Home News విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు: పార్లమెంటులో బిల్లు ఆమోదం

విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు: పార్లమెంటులో బిల్లు ఆమోదం

0
SHARE
విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు మంగళవారం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుగా వ్యవహిరించే ఈ చట్టం ద్వారా లైసెన్సులు పొందిన సంస్థలు విదేశాల నుండి విరాళాలు స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. అయితే విదేశాల నుండి విరాళాలు పొందుతున్న అనేక సంస్థలు నిర్ధేశిత లక్ష్యం కోసం వీటిని ఖర్చు చేయకపోవడం, ఎక్కువమొత్తం ధనం సంస్థల ఖాతాల్లో నిలువలుగా ఉండటం మొదలైన వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సవరణలు తీసుకువచ్చింది.  
 
 
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం ఒక ప్రాజెక్ట్ లేదా లక్ష్యం కోసం స్వీకరించిన విదేశీ ధనాన్ని కేవలం ఆ నిర్దిష్ట కార్యక్రమం కోసం మాత్రమే ఖర్చు చేయాలి. వేరే ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించరాదు. ఉదాహరణకు చిన్న పిల్లలకు విద్య  నిమిత్తం విదేశీ విరాళం స్వీకరించి, ఆ ధనాన్ని మరో ఇతర సేవా కార్యక్రమం కోసం ఖర్చు చేయకూడదు. ఈ నేపథ్యంలో  2010 – 2019 సంవత్సరాల మధ్య విదేశీ విరాళాలు పొందిన అనేక సంస్థల బ్యాంక్ ఖాతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపింది. ప్రతి సంవత్సరం స్వీకరిస్తున్న విరాళాల శాతం పెరుగుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం తక్కువగా ఉండటం, అధిక శాతం విదేశీ ధనం నిరుపయోగంగా ఖాతాల్లోనే నిల్వలుగా ఉండటం మొదలైన అంశాలను కేంద్రం గమనించింది. 
 
ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద ఉల్లంఘనలకు పాల్పడిన దాదాపు 18,000 సంస్థల లైసెన్సులు గతంలో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, మరి కొన్ని సంస్థల ఆర్ధిక లావాదేవీలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది. సంస్థల ఆర్ధిక వ్యవహారాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం తదితర అంశాలు బలపడే విధంగా  కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సవరణలు చేసినట్టు తెలుస్తోంది.
తాజా సవరణాల్లోని ముఖ్యమైన అంశాలు:
– భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 21 కింద నిర్వచించిన ప్రభుత్వ ఉద్యోగులు విదేశీ ధనం స్వీకరించకుండా నిషేధం.
– విదేశీ విరాళం నుండి సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, కార్యాలయ వనరులు, ఇతరత్రా కార్యాలయ నిర్వహణ కోసం చేసే ఖర్చుల శాతం 20కి మించకుండా కట్టడి. గతంలో ఇది 50 శాతంగా ఉండేది.
– విదేశీ ధనం స్వీకరించేందుకు లైసెన్సు కలిగిన సంస్థల ముఖ్య సభ్యులు తమ ఆధార్ కార్డు వివరాలు ప్రభుత్వానికి సమర్పించడం తప్పనిసరి. ఒకేలా విదేశీయులైతే తమ వీసా, పాస్పోర్ట్ వివరాలు సమర్పించాలి.
–  విదేశీ ధనం స్వీకరించేందుకు లైసెన్సు కలిగిన సంస్థలు ఇకపై ఇందుకు సంబంధించిన లావాదేవీల కోసం తమ ప్రధాన బ్యాంకు ఖాతాను ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ద్వారా మాత్రమే చేయాలి. సదరు బ్యాంకు ఖాతా నుండి సంస్థకు  మిగిలిన ఇతర బాంక్ ఖాతాలకు బదిలీ చేయవచ్చు.