Home News వీరశైవులు, లింగాయతుల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

వీరశైవులు, లింగాయతుల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

0
SHARE

2013లో అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని  లింగాయతులకు ప్రత్యేక మతపు హోదా ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ ఇప్పుడు హడావిడిగా లింగాయతులు వేరే మత వర్గమని, మైనారిటీలని ప్రకటించింది. దీని వెనుక ఎన్నికలరాజకీయం తొంగిచూస్తూనే ఉంది. ఇంతకీ ఇప్పటివరకు వీరశైవంలో భాగంగా ఉన్న లింగాయతులు ఇప్పుడు ప్రత్యేక మతవర్గం  ఎలా అయిపోయారు? వీరశైవం, లింగాయుతులు వేరా? ఈ విభజన సహేతుకమైనది, సమర్ధనీయమైనదేనా?

చరిత్ర

పరమశివుని కుమారుడైన వీరభద్రుడు వీరశైవాన్ని స్థాపించి, ప్రచారం చేశాడని చెపుతారు. ఈ వీరశైవ తత్వం గురించి `సిద్దాంత శిఖామణి’ అనే గ్రంథంలో ఉంది. వీరశైవ తత్వపు మూలాలు హిందూత్వంలో ఉన్నాయని ఆ మతానికి చెందిన పండితులు, విద్వాంసులు చెపుతారు.

 ప్రతి యుగపు ఆరంభంలో లింగం నుండి ఉద్భవించే అయిదుగురు జగద్గురు ఆచార్యులు వీరశైవ ధర్మాన్ని స్థాపిస్తారు. ఈ ఐదుగురు ఋషులు వీరశైవానికి చెందిన ఐదు పీఠాలను స్థాపించారు. అవి – రంభాపురి (కర్ణాటక), ఉజ్జయిని(మధ్యప్రదేశ్), కేదార్(ఉత్తరాఖండ్), శ్రీశైలం(ఆంధ్రప్రదేశ్), కాశీ(ఉత్తర్ ప్రదేశ్). ఈ ఐదు పీఠాలు ఆధ్యాత్మిక, సామాజిక, మత విషయాల్లో ఎంతో గొప్ప సేవ చేస్తున్నాయి. ప్రజలకు దారిచూపుతున్నాయి.

లింగాయతుల గురించి వీరశైవంలో ప్రస్తావన

మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు, ధర్మారాజు మధ్య జరిగిన సంవాదంలో లింగధారుల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. మెడలో లింగాన్ని ధరిస్తారు కాబట్టి వీరిని లింగధారులన్నారు. దీనినిబట్టి బసవేశ్వరునికంటే ముందే లింగధారులు ఉండేవారని తెలుస్తుంది.

 జాన్ హెర్బర్ట్ మార్షల్ భారత పురాతత్వ పరిశోధన సంస్థ (ఏ ఎస్ ఐ) డైరెక్టర్ జనరల్ గా(1902-1928) ఉండేవాడు. ఆయన సింధూ నాగరకతకు చెందిన మొహెంజదారో, హరప్పా నగరాలను వెలికితీసే పనిని పర్యవేక్షించాడు. 1931లో మార్షల్ తన పుస్తకంలో ఇష్టలింగ, తావరలింగాలను పోలిన విగ్రహాలు తవ్వకాలలో బయటపడ్డాయని వ్రాశాడు. ఇవి 3వ శతాబ్దానికి చెందినవని కూడా వ్రాశాడు.

అలాగే శృంగేరి ఆదిశంకరపీఠంలో ఉన్న చంద్రమౌళీశ్వర లింగం (శివ లింగం) జగద్గురు ఆదిశంకరులు స్థాపించినదని, దానిని రంభాపురి (కర్ణాటక) పీఠానికి చెందిన జగద్గురు రేణుకాచార్య 8వ శతాబ్దంలో స్వయంగా ఆదిశంకరులకు ఇచ్చారని శృంగేరి పీఠం ప్రచురించిన `గురువంశ కావ్య’ అనే గ్రంధంలో ఉంది. దీనినిబట్టి వీరశైవ-లింగాయత సంప్రదాయానికి మిగిలిన హిందూ సంప్రదాయాలకు భేదం లేదని తెలుస్తోంది.

1941 సంవత్సరంలో కాశీ పీఠం, ఋణదాతల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్ట్ వీరశైవ పంచ పీఠాలు క్రీ.శ. 574 (6వ శతాబ్ది)కు పూర్వపువని స్పష్టం చేసింది. అంతేకాదు బెనారస్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కాశీ పీఠపు పాత్ర ఎంతో ఉందని కూడా తెలిపింది.

దీనినిబట్టి వీరశైవ మతంతోపాటు, శివ లింగాన్ని పూజించడం, లింగధారణం వంటి పద్దతులు 3వ శతాబ్దానికి పూర్వమే ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు హిందూ సంప్రదాయాలకు, వీరశైవ-లింగాయత సంప్రదాయానికి తేడా లేదని కూడా తెలుస్తోంది.

బసవేశ్వరుడు, వీరశైవ – లింగాయత మతం

కర్ణాటకలోని పేరుపొందిన అధ్యాత్మిక, సామాజిక సంస్కర్తలలో బసవన్న ఒకరు. ఆయన లింగ, సామాజిక వివక్షను తిరస్కరించడంతోపాటు తన `వచనాల’ ద్వారా సామాజిక జాగృతికై కృషి చేశారు. 12వ శతాబ్దంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవన్న ఆ తరువాత అప్పటికే ఉన్న వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించారు.  బసవన్న ప్రత్యేక మతాన్ని స్థాపించలేదని అప్పటికే ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని సంస్కరించి, పునరుద్దరించారని `కాలచూరి’ శాసనాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వీరశైవ సాంప్రదాయంలో మెడలో లింగాన్ని ధరించే `ఇష్టలింగ’ (లింగధారణ) పద్దతిని బసవన్న ప్రవేశపెట్టారు. ఆయన తన వచనాలలో గానీ, మరెక్కడగానీ `లింగాయత్’ అనే మాట ఉపయోగించలేదు. అలాగే తాను వీరశైవానికి భిన్నమైన మరొక మతాన్ని స్థాపించానని ఎక్కడా చెప్పలేదు. 2016లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఏం.ఏం. కల్బుర్గి ప్రధాన సంపాదకత్వంలో `వచన మహాసంపుట’ 3వ ముద్రణను తెచ్చింది. అందులో వచనం 1092లో తాను సాధారణ శైవుడి  నుండి నిజమైన వీరశైవునిగా మారానని బసవన్న పేర్కొన్నట్లు ఉంది. బసవన్న హిందూమత సంస్కర్త అని, బసవ పురాణం (హిందూ లింగాయత గ్రంధం) లో బసవన్న గురించి ఉంటుందని ఎన్ సైక్లోపీడియా బ్రిటానిక పేర్కొంది. వీరశైవం మతాన్ని సూచిస్తే లింగాయత్ అనేది అందులో ఒక పద్దతిని సూచిస్తుందని బసవన్న చెప్పాడు. ఇలా వీరశైవానికి, లింగాయత్ కు మధ్య బసవన్న చెప్పని తేడాను చూడాలనుకోవడం సరికాదు. 1904లో ప్రారంభమయిన అఖిల భారతీయ వీరశైవ మహాసభ మొట్టమొదటి సమావేశాలు ధార్వాడ్ లో జరిగాయి. అందులో ఒక తీర్మానం ఆమోదించారు. బసవన్న ప్రత్యేక మతాన్ని స్థాపించలేదని, అప్పటికే ఉన్న వీరశైవాన్ని సంస్కరించి, పునరుద్దరించాడని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

వీరశైవ – లింగాయత విభజనవాదం

లింగాయత్ లను ప్రత్యేక మత వర్గంగా గుర్తించాలంటూ శమనుర్ శివశంకరప్ప (కాంగ్రెస్ నాయకుడు) అధ్యక్షతన అఖిలభారతీయ వీరశైవ మహాసభ 2013లో  ఏ ఐ సి సి అధ్యక్షురాలు సోనియా, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ లకు విజ్ఞప్తులు సమర్పించింది. సోనియా ఆ విజ్ఞప్తిని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కు పంపారు. కానీ చివరికి యు పి యే ప్రభుత్వం  ` హిందువులలో ఒకటైన వీరశైవ – లింగాయత్ వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తించడం కుదరదు’ అంటూ ఆ విజ్ఞప్తులను తిరస్కరించింది.

కర్నాటకలో కాంగ్రెస్ విభజన రాజకీయాలు

వీరశైవ – లింగాయతులను ప్రత్యేక మతవర్గంగా గుర్తించాలన్న విజ్ఞప్తులను ఇంతకుముందే కేంద్రంలోని తమ ప్రభుత్వమే తిరస్కరించిందని, అలాంటి డిమాండ్ లకు చట్టపరమైన సమ్మతి కూడా లభించదని తెలిసినా ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వీరశైవ – లింగాయత్ లను విడగొట్టాలనుకున్నారు. లింగాయత్ లను ప్రత్యేక, స్వతంత్ర మతవర్గంగా ప్రకటించాలనుకున్నారు. ఈ విజ్ఞప్తులను మైనారిటీ విభాగానికి, కర్ణాటక మైనారిటీ కమిషన్ కు పంపారు. 2017 డిసెంబర్ 22న మైనారిటీ కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించడానికి  మాజీ న్యాయమూర్తి నాగమోహన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులున్న ఒక కమిటీని నియమించింది. కమిటీలో రాజకీయ పరిశీలకుడు ముజఫర్ అస్సాది, కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ ద్వారకానాథ్, జె ఎన్ యు లో కన్నడ విభాగ అధిపతి పురుషోత్తమ బిలిమలే, కన్నడ అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఎస్ జి‌ సిద్దరామయ్య, సీనియర్ పత్రికా రచయిత సర్జూ కాట్కర్ ఉన్నారు. అయితే ఈ కమిటీలో వీరశైవ – లింగాయత్ వర్గానికి చెందినవారు ఒక్కరుకూడా లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఎంపిక చేసినవారే కమిటీ సభ్యులయ్యారని, కమిటీ ఏ నిర్ధారణకు రావాలో ముఖ్యమంత్రి ముందుగానే నిర్ణయించేశారని ఎవరికైనా తెలుస్తుంది.

2018 జనవరి 6న కమిటీ పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. అందులో ఇది చాలా సున్నితమైన విషయమని, దీనిని పరిశీలించడానికి కనీసం 6 నెలలు పడుతుందని స్పష్టం చేసింది. అలాగే కమిటీలో ఒక మహిళా సభ్యురాలిని నియమించాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఆ తరువాత ముఖ్యమంత్రి నుండి ఒత్తిడి పెరగడంతో ఫిబ్రవరి 2,3 తేదీలలో ప్రజలు తమ విజ్ఞప్తులను సమర్పించాలని, వాటి పరిశీలన ఫిబ్రవరి 26,27,28 లలో జరుగుతుందని ప్రకటించింది. ఆ తరువాత ఎలాంటి చర్చలు, పరిశీలనలు లేకుండానే కమిటీ లింగాయత్ లు హిందూమతంలో భాగంకాదని, అందువల్ల వారికి మైనారిటీ హోదా కల్పించాలని సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను కేబినెట్ హడావిడిగా మార్చ్ 19న ఆమోదించి, కింది నిర్ణయాలు తీసుకుంది –

  1. కర్ణాటక రాష్ట్ర మైనారిటీ చట్టం కింద బసవ సంప్రదాయానికి చెందిన లింగాయత్/వీరశైవ లింగాయత్ లను మతపరమైన మైనారిటీలుగా గుర్తించడం.
  2. దీనితోపాటు లింగాయత్/వీరశైవ లింగాయత్ లను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం.

హిందూ సమాజాన్ని చీల్చడమేకాక, ఇప్పటివరకు ఒకటే వర్గంగా ఉన్న వీరశైవ – లింగాయత్ లను రెండుగా విడగొట్టాడమే రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం. ఆ విధంగా బిజెపికి బలమైన సమర్ధకులుగా నిలిచే వీరశైవ – లింగాయత వర్గపు ఓట్లు చీల్చడమే వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ విభజన ద్వారా లింగాయత్ లకు ఏదైనా లాభం ఉంటుందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే లింగాయత్ వర్గానికి మైనారిటీలకు లభిస్తున్న ప్రత్యేకమైన రాజ్యాంగ ప్రయోజనాలు ఏవి ఉండవని కేబినెట్ స్పష్టంగా తేల్చేసింది. ఇప్పుడు వర్తిస్తున్నట్లుగానే వారికి 3బి నిబంధన కిందనే  రిజర్వేషన్లు లభిస్తాయని కూడా స్పష్టం చేసింది. దీనినిబట్టి లింగాయత్ లకు మైనారిటీ హోదా వచ్చినా ఒరిగేది ఏమి ఉండదన్నమాట.

మతవిషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండదు. అది ఆయా మతాలకు చెందిన పెద్దలు తీసుకుంటారు. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హిందూ సమాజాన్ని చీల్చడానికి సిద్దమయ్యారు.

ఇంకొక విషయం ఏమిటంటే బసవ మతం కేవలం ఒక వర్గానికి లేదా కులానికి  చెందినది మాత్రమే కాదు. ఇది ఒక వైశ్విక తత్వం. ఎస్ సి /ఎస్ టి వర్గానికి చెందినవారు కూడా బసవతత్వాన్ని అనుసరిస్తారు. కానీ కర్ణాటక  కాంగ్రెస్ ప్రభుత్వం మతం రంగు పులమడం ద్వారా ఈ తత్వపు విశ్వజనీనతను నాశనం చేయడమేకాక భారత రాజ్యాంగం ఎస్ సి, ఎస్ టి లకు కల్పించిన హక్కులను కూడా కాలరాస్తోంది.

వీరశైవులు, లింగాయతులు పురాతన కాలం నుంచి ఒకటిగానే ఉన్నారు, వ్యవహరించారు. ఈ విషయాన్ని సిద్దగంగ పీఠానికి చెందిన  111 సంవత్సరాల వృద్ధులైన డా. శివకుమార స్వామి దృవీకరించారు కూడా.

చట్టపరమైన అంశాలు

ఇప్పటికే ఉన్న ఒక మతానికి  మైనారిటీ గుర్తింపు ఇవ్వాలంటే జాతీయ మైనారిటీ చట్టం 1992 ప్రకారం అది కేంద్ర ప్రభుత్వానికే సాధ్యపడుతుంది. కనుక లింగాయత్ లను మైనారిటీ వర్గంగా గుర్తించాలంటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయలేదు.

మైనారిటీ హక్కులను పరిరక్షించడానికి ప్రత్యేకమైన సామాజిక పరిస్థితులు కల్పించాల్సిన అవసరం లేకుండా చేయడమే  మైనారిటీ కమిషన్ ల లక్ష్యమని  బాల్ పాటిల్ వర్సెస్ భారత యూనియన్ కేసులో సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. అంతేకాదు “మైనారిటీ చట్టం కింద గుర్తింపునివ్వడం కోసం వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిశీలించడం కాకుండా అసలు మైనారిటీ జాబితాను క్రమంగా తగ్గించడానికి అనువైన పరిస్థితుల ఏర్పాటుకు మార్గాలు, పద్దతులు సూచించడమే మైనారిటీ సంఘపు పని’’ అని కూడా పేర్కొంది.

సుప్రీం కోర్ట్ పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి –

“రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు, ప్రాధమిక విధాలను చూస్తే మైనారిటీ లేదా మెజారిటీ హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ప్రయత్నం అవసరం లేని సామాజిక పరిస్థితులను ఏర్పరచడమే రాజ్యాంగపు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.”

కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో మైనారిటీ కమిషన్ లను ఏర్పరచేటప్పుడు పైన చెప్పిన రాజ్యాంగ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కమిషన్ లు క్రమంగా మైనారిటీ, మెజారిటీ తరగతులనే తేడాను తొలగించే దిశగా, దేశ సమైక్యతను సాధించే విధంగా చర్యలు చేపట్టాలి. కేవలం ప్రత్యేక మత పంథా లేదా జన సంఖ్య లేదా ఆరోగ్యం, సంపద, విద్య, అధికారం లేదా సామాజిక హక్కులు మొదలైన అంశాల ఆధారంగా `మైనారిటీ’ హోదాను ఇస్తూ పోతే వివిధ మతాలు, భాషలు ఉన్న భారతదేశంలో ప్రతి వర్గం మైనారిటీ గుర్తింపును ఎప్పుడో ఒకప్పుడు డిమాండ్ చేసే ప్రమాదం ఉంటుంది. ఒక వర్గపు డిమాండ్ చూసి మరొక వర్గం అలాంటి కోరికే కోరుతుంది. అప్పుడు సమాజంలో సంఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కులం ఆధారంగా ఇప్పటికే హిందూ సమాజం వివిధ మైనారిటీ వర్గాలుగా విడిపోయి ఉంది. ప్రతి కులస్థులు తమ  ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరిని మెజారిటీ వర్గమని చెప్పలేము. హిందువుల్లో అందరూ మైనారిటీలే. వీరిలో చాలావర్గాలు తమ జనసంఖ్య తక్కువ కాబట్టి తాము వెనుకబడిపోకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతాయి. అలా ప్రతి మైనారిటీ వర్గం ఇతరులను తమ ప్రత్యర్ధులుగా భావిస్తే, అప్పుడు సమాజంలో సర్వత్ర అవిశ్వాసం, భయమే ఉంటాయి. అవి దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాదకారి అవుతాయి. చివరికి ఈ ధోరణే బహు జాతీయవాదానికి దారితీస్తుంది. కనుక భారత్ లోని వివిధ వర్గాలలో ఈ బహు జాతీయవాద ధోరణి ఏర్పడని విధంగా  మైనారిటీ కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలి. మైనారిటీ చట్టంలో గుర్తింపు కావాలని వివిధ వర్గాలవారు డిమాండ్ చేయడంకాక, అసలు అలాంటి గుర్తింపునే క్రమంగా తొలగించేందుకు అనువైన సామాజిక పరిస్థితులను ఏర్పరచడానికి అవసరమైన మార్గాలు, పద్దతులను కమిషన్ అనుసరించాలి.”

దీనినిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన `విభజించు , పాలించు’ విధానాన్నే అమలు చేస్తోందని అర్ధమవుతోంది. ఇలా వివిధ వర్గాలలో వేర్పాటువాద ధోరణులను ప్రోత్సహించడం కాంగ్రెస్ మొదటినుండి అనుసరిస్తున్న విధానమే. సంకుచితమైన రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ ఇటీవల గుజరాత్ లో పటేల్ వర్గపు రిజర్వేషన్ డిమాండును గుడ్డిగా సమర్ధించింది, ఇప్పుడు కర్నాటకలో వీరశైవులు, లిగాయత్ లను హిందూ మతం నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తోంది.

వీరశైవ – లింగాయత్ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా సభ్యులుగా నియమించకుండానే కమిటీని ఏర్పాటుచేసి ఆ కమిటీ ద్వారా తమకు కావలసిన నివేదికను తెప్పించి లింగాయత్ లకు మైనారిటీ హోదా ఇవ్వాలని నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం. 2013లో తమ ప్రభుత్వమే ఇలాంటి డిమాండును తిరస్కరించిందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్ర కేబినెట్ మైనారిటీ హోదా సిఫార్సును ఆమోదించింది. ఇది పూర్తిగా రాజకీయ గారడీ మాత్రమే.

By VSK Telangana