Home News లెఫ్ట్‌ వారి పుట్టింటి ప్రేమ!

లెఫ్ట్‌ వారి పుట్టింటి ప్రేమ!

0
SHARE
ఒక్క చిన్నమాట.. ఒక్క చిన్న మాట…
చిన్నగానో, సన్నగానో… సణుగుడో, గొణుగుడో…
అంత ఘాటుగా, ముక్కు సూటిగా కాకున్నా, చాటుగానో, మాటుగానో…
గుండె లోలోతుల నుంచి రాకున్నా, పెదవుల పైపైనుంచైనా…
తలుపు సందులోంచో, తడిక చాటు నుంచో, బూజు పట్టిన పుస్తకాల బీరువాలోంచో, పాత తరం పాగా వేసిన అటుకు మీది నుంచో… ఒక చిన్న మాట వినిపిస్తుందేమోనని 60 రోజులుగా, ఆశగా, ఆత్రంగా, ఆరాటంగా, చెవులు చింకి చాటంత చేసుకుని మరీ వింటున్నా. కళ్లు పేలిపోయేలా పేపర్లు, టీవీలు, సోషల్‌ మీడియాను గాలిస్తున్నా… సింగిల్‌కాలమ్‌ వార్తైనా కనిపిస్తుందేమోనని!
మావోయిస్టు చైనాది తప్పని, డోక్లాంలోకి వారి సైన్యం జొరబడడం భారత్‌కు, భూటాన్‌కు ముప్పని భారత కమ్యూనిస్టు దళంలోని ఒక్క నాయకుడైనా ఒకించుక ధైర్యంతో గళం విప్పుతాడని అనుకున్నా! కానీ నా ఆశలు అడియాసలే అయ్యాయి!
1962లో జరిగిందిదే. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే. ‘హిందీ– చీనీ భాయీ భాయీ’ అని సోషలిస్టు నెహ్రూ నినదిస్తే.. ఆ మాటున, అధాటున కమ్యూనిస్టు చైనా హిమాలయ యుద్ధంతో గాయిగాయి చేసింది. సామ్యవాద చైనా… అలీన భారత్‌పై దాడి చేయడం ఏమిటి? అది పచ్చి అబద్ధం! అని భారత కమ్యూనిస్టులు ఘోషించారు! కృష్ణమీనన్‌ (అప్పటి రక్షణ మంత్రి) జోరే వార్‌కు అసలు కారణమని చైనాను పచ్చిగా సమర్థించారు.
అర్ధ శతాబ్ది గడిచినా ఆలోచనల తీరు మారలేదు. నానాటికీ పార్టీ అంతరించి పోతున్నా… చైనా భక్తితో తరించడం ఆగలేదు. డోక్లాంపై సీపీఎం పత్రిక పీపుల్స్‌ డెమాక్రసీ సంపాదకీయం ఏం రాసిందో చూడండి. ‘‘డోక్లాం భూటాన్‌ భూమి. ఆ వివాదాన్ని భూటాన్నే పరిష్కరించుకోనివ్వండి. అందులో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సమస్యకు మూలకారణం డోక్లాం కాదు; మోదీ సర్కారు! మోదీ అమెరికాకు సన్నిహితం కావడం, టిబెట్‌ బౌద్ధ గురువు దలైలామాకు ప్రాధాన్యం పెంచడం చైనాకు చిరాకు తెప్పిస్తున్నది’’ అని సీపీఎం పత్రిక పేర్కొంది.
ఎంత నికార్సైన విశ్లేషణ! బలవంతులకు వ్యతిరేకంగా, పీడితుల పక్షాన నిత్యం రోడ్డెక్కి, ధర్నాలు, హర్తాళ్లు, బందులు, సమ్మెలతో వర్గ పోరాటాలు చేసే ఎర్ర వీరులు… చైనా పీడిత భూటాన్‌ పక్షాన భారత్‌ నిలబడొద్దంటున్నారు. అంటేగింటే వద్దనాల్సింది భూటాన్‌ కదా! చైనాలాంటి మహా సామ్రాజ్యంతో చిట్టెలుకలాంటి భూటాన్‌ చర్చలు జరిపి తేల్చుకుంటుందట! టిబెట్‌ ఏం తేల్చుకోగలిగింది? భూటాన్‌ సంగతి భూటాన్‌ తేల్చుకుంటుందని భారత్‌కు ఉచిత సలహా ఇస్తున్న కమ్యూనిస్టులు.. భారత– పాక్‌లు వాటి సంగతి అవి తేల్చుకుంటాయి… మీరెందుకు వేలు పెడుతున్నారని తమ మాతృభూమి చైనాను ప్రశ్నించరు. టిబెట్‌ సంగతి టిబెట్‌ తేల్చేసుకుంటుందని సలహా ఇవ్వరు. పైగా భూస్వామ్య లామాల నుంచి విముక్తి కలిగించడానికే టిబెట్‌ను చైనా ఆక్రమించిందని వంతపాడుతారు. నరహంతక గడాఫీ నుంచి లిబియాకు, డెడ్లీ కెమికల్‌ వెపన్‌ సద్దాంహుస్సేన్‌ నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించడానికే తాము యుద్ధాలు చేశామని చెప్పే అమెరికాకు, చైనాకు తేడా ఏముంది? రాచరికం నుంచి భూటాన్‌కు విముక్తి కలిగించడానికే దాన్ని ఆక్రమిస్తున్నట్టు, భారత్‌ ఆక్రమణ నుంచి విముక్తి కలిగించడానికే అరుణాచల్‌ను, సిక్కింను స్వాధీనం చేసుకుంటున్నట్టు రేపు చైనా ప్రకటిస్తే కూడా దాన్ని మన కమ్యూనిస్టులు సమర్థిస్తారేమో! ఎందుకంటే చైనాకు మనం చిరాకు తెప్పించకూడదు మరి!!
1962 యుద్ధంలో అవిభక్త సీపీఐ చైనాను సమర్థించింది. ఆ పార్టీ నేతలను ప్రభుత్వం జైల్లో పెట్టింది. అలా చెరసాల్లోకి వెళ్లిన వాళ్లలో కేరళ లెఫ్టిస్టు వీఎస్‌ అచ్యుతానందన్‌ ఒకరు. జైల్లో ఆయనకు కొంచం జ్ఞానోదయం అయింది. చైనా ఏజెంట్లు అనే ముద్ర తప్పించుకోవడానికైనా ఏదో ఒకటి చేద్దామని ఆయన ప్రతిపాదించారు. గాయపడ్డ భారత సైనికుల కోసం జైల్లోనే రక్తదానం చేద్దామని, తిండి తగ్గించుకుని మిగిలిన దాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును యుద్ధ ఖర్చుల కోసం ఇద్దామనీ ప్రతిపాదించారు. జైల్లోనే ఉన్న నికార్సైన కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు వర్గాలు కొట్లాడుకునేదాకా వెళ్లింది. యుద్ధం ముగిసింది. కమ్యూనిస్టులు విడుదలయ్యారు. అచ్యుతానందన్‌ నిబద్ధత మీద పార్టీలో ఫిర్యాదు నమోదైంది. (చైనాకు కాకుండా) ప్రభుత్వానికి సాయం చేయడానికి అచ్యుతానందన్‌ ప్రయత్నించాడని, ఇది ముమ్మాటికీ నేరమేనని నిర్ధారించారు. ఆయన కమ్యూనిస్టు పటుత్వాన్ని శంకిస్తూ డిమోట్‌ చేసి పారేశారు. ఇదీ కమ్యూనిస్టుల చైనా భక్తి!
మనం మామూలు మనుషులం. ఈ మట్టిమీద పుట్టి, ఈ మట్టి తిండి తిని, ఈ మట్టిలో కలసిపోతాం కనుక, ఈ మట్టికి కట్టుబడి ఉండాలని అనుకుంటాం. కానీ మన లెఫ్టిస్టులు మేధావులు. అందువల్ల వారికి భౌగోళిక సరిహద్దులు వర్తించవు. దేశభక్తి, విదేశ భక్తి అన్న తేడా లేదు. జాతి ప్రయోజనాలకన్నా అంతర్జాతీయ సిద్ధాంత నిబద్ధతే ముఖ్యం! అందుకే వారు చైనాను వ్యతిరేకించలేరు. భారత్‌లో ముస్లింలను మాటైనా అనకముందే వారికి లౌకిక వాదం గుర్తుకొస్తుంది. చైనాలోని జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం మహిళలు నిండా బురఖాలు వేసుకోవద్దని, మగాళ్లు పెద్దపెద్ద గడ్డాలు పెంచుకోవద్దని, పిల్లలకు మత ప్రాతిపదికన పేర్లు పెట్టొద్దని 15 రకాల నిషేధాజ్ఞలు విధించినా సామ్యవాదంలో భాగంగానే కనిపిస్తుంది. ఎక్కడో ఓ రచయిత మీద దాడి జరిగిందని అవార్డులు వాపస్‌ చేసే కమ్యూనిస్టు పరివారంలో ఒక్కరైనా… చైనా దుందుడుకుతనానికి వ్యతిరేకంగా కమ్యూనిజాన్ని వాపస్‌ చేస్తున్నట్టు ప్రకటించరు. భారత్‌కు ఇబ్బంది అయినా డోక్లాంలోకి చైనా రావచ్చు. కానీ తమకు ఇబ్బంది అవుతుంది కనుక కేరళలోకి ఆరెస్సెస్‌ రాకూడదు. వస్తే చంపేస్తారు. ఇక్కడ కశ్మీరీలు చేసేది అస్తిత్వ పోరాటంలా, ప్రభుత్వానిది అణచివేతలా కనిపిస్తుంది. కానీ చైనాలో యుఘుర్‌ ముస్లింలది వేర్పాటువాదంలా, కమ్యూనిస్టు సర్కారుది రాజ్య పరిరక్షణలా అనిపిస్తుంది. డోక్లాం చైనాదేనని, భూటాన్‌ ఈ విషయాన్ని అంగీకరించిందని చైనా బొంకినా… మరుసటి రోజే భూటాన్‌ దాన్ని ఖండించినా.. వారికి చైనాయే కరెక్ట్‌ అనిపిస్తుంది. ఎందుకంటే వారికి వాస్తవికతకన్నా వామపక్షీయతే ప్రధానం. భారత ప్రజల ప్రయోజనాల కన్నా చైనా ప్రజాసైన్యమే మిన్న!
నేతి బీరకాయలో నెయ్యంత కమ్యూనిజాన్ని కలిగివున్న చైనా అంటే వారికి మమకారమింకా చావలేదు. చైనాకు దాదాపు 22 దేశాలతో సరిహద్దు, తీర వివాదాలున్నాయి. అలనాడు బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి, దేశాలను అక్రమించుకుని, సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు.. ఇప్పుడు చైనా అధిక వడ్డీకి డబ్బులు అప్పిచ్చి, భూభాగాలను కుదువ పెట్టించుకుని, వాటిని స్వాధీనం చేసుకుని సామ్రాజ్య విస్తరణ చేస్తోంది! అయినా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే చైనా నిప్పు. మనం శుద్ధ తప్పు! భార్యకోసం భక్తి మార్గం పడుతున్న, సీట్ల కోసం సిద్ధాంతం మరుస్తున్న కమ్యూనిస్టులూ… ఈ దేశం కోసం చిన్న సాయం చేయరూ! ఈసారికైనా చైనాది తప్పని చిన్నమాట గట్టిగా చెప్పరూ! వినాలని ఉంది ప్లీజ్‌!!
చివరాఖరు: కుహనా కమ్యూనిస్టుల కంటే, పేదల కోసం ప్రాణాలను పణంగా పెట్టి, అడవుల్లో ఆకలి దప్పులతో పోరాడుతున్న మావోయిస్టులే ఎంతో నయం. మావోయిస్టు చైనా మారిపోయిందనీ, ప్రాంతీయ విస్తరణవాద శక్తిగా తయారైందని వారు 9వ కాంగ్రెస్‌లోనే తీర్మానించారు. చైనా వైఖరిని ఖండించాలని కూడా నిర్ణయించారు.
కృ.తి.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో )