Home News సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఋషి కావ్యకంఠ గణపతి ముని

సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఋషి కావ్యకంఠ గణపతి ముని

0
SHARE
శ్రీ కావ్యకంఠ గణపతి ముని

– ఖండవల్లి శంకర భరద్వాజ

కావ్యకంఠ గణపతి ముని గురించి, వారి రచనల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే.  అయినా ప్రస్తుతం సమాజంలో వారి పేరు విన్నవారే కొద్దిమంది.

భరత వర్షం ఆర్ష భూమి. యుగాలుగ లోకకల్యాణ నిరతులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషుల దేశకాల పాత్రమైన, దేశకాలాతీతమైన జ్ఞానం, తపస్సు, కర్మలతో పునీతమైన భూమి ఇది.  వారిని అనుసరించే సమాజం నిర్మించుకున్న నాగరికత ఇది.

గత శతాబ్దం భరతజాతి సుదీర్ఘ దాస్యం నుండి విముక్తమైనది. ఆ విముక్తికి కొన్ని దశాబ్దాల ముందు నుండి, దాస్యం వల్ల సమాజంలో వచ్చిన రుగ్మతలు తొలగించి చైతన్యవంతం చేయడం ద్వారా మరల పూర్వ వైభవం, ఔన్నత్యం సాధించే దిశలో  నడిపించటానికీ కొందరు ఋషులు అవతరించారు. అరవిందులు, గణపతి ముని, కంచి పరమాచార్యులు, రమణులు మొదలైనవారు అలాంటి మహానుభావులు.

గణపతి ముని బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుశాస్త్ర పారంగతులు, తపో నిరతులు. లోక కల్యాణ నిరతి, తపస్సు, పాండిత్యం వంటి అనేక లక్షణాలు గణపతి ముని జీవితంలో చూడవచ్చు. సాధారణంగా వ్యక్తికి ఒక విషయంలో అధ్యయనం చేత, అభ్యాసం చేత రాణింపు కలుగుతుంది. మహా తపస్సిద్ధులకు అలాకాక వారి దృష్టి ఎటు సారిస్తే అటు లోకోపకారకమైన వెలుగు వస్తుంది. గణపతి ముని లౌకిక, ఆలౌకిక మైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు.

గణపతి ముని దృష్టి, రచనలు

తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణ కి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేసారు గణపతి ముని. ఆయన రచనలు నేటి సమాజ పరిస్థితులకు ఎంతో అవసరమైనప్పటికీ అవి చాలా మందికి తెలియకపోవటానికి ఒక ప్రధాన కారణం వారు సంస్కృతంలొ వ్రాయటమే. దురదృష్ట వశాత్తూ ఇప్పటి వరకు వాటిని అనువదించే పని జరుగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వాలు సంసృత పాండిత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్నీ చిన్న చూపు చూడటం కూడా మరొక కారణం.

రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాలలో గణపతి ముని అనుభవపూర్వక  జ్ఞానం ఆయన రచనలలో కనిపిస్తుంది.

గణపతి ముని స్వయంగా చేసినవేకాక ఆయన స్ఫూర్తితో శిష్యులు చేసిన లోకోపకారకమైన రచనలు అనేకం ఉన్నాయి.  వీటిలో  వేద సూక్త శైలిని అనుసరించి కూర్చిన దైవరాతుని ఛందోదర్శనం చెప్పుకోదగినది.

గణపతి ముని రచనలలో అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలన్నా అది ఒక గ్రంథం అవుతుంది. అందువల్ల  వారి దర్శనపు ముఖ్యాంశాలను మాత్రం చూద్దాం.

నితంతర జపధ్యాన సమాధులవల్ల అనేక దేవతల అనుగ్రహానికి పాత్రులైన గణపతి ముని, దేవతా తత్వాన్ని, విద్యలను అందరికి తెలియజెప్పేందుకు  స్తోత్ర, సూత్ర రూపంలో ఉంచారు. వీటిలో వారి భక్తి, జ్ఞానాలతో పాటు వారి దేశ ప్రేమ, లోకోద్ధరణ కాంక్ష కనిపిస్తాయి. ప్రధానంగా శక్తి ఉపాసకులైన గణపతి ముని శక్తి తత్వాన్ని అనేక స్తోత్ర, సూత్ర గ్రంథాలలో కీర్తించినా, అనేక దేవతా తత్వ చర్చ, వివరణ కూడా చేసారు. వేదం అపౌరుషేయమని కొన్ని ఆస్తిక దర్శనాలు చెప్తాయి. అయితే వేదం పౌరుషేయమా, అపౌరుషేయమా అన్న చర్చలో గణపతి ముని తనదైన ప్రమాణసహితమైన వాదన చేసారు. వేదంలోని ప్రధాన దేవతలైన ఐన ఇంద్రుడికి, రుద్రుడికి తేడాలేదని, వారిద్దరూ ఒక్కటేనని  ఇంద్రేశ్వరాభేద సూత్రాలలో చూపించారు.

సామాజిక సంస్కరణ

బ్రిటిషువారు చేసిన అనేక దుర్మార్గాలలో ఒకటి సమాజాన్ని కుల ప్రాతిపదికన చీల్చటం. జాతి మొత్తం అణచివేతకు గురైనప్పుడు కొందరు ఎక్కువగా, మరికొందరు అంతకంటే కాస్త తక్కువ నష్టపోతారు. ఇలా ఎక్కువ నష్టపోయినవారు, పీడితుల కష్టాలకు   కారణం తక్కువగా నష్టపోయినవారు,  పీడితులేననే తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించి, ఆంగ్ల విద్యా విధానంతో ఆ భావాన్ని బాగా ప్రచారం చేసారు. అలా తమ అణచివేత మూలంగా సమాజంలో కలిగిన పతనావస్థకు తాము కాకుండా ఇక్కడి సంస్కృతీ సభ్యతలు, వాటిని నిష్టగా అనుసరించాలనుకున్నవారే కారణమని చూపించడానికి ప్రయత్నించారు.  ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటానికి అనేకమంది  అనేక మార్గాల్లో ప్రయత్నించారు.  సమాజంలొ ఉన్న దురాచారాలు రూపుమాపాలి అనే దృష్టి తో సంఘ సంస్కర్తలు అనేకులు పని చేసారు, కొంత ఫలితం కూడా సాధించారు. కాని సంస్కర్తలలో చాలామంది సమాజాన్ని విదెశీయుల దృష్టితో చూసి అర్ధం చేసుకోవడం వల్ల వారి ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు.  

సమాజాన్ని ధర్మ దృష్టి తో చూసి, దానిలో రావలసిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావులలో ఒకరు గణపతి ముని.

అస్పృశ్యత నిర్మూలించటానికి, షెడ్యుల్ కులాలు, తెగలకు చెందినవారిని (వీరిని పంచములు అనేవారు) తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణి లోకి ఐక్యం చేయడానికి, వారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయడమేకాక అందుకు స్వయంగా ప్రయత్నించారు.  మంత్ర దీక్షల ద్వారా, బోధల ద్వారా, ఈ వర్గాలకు చెందినవారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి కృషిచేసారు. ఈ పనిలో సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే, సమాజాన్ని దుయ్యబట్టకుండా సకారాత్మకమైన ఉద్యమం చేపట్టారు. పంచమ మీమాంస, పంచజన చర్చ వంటి రచనలలో వారి దృక్పథం తెలుస్తుంది. ప్రకృతి త్రిగుణాత్మకము (సత్వ, రజో, తమో గుణములు కలది). త్రిగుణాధారంగా ఏర్పడినందువల్ల సమాజంలో  నాలుగు వర్ణములు ఉండడమే సరైన వ్యవష్ట అని, షెడ్యుల్ కులాలు, తెగలు మధ్యలో ఏర్పడినవి కనుక ఆయా వర్గాలను ప్రధానమైన నాలుగు వర్ణాలలో విలీనం చేయడమే సరైన పరిష్కారమని గణపతి ముని రచనలు, కార్యం ద్వారా మనకు తెలుస్తుంది. అలా కాక వెనుకబాటుతనాన్ని ఒక ప్రత్యేకత లక్షణం, గుర్తింపుగా చేసి సమాజంపై సంస్కరణ అనే దండయాత్ర చేయటం ఎంత నష్టదాయకమో ఈరోజు చూడవచ్చు.

సమాజం లో అనేక వర్గాల ఐక్యత, సమరసత అనాదిగా సంప్రదాయాల వల్లనే సాధ్యమయింది. వేదం జ్ఞానమే అనేక రూపాలలో అన్ని సామాన్య, అసామాన్య జనులలో, వర్గాలలో కనిపిస్తుంది. మహావిద్యా సూత్రాలలో గణపతి ముని శాక్త విద్యల(శక్తి ఉపాసన) తత్వాన్ని బొధిస్తూ, వేదంలో, ఉపనిషద్విద్యలలో, తంత్రంలో, గ్రామ దేవతలలో ఉన్న ఐక్యతను చూపించారు. శాక్తం లోని  చిన్నమస్త దేవతే , గ్రామ దేవత అయిన రేణుక అని ఆయన చూపించారు. ఆ విధంగా గ్రామీణ, స్థానిక దేవతలు, పుజాపద్దతులు వేద సంప్రదాయం నుంచి, దానికి కొనసాగింపుగా వచ్చినవేనని గణపతి ముని నిరూపించారు. తద్వారా ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని మనకు గుర్తుచేశారు. హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది నాయకులు చెప్పినా, గణపతి ముని ఆ ఐక్యతను జన మానసంలో తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు.

(గణపతి ముని రచనలను తెలుసుకోదలుచుకున్నవారు అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం ప్రచురించిన గణపతి ముని సంపూర్ణ గ్రంధావళిని సంప్రదించవచ్చును)                                  

This article was first published in 2020