Home News ABPS తీర్మానాలు – ‘స్వ’ (స్వయం, స్వావలంబన) ఆధారంగా రాష్ట్ర పునరుజ్జీవనం కోసం సంకల్పిద్దాం

ABPS తీర్మానాలు – ‘స్వ’ (స్వయం, స్వావలంబన) ఆధారంగా రాష్ట్ర పునరుజ్జీవనం కోసం సంకల్పిద్దాం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అఖిల భారతీయ ప్రతినిధి సభ
సేవా సాధన, గ్రామ వికాస్ కేంద్రం, పట్టికల్యాణ – పానిపట్ (హర్యానా)
చైత్ర కృష్ణ 5 – 7 యుగాబ్ద్ 5179 (12 – 14 మార్చి, 2023)

ప్రపంచ శ్రేయస్సు అనే ఉదాత్త లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు భారత్ చేపట్టిన ‘స్వ’ సుదీర్ఘ ప్రయాణం మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) అభిప్రాయపడింది. విదేశీ దండయాత్రలు మరియు పోరాటాల కాలంలో, భారతదేశం యొక్క సామాజిక జీవితం చెదిరిపోయింది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మత వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో, పూజ్య సాధువులు మరియు మహోన్నతవ్యక్తుల నిర్వహణలో, యావత్తు సమాజం నిరంతర పోరాటం సాగిస్తూ తన ‘స్వ’ను కాపాడుకుంది. ఈ పోరాటానికి ప్రేరణ స్వధర్మం, స్వదేశీ మరియు స్వరాజ్యం అనే ‘స్వ-త్రయం’. ఇందులో సంపూర్ణ సమాజం భాగస్వామ్యమయింది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల శుభ సందర్భంగా, ఆ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రజా నాయకులను, స్వాతంత్ర్య సమరయోధులను మరియు దార్శనికులను దేశం మొత్తం కృతజ్ఞతాపూర్వకంగా అభినందిస్తోంది.

స్వాతంత్య్రానంతరం అనేక రంగాల్లో విశేషమైన విజయాలు సాధించాం. నేడు, భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. భారతీయ శాశ్వత విలువలపై ఆధారపడిన పునరుజ్జీవనాన్ని ప్రపంచం నేడు అంగీకరిస్తోంది. ‘వసుధైవ కుటుంబకం’ అనే భావనతో కూడిన జీవనపద్ధతిపై ఆధారపడి ప్రపంచ శాంతి, సార్వత్రిక సౌభ్రాతృత్వం మరియు మానవ శ్రేయస్సును నిర్ధారించే పాత్రను పోషించే దిశగా భారత్ దూసుకుపోతోంది.

చక్కటి వ్యవస్థీకృత, ఉజ్వలమైన మరియు సుసంపన్నమైన దేశాన్ని తయారు చేసే ప్రక్రియలో, సమాజంలోని అన్ని వర్గాల ప్రాథమిక అవసరాలను తీర్చడం, సమగ్ర అభివృద్ధికి అవకాశాలను, భారతీయ భావన ఆధారంగా కొత్త నమూనాలను నిర్మించడం వంటి సవాళ్లను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని ABPS అభిప్రాయపడింది. ఆధునిక సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకుంటూ పర్యావరణ అనుకూల అభివృద్ధి ద్వారా దేశ పునర్నిర్మాణం కోసం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, సౌభ్రాతృత్వ భావన ఆధారంగా సామరస్య సమాజాన్ని సృష్టించడం మరియు స్వదేశీ స్ఫూర్తితో దేశీయంగా వివిధ పరిశ్రమలను స్థాపించి, అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాల సాధనకు మనం ప్రత్యేక కృషి చేయాలి. మొత్తం సమాజం, ముఖ్యంగా యువత ఈ విషయంలో సమష్టి కృషి చేయవలసి ఉంటుంది. స్వాతంత్ర్య పోరాట కాలంలో పరాయి పాలన నుండి విముక్తి కోసం త్యాగాలు అవసరమయ్యాయి. చేశారు కూడా. ప్రస్తుత కాలంలో, పైన పేర్కొన్న లక్ష్యాల సాధన కోసం మనం వలసవాద మనస్తత్వం నుండి బయటపడి, పౌర విధులకు కట్టుబడి సామాజిక జీవనాన్ని సాగించాలి. ఈ దృష్టి కోణంలో, స్వాతంత్ర్య దినోత్సవం నాడు గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఇచ్చిన ‘పంచప్రాణ్’ (ఐదు పరిష్కారాలు) పిలుపు అతి ముఖ్యమైనది.

అనేక దేశాలు భారత్ పట్ల గౌరవాన్ని, సద్భావనను కలిగి ఉండగా, ప్రపంచంలోని కొన్ని శక్తులు మాత్రం ‘స్వ’ ఆధారంగా భారతీయ పునరుజ్జీవనాన్ని అంగీకరించడం లేదనే వాస్తవాన్ని నొక్కి చెప్పాలని ABPS కోరుకుంటోంది. దేశంలోనూ, బయటా హిందుత్వ ఆలోచనను వ్యతిరేకించే ఈ శక్తులు స్వార్థ ప్రయోజనాలను, విభజనను ప్రేరేపించడం ద్వారా సమాజంలో పరస్పర అపనమ్మకం, వ్యవస్థాగత పరాయీకరణ, అరాచకత్వం సృష్టించేందుకు కొత్త కుట్రలు పన్నుతున్నాయి. వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉంటూనే వారి వ్యూహాలను చిత్తు చేయాలి.

భారత్, ప్రపంచ నాయకత్వస్థానాన్ని పొందేందుకు సమష్టిగా కృషి చేసే అవకాశాన్ని ఈ ‘అమృతకాలం’ మనకు కల్పిస్తోంది. భారతీయ ఆలోచనా విధానం యొక్క వెలుగులో విద్యా, ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామిక మరియు న్యాయ సంస్థలతో సహా సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో సమకాలీన వ్యవస్థలను అభివృద్ధి చేసే ఈ ప్రయత్నంలో యావత్ సమాజమూ విజ్ఞతతో, తన సంపూర్ణ శక్తితో పాల్గొనాలని ABPS పిలుపునిస్తోంది. తద్వారా సార్వత్రిక శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్న బలమైన, సంపన్న దేశంగా ప్రపంచ వేదికపై భారత్ తన సముచిత స్థానాన్ని పొందుతుంది.