భారతీయ స్వాతంత్ర సమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్న వయస్కుడు ఖుదీరాంబోస్. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.
1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కుమీద ఒక్కగుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి ఇతడు పెట్టింది పేరు. చిన్నవాడన్న దయలేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదించాడు.
ప్రతీకారానికై ప్రతిజ్ఞ:
ఈ సంఘటన తరువాత స్వతంత్రవీరులంతా కింగ్స్ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. మానవరూపంలో ఉన్న మృగమైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంతవరకు దేశభక్తవీరులకు కష్టాలేనని భావించి అతనిని చంపడానికి నిశ్చయించుకున్నారు.
1908 లో విప్లవవీరులు కింగ్స్ఫోర్డ్ ను అంతంచెయ్యడానికి ఒకప్రణాళిక రచించారు. ఖుదీరాంబోస్, ప్రఫుల్లచాకి అనే ఇద్దరు నవయువకులు ఈ పనికై నియమించబడ్డారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒకబాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్ ఫోర్డ్ క్లబ్ బయటకురాగానే దానిపైకి బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తివెళ్లిపోయారు.
అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా ఖుదీరాంను నిర్బంధించి రెండు నెలలపాటు విచారణచేశారు. ముజఫర్పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలుపరచబడింది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు.