శబరిమల అంశంలో కేరళ ప్రభుత్వం వ్యవరిస్తున్న విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు కేరళ క్రైస్తవ సంఘాలు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుండటంతో వివాదం మరో మలుపు తిరుగుతోంది.
కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ‘వనితా మాతిల్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో భారీ మానవహారం ప్రదర్శించడం ద్వారా శబరిమల ఆలయంలోని ప్రవేశించాలనుకునే మహిళలకు సంఘీభావం తెలియజేయాలని నిర్ణయించుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే అనేక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో కేరళకు చెందిన జాకొబైట్ సిరియన్ చర్చి అనూహ్యంగా ప్రభుత్వ తీరుకి మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా మానవహారం కోసం దాదాపు లక్ష మంది మహిళా కార్యకర్తలను సమకూర్చే బాధ్యతను జాకోబైట్ చర్చి స్వీకరించడం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది.
జాకోబైట్ చర్చి మాజీ అధికార ప్రతినిధి వర్గీస్ కళ్లప్పర మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలియజేయాల్సిందిగా క్రైస్తవులకు పిలుపునిచ్చారు.
మానవహారం ప్రదర్శన నిర్ణయాన్ని ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యతిరేకించగా తాజాగా మావోయిస్టు పార్టీ కూడా దీనిపై స్పందించింది. కేరళ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ “ఇది పూర్తిగా రాజకీయ అవకాశం కోసం చేస్తున్న చర్య”గా దీన్ని అభివర్ణించింది.
Source: Organiser