Home News సంఘాన్ని ప్రత్యక్షంగా చూడండి, తెలుసుకోండి – ప్రజలకు డా. మోహన్ భాగవత్ ఆహ్వానం

సంఘాన్ని ప్రత్యక్షంగా చూడండి, తెలుసుకోండి – ప్రజలకు డా. మోహన్ భాగవత్ ఆహ్వానం

0
SHARE

`భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ ఉపన్యాస కార్యక్రమం

3వ రోజు, 19th Sept 2018

ప్రశ్నలు – సమాధానాల కార్యక్రమం

సంఘాన్ని ప్రత్యక్షంగా చూడండి, తెలుసుకోండి – ప్రజలకు డా. మోహన్ భాగవత్ ఆహ్వానం

`భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ అనే అంశంపై న్యూ డిల్లీలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఉపన్యాస కార్యక్రమంలో చివరిరోజున ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

హిందుత్వం – హిందూ ఇజం

హిందుత్వం, ఇతర మతాలతో హిందుత్వపు సంబంధం, గిరిజనులకు హిందూత్వంలో కల స్థానం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ హిందుతనమే హిందుత్వం తప్ప అది ఒక `ఇజం’, కేవలం సిద్ధాంతం కాదని ఆయన స్పష్టం చేసారు. భిన్నత్వం ప్రకృతి సహజం. కాని అందులోనే ఏకత్వం కూడా ఉంది. దీనిని అనుభూతిలోకి తెచ్చేదే హిందుత్వం. అందుచేత హిందువులు అన్ని మతాలవారితో కలిసి జీవించగలుగుతారు. గిరిజనులు హిందూ సమాజంలో భాగం అని ఆయన వివరించారు.

గోరక్ష – మూకుమ్మడి దాడులు

మూకుమ్మడి దాడులను ఖండించాల్సిందే. అవి ఏ కారణంగా జరిగినా మంచిది కాదు. అయితే గోవుపట్ల మనకు శ్రద్ధ ఉంది. గోవు వ్యవసాయానికి ఆధారం. కనుక గోరక్షణ, సంవర్ధన అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు ముస్లిములు కూడా గోశాలలు నిర్వహిస్తున్నారు.

కుల వ్యవస్థ – సామాజిక సమరసత

కుల వ్యవస్థ, దాని వల్ల వస్తున్న సమస్యలు, కులాంతర వివాహాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ కాలం చెల్లిన కుల వ్యవస్థను పూర్తిగా పక్కకు పెట్టవలసిందేనని స్పష్టం చేసారు. సాముహిక భోజన కార్యక్రమాలను వెంటనే చేపట్టగలిగినా, కులాంతర వివాహాల విషయంలో మరింత ప్రజామోదాన్నిసాధించవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సమాజంలో సరైన ఆలోచన, అవగాహన తీసుకురావలసి ఉందని, ఆ పని స్వయంసేవకులు చేస్తున్నారని వివరించారు.

విద్య – భారతీయ విలువలు

భారతీయ విలువలతో కూడిన విద్య ఎప్పుడు మన దేశంలో అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చదువు అనేది కేవలం డబ్బు సంపాదన కోసం కాదనే దృష్టి  విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోను  రావాలని, అలాగే వ్యక్తులను తీర్చిదిద్దడం కోసమే ఉపాధ్యాయులు పనిచేయాలని, అప్పుడే సరైన విద్యావ్యవస్థ తిరిగి మనం పొందగాలుగుతామని ఆయన అన్నారు. వేద, ఉపనిషత్, ఇతిహాసాలను విద్య ప్రణాళికలో తప్పక చేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.

మత మార్పిడులు – చట్టం

అన్ని మతాలూ సమానం కనుక మత మార్పిడి తప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అన్ని మతాలూ సమానం అని అంగికరిస్తున్నప్పుడు ఇక మత మార్పిడికి ప్రయత్నించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మత మార్పిడులు ఆధ్యాత్మిక ఉన్నతి లక్ష్యంగా జరుగుతున్నవి కావని, అందుకనే వాటిని వ్యతిరేకిస్తామని స్పష్టం చేసారు.

రిజర్వేషన్ లు

రిజర్వేషన్ విధానం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సామాజిక అసమానతలు తొలగించడానికి ఈ విధానం అవలంబించారని, తమకు రిజర్వేషన్ లు అవసరం లేదని అవి పొందుతున్న వర్గాలు చెప్పేవరకు దానిని కొనసాగించాలని ఆయన అన్నారు. వివాదం రిజర్వేషన్ ల వాళ్ళ రావడం లేదని, వాటిని రాజకీయం చేయడం వాళ్ళ వస్తోందని ఆయన అన్నారు.

అల్పసంఖ్యాకులు

అల్పసంఖ్యాకుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎవరు అల్పసంఖ్యాకులు అనే విషయంలోనే స్పష్టత లేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారికి ముందు అసలు ఈ వర్గికరనే లేదని వివరించారు. జాతీయభావన ముఖ్యమని, అది ఏ మతానికి చెందినవారికైనా ఉండాలని అన్నారు. ఆ దృష్ట్యా సంఘం ప్రజలందరినీ ఒకటిగానే చూస్తుందని వివరించారు.

రామ మందిర నిర్మాణం

రాముడు జన్మించిన స్థలంలో భవ్యమైన మందిర నిర్మాణం సాధ్యమైనంత త్వరగా జరగాలని ఆయన అన్నారు. రాముడు ఇక్కడి ప్రజానికానికి ఆడర్శప్రాయుడని, ముస్లిములు కూడా `ఇమామే హింద్’ గా ఆయనను గౌరవిస్తారని వివరించారు. రామ మందిర నిర్మాణం జరిగితే అది ముస్లిం వర్గానికి కూడా మంచిదని, వారిపై ఇతర ప్రజానీకంలో ఉన్న సందేహాలు తొలగిపోతాయని అన్నారు.