, వ్యవహర కుశలతలే కారణమని చెప్పవచ్చు.
దాదాపుగా రాష్ట్ర సేవికా సమితి ఆవిర్భావ సమయంలోనే ఇంచుమించు అదే లక్ష్యంతో పుణెలో సేవాకార్యక్రమాలు ప్రారంభించిన సరస్వతీ తాయి కూడా తమ సేవా కార్యక్రమాలను ఆనందంగా సమితి ప్రవాహంలో సంగమింప చేశారు. చివరి వరకూ రాష్ట్ర సేవికా సమితిలో కలిసి ఉన్నారు. వారిద్దరి కలయిక, స్నేహం రాష్ట్ర సేవికా సమితిని ఇంకా దృఢతరం చేసింది. లక్ష్మీ సరస్వతుల దృఢ సంకల్పం వల్ల, నిరంతర కృషి, కార్యదక్షత వల్ల అనతి కాలంలోనే సేవికా సమితి దేశమంతటా విస్తరించింది. అనేకమంది సేవికలు కార్యంలో భాగస్వములైనారు. వందనీయ లక్ష్మీబాయి.. వందనీయ మౌసీ జీ గా అనేక మందికి మార్గదర్శకులైనారు.
స్త్రీ తను స్వయంగా శక్తిరూపిణి, ఈ విషయాన్ని గుర్తించడమే ముందు అవసరంగా భావించిన మౌసీ జీ సాక్షాత్తూ దుర్గాస్వరూపం అయిన అష్టభుజాదేవిని రాష్ట్ర సేవికా సమితి ప్రతీకగా సేవికల ముందు నిలిపారు. అంటే ఒక సేవికకి ప్రతీక అష్టభుజాదేవి. నమో అష్ట భుజదేవి లక్ష్మి పార్వతి శారదే, బుద్ధి వైభవదోమాతర్ హమే దోశక్తి సర్వదే అంటూ సాగే ప్రార్థనలలో శీల రూపవతీ నారీ తేరీహీ ప్రతిమాబనే అనటంతో ప్రతి సేవికలోనూ ఆత్మశక్తిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. బంకిం చంద్రులు తన వందే మాతరంలో ఆ భారతమాత, దుర్గ ఒకరే అంటారు . ‘త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిగ స అన్న చోట. అలా ప్రతి సేవిక తను, భారత మాతకు , అష్ట భుజా దేవికి అభేదాన్ని చూసే శక్తి ని, తద్వారా గుణ వికాసాన్ని కలిగించారని చెప్పవచ్చు . ఇలా మానసిక, శారీరక, భౌద్దిక వికాసాలతో పాటు ఆధ్యాత్మిక శక్తి అంతర్లీనంగా చైతన్యంగా ఉన్నది.
సమితిలో ప్రతి స్త్రీ అపర దుర్గలా, లక్ష్మిలా , సరస్వతిలా తనను తాను, తన స్వరూపాన్ని తెలుసుకున్న నాడు ఆమెయే ఈ రాష్ట్రానికి ఆలంబన అవుతుంది. ఆధారం అవుతుంది , రాష్ట్ర వైభవానికి శక్తి అవుతుంది. ఆనాడు ఒక సీత, ఒక ద్రౌపది తన వ్యక్తిగత కష్టమైనా, దానితో సమాజానికి పట్టిన అధర్మం అనే చీడలను ఏ విధంగా తొలగించగలిగారో అలా తాను చేసే ప్రతి పనీ సమాజ బాగోగులకు అన్వయించి చూసుకునేలా శాఖ సేవికలను తయారు చేశారు. అతి స్వల్ప కాలంలో సమితి కార్యం దేశం నలుమూలలా విస్తరించింది.
1948 ఎమర్జెన్సీ సమయంలో సంస్థ మీద నిషేధంతో కార్యం కుంటుపడింది. సేవికలలో పూర్వపు ఉత్సాహం, చైతన్యం కలిగించడం కోసం రామాయణ ప్రవచనాలు చేశారు మౌసీ జీ. రామకథ అందరిలో మళ్ళీ చైతన్యాన్నినింపింది.
లక్ష్య సాధన జరగాలంటే సేవికలకు ఈ శక్తితో పాటు వారిలో మాతృత్వ, కర్తృత్వ, నేతృత్వ గుణాల వికాసం జరగాలి. దీనికై జిజియాబాయి, రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మిబాయి ల ఆదర్శాన్ని సేవికల ముందు ఉంచారు వందనీయ మౌసీ జీ.
ఇలా దినిదిన ప్రవర్థమానమవుతున్న సమితి కేవలం శాఖకే పరిమితం కాక అనేక ఇతర సేవా కార్యక్రమాలు కూడా మొదటు పెట్టింది. ఈ నాటికీ మహిళలలో దేశభక్తిని రగిలించి, తను అస్తిత్వాన్ని సమాజానికి తమ అవసరాన్నీ గుర్తింప చేసే సంస్థలు ఎక్కడా కనిపించవు. నేడు విశ్వవ్యాప్తమైన ఈ సంస్థ ఒకే ఒక్క వ్యక్తిలోని తీవ్ర మధనకు, సంఘర్షణకు రూపం. మన దృఢ సంకల్పం ఎంతటి మాహనీయ కార్యమైనా చేయిస్తుంది అనేందుకు చరిత్రలోని చక్కటి ఉదాహరణ.
కీర్తి శ్రీ ర్వాక్ చ నారీణా స్మృతిర్మేధాధృతి క్షమా … అంటారు గీతా కారుడు. స్త్రీలోని సప్త శక్తుల గురించి తెలుపుతూ.. ఆ సప్తశక్తలూ ప్రతి స్త్రీలో జాగృతమవడం కోసం వందనీయ మౌసీ జీ ప్రారంభించిన నిర్మాణాత్మక కార్యం రాష్ట్ర సేవికా సమితి వందనీయ మౌసీ జీ గురించి చెబుతూ ఒక ప్రసిద్ధ వామ పక్ష భావజాలం గల రచయిత్రి “ఆమె జీవితం పవిత్రమూ, ఔషధీయుక్తమూ, సుగంధ భరతమూ” అని చెప్పడం ఒక్క మాటలో వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే. వారి జయంతి సందర్భంగా ఆ స్పూర్తి మనందరిలో నెలకొలపాలని ఆకాంక్షిస్తూ .. శ్రద్ధాంజలి